"నీకు ఇష్టమేనా ?" అన్నాడు అభిమానంగా.
"చాలా ఇష్టం" అంది భారతి. 'చాలా ఇష్టం' అని ధ్వనించేలా కలిపి పలుకుతూ. ఆమె మొహంలో సంతోషం తొంగి చూస్తోంది.
"శుభస్య శీఘ్రం అన్నారు- మరింకేం - నాన్నగారితో చెప్పెయ్యానా?"
"ఉహు! ఇప్పుడు కాదు - సాయంత్రం నేను సంగీతం క్లాసు తీసుకునేటప్పుడు చెప్పు."
అది వినిపించుకోకుండా , గొంతు పెద్దగా సవరించుకుని, "నాన్నగారూ" అనబోయాడు భరత్?"
చటుక్కున లేచి, అతని నోట్లో వేడి వేడి అట్టు ఒకటి కుక్కేసింది భారతి.
--------------
ఎన్నెన్నో నేరాలూ, నీతిమాలిన పనులూ , చట్టవిరుద్దమైన వ్యవహారాలూ చేస్తేనే ఒకప్పుడు గరిబుగా ఉండే రత్నాకరరావు నవాబుగా మారగలిగాడు.
అయితే, అతను చాలామంది ఘారనా గుండాలలాగే , తను స్వయంగా రంగంలోకి దిగి నేరాలూ చెయ్యడు. తెరవెనుక ఉండి చేయిస్తాడు. ఘోరాలన్ని. అతని కింద పనిచేసే వాళ్ళు పొరలు పొరలుగా చాలా లేవెల్సు లో ఉంటారు.
అతను ఒక అజ్ఞ జారి చేసిన తరువాత, అది అంచెలంచెలుగా కింది వాళ్ళలో ఇంకి, చివరగా దాన్ని అందుకుని నేరం చేసినవాడికి నిజంగా చేయించిన రాత్నాకరావుకి అసలు సంబంధమే లేకుండా పోతుంది.
అలాగే అయింది ఇప్పుడు కూడా.
రత్నాకరరావు తన నిర్ణయాన్ని సారధికి చెప్పాడు. సారధి తన కింది వాడికి చెప్పాడు. అతను తన కింది వాడికి, అతను తన కింది వాడికి...........అలా అలా సాగి , చివరగా బాబూలాల్ కి అందింది ఆ ఆర్డరు.
బాబూలాల్ పెద్ద గుండా అని అందరికి తెలుసు. అతను రత్నాకరరావు కొలువులో ఉన్నాడని మాత్రం చాలామందికి తెలియదు.
ఒక్క డొక్కు అంబాసిడర్ కారులో వచ్చాడు బాబులాల్. రాష్ డ్రయివింగ్ వల్ల సొట్టలు పడి వుంది కారు. చాలా చోట్ల పెయింటు పెచ్చులు పెచ్చులుగా ఉడిపోయి వుంది. పూర్తిగా అరిగిపోయిన టైర్లు నున్నటి బట్టతలలా కనబడుతున్నాయి.
సారా పీపాలా వుంటాడు బాబూలాల్. వదులుగా మోకాళ్ళ కిందకి వచ్చే ఎర్ర చొక్కా చీల మండల పైకి వున్న పూనా పాంటు అనబడే పైజామా వేసుకుని స్టిరింగ్ ముందు కూర్చుని వున్నాడు. అతనిలాగే మొరటుగా వున్న మరో నలుగురు కూడా కార్లో వున్నారు.
"ఇటూ రా!" అన్నట్లు దయాకర్ కి సైగ చేశాడు బాబూలాల్.
"ఏం కావాలి సార్? వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ, మైసూర్ బొండా.........." అంటూ పరుగెత్తుకొచ్చాడు దయాకర్.
ఉపోద్ఘాత మేమి లేకుండా, "నువ్వు వారం రోజుల లోపల ఈ స్థలం ఖాళీ చేసేయ్యలా" అన్నాడు బాబూలాల్.
దయాకర్ నిర్ఘాంతపోయాడు.
"ఏమిటి సార్?" అన్నాడు అర్ధం కానట్లు.
"నువు ఏడు దినాల్లోపల ఈ జాగా ఖాళి చేసి పోవాలా!"
"ఎక్కడికి?"
"ఏట్లోకి, యాడికన్నా ఎల్లి పెట్టుకో హొటల్. ఈడ మాత్రం కుదరదు."
"అసలింతకీ మీరెవరు?"
"నీ యవ్వ యమదూతలంటే! సమఝయిందా! కావాలంటే పైసలు పారేస్తా. ఎల్లిపో."
"నేను ఆరేళ్ళగా ఇక్కడ స్థిరపడిపోయి , ఈ కాలేజి పిల్లల అభిమానంతో బతుకుతున్నాను. ఇంకో చోటు వెదుక్కుని హొటలు పెట్టుకున్నా, దానికి రెగ్యులర్ కస్టమర్స్ ఏర్పడి , మళ్ళీ బిజినెస్ పుంజుకోవాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదు. పేపర్లలో అడ్వార్ట్యిజ్ మెంట్స్ వేయించుకోవడానికి , పబ్లిసిటి ఇచ్చి బిజినెస్ పెంచుకోవడానికి నేను డబ్బున్న వాణ్ని కాను. ఇక్కడ నుంచి వెళ్ళిపొమ్మని మీ రంటే అన్యాయంగా చచ్చిపోతాను సార్.'
"నువ్వు చచ్చినా, బతికినా లోకాని కొచ్చిన నష్టం లేదు. ఎల్లిపొమ్మని చెప్తే మంచితనంగా ఎల్లి పోవాల. వింటివా? ఇంకో జాగాలో నువ్వు బతకలేకపొతే ఈడనే మేం ఫైవ్ స్టార్ హొటల్ కడుతున్నాం. అందులో వంటలవానిగా నౌకరి ఇస్తంలే!"
"ఇంకొకళ్ళ కింద వంటవాడిగా పని చెయ్యాల్సిన ఖర్మ నాకేమిటి సార్?" అన్నాడు దయాకర్ ధైర్యం కూడదిసుకుంటూ. "నాకి స్థలం లీజుకి ఇచ్చారు. లీజు పిరియడ్ ఇంకా చాలా కాలం ఉంది. నన్ను బెదిరించాలని చూడకండి. అంతాదాకా వస్తే కోర్టుకి వెళతాను నేను."
నములుతున్నా జర్దా పాన్ ని తుపుక్కున ఉమ్మేశాడు బాబూ లాల్. "బద్మాష్, కోర్టులు, గిర్టులు అని ఎదురు తిరిగేంత దమ్ముందిలే నీకు? నువ్వెంత? నీ బతుకెంత? నువ్వు ఎవరితో కొట్లాట పెట్టుకుంటున్నావో తెలుసా?"
"నే నన్న దానిలో తప్పేముంది సార్! లీగల్ గా ఈ స్థలం మీద ఇంకా చాలా ఏళ్ళపాటు హక్కుంటుంది నాకు."
బాబూలాల్ అప్పటికే కారు ఇంజన్ రైజ్ చేశాడు. "అనుభవిస్తావు" అని టూకీగా హెచ్చరించి , కారు ముందుకు పోనిచ్చాడు.
------------
బాబూలాల్ చెప్పిన సమాధానం అంచెలంచెలుగా సారధికి చేరింది.
అతను రాత్నాకరావు దగ్గరికి వచ్చేసరికి చింతకాయల బాబా, రత్నాకరరావు, సీత కూర్చుని సీరియస్ గా చర్చిస్తున్నారు.
"నరబలి ఇస్తేనే సీతమ్మకు మంత్రిపదవి వచ్చేది" అంటున్నాడు బాబా.
"కాని, స్వామి! నరబలి అంటే మాటలా!" అంది సీత.
"సీతమ్మ తల్లి! మీరు ఇంతకు ముందు ఎన్ని ప్రాణాలు తియ్యలేదు! ఎన్ని హత్యలు చేయించలేదు! మరొక్క ప్రాణం తీసినంత మాత్రాన పాపమేమి చుట్టుకోదు. పైగా ఇది దేవతా ప్రీత్యర్ధం! కాబట్టి దీనితో పాత పాపాలన్నీ కూడా తుడిచి పెట్టుకుపోతాయి. మీకు గిట్టని వాళ్ళెవరన్నా వుంటే ఈ లెక్కలో పద్దు రాయించేయ్యండి.'
"ఎక్యుజ్ మీ సర్!" అంటూ లోపలికి వచ్చాడు సారధి.
"ఏమిటి?" అన్నాడు రత్నాకరరావు.
"ఆ దయాకర్ గాడు ఇడియట్........రూల్స్ మాట్లాడుతున్నాడట! కోర్టు కెళ్తనని వాగుతున్నాడట!"
అందరూ సాభిప్రాయంగా మొహమొహాలు చూసుకున్నారు.
బాబా చిద్విలాసంగా నవ్వాడు. "వేదకపోయిన తీగె! ఇంక ఆలస్యమెందుకు? పైకి పంపించెయ్యండి వాడిని" అన్నాడు.
----------------
"నీ కోసం చిలక వచ్చి వెళ్ళింది" అంది భారతి నవ్వుతూ.
భరత్ ఒక చేత్తో ముప్పయ్ కిలోల బియ్యం సంచి, మరో చేత్తో పది కిలోల గోధుమ సంచి సునాయకంగా పట్టుకుని అప్పుడే రేషన్ షాపు నుంచి తిరిగి వచ్చాడు . దృడంగా కనబడుతున్నాయి అతని చేతులు.
"ఎవరు?" అన్నాడు తెలియనట్లు.
"ఎవరు? అని వెక్కిరింపుగా అంది భారతి. "ఎవరుట! ఏమి తెలియనట్లు! సుదీర వచ్చింది. నువ్వు రేషన్ షాపుకి వెళ్ళి క్యూలో నిలబడ్డావని , రెండు మూడు రోజుల్లో వచ్చేస్తావని చెప్పాను. నవ్వి, తనకు అర్జెంటు పని ఉందని , ఒకసారి ఈ నంబరుకి ఫోన్ చెయ్యమని చెప్పి వెళ్ళిపోయింది."
"సరే! చేస్తాలే!"
"అన్నయ్యా!"
"ఏమిటి?"
"ఎటూ తేల్చి చెప్పకుండా, ఆ అమ్మాయిని నీ చుట్టూ తిప్పుకోవడమే మగతన మనుకుంటున్నావా?"
"భారతీ!"
"కాకపోతే ఏమిటి? వెంటనే వెళ్ళి పెళ్ళి నీ కిష్టమేనని చెప్పేయ్! ఇప్పుడే!"
"ఇప్పుడు చాలా పనులున్నాయి భారతి!"
"పనులేప్పుడు ఉంటాయి లెద్దూ! ముందు వెళ్ళి చెప్పు!"
"పోనీ అన్నం తిన్న తరువాత వెళ్తాలే"
"అన్నం లెదూ, సున్నం లెదూ వెళ్ళమంటుంటే!"
నిస్పృహగా భుజాలు ఎగరేసి బయలుదేరాడు భరత్.
"అలాగే వెళ్ళిపోతావా ఏమిటి? బట్టలు మార్చుకోవు!"
"ఫోన్ లో బట్టలెం కనబడతాయా?"
చేత్తో నుదుటి మీద కొట్టుకుంది భారతి. "మహానుభావా! ఒకవేళ ఫోన్ దొరక్కపోతే ఆ అమ్మాయిని వెంటనే స్వయంగా కలిసి చెప్పి రావాలి. తెలిసిందా?" అంటూ లోపలికెళ్ళి , ఇస్త్రి బట్టలు తెచ్చి ఇచ్చింది భారతి.