Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 21


    "ఎట్లా స్టార్ట్ చేస్తావయ్యా!" నీ జగ్గులోపాలు పోయించుకోలేదా?" అడిగాడు పాలతను కోపంగా.
    "పోయించుకుంటే గంటసేపు ఆపమంటే ఎలా? ఏదో ఓ అరగంటంటే పర్లేదుగానీ! అవతల మా ఆఫీసర్లు కూడా మమ్మల్ని అడుగుతారు కదా!" అన్నాడు డ్రైవరు గార్డుని సపోర్టు చేస్తూ.
    దాంతో పాలతను మరీ రెచ్చిపోయాడు.
    "ఏటీ? మీ ఆఫీసరా? ఏం? మొన్న మీ ఆఫీసరుగారమ్మాయి పెళ్ళికి మా పాల వాళ్ళందరం కలసి ఫ్రీగా పాలుపోయలేదూ? బెజవాడలో ఏ ఆఫీసరింట్లో ఏం జరిగినా మాకేగా నష్టం? మరింకా ఏ మొఖం పెట్టుకుని బెదిరిస్తావయ్యా మమ్మల్ని?"
    ఆ జవాబుతో గార్డు డ్రైవరూ వెళ్ళిపోయారు-
    నేను టైమ్ చూసుకున్నాను. అరగంటైపోయింది. అప్పటికి! ఇక లాభం లేదని నేనే కలుగజేసుకున్నాను.
    "ఇదిగో చూడండి టి.సి.గారూ! అయిందేదో అయింది! ఇక రైలుని వదిలేస్తే మేము బెజవాడలో ఆఫీసుకెళ్ళాలి!" అన్నాను బ్రతిమాలుతూ.
    "ముందు మీ టికెట్ చూపించండి!" అన్నాడు టి.సి. కోపంగా.
    నేను సీజన్ టికెట్ తీసి చూపించాను.
    ఫోటోవంక- నా వంక రెండు నిమిషాలు పరీక్షగా చూసి టికెట్ నాకిచ్చేశాడు మళ్ళీ.
    మొత్తం రైల్లోని జనం అంతా వచ్చిచేరారప్పటికి!
    "ఇదిగో చూడు బాబూ! నువ్వన్నా ఆయనక్కొంచెం పాలుపోయవయ్యా! మాకు టైమవుతోంది!" అన్నాడు మరో ప్రయాణీకుడు పాలతనిని బ్రతిమాల్తూ.
    "ఎందుకు పోయాలండీ? అతని గేదెలు రెండు ఎండిపొయ్యాయట? ఎలా పోస్తాడు?" ఇంకో పలతను రావుడిని సమర్ధిస్తూ మాట్లాడాడు.
    ప్రయాణీకులు అందరూ కలిసి పాలతనిని, టి.సి.నీ బ్రతిమాలి రైలు స్టార్ట్ చేయడానికి వప్పించారు.
    అందరం 'హమ్మయ్య' అనుకుని రైలెక్కాం. సడన్ గా ఓ బిచ్చగాడు, ఓ చిన్నపిల్లా పాట అందుకున్నారు. ప్రయాణీకులు "శ్రోతలు కోరిన రికార్డులు" పాడిస్తున్నారు, వరుసగా! రైలు మళ్ళీ బయలుదేరింది.
    పాతకోటు, భుజాన పెట్టెతగిలించుకున్న వ్యక్తి మా కారేజ్ లో కొచ్చాడు.
    "పట్నంలో పళ్ళడాక్టర్లకి ఇరవైలు, ముఫ్ఫయ్ లు ఖర్చుపెడతారు సార్! అంత డబ్బు వృధా చేయకండి. కేవలం రెండు రూపాయలు అరవై పైసలకే మీ పళ్ళు పీకించుకోండి!    నాలుగు పళ్ళు పీకించుకున్న వారికి కన్సెషన్! గొప్ప దీపావళి బంపర్ ఆఫర్ సార్. ఎవరికండీ పన్నుపీకాలి? మాష్టారూ! ఈ అద్భుతమైన అవకాశం జారవిడుచుకోకండి! నేను మళ్ళీ నెలరోజులవరకూ ఈ లైన్ మీదకు రానండీ! వైజాగ్ లైన్ కెళ్ళిపోతున్నాను" కారేజంతా నాలుగు రౌండ్లు కొట్టాక మా పక్క కంపార్టుమెంటులోనే ఓ కేస్ బుక్ చేశాడతను.
    "ఏ పన్నండీ బాబూ?"
    "ఇదిగో ఇది..."
    "ఆహాహా పూర్తిగా చెడిపోయిందండీ! పాపం మీరు ఎంత బాధపడుతున్నారో."
    "అవును తెగ బాధగా ఉందనుకో!"
    "మరిదాని పక్కదాని మాటేమిటి? అదీ పాడయిపోయింది కదా?"
    "అబ్బే! దాని బాదేం లేదు."
    "లేకపోయినా ఇప్పుడే లాగేయటం మంచిదండీ! నేను మళ్ళీ  నెలరోజుల దాకారానిటు. రేటు కూడా కొంచెం తగ్గిస్తాను."
    "వద్దయ్యా దాన్నేం చేయకు"
    "సరే! - ఆ మాష్టారూ! మీ నలుగురూ ఇతనిని గట్టిగా కదలకుండా పట్టుకోండి సార్! ఈ రోగిని కదలకుండా పట్టుకుని, మాధవసేవ చేయండి బాబూ! ఎంతసేపో అక్కరలేదు. అయిదు నిమిషాలు చాలు ఆపరేషన్ చేసేస్తాను."
    ఆ చుట్టు పక్కలున్నవాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నారు. మరోక్షణంలో ఆపరేషన్ ప్ర్రారంభమయింది.
    "అబ్బా- బాబోయ్- నాయనోయ్-నన్ను వదలండ్రో- వ్వవ్వవ్వవ్వవ్వ-" ప్రాణం పోతున్నట్లు కేకలు వేస్తున్నాడా రోగి.
    "ఇంకో నలుగురు పుణ్యాత్ములు వచ్చి ఇంకా గట్టిగా పట్టుకోండి సార్! మానవసేవే మాధవసేవ సార్!"
    నా పక్కనున్న మరో నలుగురయిదుగురు కూడా వెళ్ళి ఆ వ్యక్తి మీదపడి శరీరం, నోరు, తల కదలకుండా నొక్కిపట్టారు!
    మళ్ళీ ఆపరేషన్ రెండో ఘట్టం ప్రారంభమయింది.
    మళ్ళీ కేకలు.
    "వావోయ్ వావోయ్- వ్వా-వ్వా-వ్వా-అవ్వా-అవ్వా."
    "అబ్బ! రక్తం చిమ్ముతోంది" అందో గొంతు.
    "ఏవయ్యా- ఏమిటది, రక్తం పిచికారీ కొట్టినట్లు కొడుతోంది?" ఎవరో అడిగారు.
    "పన్నులో చేప ఎక్కువుందన్నమాటండీ! అంటే వీళ్ళు వంశమంతా బాగా చేవవున్న మనుషులన్నమాటండీ! మా గట్టి దంతవరుస! సర్వీసులో ఇంత జబర్దస్త్ దంతం పీకటం ఇది మూడోసారి మాత్రమే" రైలు ఆగిందోస్టేషన్ లో.
    "నా పన్ను పీకద్దు బాబోయి- నన్నిలా వదిలేయ్ దేవుడోయ్" అంటూ అరుపులు.
    "మధ్యలో ఎలా వదుల్తానయ్యా- నన్ను పన్ను పీకటం చేతకాని వాడనుకుంటారందరు-"
    "నేనీ స్టేషన్ లో దిగాలయ్యా బాబూ! నన్నొదిలేయండి" తనను పట్టుకుని మీదెక్కి కూర్చున్నవారిని బ్రతిమాలసాగాడతను.
    "ఏం ఫర్వాలేదయ్యా! గొడవచేయకు. ఇంకొక్క జర్కు ఇచ్చానంటే ఠకీమని వూడిపోతుంది."
    "రైలు బయల్దేరుతుందయ్యా బాబూ! దిగిపోతాను."
    పళ్ళుపీకే వ్యక్తి ఓక్షణం ఆలోచించాడు.
    "సరే- నేనిప్పుడే వెళ్ళి ఓ పావుగంటబండి ఆపమని గార్డుగారితో చెప్పివస్తానుండు."
    "నేనూ నా పక్కనున్న వాళ్ళు అదిరిపడ్డాం.
    "ఏమిటి? గార్డుగారితో బండి ఆపమని చెప్తావా?"
    "అవునండీ! ఏం ఫరవాలేదు! నేను చెప్తే ఆపేస్తారులెండి! ఒకసారి ఆయన కుక్కకి నేనే పన్ను పీకేశాను? ఒక్క పైసాకూడా తీసుకోలేదు"
    "కుక్కకా?" ఒకాయన ఆశ్చర్యంగా అడిగాడు.
    "అవును సాధారణంగా కుక్కపళ్ళు పీకనులే? అయితే ఏదయినా పెద్ద రికమండేషనుంటే పీకేస్తాను! జంతుసేవే మాధవసేవ..."
    అతనుగార్డు దగ్గరకెళ్ళి వెంటనే తిరిగొచ్చాడు.
    రైలు ఆగిపోయింది.
    మళ్ళీ ఆపరేషన్ మూడో ఘట్టం (అంతిమ ఘట్టం) ప్ర్రారంభమయింది.
    "ఈసారి ఇంకాకొంచెం గట్టిగా పట్టుకోండి! సార్! మనం కోడి మెడెలా పట్టుకుంటాం? అలా నొక్కి పట్టుకోండి! ఒకే ఒక జర్క్ తో ఊడిపడాల్సిందే."
    అందరూ అతనిని బలవంతంగా పట్టుకుని నొక్కిపట్టారు.
    ఒక్కసారిగా అతను పిచ్చికేక వేశాడు.
    అతనిని పట్టుకున్నవాళ్ళిద్దరూ ఎగిరిపడ్డారు దూరంగా.

 Previous Page Next Page