Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 20

                                 

 

                         ఏ ట్రయిన్ ఫ్రమ్ మసులా!

     
    
    నాకు హైదరాబాదు నుంచి బెజవాడకు ట్రాన్స్ ఫర్ అయింది. బెజవాడ ఆఫీసులో నా పాత మిత్రుడు భగవాన్ కనిపించాడు.
    "ఇల్లెక్కడ తీసుకున్నావ్?" అడిగాడు భగవాన్.
    "ఎక్కడా తక్కువ అద్దెలో దొరకటంలేదు!" అన్నాను దిగులుగా.
    "అన్నట్లు నీకు బందర్లో ఓ ఇల్లుంది ఇదూ?"
    "అవును! ఉంటే ఏం లాభం?"
    "అక్కడే వుండి రోజూ బెజవాడ ట్రెయిన్ లో వచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం బెస్టు! చాలామంది అదేపని చేస్తుంటారు."
    నా కా అయిడియా నచ్చింది. వెంటనే బందర్లో సెటిలయిపోయి రైల్వేస్టేషన్ కెళ్ళి సీజన్ టికెట్ తీసుకున్నాను.
    మొదటిరోజు పొద్దున్నే స్టేషన్ చేరుకొని రైలెక్కి కూర్చున్నాను. తొమ్మిదిన్నరకల్లా బెజవాడ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సాయంత్ర ఎనిమిదింటికల్లా బందరు చేరుకోవచ్చు. రైల్వే ఇంత అభివృద్ధి చెందటం నాకెంతో ఆనందం కలిగించింది. నా చిన్నప్పుడు బందరు బెజవాడ రైలు విజయవాడ చేరటానికి ఆరుగంటలుపట్టేది. ఇప్పుడు కేవలం మూడేగంటలట! భగవాన్ చెప్పాడు. రైలు కదిలేవేళయేసరికి కారేజ్ లో సగం వరకు జనం నిండిపోయారు. నిజంగా బస్ ప్రయాణం కంటే రైలు ప్రయాణం ఎంతో సరదాగా వుంటుంది. అనేక ఊళ్ళవాళ్ళు కలుసుకోవడం మాట్లాడుకోవడం-
    రైలు బందరు స్టేషన్ వదలగానే ప్రయాణీకులు అర్జంటుగా రాజకీయాలు మాట్లాడేసుకోసాగారు.
    "ఎన్టీఆర్ మనకు చేసిందేమిటి? అని నేను కొశ్చెన్ చేస్తున్నాను! తెలుగు ప్రజల ఆత్మగౌరవం తగలబడిపోతోందహో అని కన్నీరు కార్చాడు- మరి మద్రాస్ నుంచి ఓ తమిళుడి ని తీసుకొచ్చి తనకు కార్యదర్శిగా నియమించుకున్నప్పుడు తెలుగువాళ్ళ ఆ ఆత్మగౌరవం ఏమయింది? అన్నాన్నేను కొశ్చెన్ చేస్తున్నా! అంతేకాదు, కిలోరెండు రూపాయల బియ్యం ఏవి? ఎవరిస్తున్నారు అని కూడా నేను కొశ్చెన్ చేస్తున్నాను."
    ఆ గురుడి ఉపన్యాసం ఎంత వరకూ కొనసాగేదోగాని ఈలోగా ఆ కారేజిలోకి ఓ వర్తక శిఖామణి వచ్చి వేలంపాట ప్ర్రారంభించేసరికి అతను చప్పబడిపోయాడు.
    "ఈ అద్భుతమైన సూపర్ డీలక్స్ స్టీలు గిన్నె. ఈ దంతపు దువ్వెనా కలిసి కేవలం అర్ధరూపాయి మాత్రమేనండీ. ఒకటోసారి రెండోసారి- డెబ్బయి ఆరురూపాయల స్టీలు గిన్నె, పధ్నాలుగు రూపాయల దువ్వెన కలిసి కేవలం అర్ధరూపాయి మాత్రమేనండీ."
    అంతకుముందే కారేజిలోకి వచ్చి కూర్చుని అతని అసిస్టెంటే కాబోలు, వాటిని బాగా పరీక్షించి "అయిదు రూపాయలు" అన్నాడు.
    సరే ఈ తతంగం తెలిసిందే కాబట్టి నవల తెరిచి చదువుకోసాగాను.
    కాసేపటికి తర్వాత చూస్తే రైలు ఏదో స్టేషన్ లో ఆగిపోయివుంది. క్రాసింగట. అరగంట తర్వాత బయల్దేరింది మళ్ళీ. ఆ తర్వాత రెండో స్టేషన్ లొ ఆగిపోయి కదల్లేదు.
    "ఎందుకిక్కడ ఆగిపోయింది మన బండి" పక్కనున్నతన్ని అడిగాను.
    "స్టేషన్ లో పాలవాళ్ళు పాలు తక్కువ పోశారట. గొడవ జరుగుతోంది." అన్నాడు అదేమిటో చూద్దామని రైలుదిగి గొడవ జరుగుతున్నచోట కెళ్ళాను.
    టికెట్ కలెక్టర్ కాబోలు పాలకాన్ ల దగ్గర నిలబడ్డాడు.
    "అది కాదండీ మొన్న తక్కువపోశారు. సరేనన్జెప్పి పట్టించుకోలేదు. చూడండి! ఇవాళకూడా ఈ గిన్నెలో సగానికి పోశారు. ఇది కావాలని చేయటం కాదంటారా?"
    కోపంగా అన్నాడతను మరో పాలు అమ్మే పెద్దమనిషితో.
    "ఎందుకొచ్చిన గొడవరావుడూ! లెక్కప్రకారం స్టేషనోళ్ళకి పోసేయకూడదూ?"
    రావుడు తిరగబడ్డాడు.
    "గొడ్లు రెండు ఎండిపోయినయ్! అందుకని తగ్గించాను. అయినాగాని ఊరికే బేవర్సుగా వచ్చేపాలు- కొంచెం తగ్గితేనేం?" పౌరుషంగా అన్నాడు రావుడు.
    "ఏటి? బేవార్సుగా పోస్తున్నావా?" కోపంగా అడిగాడు టి.సి.
    "అవును! మేమందరం బేవర్సుగా పోయకపోతే మీ రైలోళ్ళు ఏ రోజయినా డబ్బెట్టికొన్నారా?"
    "ఎవడికోసం పోస్తారయ్యా? మీరు పదిరూపాయలు పాలు ఊరికేపోసి వందరూపాయలు లాభం మా దగ్గర్నుంచీ దొబ్బుతున్నారు.'
    "మీలాటోళ్ళుంటే లాభాలు గాడిదగుడ్డొస్తాయి."
    గుంపుని నెట్టుకుంటూ స్టేషన్ మాస్టర్ లోపలకు జొరబడ్డాడు.
    "ఏమిటయ్యా గొడవ! బండికి ఆలస్యం అయిపోతుంది" అన్నాడాయన మందలింపుగా.
    "ఆ టికెట్ కలెక్టర్ని పాల డబ్బాలు వదలమనండి - వెళ్ళిపోతాం! మాదేం ఆలస్యం వుంది?" అన్నాడు రావుడు.
    "వదిలేయవయ్యా ఎందుకొచ్చిన గొడవ?" విసుక్కున్నాడు స్టేషన్ మాస్టర్.
    "మీ కోటాపాలు మీకు వచ్చేశాయి గనుక మీరు వదలమంటారండీ! అనకేంజేస్తారు?" కోపంగా అన్నాడు టి.సి.
    ఆ మాటతో స్టేషన్ మాస్టర్ కింకేమనాలో తెలీలేదు.
    "సరే- ఈ రోజుకి పోనీ! రేపు సంగతి చూద్దాం" అన్నాడు రాజీధోరణిలో.
    "ఎలా పోనిస్తానండి! మా చంటిదానికి పాలు పట్టించాలా? మా పెద్దాడికి పాలివ్వాలా, పెరుగు తోడేయ్యాలా- మా ఆవిడా, నేనూ తాగాలా? ఎట్టా సరిపోతాయి ఇంతమందికీ పాలు? మీకు తెలుసో తెలీదో - రెండ్రోజుల్నుంచీ జేబులో డబ్బెట్టి పావులీటరు పాలు కొంటున్నాను. నా సర్వీసులో ఎప్పుడూ కొన్లేదు. ఈ స్టేషన్లో మొట్టమొదటిసారి కొన్నానండీ! కాష్ పెట్టి పాలుకొన్నాను. థూ వెధవ స్టేషన్" కన్నీళ్ళ పర్యంతం అయిందా టి.సి.కి డబ్బు సంగతి తల్చుకోగానే.
    ఈలోగా గార్డూ, డ్రయివరూ కూడా వచ్చి చేరారక్కడ.
    "ఏమయింది?" అడిగాడు గార్డు.
    స్టేషన్ మాస్టర్ కథంతా చెప్పాడు గార్డుకి.
    "అయితే వీళ్ళ గొడవమూలాన బండి ఎంతసేపు ఆపుతాం? స్టార్ట్ చేసేస్తాను" అన్నాడు గార్డు.

 Previous Page Next Page