ద్రవిడ మాహేశ్వరుడి ముందునిలిచిన కృష్ణ సర్పం మెడను వొంకలుత్రిప్పి తొలిచూలాలు యాతన పడుతున్నట్లు కదిలింది! కొద్ది సేపటికి దాని శరీర భాగాలు నెమలిపించాన్ని విప్పినట్లు పురివిప్పటం ప్రారంభించినాయి! ఆకృతులు రూపుదిద్దుకున్నాయి.
ఒక అపూర్వ లావణ్యరాసిగా మారిపోయింది!
శ్వేతదంత కాంతులు చిమ్మేలా అందమయిన చిరునవ్వు నవ్విందామె!
"నీ కోసమే ఎదురు చూస్తున్నాను!" కోటి వీణల మీద శత కోటి రాగాలు సృతులు సవరించు కుంటున్న అనుభవం కలిగింది ఆ స్వరంలో!
"ఎవరు నువ్వు? నన్నేంచేస్తావు?" అని ప్రశ్నించింది తులసి భయంగా!
"ఏమీ చేయను. యాచిస్తాను. పతిభిక్ష అర్దిస్తాను" అందామె కొంగు చాచి!
"నేను పతిభిక్ష పెట్టటం ఏమిటి?" అంది విస్మయంగా.
"ఈ నాటి నీ పతిదేవుడే ఒకనాటి నాపతిదేవుడు! నా గజాతి మగువలకు మనసుపడ్డ మగవాడే ఎన్ని జన్మలకయినా! నాపతి దేవుడి కౌగిలింతలలో పులకింతలవుతున్న ఓనారీ! ధన్యురాలవు. నా సోదరివి! అంటూ అడుగు ముందుకేసి గాఢంగా కౌగిలించుకుంది సర్పసుందరి!
ఊపిరాడలేదు. ఉలికిపడి లేచి కూర్చుంది "నో నో" అని అరుస్తోంది తులసి!
"పీడకల వచ్చిందా తులసీ. మంచి నీరు త్రాగి పడుకో!" అంటున్నాడు శివరాజ్!!
5
"అర్దరాత్రి ఎందుకలా కేకలు పెట్టావు? మేడ మీదికి వచ్చి చూద్దామనుకున్నాను! అబ్బాయి అపార్ధం చేసుకుంటాడనిపించి ఆగిపోయాను" అంది తల్లి కాఫీ కప్పులలో సర్ది తులసి చేతికి అందిస్తూ!
కాఫీ కప్పులు అందుకుని పైకి వచ్చింది తులసి!
అప్పటికే శివరాజ్ డ్రసప్ అవుతూ కన్పించాడు. బ్రతిమాలి బుజ్జగించి నిద్రలేపాలి కాబోలు అనుకుంటూ గదిలో కాలుపెట్టిన తులసి ఆ దృశ్యం చూచి నిర్ఘాంత పడిపోయింది.
"ఆగిపోయావేం? తులసిజలం అందించుకో!"
"ఈరోజు పెందలాడే తయారై పోయారేమిటి?"
"ఒక్క క్షణం ఆలస్యమయినా క్రిమినల్స్ దొరకరు! మన కోసం వాళ్ళుండరు. వాళ్ళ కోసమే మనం పరుగులు తీయాలి?" కాఫీ త్రాగటం ముగించాడు.
"రాత్రి మీరు మేలుకునే ఉన్నారా? సంశయంగా సిగ్గుపడుతూ అడిగింది.
"హాయిగా విద్రపోయాను. నీ కలవరింతలు విన్నాకే లేచాను"
"ఏమని కలవరించాను. మీకు గుర్తుందా?"
"నిద్రపోతూ అనే మాటలకు విలువేమిటి? గుర్తెందుకు పెట్టుకోవాలి?"
"కొన్ని కలలు నిజమవుతాయంటారు ముఖ్యంగా తెల్లవారుఝాము వచ్చినవి!"
"ఇలాంటి పిచ్చి నమ్మకాలు మీ మమ్మీతోపాటు నీకూ వంట పట్టాయన్నమాట?"
"కాదండీ ఇవాల్టి కల మాత్రం భయం పుట్టించింది!" గుండీలు సవరించింది..
"సైన్సు స్టూడెంట్ వి. ఇలా మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు" బెల్టు బిగించేశాడు.
"మీరు తొందరపడి పోతున్నారు. ఒక్క క్షణం నిలబడి నామాటలు వింటారా!"
క్యాప్ అతని చేతులకు అందించి దగ్గరగా నిలబడింది.
"చెప్పా కదా! క్రిమినల్స్ ఒక్కక్షణం అయినా మాకోసం చూడరు. త్వరగా చెప్పాలి" అంటూ హడావుడిగా స్టిక్ అందుకుని గాగుల్స్ తగిలించుకున్నాడు.
"సరే చెప్పు వింటాను" అన్నాడు నింపాదిగా! అతని భుజంమీద చెంపలానించి కన్నులు మూసుకుంది తులసి!
"ఇవాళ నాకు చాల భయంగా ఉంది!"
"పోలీసు భార్యకి భయమేమిటోయ్? కారణం ఉండాలిగా?"
"ఏ మాటలయితే కలలో కూడా వినకూడదనుకున్నానో ఆ మాటలే విన్నాను. అదంతా నిజమే అయితే నేను చచ్చిపోతానండీ!"
"కలలు నిజాలెందుకవుతాయి పిచ్చిదానా?"
"అయినా నాకు భయంగానే ఉంది!"
"విషయమేమి జరిగిందో వివరించు"
"ద్రవిడ మాహేశ్వరుడి జటా జూటంలోంచి కృష్ణసర్పం క్రిందికి దిగి వచ్చి చాలా అందమయిన అమ్మాయిగా మారిపోయిందండీ!"
"ఇలలో జరగనివే కదా కలలో కన్పిస్తాయి. తరువాత?"
"నేను ఆమెకు సోదరిని అవుతానట!"
"తమాషాగా ఉందోయ్ వింటానికి!"
"మీరు ఆమెకు పూర్వజన్మలో భర్తఅట! మిమ్మల్ని తీసుకుపోతుందట!" అంతవరకే చెప్పగలిగింది. ఆ తరువాత మాటలు పెగలలేదు.
బావురుమని ఏడ్చేసింది తులసి!
భుజంమీదినించి చేతులవరకు పోలీస్ షర్ట్ తడిచిపోయింది.
"హమ్మయ్య! అర్ధమయింది. అదన్నమాట నీ బాధ! చాల చదువుకున్నావు కాని పాములు కలలో ఎందుకు కన్పిస్తాయో తెలుసా నీకు?"
"ఇలా భయపెట్టేందుకేనేమో అనుకుంటున్నానండీ!"
"కాదు! సెక్స్ పరమయిన కోరికలు తీరనప్పుడు అవి సర్పాల్లా కలల్లో దర్సనమిస్తాయని నిర్వచించాడు కలలమేధావి సిగ్మండ్ ఫాయిడ్!"