Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 19


        
    చాపపై పడుకుని వున్న రీటా కళ్ళుమూసుకుని వున్నది.
    ఆమె నిద్రపోతున్నదో లేక కళ్ళు మూసుకుని ఆలోచనలో వున్నదో తెలుసుకోవడం కష్టమే. ఒకవేళ అలా పడుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుని లైటు తీయడం మరచిపోయి వుండవచ్చుననుకోవడానికి వీలుంది.
    రీటాతో తనకు అనవసరం అనుకుని ధైర్యం చేసి ముందుకు అడుగు వేసింది భారతి.
    సరిగ్గా ఆమె విష్ణు మందిరంలోకి అడుగు పెట్టిందో లేదో, తన గదిలో నుంచి బయటకు వచ్చింది రీటా.
    ఆమె కళ్ళలో అదొక విధమయిన అనుమానం తొంగిచూస్తున్నది.
    భారతి ఇంత రాత్రి వేళ తనేం చేస్తున్నదో వచ్చి దొంగచాటుగా చూడడమే కాకుండా విష్ణు మందిరంలోకి వెళ్ళడమేమిటి?
    అసలు విష్ణుకి ఆమెకు ఏం సంబంధం?
    ఏ సంబంధం లేకపోతే సరాసరి విష్ణు మందిరంలోకి అంత ధైర్యంగా ఎందుకు వెళుతుంది?
    అలా అనుకోవడమే కాదు, ఊరుకుండలేకపోయింది.
    తన గదిలోని లైటు తీసి వేసి విష్ణు మందిరం వైపు చకచకా సాగిపోయింది రీటా.
    రెండే రెండు నిమిషాలలో విష్ణు ధ్యానమందిరాన్ని చేరుకున్నదామె.
    రీటా లోనికి వెళ్ళే ప్రయత్నం చేయకుండా బయటనే ఆగిపోయింది.
    ఆ నిశ్శబ్ద సమయంలో గదిలోపల ఇద్దరిమధ్యా జరిగే సంభాషణ లీలామాత్రంగా వినిపిస్తుంది.
    "వ్వాట్......భారతి....ఈ సమయంలో వచ్చావు?" ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు విష్ణు.
    'అవును స్వామి....మీ సన్నిధిలో వుండాలని వచ్చాను" అమాయకంగా ముఖం పెడుతూ అన్నది భారతి.
    "ఇంత రాత్రి వేళ రావడానికి .....ఇదే విష్ణుమందిరం అనుకున్నావా లేక నందనవనం అనుకుంటున్నావా? ఆశ్రమ మర్యాదలను గౌరవించాలన్న కనీస నియమాలను సయితం మరచిపోయి ఇలా రావచ్చా?' ఆవేశపూరిత స్వరంతో ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్న విష్ణు గంభీరమయిన ముఖం వైపు ఎక్కువసేపు చుదలేకపోయింది భారతి.....
    'అది....అది కాదు స్వామీ......"
    "ఏది కాదు......అసలు నువ్వెందుకొచ్చావు?"
    విష్ణు కళ్ళలో ఎర్ర జీర మొట్టమొదటిసారిగా చూస్తున్నదామె.
    అయన కోపాగ్నికి తను మాడి మసైపోదు కదా? అయినా ఇంత ముక్కోపి భక్త జనులను ఉద్దరించే మహాపురుషుడు ఎలా అయ్యాడో ఆమెకు అంతుపట్టలేదు.
    అప్పటికి తనను తాను నిగ్రహించుకున్నాడు విష్ణు.
    "ఏమీ లేదు స్వామీ. ఎందువల్లనో నిద్రపట్టడం లేదు. బయటకు వచ్చి చూస్తే మీ మందిరంలో లైటు వెలుగుతుండడం గమనించాను. నా మనస్సులో వున్న ధర్మ సందేహాలను మీ సమక్షంలో తీర్చుకుంటే హృదయము తెలికపడుతుందేమోననిపించింది" ఓరగా విష్ణు వైపు చూస్తూ భారతి ఎంతో వినయ విదేయలతో చెప్పింది.      
    "అలాగా ..........ఏమిటి నీ సందేహం?"
    'మానవుని జీవితానికి కర్మఫలం ఎలా ఆపాదింఛబడుతుంది స్మామిజీ!"
    అలాంటి ప్రశ్న వేస్తుందని ఊహించనందువల్లనెమో ఒక క్షణం ఆమె ముఖం వైపు తేరిపార చూశాడు విష్ణు. కానీ ఆమెలో ఎలాంటి భావాన్నీ చదవలేకపోయాడు.
    "ఎందరో జనులు దుఃఖం అనే దావాగ్నిలో పడి శాంతిని నోచుకోక తల్లడిల్లిపోతున్నారు. ఈ సంసార దుఖానికి జనన మరణాలకు , ఇతర సంసారిక పరితాపాలకు మూలకారణం అజ్ఞానం. అజ్ఞానం వలనే కర్మ జనిస్తుంది. కర్మచేత జన్మ (శరీరం) ఏర్పడుతున్నది. జన్మ వలన దుఃఖ పరంపర కలుగుతున్నది. కాబట్టి దుఖాన్ని పరిపూర్ణంగా తొలగించుకోవాలంటే ముందు అజ్ఞానాన్ని పారద్రోలాలి. చీకటి ప్రకాశం వల్లనే తొలగిపోతున్నట్టు అజ్ఞానమనేది జ్ఞానం పొందడం చేతనే అంతర్దానమవుతుంది. కాబట్టి ముందు నీలోని అజ్ఞానాన్ని వీడీ నీ మనస్సును ఆద్యాత్మిక చింతన వైపు మళ్ళించు."
    'అందుకే స్వామీ......మీరు నాకు నచ్చారు' టక్కున చెప్పింది భారతి.
    విష్ణు ఉలిక్కిపడ్డాడు.
    "ఏమిటి......"
    "అదే స్వామీజీ.......మీలో అంతులేని అపారమయిన జ్ఞాన నిధి వున్నది. ఏది అడిగినా సూక్ష్మర్దాలతో సహా విపులంగా మనసుకు హత్తుకునే రీతిలో సందేహాలను తీరుస్తారు. మీలో అంతర్లీనంగా వున్న ఆ తత్వమే నాకు నచ్చింది అని చెబుతున్నాను. నేనేమైనా తప్పుగా మాట్టాడానంటారా?" అమాయకంగా ముఖం పెట్టింది భారతి.
    "అబ్బబ్బే.......లేదు.......లేదు......"
    "కానీ మీరు నా మొదటి సమస్యకు మార్గం చూపనే లేదు......"

 Previous Page Next Page