సూట్ కేస్ సర్దుకుని ప్రయాణమావుతోన్న మాధవను చూసి నిర్ఘాంత పోయింది కాత్యాయని. ఏది జరగటానికి ఇష్టం లేక సరళ రాసిన ఉత్తరాన్ని మాధవకు చూపించకుండా చింపేసిందో అదే జరుగుతోంది.
"నువ్వు వెళ్ళటానికి వీల్లేదు" గంభీరంగా , దృడంగా అంది కాత్యాయని.
ఎన్నడూ కాత్యాయని అజ్ఞాలకు అలవాటుపడని మాధవ ఒక్క క్షణం బిత్తరపోయి చూశాడు. మరుక్షణంలో అతనిలో ఏదో మొండితనం తలెత్తింది. కాత్యాయని మంచితనం అతనిని బంధించినంతగా కాత్యాయని అజ్ఞ ఏనాడూ బంధించలేదు.
"వెళ్ళి తీరాలి అత్తయ్యా!"
కాత్యాయని నిర్ఘంతపోయింది . తన మాట కాదంటూన్నాడా మాధవ.....?
"మాధవా! నేను నిన్నెప్పుడూ అజ్ఞాపించలేదు. ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు."
"నువ్వు స్పష్టంగా ఆజ్ఞాపించలేకపోయినా ఇంతవరకూ నీ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఏనాడూ సంచరించలేదు. ఈ ఒక్కసారి క్షమించు."
"నువ్విలా ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు తెలుసు. ఇది నీకు న్యాయం కాదు."
"నేను ఎందుకెళ్ళి పోతున్నానో నిజంగానే నీకు తెలిస్తే నన్ను ఆగమని నిర్భంధించటంలో అర్ధం లేదు"
కాత్యాయని కళ్ళు పెద్దవి చేసుకుని నిలబడిపోయింది. ఆ చూపుల నేదుర్కోలేని మాధవ గబుక్కున అక్కడ నుండి బయటికొచ్చేసి కాలినడకతోనే స్టేషన్ కు బయల్దేరాడు.
కాత్యాయని విసురుగా జానకి దగ్గర కెళ్ళింది. జానకి తల వంచుకుని ఎంబ్రాయిడరీ కుట్టుకుంటూ వుంది.
"ఛీ! నువ్వూ ఒక అడదానివేనా? మొగుడు ఉన్నట్లుండి ప్రయాణ మవుతుంటే కాస్త అపలేవూ?"
ఎంబ్రాయిడరీ పక్కకు పెట్టి మర్యాదగా లేచి నుంచుంది జానకి.
"ఎందుకు ఆపటం?"
"ఎందుకా?"
"అవును. ఎన్నాళ్ళూ ఆపగలను?"
స్థాణువయి నిలబడింది. అప్రయత్నంగా జానకిని కౌగలించుకుని "నీకు అన్యాయం చేశాను జానకీ! చేస్తున్నానని తెలీకుండా చేశాను" అంది కన్నీళ్ళతో.
"లేదు పిన్నీ! మీరు నాకు ఏ అన్యాయమూ చెయ్యలేదు. మీరు నా గురించి ఇలా బాధపడితే నేను సహించలేను."
ఎన్నడూ , ఏ పరిస్థితులలోనూ కన్నీళ్ళూ పెట్టుకొని కాత్యాయని కన్నీళ్ళూ పెట్టుకున్నందుకు సిగ్గుపడి అంతలోనే మాములుగా గంభీరంగా అయిపొయింది.
ఆశ్చర్యంగా కాత్యాయని ముఖంలోకి చూసిన జానకి ఆవిడ మనసులో ఏముందో అంతుపట్టలేదు. ఆ రోజంతా అతి మాములుగా గడిచిపోయింది. కాని, ఆ సాయంత్రానికల్లా కాత్యాయనికి ఉదృతంగా గుండెల్లో నొప్పి వచ్చేసింది. జానకి గాభరాపడిపోయి "ఆయనకు టెలిగ్రాం ఇస్తాను" అంది.
కాత్యాయని జానకి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
"వద్దు. మాధవకు నా జబ్బు గురించి ఉత్తరం రాసినా, టెలిగ్రాం ఇచ్చినా నా మీద ఒట్టే."
ఆజ్ఞాపిస్తున్నట్టే అని, బాధ భరించలేక గట్టిగా కళ్ళు మూసుకుంది కాత్యాయని. నిస్సహాయంగా కాత్యాయని పక్కన కూచుని నెమ్మదిగా గుండెలు రాయసాగింది జానకి.
* * *
మెడ్రాస్ చేరుకున్న మాధవ, ప్రయాణం చేసిన బట్టలైనా మార్చకుండా మంచం మీద పడుకున్నాడు. తల పగిలిపోతోంది. అయినా లేచి హోటల్ కి వెళ్ళి కాఫీ తాగాలని కూడా అనిపించలేదు.
డబ్బు పెడితే అందాలను కొనుక్కోగలడా? అంటే తన ప్రేమలో జానకి కేమాత్రం నమ్మకం లేదన్నమాట!
ఎలా నమ్మకం కలిగించగలడు? తనకి లోకంలో అందరికంటే జానకే ఎక్కువని చెప్పగలిగే భాష ఏది?"
"హమ్మయ్య! వస్తావో , రావో అని బెంగ పెట్టుకున్నాను. వచ్చేశావు. అలా పడుకున్నావేమిటి?"
సరళ గొంతు విని మంచం మీంచి లేచి కూర్చున్నాడు మాధవ.
సరళ వంక విచిత్రంగా చూస్తూ "బెంగ పెట్టుకోవటమేమిటీ?" అన్నాడు.
సరళ ఆహ్లాదంగా నవ్వింది.
"నాకు తెలుసులే! నువ్వు రాకుండా ఉండవని తెలుసు. అయినా చెప్పకుండా చెయ్యకుండా వెళ్ళిపోయిన పెద్దమనిషివి. నామాట మన్నించి వస్తావో, రావో అని కాస్త భయపడ్డాను."
మాధవ చిరాగ్గా చూశాడు.
"నీమాట మన్నించి రావటమేమిటి? అసలు నేను వస్తానని నీకెలా తెలుసు?"
సరళ ఆశ్చర్యపోయింది.
"నా ఉత్తరం నీకందలేదూ?"
"ఏ ఉత్తరం?"
"మరి! ఇంకో నాలుగు రోజులు సెలవు పెట్టుకుని కూడా ఇప్పుడెందుకొచ్చినట్టు?"
"నా మనసు చికాగ్గా ఉండి వచ్చేశాను."
"మనసు చికాకా?"
"అబ్బ! నన్ను విసిగించకు సరళా! వెళ్ళు. తర్వాత కలుసుకుంధాం" విసుక్కున్నాడు మాధవ.
సరళ ముఖం చిన్నబుచ్చుకుంది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
మాధవకు జాలి కలిగింది.
"సారీ సరళా! నా మనస్సెం బాగుండలేదు. అందుకని విసుక్కున్నాను. తరువాత మట్లాడుకుందాం. నీ కాలేజికి టైం కాలేదూ!"
"ఇవాళ ఆదివారం"
"పోనీ సరే! కూచో కాఫీ తెప్పిస్తాను"
"కూచోవటమేమిటి ? పిక్ నేక్ కి రావా?"
"పిక్ నిక్ ఏమిటి?"
"ఓహో! నా ఉత్తరం అందలేదు కదూ!" ఇవాళ కొంతమంది స్నేహితులం కలిసి పిక్ నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం. అందుకే నిన్ను రమ్మని రాశాను."
"వెరీ సారీ సరళా! నేను రాలేను. నా ఒంట్లో కూడా బాగుండలేదు."
"ఒంట్లో బాగుండలేదా. ఏం?" అంటూనే సరళ మాధవ దగ్గరగా వచ్చేసి నుదుటి మీద చెయ్యి వేసింది.
"జ్వరం లేదు" అంది తేలిగ్గా ఊపిరి పీలుస్తూ.
చేతిని మృదువుగా తొలగిస్తూ "ఏం లేదు కాస్త తలనొప్పి" అన్నాడు విసుగు నణచుకుంటూ.
"ఏదయినా టాబ్లెట్ వేసుకోకపోయావా? అంజనం కాస్త రాయనా?"
"ఏం వద్దు. పడుకుంటే అదే పోతుంది. నువ్వు పిక్ నిక్ కి వెళ్ళాలి కదూ! టైమవుతోంది వెళ్ళు"
"భలేవాడివి . నీకిలా ఉంటె నేను పిక్ నిక్ కి వెళ్ళగలననే అనుకుంటున్నావా? నేనెక్కడికి వెళ్ళటం లేదు' మాధవ మంచం దగ్గరగా స్టూలు లాక్కుని కూర్చుంటూ అంది సరళ.
"ఫరవాలేదు సరళా! నువ్వు వెళ్ళు . నువ్వు రాకపోతే నీ స్నేహితులంతా నిరుత్సాహపడతారు. కాస్త తలనొప్పి సాయంత్రానికల్లా....."