Previous Page Next Page 
విరిజల్లు పేజి 20


    మనిషిలో ఆలోచన రేగితే వ్యధ విస్తృతమై మెల్లిగా నశిస్తుంది. ఆలోచనలో పడిన వేణుని మరేమీ పలుకరించకుండా నిశ్శబ్దంగా అతని ముఖంలోకి చూస్తూ అతని ముఖంపై మనసుకి ప్రతిబింబంగా మెదలుతున్న భావాలని గమనిస్తూ కూర్చున్నాడు మురళి.
    అలాగే ఎంతోసేపు కూర్చుని ఆలోచనలతో విసుగెత్తిపోయి అన్నాడు. "వెళతాను మురళీ! రౌండ్స్ కి వేళయింది."
    ఏవేళ అయినా ఏ పరిస్థితులలోనయినా తన విద్యుక్త ధర్మాన్ని కర్తవ్యాన్ని మరువని అతని నిరతిని చూచి మెచ్చుకున్నాడు. మనసులోనే ధన్యవాదాలు అర్పించుకున్నాడు.

                                                          13


    "చూడండి డాక్టర్! మీ నర్సులు రోజు కొకరుగా నన్ను ఏడ్పిస్తున్నారు. మీరు వాళ్ళకి జీతం యిచ్చేది రోగుల్ని సంతోషంగా వుంచి రోగాన్ని నయం చేయటానికా, లేక రోగుల్ని సదా ఏడిపించి రోగాన్ని పెంచటానికా" దీనంగా ముఖంపెట్టి అడిగింది.
    దగ్గరగా వచ్చి ప్రక్కనే కుర్చీ వేసుకుని కూర్చొని ఆదరంగా అడిగాడు. "ఏమమ్మా ప్రమీలా? మళ్ళీ ఈ రోజు ఏమైంది!
    లాలనగా ఆయన ప్రశ్నించటంతో గుండెల్లో బాధ సుడులు తిరిగి బొట బొటా కన్నీరు కార్చింది. పూడుకుపోయిన గొంతుకతో అంది.
    "మార్ఫియా యిమ్మని అడిగాను డాక్టర్....మీ హెడ్ నర్స్ నిర్మల యిదో తెస్తానని చెప్పి అలాగే వెళ్ళిపోయింది యివ్వకుండా...."
    ప్రశాంతమయిన గొంతుకతో అడిగాడు "యెందుకమ్మా మార్ఫియా!"
    "అదేమిటి డాక్టర్ మీరూ అలాగే అంటారు....మా ఆయన స్మృతుల్ని తప్పించుకుని పోదామని.... అంతకన్నా నాకేం బాధ వుంది డాక్టర్....మత్తుగా తీయని కలలు కంటూ ఒక్క కలలోనయినా ఆయన కనిపిస్తాడేమోనని, మమతకీ, దూరమై చివరకు భావానికి కూడా దూరం కమ్మంటే, నేనూ మనిషినే డాక్టర్.... నాదీ మనసే. నేనూ మీలాంటిదాన్నే.... ఎందుకు నన్నిలా వేధిస్తారూ...."
    ఎప్పుడూ దగ్గరకి వచ్చినా మనో వేదనని వెళ్ళబోసుకుని మనసులో వేదనను రగిల్చే ఆ అమ్మాయంటే అతనికెంతో ఆప్యాయత. ప్రతిరోజూ ఏదో ఒక రిపోర్టు చేస్తుంది. అందులో గుండెగల మనిషిని నిలువునా దహించుకుని పోయే బాధ స్పష్టమౌతోంటుంది.
    "డాక్టర్! మా వారు తెలుసా మీకు? ఎంత అందంగా వుండేవారని. ఆయన ప్రక్కనే నిలుచోవాలంటే సిగ్గేసేది. ఎప్పుడూ ఆయన్ని నిలువునా చూళ్ళేదు. ఎక్కడ దిష్టి సోకుతుందోనని భయం. ఆయన మాట్లాడినా నవ్వినా నా యెదలో మదిలో సదా అనురాగా స్రవంతులు జలజలా ప్రవహించేవి ఇప్పుడు ఆయన రూపాన్ని తలచుకున్నా వళ్ళంతా గగుర్పొడుచుతుంది డాక్టర్. అంతగా గుండెలో ప్రాణ ప్రతిష్ట చేసుకున్న ఆ మూర్తిని ఒక్కసారయినా పలుకరిద్దామంటే ఈ సన్మకికగతి లేదని తెలిసిన తర్వాత వేదనకి అంతుంటుందా డాక్టర్."
    ఒక్క క్షణం ఆగింది. దుఃఖంతో ఆమె కళ్ళు పూర్ణకుంభాల్లా వున్నాయి. మళ్ళీ అంది.
    డాక్టర్! మావారు మంచి రచయిత డాక్టర్. అందానికి అందం వినయానికి వినయం, విజ్ఞానానికి విజ్ఞానం, సహృయానికి సహృదయత పైగా రచయిత. ఎన్ని గుణాలు డాక్టర్. అందుకే అప్సరసలు ఆయనపై మోహించి తీసికెళ్లి వుంటారు. డాక్టర్ ఆయన పెన్ పేరుతో రాసేవారు. ఎంత బాగా రాసే వారని? అబ్బ! తలుచుకుంటే కన్నీళ్ళు తిరుగుతాయ్. అచ్చంగా మనిషి గుండెలో కూర్చుని భావాలను చదివినట్టుగా రాసేవారు. దుఃభిత మనస్సుని, క్రోధిత మనస్సుని దుర్మార్గుడి మనస్సుని.... శృంగారి మనస్సుని యెన్నని అలా అని యెంత బాగా సృష్టించేవారు డాక్టర్.  
    మౌనంగా ఆమె భావోద్రిక్తతని, ఆ భావోద్రేకంలో వస్తున్న పునరుక్తి దోషాన్ని గమనిస్తూ వింటున్నాడు.
    "వింటున్నారా డాక్టర్! ఆయన పద్యాలు కూడా రాసేవారు. ఒకసారి ఓ పద్యం రాసేరు నా మీదే. ఈ దుఃఖిత మనస్సులో అది ఇప్పుడు స్మృతిరాకపోయినా భావం గుర్తుంది చెబుతా వినండి."
    కొంచెం సిగ్గు ఆమె ముఖంలో శరదృతువులో తెల్లని మేఘం చాటున మెరుపు మెరిసినట్టు వెలిగిపోయింది. త్రషాపూర్ణ స్వరంతో చెప్పసాగింది.
    "ఓ ప్రియురాలా! నీ ఈ మూన్నాళ్ళ వియోగం నన్ను నరకద్వారాల చెంతకి తీసుకుని పోయింది. దగ్గరగా వచ్చి దేహానికి పెనవేసుకుని పోయే నీ తనూవల్లరి అల్లంత దూరాన ఆగివుంది. పోనీ మనసున భావించుకుని కలగందా మాయన్న నీ కాలి యందల సవ్వడి నన్ను నిదుర మేల్కొల్పుతుంది!"
    కొన్ని సెకన్లు ఎవరూ ఏమీ అనలేదు. ఆయన భావానికి ఈయన కలిగించిన భావనా బలానికి అతనికి ఏదో స్వర్గంద్వారంలో ప్రవేశించినట్లుంది.
    మళ్ళీ ఆమే చెప్పసాగింది. వింటున్నారు కదూ డాక్టర్. ఆయన చనిపోయేందుకు కొలది రోజుల ముందు ఓ నవలని ప్రారంభించారు. అది సగంలోనే వుంది ఆగిపోయి. ఎంత గొప్ప నవలని డాక్టర్! చిన్ననాటి నుంచి అన్నిటా వంచిత అయి అదృష్టవశాత్తు సరస్వతీ కటాక్షం పొందిన ఓ అభాగ్య జీవిత చరిత్ర. ఆమె అన్నిటా అతీత. అలా వదిలేస్తే ఎలా పాపం, అసంపూర్ణ చిత్రణతో ప్రాణం వచ్చీ రాక అలాగే మరిగిపోతుంటే ఎంత వ్యధ నొందుతాయ్.... వాటి వుసురు నాకు తగలదా? సగం ప్రాణాలతో అవి అలా బాధపడుతూవుంటే వున్న ప్రాణం పోక నేనూ ప్రాణం పోయి అయినా యిలా ఒకరి కోసం ఒకరం ఏడుస్తూ వుండాల్సిందే కదా?"    
    ఆమె విపరీతంగా తనవేపు చూస్తున్న అతన్ని చూస్తూ అంది.
    "అలా చిత్రంగా చూస్తారేం డాక్టర్! మా ఆయన అప్పుడప్పుడూ నాకు కనిపించేవారు. దూర దూరంగా నన్ను ఓదార్చబోయి ఆయనే గట్టిగా ఏడుస్తూ నా కన్నీరు తుడుస్తూ మళ్ళీ దూరంగా పోతారు. ఇదంతా వాటి శాపం కాదా డాక్టర్.... ఈ శాపాన్నుండి తప్పించుకోవటం ఎలాగో తెలుసా డాక్టర్, మీకు తెలుసా చెప్పండి_"
    కళ్ళు చిలికించి కుతూహలం అంతా ఉట్టి పడేటట్టు ఎంతో వినయంగా ఆతురతతో ప్రశ్నించింది. తనకి ఈ విషయాలేవీ తెలియవన్నట్టు అడ్డంగా తలవూపారు.
    "ప్చ్! మీకు రోగులు, రోగాలూ, మందులూ, చికిత్సలూ తప్ప మరేమీ తెలియదల్లే వుంది!....పిటీ__నేను చెప్పనా? చెబుతా వినండి! ఆ నవలని మళ్ళీ నేనోసారి అంతా ఎత్తి వ్రాయాలి! తర్వాత భావాన్ని ఊహించుకుని పూర్తి చేయాలి! అప్పుడే మాకు విముక్తి! నమ్ముతారా!"
    "నమ్ముతాను...." క్లుప్తంగా అన్నాడు.
    "నాకు తెలుసు డాక్టర్ మీరు నమ్ముతారని! సరే! ఎలా పూర్తిచేయాలో చెప్పండి " సంతోషంగా అడిగింది.
     ".... ...."
    "మీరు జవాబు చెప్పలేరని చెప్పానుగా! పాపం మీకు ఏం తెలుసులెండి. ఇది ప్రేమించేవాళ్ళకి ప్రేమంటే ఏమిటో తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది డాక్టర్! ఎలాగ రాయాలో చెప్పను! నేను మార్ఫియా తీసుకోవాలి. ఆ మత్తులో తీయ తీయని కలలు కనాలి. ఆ కలల్లో ఆయన కనిపించాలి. ఆయన కనిపించి ఆ నవలని ఎలా రాయాలో సంభాషణతో సలహాచెప్పాలి. చెబుతారు నాకు నమ్మకం డాక్టర్! ఆ మర్ఫియామత్తు దిగిపోయాక యధా తధంగా రాసెయ్యాలి. అంతా అలా ఆ నవలని పూర్తి చేయాలి, చేస్తాను. కానీ. మీరు దయచూపండి డాక్టర్"
    ఏమంటే ఏముంటుందోనని వింటూ కూర్చున్నాడు వేణు.
    "ఇలా ఎలా ఊహించానో తెలుసా మీకు! ఎవరికో యిలాగే ఏదో జరిగితే మార్ఫియా మత్తులో దాని తర్వాత వూహించి రాసారట ఓ ఆంగ్ల రచయిత్రి. నిజం డాక్టర్! నేను నమ్ముతాను. నాకు అలా ఓసారి జరిగాక మరొకరికి అలాగే జరుగుతుందని నమ్మటంలో తప్పేమిటి? మరొకరికి జరిగాక మనకూ అలాగే జరుగుతుందనుకోవటం పొరపాటేమిటి?
    "కావచ్చు ప్రమీలా! అందులో పొరపాటు లేకపోవచ్చు."
    కరెక్ట్! మీరు చక్కగా చెబుతారు డాక్టర్. మీలో ప్రేమ బీజాలున్నాయ్. ఇప్పుడు కాకున్నా యింతకు ముందైనా ఎవరినో ఒకరిని మీరు ప్రేమించి వుంటారు! కానీ వీళ్ళున్నారే మా బంధువులు రాబందులు. నేను మా ఆయన మీది చింతతో దిగులుతో అసలేపోయిన మతిని మళ్ళీ పోగొట్టుకుంటానట! వెర్రివాళ్ళు. పోగొట్టుకునేదైతే ఆయన పోయినరోజే ప్రాణాన్నే పోగొట్టుకునేదాన్ని. ఒక వేళ వాళ్ళన్నట్టే మతిపోవటమే సంభవిస్తే అది మంచిదే కదా డాక్టర్. మా ఆయన్నే పోగొట్టుకుంటే మాత్రం అంతకంటే పెద్ద నష్టమౌతుందంటారా? ఆయన్ని విడిచి యిలా అర్గస్మృతిలో బ్రతికేనన్నా భౌతికంగా కాకున్నా మానసికంగానైనా చచ్చి మతి పోగొట్టుకోవటం మేలు కాదా?"
    జాలిగా అన్నాడు "అలా అనొద్దు ప్రమీలా! తప్పు! నీవు ఆరోగ్యంగా వుండి మీ ఆయన్ని సదాస్మరిస్తూ ఆయన వంశాన్ని నిలిపితేనే మంచిది. మీ మనస్సుని వంచించుకుంటూ మతి పోగొట్టుకుంటే ఆయనకి మనశ్శాంతి కూడా వుండదు. నీ ఆరోగ్యం, నీ క్షేమం! నీ శరీరంలో దాక్కున్న ఆయన ప్రతిబింబం క్షేమము ఆయనకి ముఖ్యం. అలాకాక వీటిలో వేటికి ముప్పువచ్చినా ఆయనకిక మనశ్శాంతి అనేది శూన్యం అవుతుంది.

 Previous Page Next Page