దుఃఖంతో అంది. "అలా అనొద్దు డాక్టర్! నేనేమీ చేయను ఏమీ ఆలోచించను. ఆయన్ని గురించి ఆలోచించటం తప్ప మరేమీ చేయను. ఆయనకి మనశ్శాంతికావాలి! అంతే....అంతే!
జారిన కన్నీళ్ళు చెక్కిళ్ళను తుడుపుతుంది.
14
"బావా!"
దగ్గరగా వచ్చి కూర్చొని కళ్ళల్లో మందు వేయాలని యత్నిస్తున్న బావగారి చేయి అందుకుంటూ అన్నాడు.
"బావా! నేను ఏం పాపం చేశానని యిలా అయింది బావా!"
మౌనం వహించిన బావగారి చేతిని మృదువుగా నొక్కుతూ అన్నాడు.
"మౌనం వహిస్తారేం బావా! ఏదీ తప్పు చేయనిది దేవుడిలా శిక్షిస్తాడంటావా బావా! అయినా బావా! భగవంతుడిది కూడా తప్పేనంటాను శిక్షించేవాడు పుట్టుకతో గ్రుడ్డిని చేసేసి శిక్షించకూడదూ? ముందు కొంచెం రుచి చూపించి ఆకలితో అల్లాడుతూ ఏడిచే వాడికి వస్తువు అందివ్వకుండా పోయినట్లు ముందు ప్రపంచాన్ని చూపించి తర్వాత అన్నీ అంధకార బంధురంచేసి నన్నిలా వేధించటం తప్పుకాదూ! చెప్పండి బావా! పచ్చని పైరులతో కళకళలాడే పంట పొలాల్ని, నీలి ఆకాశంతో నక్షత్రమార్గంలో తరవాణి మండలో వెన్న ముద్దలా వెలిగే చందమామనీ ఎప్పుడూ చిరునవ్వుని చిందించే బంగారం లాంటి అందమైన ముఖాల్నీ చూసి ఆనందించినవాడికి అవన్నీ ఒక్కసారి దూరమైతే...."
పైన మాట్లాడలేక ఒక్కసారి బావురుమన్నాడు "భగవాన్ ఎందుకిలా చేశావ్...."
వెక్కి వెక్కి ఏడుస్తున్న అతన్ని ఓదార్చటానికి యత్నిస్తూ అన్నాడు.
"ఊరుకో రంగా ఏడ్వవద్దు.... ఏడ్వటం వలన కళ్ళు మరింత దెబ్బతింటాయి.... ఎందుకలా నీలో నీవే కుళ్ళుకుని ఏడుస్తావు. నీ కళ్ళు బాగయ్యే అవకాశం చాలావుంది. నాకింకా ఆశ చావలేదు. ఉన్నదానిని ఊరంతా ఊహించుకుని ఏడ్వటం వల్ల జరిగేదేమిటి? బాధ....బాధ అది ఎక్కువౌతుంది. అంతకన్నా మరేమయినా అవుతుందా? చెప్పు రంగా.... కల్పిత జగత్తుని సృష్టించుకుని గత అనుభవాల్ని అందంగా బంగారంలో పొదిగికొని దుఃఖపడితే ఒచ్చే లాభమేమిటో చెప్పు? అయినా నీకు ఏమీ కాలేదనుకుంటున్నాను. నీకు నమ్మకం లేదు. ఒకవేళ నీవనుకున్నట్లే అయితే పోయిన వస్తువుని గురించి బాధపడటం వల్ల జరిగేదేమీ వుండదని నీకు మాత్రం తెలీదా రంగా...."
"అలా అనండి బావ స్మృతి....స్మృతి.... అది నన్నెంతగా వేదిస్తోందో నీవు వూహించుకోలేవు బావా! అనుక్షణం నేను చదివిన పుస్తకాల్లోంచి అక్షరాలు ఒక్కొక్కటీ బ్రహ్మాండమంత పెరిగిపోతూ నన్ను మింగటానికి తయారై వస్తున్నాయ్. నేను చూచిన సినిమాల్లోనే బొమ్మలు హేళనగా నవ్వుతున్నాయ్. నేను ఆడిన ఆటల్లో ఓడిపోయివ వెధవలంతా కల్సి గ్రూఫ్ డాన్స్ చేస్తూ నా చుట్టూ తిరుగుతూ బిగ్గరగా అరుస్తూ అల్లరిచేస్తూ నన్నల్లరి పట్టిస్తున్నారు. ఆటల్లో నేను పగులగొట్టిన బంతులు ఒక్కొక్కటి కుజగ్రహం అంత పరిమాణంతో కాంతివేగంతో దొర్లుకుంటూ నా మీదకు వస్తున్నాయ్. బావా ఒక్కొక్క సూర్యకిరణం నా కనురెప్ప మీద పడి నన్ను చూచి అవహేళనగా నవ్వుతూ ఏడిపిస్తోంది, ఏంచేయను బావా...."
ఏమీ జవాబు చెప్పలేక మౌనంగా ఓదార్పుగా అతని తల నిమురసాగాడు. దుఃఖమనేది ప్రాథమిక దశ దాటితే తర్వాత పెరిగేవి ఆలోచనలు. హిమాలయాలంత ఎత్తుగ తత్పర్వత సానువులపై కురిసే దట్టమయిన మంచంత మందంగా ఆ హిమవన్నాగముల ఉత్తుంగ శృంగాలనుంచీ జలజలా జాలు వారే నిర్ఘరుల వేగంతో వస్తున్నాయ్ ఆలోచనలు. నిజంగా మనిషికి ఆలోచన అనేది శాపం వరమూను. మంచికి సాగే ఆలోచనల కన్న దుఃఖ సమయంలో కష్ట కాలంలో ముసురుకుని వచ్చే ఆలోచనలే అధికం. వాటిని పరిహారంచాలని యత్నించే కొద్దీ అవి యెక్కువే అవుతాయ్.
"బావా! భగవంతుడు నాకీ ఆలోచనలనుండి విముక్తిని కలగించరాదూ? పిచ్చి ఎక్కితే ఎంత బావుంటుంది? ఏదీ తెలిసీ తెలియని స్థితిలో ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలతో వుంటూ ఈ బాధని మరిచిపోతాను. పోనీ నోరు పడిపోయేటట్టు చేయరాదూ? చేయడు బావా! అనుక్షణం హృదయాన్ని దహిస్తోన్న వేదనని మాటల రూపంలో పెట్టలేక అవి లోపలనే హృదయాన్ని మండిస్తుంటే మనసు మనిషి రెండూ త్వరగా మండి మసైపోతే ఎంత బావుంటుంది? ఈ బాధంతా తొలగిపోతుంది కదా బావా...."
అతని నోటికి మెల్లిగా మృదువైన తన చేతితో ఆప్యాయంగా కప్పుతూ అన్నాడు.
"భావనాశక్తి మంచిదే రంగా! కాదనను కాని యిలా అది మనిషిని వేధించేందుకే అయితే అది అక్కరలేదు రంగా! ఊహాశక్తిని మరో మార్గానికి మళ్ళించుకో. భగవానుడిని ప్రార్ధించుకో. నీ ప్రార్ధనకి ఈ రోజు ఫలితం దక్కకపోయినా వచ్చే కాలంలో నయినా మంచి కలగొచ్చు. మనిషి ఆశతో బతకాలి రంగా! బంగారు కొండవలే కన్పించే భవిష్యత్తుపై లేసుల్లాగా, తీగలలాగా ఆశని అల్లుకోవాలి. నిరాశకి చోటు ఇవ్వరాదు రంగా."
"హు...." నిట్టూరుస్తూ అన్నాడు.
"తీయనయిన కబుర్లు మాత్రమే ఎప్పుడూ చెబుతావేం బావా! కొంపలంటుకుని పోతుంటే ఎవడయినా సంగీతం పాడుకుంటూ కవిత్వాన్ని ఆనందించలేరు. అన్నీ సరిగా వున్ననాడే సుఖమూ సంతోషము. అబ్బుతున్న నాడే లలిత కళలన్నీను. అవన్నీ మనిషిలో శూన్యమైననాడు ఇవి ప్రపంచంనుండే శూన్యం అవుతాయ్.
ఒక్కక్షణం ఆగి హృదయ విదారకమయిన గొంతుకతో అన్నాడు దాదాపు ఏడుపు ఒక్కటే తక్కువ.
"ఒకవైపు ప్రాప్తించిన అంధత్వానికి ఏదయినా మరోవైపునా అసహాయతని అశక్తతని చూసి నవ్వే లోకాన్ని గురించి ఏడవనా? రెంటికీ కాక దురదృష్టానికి ఏడవనా? భగవంతుడు ఆపదలో గుర్తుకురావాలి. మనుషులచేత అడుగడుగునా దండాలు ఆపైన మొక్కులు పెట్టించుకోవాలి. కానీ నాకు ఒక్కక్షణం కూడా గుర్తుకురాడు. నాకు ప్రార్ధించటం కూడా చేతనవటం లేదు. ఎందుకో తెలుసా? అన్నెం పున్నెం ఎరుగని నన్ను యింత అన్యాయానికి గురిచేసిన వాడిని భగవంతుడని ఎలా అనను? ఎలా అనుకోను? సమవర్తి అనుకున్న దేముడు అన్యాయంగా ప్రవర్తిస్తోంటే సహించుకోటానికి ఓదార్చుకోటానికీ నాదీ మనస్సే కదా బావా!"
"ఏ విధమయిన భావమూ ధ్వనించిన గొంతుకతో అన్నాడు. ఎందుకంటే నిశ్చలమయినతటాకంలో ఏటిలో పడినా అలలు లేవటం సహజం!
"పోనీలే బాబూ! ఏవైయినా మంచి పుస్తకాలు మీ విశ్వనాధవో, లతవో చదివి వినిపించనా!"
నవ్వాడు__ఆ నవ్వులో జీవం లేదు. అయినా ఒక విధమయిన తృప్తి వుంది.
"నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రోగులు, రోగాలు, మందులు ఆస్పత్రి స్నేహాలూ స్నేహితులు తప్పితే మాట్లాడవ్. ఇవితప్ప మరేమీ పట్టించుకోలేవు నీవు. మీరు చదివి వినిపిస్తానంటే నేనమ్మను బావా! పిచ్చిబావా! నన్ను తృప్తి పరచటానికి ఏదేదోచేస్తానంటే మాత్రం నిజా నిజాలు తెలియవనుకున్నావా?
పెళ్ళయ్యాక ఆడవారు ఎంతో పెద్దగా పెరిగిపోయినట్టు అనుభవాన్ని సంపాదించుకున్నట్టు మాటాడుతారు. అంగహీనులూ, వ్యాధిగ్రస్తులూ అంతే.
"పోనీ మీ అక్కయ్యకి అప్పజెప్పమంటావా?" సందేహంగానే అడిగాడు.
గట్టిగా నవ్వేడు రంగ. "భలే, భలే! ఎంత మాట అన్నావు బావా! నిజం నీకు నా రోగంలో కొంచెం ఆలోచన మందగించింది. అయితే యిలాగే మరచిపోయి ఏదో సాల్టు బదులు ఎస్సమ్ సాల్టు యిచ్చేవు. బావా! అయినా డాక్టరుగా నీకు అంత మతిమరుపు రాలేదులే! మా అక్క చదవటమూ, నేను వినటమూనా? ఎంత చిత్రం? నిజంగా అది జరిగేనాటికి నాకు చూపుతో బాటు వినికిడి శక్తి కూడా పోతుంది__"
అతని అమాయకత్వానికీ ఆలోచనలకీ నవ్వొచ్చింది.
"పిచ్చి రంగా అక్కయ్యంటే మీ అక్కయ్యేననుకున్నావా? ఏమిటి అంతలా ఆలోచించ లేకపోయావా? బార్లీ కావాలా? నారింజ కావాలా అని సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తుందని ఇంతకు ముందే ఓసారి ఈ అక్కయ్య యింకో మంచి అక్కయ్య.... ఎంత మంచిదంటే అబ్బ! నాకు ఉపమానాలు రావు. నేను రచయితను కాను. కవినీ కాను. పండితుడిని అసలే కాను__నాకు అతిశయోక్తులురావు. ఆమె మంచిది. లోకంలో ఉన్న సౌజన్యం ఆర్ద్రత అంతా ఆమెదే! అంతే తెలుసు. ఆమెంత మంచిది ఆమె! ఆమె పేరు చెప్పనా విరజ. విరజ ఎంత బావుందో చూడు! నిన్ను నిన్ను ఒక్కసారి చూస్తే అసలు వదలదు. వదల్లేదు. నీవూ అంతేననుకో. ఆమెతో ఒక్కసారి మాట్లాడితే....నీకు యింకెందుకు అవన్నీను__సాయంత్రం ఆమెను తీసుకొనివస్తాను__ నీకే తెలుస్తుంది.