Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 20


    "ఏమయింది జరిగితే?"
    
    "అలా అని కాదు అసలు జరిగిందా?"
    
    "జరిగింది."
    
    "మరి... తఃరువాత కాంప్లికేషన్స్ ఏమీ రాలేదా?"
    
    "కాంప్లికేషన్ అంటే? గొడవలు పడటం అవీనా?"
    
    "కాదు."
    
    "మరి?"
    
    "ప్రెగ్నెన్సీ అలాంటివి."
    
    "వచ్చాయి."
    
    "అప్పుడు... ఏం చేశావు?"
    
    "ఎబార్షన్ చేయించుకున్నాను."
    
    వినూత్న శరీరమంతా వణుకుతుండగా ఆశ్చర్యంగా చూసింది.
    
                                               * * *
    
    రాజాచంద్ర అప్పుడే ఓ కస్టమర్ తో ఫోన్ లో మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు.
    
    బాయ్ స్ప్రింగ్ దోర్ తీసుకుని లోపలకొచ్చి "సార్! మీ కోసం ఎవరో అమ్మాయిగారు వచ్చారు" అని చెప్పాడు.
    
    "రమ్మను."
    
    ఓ నిమిషం గడిచాక బాయ్ చెప్పిన అమ్మాయి లోపలకొచ్చింది.
    
    "మీరా?" అన్నాడు విజ్ఞతను చూసి ఎందుకో ఆమెను చూడగానే అతనికి సంతోషం కలిగింది.
    
    "అంకుల్! మీకు కొంచెం ట్రబుల్ ఇద్దామని వచ్చాను."
    
    "ముందు కూచోండి" అని బజర్ నొక్కి, బాయ్ వచ్చాక కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పాడు.
    
    విజ్ఞత అతనికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
    
    "అంకుల్! మీరు కులాసాగా ఉన్నారా?"
    
    "బాగానే ఉన్నాను. తరువాత ఇంకెలాంటి యాక్సిడెంట్లూ కాలేదు."
    
    విజ్ఞత నవ్వింది.
    
    "చెప్పండి" అన్నాడు.
    
    "అంకుల్! అప్పుడు మేము వరద బాధితులకోసం ఓ నాటకం, ఇంకా కొన్ని వెరైటీ ప్రోగ్రామ్స్ వేస్తున్నట్లు చెప్పాను కదా అది మెటీరియలైజ్ అయింది. కళాక్షేత్రంలో మా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాము. రేపు ఇరవై అయిదున. ఆ రోజు ఆదివారమే మీరు తప్పకుండా ఓ టికెట్ తీసుకోవాలి" అంది.
    
    కూల్ డ్రింక్స్ వచ్చాయి.
    
    "తీసుకోండి" అన్నాడు.
    
    ఆమె బాటిల్ అందుకుంతూ "చెప్పండి తీసుకుంటారా?"
    
    "తప్పకుండా"
    
    హాండ్ బాగ్ లో నుంచి ఓ బుక్ తీసి టేబుల్ మీద పెట్టి అతనిముందుకు జరిపింది. "ఒక టికెట్ మీద ఇద్దరు రావచ్చు. ఆంటీని కూడా తప్పకుండా తీసుకురండి" అంది.
    
    "చెప్పండి ఎంత ఇవ్వమంటారో?"
    
    "మీ ఇష్టం అంకుల్"
    
    "అలా కాదు ఓ ఐడియా ఉండాలి కదా!"
    
    "నూట పదహార్లిస్తే బావుంటుందేమో" అంది విజ్ఞత మొహమాటంగా.
    
    రాజాచంద్ర టేబుల్ సొరుగులోంచి ఓ చెక్ బుక్ తీశాడు. దానిమీద ఫిగర్ వెయ్యి నూట పదహార్లు వేసి ఆమె చెప్పిన పేరు రాశాడు.
    
    ఆ అంకె చూసి విజ్ఞత ముఖం సంతోషంతో వికసించింది. "థాంక్యూ అంకుల్" అంది.
    
    "అన్నట్లు నాటకంలో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా?"
    
    "అవునంకుల్ ఓ నలభై అయిదేళ్ళ స్త్రీ పాత్ర అయితే కథలో ఆ పాత్రకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది."
    
    "నాటకం ఎవరు రాశారు?"
    
    విజ్ఞత కొంచెం మొహమాటంగా- "నేనే రాశాను అంకుల్" అంది.
    
    "మీకు ఎన్ని కళలు వచ్చు? వీణ వాయిస్తారు. భరతనాట్యం వచ్చు. నటనలో ప్రావీణ్యం ఉంది. రచనలో ప్రవేశం ఉంది."
    
    సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. ఏమీ మాట్లాడలేదు.
    
    ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అతనికి విశారద గుర్తొచ్చింది. కాలేజీలో చదువుకున్న ఆ రోజులు....
    
    "నే వస్తాను అంకుల్ ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి. ఆరోజు ప్రోగ్రామ్ కి మీరు తప్పకుండా రావాలి- ఆంటీని తీసుకుని" అంటూ విజ్ఞత లేచింది.
    
    ఆమె వెళ్ళిపోయాక రాజాచంద్ర చాలాసేపు స్తబ్దుగా కూర్చుండిపోయాడు. అతని మనసులో విశారద రూపమే మెదుల్తోంది.
    
                                         * * *
    
    ధర్మేంద్ర ఇంట్లో ఒక్కడే కూచుని వి.సి.ఆర్. లో బ్లూ ఫిలిం పెట్టుకుని టి.విలో చూస్తూ ఎన్ జాయ్ చేస్తున్నాడు.
    
    ఆ ఫిలింలోని దృశ్యాలూ, సంఘటనలూ చూస్తుంటే అతని ఒళ్ళు వేడెక్కుతుంది.
    
    మన వేగం, మన సంస్కృతి అంటే అతనికి చికాకు పుట్టింది. డ్యాషింగ్నెస్ ఉండదు. ప్రతిదానికీ, భయం, అనుమానం, సెంటిమెంటే. పదేళ్ళబట్టి కాపురం చేస్తూ, పిల్లల్ని కన్న భార్యా భర్తలకి కూడా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటం తెలీదు.
    
    బయటనుంచెవరో బజర్ నొక్కారు. అతను విసుక్కుంటూ లేచాడు. టీవీలో అతిరసవత్తరమైన దృశ్యం కనులపండుగ కావస్తోంది. ఈ మధ్యలో ఈ డిస్ట్రబెన్సేమిటి? వీడియో ఆఫ్ చెయ్యకుండానే వెళ్ళి తలుపు తీశాడు.

 Previous Page Next Page