Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 20


    "ఏమిటది?"
    "అదే స్వామీజీ ...నిద్రపట్టడం లేదని చెప్పానుగా...అందుకు ఏదయినా మార్గం ఉంటే చెప్పండి....." చిరునవ్వుతో విష్ణు వైపు క్రీగంట చూస్తూ అడిగిందామె.
    విష్ణు ఒకే ఒక నిమిషం ఆలోచించాడు.
    "చూడు భారతీ నీలాగానే మన మందిరంలో మరొక భక్తురాలు కూడా చేరింది..."
    "ఆమె పేరు లీలా కదూ...."
    'అవును.....నిజానికి ఈ మందిరంలో ఏదో దొరుకుతుందనే ద్రోహచింతనతో అడుగుపెట్టింది. ఒకసారి దొంగతనం చేసి తీసుకు వెళ్ళింది కూడా. కానీ దొంగలించుకు వెళ్ళినవి ఆమెకు ఎందుకూ ఉపయోగించవు నా డైరీలు. అందుకే వాటిని తిరిగి పెట్టేసే నెపంతో మరొకసారి దొంగతనానికి వచ్చింది. ఆమె దురదృష్టవశాత్తూ పట్టుబడింది. కానీ తన ప్రవర్తనలో మార్పు వచ్చిందనీ, తనను శిష్యురాలిగా స్వీకరించమని అభ్యర్ధించడంతో నేను అంగీకరించాను. అందుకే నీకు నిద్ర పట్టనప్పుడల్లా రీతాను కలిసి మాట్లాడుతుండు. ఆమె ఎందుకు వచ్చిందో , నిజంగానే మార్పు వచ్చిందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ రానట్టయితే ఆమెలో ఆధ్యాత్మిక భావనను తీసుకొచ్చి సన్మార్గంలో పెట్టె బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను..... ఆశ్రమ వాతావరణం నీకు అలవాటుపడిన తరువాత రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదనే సమస్య నీకుండదు...."
    'అలాగే స్వామీ .....మీరు చెప్పినట్టు ఈ రోజు నుంచి ఆమెను గమనిస్తుంటాను మది మరొక విన్నపం......' భారతి కంఠంలో అభ్యర్ధన.......
    "ఏమిటో చెప్పు.'
    "నాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపించినా , మీతో మాట్లాడాలనిపించినా మీ మందిరానికి వచ్చేస్తాను, కాదనకండి!"
    "వ్వాట్......"
    ఈసారి విష్ణులో ఉలికిపాటును గమనించిందామె.
    "అవును స్వామీ.....ఇప్పటికి నా జీవితానికి గమ్యం ఏమిటో తెలిసింది. నా అన్వేషణ ఫలించింది" అంటూనే లిప్తపాటు కాలంలో విష్ణును సమీపించి అయన పెదవులపై ముద్దు పెట్టింది.
    చల్లటి మంచుగాలులు వీచినట్టు విష్ణు శరీరం జలదరించింది.
    ఊహించని ఆమె చర్యకు విష్ణు భిన్నుడయ్యాడు.
    "వస్తాను స్వామీజీ......"
    భారతి వెళ్ళడానికన్నట్టు అన్నది.
    అది గమనించి మందిరం బయట తరట్లాడుతున్న రీటా వడివడిగా ముందుకు వెళ్ళిపోయి ఒక స్తంభం చాటున క్రీనీడలో తప్పుకున్నది.
    వయ్యారంగా అడుగులు వేస్తూ విష్ణు వైపు కొంటెగా చూస్తూ బయటకు వచ్చేసింది భారతి.
    విష్ణు మనసు భారతి ప్రవర్తనను జీర్ణం చేసుకోలేక జడత్వాన్ని పొందినట్టు కొన్ని క్షణాల క్రితం జరిగిపోయిన సంఘటనల ప్రకంపనల నుంచి బయట పడలేకపోతున్నది.
    రీటా మందిరంలోకి అడుగుపెట్టింది.
    అయినా ఆమె ఉనికి గ్రహించనట్టు విష్ణు చూపులు శూన్యలోకి చూస్తున్నాయి.
    రీటాకు పరిస్థితి అయోమయంగా వున్నది.
    విష్ణు పరిసరాలనే మరచిపోయి ఉన్నాడు. భారతి ఎందుకు వచ్చోందో......వెళ్ళేటప్పుడు ఆమె ముఖంలో చిందులేస్తున్న ఆనందానికి కారణం ఏమిటో వచ్చీ రావడంతో ఆయనను అడగాలని అనుకున్నది గానీ అయన పరిస్థితి చూసిన తరువాత ఆ ప్రశ్న వేయలేకపోయింది.
    "స్వామీజీ......ఈ వేళప్పుడు వచ్చి మీ ప్రశాంతతను భంగాపరచడం లేదు కదా........
    రీటా ప్రశ్నకు ఉలిక్కిపడుతూ వాస్తవానికి వచ్చాడు విష్ణు.
    ఆమె చెప్పిన మాటలనే చెప్పి అర్ధరాత్రి వేళ తన మందిరానికి ఎవరూ రావద్దు అనే ఆంక్షలు విధించాలని అనుకుంటున్న విష్ణు ఆ మాటలను మనసులో అనుకున్నాడు తప్ప బయటకు చెప్పలేకపోయాడు.
    విష్ణు సమాధానం చెప్పకముందే......
    "ఏమీ లేదు స్వామీ.......ఎందుకో నిద్రపట్టడం లేదు. బహుశా మనసులో పేరుకుపోయి వున్న అశాంతి వలనే అనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో మీ వద్ద వుంటే మనశ్శాంతి లభిస్తుందని ఇలా వచ్చాను...." రీటా గొంతులో మార్దవం ధ్వనించింది.
    విష్ణు ఒకే ఒక క్షణం ఆలోచించాడు.
    "సరే, ఈరోజు నుంచి నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. భారతి అనే విదేశీ యువతి కూడా నీలానే ఆశ్రమంలో వుంటుంది. ఆమెను నీడలా వెన్నంటి వుండు. ఆమె ప్రవర్తన నాకు ఎందుకో అనుమానాస్పదంగా తోస్తుంది. ఆమె ప్రవర్తన వలన ఆశ్రమ పవిత్రత మంట గలిసిపోతుందేమోనని సందేహంగా వున్నది. నువ్వు గమనిస్తున్నానని తెలిస్తేనయినా ఆమె ప్రవర్తన మార్చుకుని సవ్యంగా వుంటుందని నా ఆలోచన..." అలాగైనా భారతి చేష్టలకు కళ్ళెం వేయవచ్చనని విష్ణు తలపోశాడు.
    "అలాగే స్వామీజీ......మీరు చెప్పినట్టే చేస్తాను. నాలాంటి ఒక శిష్యురాలు గురువు సాన్నిధ్యాన్ని కోరుకోవడం తప్పుకాదుగా....నా ధర్మ సందేహాలను తీర్చగలిగిన గురువులు మీరేనని గుర్తించబట్టే నేను నా ప్రపంచాన్ని వదులుకుని మీ ప్రాంగణమే నా నివాసంగా చేసుకుని మీ చెంత వుండిపోయాను.'
    రీటా మాటలలో ఎన్నెన్నో అర్ధాలు స్పురిస్తున్నా, ఆధ్యాత్మిక జీవనం కోసమే ఆమె వచ్చి వుంటుందేమో , తనే అనవసరంగా ఆమె మాటలను సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నానేమోనని సరిపెట్టుకున్నాడు విష్ణు.
    "అసలు ఆడవాళ్ళకు దేవుడు ఈ అందాన్ని  ఎందుకు ఇచ్చాడు స్వామీ? ఈ అందం మోక్ష సాధనకు అంతరాయం కలిగించదా?" సూటిగా ప్రశ్నించింది రీటా.
    "నిజమే.....నీలాంటి అందమయిన వాళ్ళ వలన ఆశ్రమ వాతావరణం కలుషితం అవ్వడానికి అవకాశం వుంది. అయినా శరీరం వేరు. వస్త్రం వేరు. ఈ శరీరం జీవునికి వస్త్రం లాంటిది. అది జీవుని వాస్తవ స్వరూపం కాదు. శరీరం కేవలం జడమైన వస్తువు. అది పంచభూతముల చేత నిర్మించబడింది. ఒక వస్త్రాన్ని ధరించి ఎలా వదిలి మరొక వస్త్రాన్ని ధరిస్తామో అలానే జీవుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని పొందుతాడు. కాబట్టి దేహం యొక్క సౌందర్యాన్ని చూసి, ఆనందాలను వీక్షించి ఎవరూ మురిసి'పోకూడదు.
    "మీరు చెప్పింది నాకు అర్ధమయింది స్వామీ....అలానే మరొక నగ్న సత్యాన్ని కూడా మీరే చెప్పారు.' గుంభనంగా అన్నది రీటా.
    'ఏమిటది?"
    "నేను అందంగా వున్నానని......'
    "నేనా....నేనెందుకన్నాను ......అసలు నీ అండంతో నాకేం పని .నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పానంటే......"
    ఒక క్షణం కలవరపడినా వెంటనే తమాయించుకుంటూ అన్నాడు విష్ణు.
    'అదేమిటి స్వామీ అలాగంటారు? ఇప్పుడు మీరే చెప్పారుగా...నీలాంటి అందమయిన వాళ్ళ వలన అని....అంటే నేను అందంగా వున్నానని మీ నోటితో మీరు చెప్పినట్టు కాదా?" వగలుపోతూ అన్నది రీటా.
    "మాట వరుసకు అన్నాను తప్ప అది నీ అందాన్ని మెచ్చుకోవడం కాదు.
    "విష్ణు గతుక్కుమన్నాడు..
    "కారణం ఏదయినా మీ దృష్టిలో నేను అందంగా వున్నాను. అనే మాట చాలు..మీరు చెప్పినట్టుగానే భౌతికమయిన ఈ అందాన్ని చూసి మురిసిపోకుండా అశాశ్వతమయిన నా సౌందర్యాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తూ మీ మార్గంలోనే నడవడానికి ప్రయత్నిస్తాను.

 Previous Page Next Page