"ఆ అమ్మాయిగురించి తెలిసింది. వాళ్ళ అమ్మానాన్నా మంచివాళ్ళుకారు. అందుకే నువ్వు స్నేహం చెయ్యట౦ నాకు ఇష్టంలేదు" అనునయంగా అంది ......
"అమ్మా నాన్నలు మంచివాళ్ళు కాకపోతేనేం ? ప్రసూన అమ్చిదేగా," అమాయకంగా అడిగింది. సుశీల. ఉలికిపడింది లలిత ..... సుశీల అమాయకంగా అడిగిన ప్రశ్న లలితను నిలబెట్టి సంజాయిషీ అడిగినట్లే అయింది .......
"వద్దు !" అంది అంతకంటే ఇంకేమీ చెప్పలేక సుశీల అన్నం తినకుండా పెంకేతనం ప్రారంభించింది. లలిత లోలోపల బాధపడినా, ఆ మొండి పట్టుదల అలా సాగానిస్తే అదే అలవాటవుతుందని భయపడి పట్టించుకొనట్లు ఊరుకుంది ......
ఆ మధ్యాహ్నమే ప్రసూన వచ్చింది సుశీలకోసం. లలిత ముఖంలో ప్రసూనకేం కనిపిస్తో౦దో ..... ఎందుకో అర్ధం కాని బెదురూ కలుగుతుంది ......
"సుశీల .... సుశీలకోసం వచ్చాను?" అంది .....
"సుశీలకు వంటలో బాగులేదు __ ఎవరితోను మాట్లాడదు" విసిగ్గా అంది లలిత .......
ప్రసూన ఒక్క క్షణం బిత్తరపోయినట్లు నిలబడింది ......మరుక్షణం అణచుకుంటూ అణుచుకుంటూ ఏడుపు మొదలు పెట్టింది ..... బెక్కుతూనే "మాట్లాడను _ దూరంనుంచి చూస్తా" ... అందిజాలిగా .... దీనంగా ప్రాధేయ పడుతున్నట్లు .....
నిర్ఘాంతపోయి చూసింది సుశీల......
ఎవరో తనచేత బలవమ్త్కాన పలికిస్తున్నట్లు "వెళ్ళు?" అంది .......
ఒక్క పరుగున లోపలి గెంతింది ప్రసూన _ మరుక్షణం పిల్లలిద్దరి పకపకలూ లలితకు కార్నకఠోరంగా వినిపించాయి. వెళ్ళి సుశీల గదిబయట నిలుచుంది.
"సుశీ! నీకు వంట్లో బాగుందాలేదా?" ఆప్యాయంగా అడిగింది ప్రసూన ........
"ఎవరు చెప్పారు?"
"మీ అమ్మగారు"
"అవును . బాగాలేదు. అందుకే పొద్దుటినుండి అన్నం తినలేదు."
"పోనీ బిర్నవీటా తాగు!"
"ఏమో ! అమ్మ ఇష్టం ......"
లలితా చెమ్మగిల్లిన కళ్ళను రుమాలు తో అద్దుకుని వంటమనిషితో సుశీలకు బిర్నవిటా పంపించింది. సుశీల ట్రేలో ఉన్న ఒక కప్పు చూసి "నాకు అక్కర్లేదు" అంది. వంట మనిషి లలితకు చెప్పింది. లలితా ఒక్కక్షణం ఆలోచించింది . రెండు కప్పులతో బిర్నవిటా పంపించింది. సుశీల ఒక కప్పు ప్రసూనకిచ్చి అప్పుడు తను త్రాగింది..... ఆరోజు ప్రసూన వెళ్ళగానే సుశీల లలితా భుజాలచుట్టూ చేతులు వేసి ఊగుతూ "మా అమ్మ మంచిది" అంది ......
లలితా సుశీలను ముద్దు పెట్టుకుంది .......
ప్రసూన "నీకు వంట్లో బాగులేదా" అని అడగానే సుశీల "అవును బాగులేదు" అని చెప్పటం లలితకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి సిగ్గూ, ఆనందమూ రెండూ కలుగుతున్నాయి.
నాటినుండీ ప్రసూనా సుశీలను స్నేహానికి లలితా స్పష్టంగా ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ప్రసూన పట్ల లలితకుగల అసహనభావం సుశీలకు ప్రసూనకు ఇద్దరికీ అర్ధమయ్యేది .
ఇంటర్ చదివే రోజులలో ఒకనాడు సుశీలా ప్రసూనా ఇద్దరూ సినిమాకు వేళ్ళాలనుకున్నారు. లలితా వీల్లేదంది.
"వయసోస్తున్న పిల్లవు నాతోకాని, నాన్నగారితో కాని వెళ్ళవలసిందే! స్నేహితులతో తిరగనివ్వను_"
సుశీల ఎన్ని విధాల బ్రతిమాలినా ప్రయోజనం లేక పోయింది. చివరకు సుశీల ఏడుస్తూ పడుకుంది. అయినా లలితా కరగలేదు. ఏడుస్తోన్న సుశీల దగ్గరకు సాంబశివం వచ్చాడు.
"ఎందుకమ్మా? ఎందుకు ఏడుపు?" అన్నాడు అప్యాయంగా బుజ్జగింపుగా .......
"చూడునాన్నా! అమ్మ ప్రసూనతో సినిమాకు వెళ్ళద్దంటో౦ది ......." ఏడుపు గొంతుకతో మరంత గారాలు పోతూ అంది సుశీల .........
లోలోపల మండింది సాంబశివానికి .......
"ఓస్ ఇంతేనా! నేను డబ్బులిస్తా! నువ్వెళ్ళు " .... అన్నాడు సాంబశివ౦.
"మరి , అమ్మ?" ......
"అమ్మకు చెప్పకుండా వెళ్ళిపో! నేనుచూస్తాలే?"
వచ్చి రాణీ వయస్సులో ఎలాగైనా స్నేహితురాలితో కలసి సినిమా చూడాలని ఉత్సాహంతో ఉన్న సుశీలకు ఆ మాటలు అమృతపు గుళికల్లా తోచాయి __ వెనుకముందు లాలోచించకుండా వెంటనే వెళ్ళిపోయింది.
రాత్రి పదింటికి సుశీల ఇంటికి చేరేసరికి లలితా అపర కాళికలా సుశీలమీద మండిపడుతూ "సినిమాకు వెళ్ళావా? నేను వద్దన్నాక కూడా ......" అంది.
సుశీల నిలువునా వణికింది. లలితా వ్యక్తిత్వంలో ఏముందో కాని ఆవిడ చిన్నమాట అన్నా ఎదుటివాళ్ళు పిల్లుల్లా అయిపోతారు. "నాన్నా ... నాన్న వెళ్ళమన్నాడు. అందుకని ......" సంజాయిషీ. ఇచ్చుకుంది సుశీల ......
లలితా గిర్రున సాంబశివ౦ వైపు తిరిగింది సాంబశివం గర్వంగా నవ్వుతూ నిలిచున్నాడు.
"అవును నేనే వెళ్ళమన్నాను, ఏం?"
ఆ సమయంలో తాగిఉన్నాడేమో, అతని నాలుక ముద్దా ముద్దగా పలుకుతోంది.
తనలో జీవమంతా ఎవరో లాగేసినట్లు కూలబడి పోయింది లలిత .....
ఒక్కసారిగా పట్టరాని ఉద్రేకంతో పిడికిళ్ళు బిగించి "నువ్వు నువ్వు" అని ఆ తరువాత ఇంకేమీ అనలేక తల రెండు చేతులతో గట్టిగా పట్టుకుని "అబ్బా!" అంది .....
"ఈ లలిత ..... ఒక్క చూపుతో ..... ఒక్క విదిలింపుతో ..... తనను ఒక పురుగులా అల్లంతదూరాన నిలబెట్టుగలిగిన లలితా కుమిలిపోతుంటే పట్టరాని అనందం కలిగింది సాంబశివానికి ......
పక పక నవ్వాడు........
దిగ్గున తలెత్తింది ..... లలితా ఆ కళ్ళలోంచి నిప్పులు నీళ్లుగా స్రవిస్తున్నాయి.
"నువ్వు చేసిన ఈ పని నా గుండెల్లో కత్తితో పొడవాటమే! కానీ, గుర్తుంచుకో ! ఒకనాటికి నువ్వు పదును పెట్టుకుంటోన్న ఈ కట్టి నీ గుండెల్లోనూ దిగపడుతుంది . అప్పుడు ఎంతగా కుమిలిపోయినా ప్రయోజనం ఉండదు."
తన తల్లిని అలా చూస్తోంటే సినిమాకు వెళ్ళిన సంతోషమంతా ఆవిరయిపోయింది సుశీలలో .... అలా కుమిలిపోతున్న తల్లిని ఓదార్చాలని ఎంతగా అనిపించినా సమీపించటానికి సాహసించలేకపోయింది.