Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 21


    
    ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయినట్లు నిలబడిపోయాడు.
    
    బయట విజ్ఞత నిలబడి ఉంది. చేతిలో ఏవేవో చిన్న పుస్తకాలున్నాయి.
    
    "మీరా?" అన్నాడు.
    
    విజ్ఞత అతన్ని గుర్తుపట్టింది. ఈ ఇంటికెందుకు వచ్చానా! అనిపించింది. కాని తండ్రి ఇచ్చిన లిస్ట్ లో ఈ ఇంటియజమాని పేరు కూడా ఉంది.
    
    "ప్రకాశరావుగారు లేరా?" అంది.
    
    వేడెక్కి ఉన్న ధర్మేంద్ర మెదడు చకచకా పని చేస్తోంది.
    
    "ఉన్నారు లోపలకు రండి" అన్నాడు.
    
    విజ్ఞత లోపల కడుగుపెట్టింది. "అతనితో కొంచెం పని ఉండి వచ్చాను" అంది.
    
    "మేడమీద ఉన్నారు కూచోండి పిలుచుకు వస్తాను"
    
    "ఆమె సోఫాలో కూచోబోతూ టీవీ వంకచూసి ఉలిక్కిపడి ముఖం పక్కకి తిప్పేసుకుంది.
    
    "దయ వుంచి వెంటనే అది ఆఫ్ చేసెయ్యండి."
    
    "మా ఇంట్లోకి వచ్చి అది ఆఫ్ చెయ్యమనీ, ఇది ఆఫ్ చెయ్యమనీ ఆజ్ఞలివ్వడానికి మీరెవరు? ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకుని కూచోండి."
    
    "అయితే నే వెళ్ళిపోతున్నాను" అంటూ విజ్ఞత గుమ్మంవైపు కదిలింది.
    
    "ఆగండి" అంటూ అతను వి.సి.ఆర్. దగ్గరకెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేశాడు.
    
    విజ్ఞత వెనక్కి తిరిగింది.
    
    "చెప్పండి."
    
    "ఏమిటి?"
    
    "మీరు వచ్చిన పని ఏమిటి?"
    
    "ప్రకాశరావుగారితో మాట్లాడతాను."
    
    "ఆయన లేరు."
    
    "ఇందాక ఉన్నారని చెప్పారు?"
    
    "చెబితే చెప్పాను ఇప్పుడు నిజం చెబుతున్నాను. ఇంట్లో వాళ్ళంతా తీర్ధయాత్రల కెళ్ళారు- సాధ్యమైనంత పుణ్యం మూట కట్టుకొద్దామని ప్రస్తుతం ఇంటియజమానిని నేనే, ఏంకావాలో చెప్పు" అన్నాడు నువ్వు అని సంబోధిస్తూ.
    
    అతను తనని "నువ్వు" అని పిలవటం ఆమె గమనించింది. అతని ప్రవర్తన అసహ్యమానిపించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంది. కాని తాను ఏభై వేల రూపాయల దాకా వసూలు చేస్తానని కమిటీ వాళ్ళకి మాట ఇచ్చింది. అందుకనే స్నేహితురాళ్ళు తనతో వచ్చినా, రాకపోయినా పట్టుదలగా ఒక్కతే తిరుగుతుంది- టార్గెట్ పట్టుదలగా.
    
    అందుకని అసహ్యాన్ని దాచుకుంటూ వచ్చినపని చెప్పింది.
    
    "నాకిలాంటి కార్యక్రమాలంటే సదభిప్రాయం లేదు" అన్నాడు ధర్మేంద్ర.
    
    "ఎందుకని?"
    
    "ఒకసారి కరువు, ఒకసారి వరదలు, ఒకసారి అనాథబాలల పోషణ- వీటిని ఉద్దరించటానికి ముందుకొచ్చి భుజాలు తడుముకోవడం భేషజం. వీళ్ళెంత చేసినా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతాయి. అయినా నాకో రూలుంది. అందమైన ఆడపిల్ల వచ్చి ఏదయినా కోరిక కోరితే నిరాకరించక పోవటం. అందుకని ఒబ్లైట్ చేస్తున్నాను. చెప్పు ఎంతివ్వమంటావో."
    
    విజ్ఞత తన అసహ్యాన్ని లోపలే దాచుకుంటూ "ఎంతో కొంత ఇవ్వండి" అంది.
    
    "ఆ పుస్తకమిలా ఇవ్వు"  అంటూ ఆమె వేలు పట్టుకున్నాడు ఆమె చేతిని వెనక్కి లాక్కుంది."
    
    "నీకో సంగతి తెలుసునా?"
    
    ఏమిటన్నట్లు చూసింది.
    
    "నువ్వు చాలా అందంగా ఉంటావనీ, ఆ అందంలో చాలా వైవిధ్యముందనీ."
    
    "నీకూ ఓ సంగతి తెలుసునా?"
    
    "ఏమిటీ?"
    
    "నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడతావనీ, అందులో అసహ్యంతోబాటు జుగుప్స కూడా ఉన్నదనీ..."
    
    "షటప్"
    
    "అలాగా? ఇంటికొచ్చిన ఆడపిల్లతో మర్యాదగా మాట్లాడకపోగా, షటప్ అంటూ తూలనాడిన నువ్వు నా దృష్టిలో మనిషిని కాదు ఒట్టి వెధవ్వి" అంటూ ఆమె విసురుగా వెనక్కి తిరిగింది.
    
    అతనంతకంటే వేగంగా కదిలి ఆమె దారికడ్డుగా నిల్చున్నాడు.
    
    "ఆడదానివై ఉండి అంత పొగరా నీకు? నిన్నేం చేస్తానో చూడు" అతని కళ్ళు జ్యోతుల్లా మారిపోతున్నాయి.
    
    "ఏం చేస్తావు?"
    
    "నిన్ను అణువణువునా నలిపి పారేస్తాను."
    
    "ఏడిశావు."
    
    "ఈ ధర్మేన్ అంటే నీకు సరిగా తెలీదు. ఈ ఊళ్ళో నన్నెదిరించి బ్రతికిన ఆడది లేదు. నువ్వెంత? నీ బ్రతుకెంత?" అంటూ అతను ముందుకు వంగి ఆమె ముఖాన్ని అందుకోబోయాడు. మరుక్షణంలో అతని చెంప చెళ్ళుమంది. కళ్ళు బైర్లు కమ్మినట్లైనాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపల ఆమె మెరుపులా బయటికెళ్ళిపోయింది.
    
                                           * * *
    
    రాజాచంద్ర ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కూడా అన్యమనస్కంగానే ఉన్నాడు. విశారద కాఫీ తీసుకువచ్చి ఇస్తుంటే ఆమె ముఖంలోకి చూశాడు.
    
    కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
    
    "ఏమిటలా చూస్తున్నారు?" కాఫీ చల్లారిపోతుంది. తీసుకోండి" అంది విశారద నవ్వుతూ.
    
    "నువ్వు ఇరవైరెండు, ఇరవై మూడేళ్ళ క్రితం ఎలా ఉన్నావా అని ఆలోచిస్తున్నాను" అతని హృదయక్షేత్రంలో విజ్ఞత మెదుల్తుంది.
    
    "ఎందుకిలా.... అడిగారు?"
    
    "ఒక్కోసారి.... ఒక్కో ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకో గుర్తొచ్చింది."

 Previous Page Next Page