Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 20


    "మాధవుడేడీ?" అడిగాడు సీతారామయ్య.
    
    "తన గదిలో ఉన్నాడు. అమెరికా నుండి వాడికేవో ఉత్తరాలొచ్చాయి. చూసుకుంటున్నాడు!" అన్నాడు కేశవరావు.
    
    "ఈ మెయిల్!" సవరించింది యశోద.
    
    "నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా!" అన్నాడు సీతారామయ్య.
    
    "చెప్పన్నయ్యా!" అన్నాడు కేశవరావు.
    
    ఇంతలో 'టిర్..... ర్.....ర్....' అంటూ అతని సెల్ ఫోన్ మోగింది. "ఒక్క నిమిషం, అన్నయ్యా!" అంటూ ఫోన్ తీసి, "హలో.....జగన్నాథరావుగారా! ఏమిటీ మీ అల్లుడు వచ్చినట్లు అప్పుడే తెలిసిపోయిందా? సాయంత్రం పార్టీనా? స్మితని ఫోన్ చేసి చెప్పమనండి తప్పకుండా తీసుకొస్తాను. అందరం వస్తాం! ఓకె, బై....!" అని ఫోన్ పెట్టేసి, అన్నగారితో "జగన్నాథరావుగారని కోటీశ్వరుడు. సి.ఎం.కి చాలా కావలసినవాడు, నాకు మంచి మిత్రుడు!" అన్నాడు.
    
    యశోద గొప్పగా "అసలు సంగతి దాచేశారేం? మన మాధవ్ ని అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నారు. వారికి ఒక్కగానొక్క పిల్ల!" అంది.
    
    కేశవరావు కూడా ఆనందంగా "సంఘంలో పలుకుబడీ, హోదా ఉన్న పెద్ద మనిషితో వియ్యం అందడం అదృష్టమేగా అన్నయ్యా!" అన్నాడు.
    
    సీతారామయ్య మాట్లాడలేదు.
    
    "ఆయనకి మాత్రం ఈ విషయం  ఆనందం కాదా ఏం? సాయంత్రం వెళ్తాంగా, పిల్లని చూస్తారు!" అంది యశోద.
    
    "మాధవ్ ని కనుక్కున్నారా? చేసుకుంటా నన్నాడా?" అడిగాడు సీతారామయ్య.
    
    "వాడి మొహం! వాడికేం తెలుసు? ఆడపిల్లని చూస్తేనే మెలికలు తిరిగిపోతాడు!" నవ్వుతూ అంది యశోద.
    
    "మరి నా పోలికాయె!" అన్నాడు కేశవరావు.
    
    మూతి తిప్పి, "రండి వడ్డించేస్తాను!" అంది.
    
    మాధవ్ కూడా వచ్చాడు. "లిజీ ఏం రాసిందో తెలుసా నాన్నా?" అడిగాడు.
    
    ముందు భోజనం చెయ్యి తర్వాత, తీరుబడిగా మాట్లాడుకుందాం!" చెప్పాడు కేశవరావు.
    
    "ఈ విషయం గురించే రాసింది నాన్నా! వాళ్ళ అమ్మా నాన్నా ఏ విషయం తాను మాట్లాడదామన్నా ఇప్పుడు కాదూ.... లీజర్ గా మాట్లాడదాం అనేస్తారట. మనుషులు లేక మాట్లాడేవాళ్ళు లేక తను అలమటించి పోతుందిట. వారానికి ఓ సారైనా అందరం కలిసి డిన్నర్ చేయడం, తల్లి చేతి కాఫీ తాగడం, తండ్రితో కలిసి బయటికెళ్ళటంలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీరని ఈ ఎండమావిని చూసి ఎందుకు మీరు పరుగెత్తుకుంటూ వస్తారూ? గ్రాండ్ పేరంట్స్ ని చూడటానికి మమ్మీ, డాడీ హోమ్ ఫర్ ది ఏజ్డ్ కి కనీసం ఆరునెలలకి ఒక్కసారైనా వెళ్ళరు! నేను హాస్టల్లో వుంటే వాళ్ళంత వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ అయినా చెయ్యరు! నువ్వు చెప్పినట్లు అమ్మ చేతివంటా, ఇంటినిండా చుట్టాలూ..... సందడీ... ఎంత బాగుంటుందో కదూ! అని రాసింది!" అన్నాడు.
    
    "నీ పిచ్చి ఆ పిల్లకి కూడా అంటించి వచ్చుంటావు!" అన్నాడు మంచినీళ్ళు తాగుతూ.

    "కొంపదీసి పెళ్ళి చేసుకోమనదు కదా!" గాభరాగా అడిగింది యశోద.
    
    "ఏరా.... ఏమిటి సంగతి?" కేశవరావు కూడా భయంగా అడిగాడు.
    
    అన్నం కలుపుతూ మాధవ్ సీతారామయ్యకేసి విషయం కదపవేం?" అన్నట్లు చూశాడు.
    
    ఆయనెందుకో గంభీరంగా కనిపించాడు.
    
    "సాయంత్రం అంకుల్ పార్టీ ఇస్తున్నారట. నిన్ను తప్పకుండా రమ్మన్నారు స్మిత నీకు ఫోన్ చేస్తుంది!" అంది యశోద.
    
    "నాకు వీలు పడదమ్మా!" అన్నాడు మాధవ్.
    
    "అరగంటైనా వీలు చేసుకో! బాగుండదు" చెప్పాడు కేశవరావు.
    
    ఫోన్ మోగింది.
    
    "స్మితే అనుకుంటా...." కార్డ్ లెస్ అందిస్తూ అంది యశోద.
    
    "నేను లేనని చెప్పేయ్!" విసుగ్గా అన్నాడు మాధవ్.
    
    "ఏం మాటలవి?" కాస్త కోపంగా అంది.
    
    మోగుతున్న ఫోన్ కేసి చూస్తూ "ఆడపిల్లంటే అందమైన కందపద్యం గుర్తొచ్చే చోటునుండి వచ్చానమ్మా.... అప్పుడే ఏం తొందర ఈ సీమటపాకాయతో మాట్లాడటానికి?" అన్నాడు.
    
    యశోద లిఫ్ట్ చేసి, మాట్లాడి పెట్టేసి "స్మిత కాదులే!" అంది కాస్త కోపంగా.
    
    అంతలోనే "మాధవ్... హాయ్!" అన్న కేకతో లోపలికి దుమారంలా దూసుకొచ్చింది స్మిత.
    
    ఆమెను చూడగానే యశోద మొహం వికసించింది.
    
    మాధవ్ మొహం ముకుళించింది.
    
    "హాయ్... హౌ ఆర్ యూ?" మర్యాదకి పలకరించాడు.
    
    "ఫైన్! ఏంటీ చెప్పకుండా ఇన్ని రోజులు దొబ్బేశావు?" అంటూ వచ్చి ఓ కుర్చీ లాక్కుని కేశవరావు పక్కన కూర్చుంది.
    
    పొట్టి క్రాఫింగ్ తో, అతి టైట్ బట్టలతో ఉన్న ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాడు సీతారామయ్య.
    
    "మా పెద్దనాన్న!" పరిచయం చేశాడు మాధవ్.
    
    "హలో....!" అంది స్టయిల్ గా కాలూపుతూ.
    
    అంత పెద్దాయన్ని అలా పలకరించటం కేశవరావుకి కూడా ఇబ్బందనిపించింది.
    
    "అప్పుడే లంచ్ చేస్తున్నావా? నిన్ను బయటకు ఎత్తుకుపోదామనుకున్నానే?" అంది మాధవ్ తో.
    
    మాధవ్ కి సిగ్గుగా తల వంచుకుని నెయ్యి వడ్డిస్తున్న రాధ కళ్ళల్లో మెదిలింది.
    
    స్మిత డబ్బాలో రాళ్ళేసి గిలకరించినట్లుగా వడవడా మాట్లాడుతూనే ఉంది.
    
    సీతారామయ్య లేచి చెయ్యి కడుక్కుని గదిలోకి వెళ్ళిపోయాడు.
    
    మాధవ్ కూడా లేచి, "సారీ స్మితా.... నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సిన పని ఉంది!" అన్నాడు.
    
    "వెయిట్ మాన్! సాయంత్రం మా ఇంట్లో హౌస్ వార్మింగ్ పార్టీ ఉంది!" అంది.
    
    "నువ్వున్నచోట వార్మ్ కాదు, బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంక వేరే వార్మింగ్ ఎందుకూ?" అన్నాడు.
    
    "నైస్ జోక్!" ఆమె నవ్వింది.
    
    "సారీ, నాకు రావడానికి వీలవదు!" అన్నాడు మాధవ్.
    
    "వై.....వై... వై..... వై?" అంది.
    
    "సాయంత్రం మా పెద్దనాన్నని రామకృష్ణామఠ్ కి తీసుకెళ్ళాలి!" అన్నాడు.

 Previous Page Next Page