"కసాయివాడి దగ్గరి కెళ్ళే మేకపిల్లలా మొహం పెట్టకు! లుక్ గుడ్ అండ్ గుడ్ లక్! వెళ్ళిరా!"
భారతి అన్నట్లే, ఎన్ని సార్లు ఫోన్ చేసినా సుదీర దొరకలేదు. నలబై నిమిషాల సేపు నడిచి సుదీరా వాళ్ళ హొటలుకి వెళ్ళాడు భరత్.
అప్పుడే బయటికి వెళ్ళబోతోంది సుదీర. భరత్ ని చూడగానే ఆమె మొహం వికసించింది.
"ఓహ్! రండి! ఎలా వచ్చారు?"
"నటరాజా సర్విస్! అంటే రెండు కాళ్ళ సవారి!"
నవ్వింది సుదీర. "అయితే , ప్రాబ్లెం లేదు. నేను కాస్త పనిమీద బయటికి వెళ్తున్నాను. ప్లీజ్! సాయం రారూ! మా సారధికి ఏదో పని ఉందని రెండు రోజుల పాటు కనబడనన్నాడు."
సారధి దయాకర్ పని పట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అది చూచాయిగా మాత్రమే తెలుసు సుదీరకి.
"ముందు మీకు మా హొటల్ లో కొంచెం అతిధి సత్కారాలు చేస్తాను రండి!" అంటూ కాఫీ షాప్ లోకి తీసుకెళ్ళింది. బంగారు రంగులో ఉన్న మెనూ కార్డు అందిస్తూ, "ఏం తీసుకుంటారు?' అంది.
మెనూ చదివాడు భరత్. ఆశ్చర్యంగా అతని కళ్ళు పెద్దవయ్యాయి. కాఫీ- అయిదు రూపాయలు. కుకుంబర్ శాండ్ విచేస్- ఎనిమిది రూపాయలు. ఐస్ క్రీమ్ ఫలుదా- పద్దెనిమిది రూపాయలు.
కాఫీ తాగాక 'ఇప్పుడు నేను కొంచెం షాపింగ్ చెయ్యాలి, తోడు వస్తారా? ప్లీజ్ !" అంది.
ఇద్దరూ బయటికి వచ్చి కారేక్కారు. పావుగంట తర్వాత కారు ఒక జ్యువెలరి షాపు ముందు ఆగింది.
"దైమెండ్స్ కలెక్ట్ చెయ్యడం నాకు హాబీ!" అంది సుదీర.
ఎయిర్ కండిషన్డ్ జ్యువెలరి షాపు అది. నిశ్శబ్దంగా వుంది. డిగ్నిపైడ్ గా ఉన్న కస్టమర్స్ చాల నెమ్మదిగా మాట్లాడుతూ నగలు పరిక్షిస్తున్నారు.
సుదీరని చూడగానే కూల్ డ్రింకులు తీసుకురావడానికి వెళ్ళిపోయాడు ఒక సేల్స్ మాన్.
"భరత్! మీకు తెలుసా? ఒకప్పుడు ఇండియన్ డైమండ్స్ కి ప్రపంచంలో చాలా గిరాకి ఉండేది. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. కోహినూర్ వజ్రం కూడా అక్కడే దొరికిందని చెబుతారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆఫ్రికన్ డైమండ్స్ ఎక్కువ బాగుంటాయి. వాటిని సెట్స్, బెలియమ్ దేశాలలో కట్ చేయించి సాన పెట్టిస్తే గిరాకి మరి ఎక్కువ. ఇండియన్ డైమండ్స్ కి చుట్టూ ఉన్న మైనాన్ని , మట్టిని పూర్తిగా రిమూవ్ చెయ్యరు. అందుకని ఒక్కోసారి అవి వజ్రలలోనే ఉన్న నల్లటి చుక్కల్లగా కనబడి, అందాన్ని చెడగోడతాయి."
"ఎందుకని సరిగ్గా క్లీన్ చెయ్యరు?"
"ఇక్కడున్నవన్ని పాతకాలపు మెషినులు, పాతకాలపు పద్దతులునూ! అందుకని!"
"మీరు రోజు బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం తింటారు సుదీరా?"
"ఏం?"
"బ్రేక్ ఫాస్ట్ లోకి డైమండ్స్ తింటారేమో అనుకున్నాను. ఇంత సులభంగా చెప్పేస్తుంటే!" అని నవ్వాడు భరత్.
"దైమెండ్స్ తింటే చచ్చిపోతారు తెలుసా? నాకు నగలమీద చాల ఇంటరెస్టు ఉంది భరత్. అయితే ఉరికే అమ్మవారిలాగా వంటినిండా నగలు దిగేసుకుని ఫోటోలు తీయించుకోవడం అంటే అసహ్యం. వజ్రాల గురించి, రత్నాల గురించి కూలంకషంగా తెలుసుకోవడం , సేకరించడం నా హాబీ! నూట అరవై రకాల ఖనిజాలని విలువైన రాళ్ళుగా భావిస్తారు. వాటిలో ఇండియన్సు ఎక్కువ కొనేది ఇరవై అయిదు రకాలనే! ఈ మధ్య కొత్తగా క్యూబిక్ జింకోనియం అని ఒకటి వస్తోంది. తెలియని వాళ్ళు అది నిజంగా వజ్రమే అని భ్రమ పడతారు. దానికి అన్ని వజ్రాలకు ఉండే లక్షణాలే ఉంటాయి" అంది గడగడ వప్పచెప్పేస్తూ.
అందుకే ఆ షాపువాళ్ళు ఆ అమ్మాయిని చూస్తే గడగడలాడిపోతారు. వజ్రాల గురించి సుదీరకి తెలియనిది లేదు. వజ్రం చూడగానే దాని విలువ చెప్పేస్తుంది.
ప్రోప్రయిటర్ స్వయంగా వచ్చి , భక్తిగా నెక్లేసులు చూపించాడు. వాన్ క్లీఫ్ అర్పల్స్ లాంటి ప్రముఖ విదేశీ సంస్థలు డిజైన్ చేసిన నగలు అవి.
ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసుకుని భరత్ కి చూపించింది సుదీర.
"బాగుంది!" అన్నాడు అతను. నిజానికి దాని బాగోగులు గురించి అతనికి బొత్తిగా తెలియదు.
నవ్వి- ప్రోప్రయిటర్ వైపు తిరిగి, తల పంకించింది సుదీర. అతను లోపలికెళ్ళి అచ్చం అలాగే వున్న మరో నెక్లెస్ తెచ్చి, ఆమె అంగీకారం కోసం ఎదురు చూశాడు.
ఆ రెండూ రెండు చేతుల్లో పట్టుకుని, మార్చి మర్చి చూసింది సుదీర.
"బ్యూటిఫుల్! ఎవ్వరు తేడా కనిపెట్టరు. ఒకే! పాక్ చెయ్యండి!" అంది.
అర్ధం కానట్లు మొహం పెట్టాడు భరత్.
"ఈ డూప్లికేట్ నెక్లెస్ జ్యువెలరి భరత్! అమెరికన్ డైమెండ్స్ అంటారు వాటిని. మోజుకొద్దీ వజ్రాల నగలు కొనుక్కుంటాం. కానీ లక్షలు పెట్టి కొన్న ఆ నగలని మోజు తీరా పెట్టుకోవడానికి లేకుండా దొంగల భయం. అందుకని ఈ డూప్లికేట్ నగలు పెట్టుకుని తిరగాలి. ఒరిజినల్ నగల్ని బ్యాంకు లాకర్లలో నుంచి తియ్యడానికే వీల్లేదు. అలా ఉంటుంది జీవితం!" అంది నిస్పృహగా.
"పాపం ఎంత కష్టం!" అనుకున్నాడు భరత్. అతనికి నవ్వొస్తోంది.
"మర్చిపోయాను సేట్ జీ! నవరత్నాలు కావలి?" అంది సుదీర.
"జరూర్ మేం సాబ్! ఏమి విశేషం అమ్మా? కొత్త బిల్డింగు భూమి పూజ గినా చేస్తుండ్రా?"
అవును! అలాంటిదే!" అంటూ బిల్లు చూసి చెక్కు రాసిచ్చింది సుదీర.
బయటికి వచ్చారు.
"ఇంక నేను వెళ్ళనా? నాకు కొద్దిగా పని వుంది" అన్నాడు భరత్ సంకోచంగా.
"చెప్పండి! ఏం పని? నేను కార్లో డ్రాప్ చేస్తానుగా.'
"ఏమి కాదు. రేషను తెచ్చేశాను. ఇంక ఇప్పుడు వెళ్ళి కిరోసన్ క్యూలో నిలుచోవాలి. ఇవాళ కాకపోతే మళ్ళీ నాలుగు రోజుల దాకా పోయ్యడు.
"కిరోసనా?ఎందుకు?"
"మరి వజ్రాలతో వంట జరుగుతుందా అండి?"
నవ్వింది సుదీర.
"వజ్రం అంటేనే కార్బన్- అంటే ఒక విధమైన బొగ్గు లాంటిదే అన్నమాట. బ్రహ్మాండంగా కాలుతుంది. మీకు కిరోసిన్ దొరక్క పొతే ఈ వజ్రాల హారం ఇచ్చేస్తాలెండి! వంట చేసుకోవచ్చు!"
"మీకు జోక్ గా ఉంది. నేను వెళ్ళాలండి!"
జాలిగా చూసింది సుదీర. "మీది ఏ షాపు? చెప్పండి మీ డీలర్ ఎవడు?"
ఒక అప్పడాల షాపు వారి కాంప్లిమెంటు అయిన పసుపుపచ్చ గుడ్డ సంచిలో నుంచి తన రేషను కార్డు తీశాడు భరత్.
అది అందుకుని, కనుబొమ్మలు ముడేసి చూసింది సుదీర. "ఓహో! వాడా! పదండి వెళ్దాం!" అని కారు వేగంగా నడుపుతూ ఒక పెద్ద బంగళాముందు ఆపింది. బంగళా చుట్టుతా ఆవరణ ఉంది. దానిలో బోలెడన్ని కిరోసిన్ డ్రమ్ములూ, ట్యాంకర్లు, ఎద్దుబళ్ళు ఉన్నాయి.
కారు చూడగానే ఒక నౌకరు పరిగెత్తుకొచ్చాడు.
"కిషన్ ఉన్నాడా?"
"ఉన్నాడు మేం సాబ్!"
"పిలుస్తున్నానని చెప్పు."
దడదడలాడుతూ పరిగెత్తుకొచ్చాడు కిషన్.
"కిషన్! ఈ కార్డు మీద ఎన్ డార్స్ చేసి వెంటనే నాలుగు టిన్నుల కిరోసిన్ అందేలా చూడు.'
"జీ!" అంటూ బాల్ పాయింట్ తీసి సంతకం పెట్టాడు కిషన్. నౌకరు లోపలికెళ్ళి రబ్బరు స్టాంపు తెచ్చి దానిమీద ముద్ర వేశాడు.
"రేయ్ టాంకరు తోలుకెళ్ళి అయ్య ఇంట్లో సప్లయి చేసి తర్వాత రౌండ్లకి వెళ్ళండి. సమఝయిందా?"
"అవ్!" అంటూ నౌకరు పరుగెత్తికెళ్ళి టాంకర్ డ్రైవరుతో చెప్పాడు.
టాంకరు కదిలి వెళ్ళిపోయింది.
"మీకు చాలా ఇన్ ఫ్లుయేన్సు ఉందే!" అన్నాడు భరత్.
"ఈ ఉళ్ళో మాకు పెట్రోలు, ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మా బాబాయి చూస్తూ ఉంటాడు" అంది సుదీర.
"అలాగా!"
"ఇప్పుడు తమాషా చూద్దాం!" అంటూ కారుని భరత్ వాళ్ళ ఇంటి వైపు పరుగెత్తించింది సుదీర.
అప్పటికే కిరోసిన్ టాంకరు హడావుడిగా ఆ సందులోకి మళ్ళుతోంది. అదే సందులో ఉంది కిరోసిన్ రిటైయిల్ షాపు కూడా. అతను పరమ కర్కోటకుడు. ఆ షాపు ముందు దిగాలుపడ్డ మొహాలతో పెద్ద క్యూలో నిల్చుని ఉన్నారు జనం. అందరి చేతుల్లో డబ్బాలు, సీసాలు.