Previous Page Next Page 
మమత పేజి 20

ఈరోజు ఈ పిల్లకోసం ఇన్ని పోగొట్టుకుంటుందా?!
ఆ ఇంట్లోకి రాగానే మాధవరావు జానకితో అన్నాడు-
"దీని పేరు మార్చేస్తున్నా.... దీని పేరు సుబ్బి! అదే.... సుబ్బమ్మ!!"
జానకి ఏమీ అనలేదు.
"సుబ్బీ... ఇటు రావే! యాష్ ట్రేలో వున్న ఆ సిగరెట్ పీకలు పారేసి శుభ్రంగా కడిగి తీసుకురా!" ఆ మాటంటూ జానకివైపు చూసాడు మాధవరావు.
జానకి ఏమీ మాట్లాడలేదు.
"మా ఫ్రెండ్సు చాలా జెలసీ ఫీలయిపోతున్నారు. ఎందుకో తెలుసా - మనకి చిన్న పనిపిల్ల వున్నందుకు! మా ఫ్రెండు రాఘవ ఇలాగే ఓ పనిపిల్లని ఊరినించి తెస్తే -నాలుగు నెలలు తిరిగేసరికి ఇంట్లోంచి పారిపోయిందిట!"
"అవును కొట్టిచంపి వుంటారూ - పారిపోదు మరీ!" అంది జానకి.
జానకి అంతకుముందు కొన్న మంచిగౌన్లను ఓరోజు జానకి లేనప్పుడు తీసి అక్కడక్కడా చింపి దగ్గర్లో వున్న చెత్తబుట్టలో విసిరేసాడు మాధవరావు.
ఇప్పుడు పూర్తిగా పాతగౌను, పిచ్చిజుట్టు, కాళ్ళకి చెప్పులు లేకుండా పనిపిల్ల సుబ్బిని చూస్తుంటే- మనసు బాధపడుతున్నా, జానకి కన్న కలలన్నీ కల్లలైపోయినా చూస్తూ వూరుకుంటోంది. ఎందుకూ- తన ఉనికికి దెబ్బతగలకూడదు కదా!
స్వార్ధం పడగవిప్పింది- అసలు తను చేసింది పొరపాటు! నిజంగానే పనిపిల్లే తనకి కావాలి- తన చేతికి సాయంగా! తనకి భర్తపై కోపం రావటంలో అర్ధంలేదేమో- జానకికి నవ్వొచ్చింది- ఎంత బతిమాలి తెచ్చింది ఈ పిల్లని! కూతురిలా పెంచుకుందామనుకుంది. కానీ... విచిత్రం! మనిషి స్వభావం- తనకి అనుకూలంగా మార్చేసుకోగలడు ఏ పరిస్థితిలోనైనా! అదే మనుగడ..!!
ఇంట్లో గదులన్నీ బట్టపెట్టి తుడుస్తోంది సుబ్బి! ఆరోజు జ్వరం తగిలింది - కానీ, ఎలా చెప్తుందీ సుబ్బి?! అయ్యగారు కొడతారనే భయం! అమ్మగారు క్లబ్బుకి వెళ్ళిపోయింది. వంటమనిషి లోపల పనిచేస్తోంది.
రెండు గదులు తుడిచి ఇక తుడవలేక ఆ బకెట్, బట్ట అలా వదిలేసి వరండాలో చాపమీద పడుకుంది సుబ్బి గజగజ వణుకుతోంది....మూలుగుతోంది.
వంటమనిషి దుప్పటి కప్పింది.
సుబ్బి ఏడుస్తోంది. ఏం చేయాలో తెలియలేదు వంటమనిషి చెన్నమ్మకి! ఖంగారుగా చూస్తూ - ఫోను గదిలోకెళ్ళింది.
"అమ్మా, సుబ్బికి జ్వరం బాగా వుందండీ- వణుకుతోంది. మీరొచ్చి డాక్టరుకి చూపిస్తే!" అంది చెన్నమ్మ.
సెల్ ఫోన్ తీసుకు రెండడుగులేసి క్లబ్ వరండాలోకొచ్చిన జానకి- "మొన్ననూ అలాగే వచ్చింది... భయపడాల్సిందేమీ లేదు....నా షెల్పులో డబ్బావుంది చూడు-ఎర్రగోలీ వుంది...అది వేయి -నేను మూడు గంటలవరకు రాలేను" అంది.
చెన్నమ్మ ఆ ఎర్ర గోలీ వేస్తూ- 'ఆ పేకాట మాని రావచ్చుగా' అనుకుంది మనసులో.
ఎండ బాగా ఎక్కింది. మాత్ర వేసుకుపడుకుంది సుబ్బి.
చెన్నమ్మ టీవీలో సినిమా చూస్తూ కూచుంది. నాలుగయ్యేసరికి జ్వరం కొంచెం తగ్గి లేచింది సుబ్బి.
"మలేరియా...ఆ-అదే తగ్గిపోతుందిలే! -ఇలా చలి వచ్చినప్పుడల్లా మాత్రవేసుకో ... అంతే!" అంది చెన్నమ్మ- సత్తు కంచంలో మజ్జిగా అన్నం పెట్టింది.
క్లబ్బులో పేకాటలో గెలిచిన జానకి ముఖం వెలిగిపోయింది. ఈమధ్య చాలాసార్లు ఓడిపోతూనే వుంది. కార్లో వస్తుంటే అనిపించింది జానకికి- సుబ్బికి మంచి గౌను కొనాలని!
రెడీమేడ్ షాపు దగ్గర కారు ఆగింది. లోపలకెళ్ళిన జానకి మనసు క్షణంలో మారిపోయింది. 'పనిపిల్లకి అంత ఖరీదైన గౌనేమిటీ.... నవ్వుతారు అంతా!'-అనుకుంటూ రేడీమేడ్ బ్లౌజులు వెల్ వెట్ వి నాలుగు తీసుకుంది తనకోసం! వస్తూవస్తూ ఎదురుగా షాపులో ఆగి మాచింగ్ లిప్ స్టిక్ కొనుక్కుంది. తనూ, భర్తా రేపు సినిమా అవార్డుల ఫంక్షన్ కి వెళ్ళాలి! ఈ మెరూన్ వెల్వెట్ బ్లౌజు, ఈ షిపాన్ చీర, దీనిమీదకి మాచింగ్ లిప్ స్టిక్-బ్యూటిఫుల్!
జానకి ఇంట్లోకొచ్చిన పది నిమిషాలకే మాధవరావు లోపలకొచ్చాడు.
"నీకోసం ఏం తెచ్చానో చూసుకో!" అన్నాడు.
"నిన్న చూసిన డైమండ్ నెక్లెసా!" అంది ఉత్సాహంగా.
"నో..!"
"మరి..?"
"ఊహించు- మరో పిల్లని!"
జానకి ఉలిక్కిపడింది.
"చాలా ప్రేమగా ముద్దుగా చూడాలి... మనం ఎంత ప్రేమగా చూస్తే మనకి అంత ఆనందం!"
జానకికి మాధవరావు మాటలు అర్ధం కావడంలేదు.
కానీ మనసులో ఆనందంగానే వుంది. ఆరోజు తను రాజీవ్ దగ్గరనుంచి తెచ్చినందుకు కోపమేమో! ఇప్పుడు తన స్నేహితుల దగ్గర నుంచో, బంధువుల దగ్గరనుంచో తెస్తున్నాడన్నమాట! పోన్లే.... తనకి సంతోషమే!!
మాధవరావు జానకిని దగ్గిరగా తీసుకుంటూ, "చూస్తావా..!" అన్నాడు.
"అదేమిటీ - ఎక్కడుందీ?" అంది ఆత్రంగా.
మాధవరావు కారు తలుపు తీసాడు. ఎత్తుకుని లోపలకొస్తుంటే జానకి ముఖం వెలవెలబోయింది. తెల్లన గుండ్రటి పూలబంతిలా మాధవరావు ఒళ్ళో కూచుని, చిన్న కళ్ళతో జానకి వైపు చూస్తోంది.....దీన్ని తీసి అవతల విసిరేయాలనిపించింది ఓ క్షణం! సుబ్బి, చెన్నమ్మ దాన్ని చూసి మురిసిపోయారు.
"ఎంత బావుందో...." అంది చెన్నమ్మ.
దూరంగా నిలబడి చూస్తోంది సుబ్బి.
జానకికి పెద్ద అవమానంలా అనిపించింది ఇది. తను పిల్లని తెస్తే - అతను కుక్కపిల్లని తెచ్చాడా? - ఇది పురుషాహంకారమా, భార్యని వెక్కిరించటమా?!
జానకి ఆ చిన్న నెలరోజుల కుక్కపిల్ల వంక చూస్తూ కూచుంది.
"ఇవాల్టినుంచీ దీన్ని చూసుకోవాలి నువ్వు! పాలు నువ్వే పట్టాలి- పనిపిల్ల మీద అప్పచెప్పకూడదు- తెలిసిందా-ఇప్పుడిదే మన పిల్ల!"
"ఛీ..." కోపంగా లేచి లోపలకెళ్ళి పోయింది జానకి.
దానికోసం సెరిలాక్ పిల్లలకిచ్చే ఆహారం రెండు డబ్బాలు, అది పాలు తాగేందుకు అందమైన ప్లేటు, అది పడుకుందుకు మంచి చిన్న పరుపు, దాన్ని దువ్వటానికి బ్రష్... దానికి స్నానం చేయించటానికి షాంపూ, డానికి పౌడరూ అన్నీ మాధవరావు అలా కార్లో వెళ్ళి ఇలా తెచ్చి లోపలపెట్టాడు.
"నాకు కనక దీన్నిచ్చాడు నా ఫ్రెండు వైద్యనాథన్ -మనం ప్రేమగా చూడకపోతే మరురోజు తీసికెళ్ళిపోతాడు" అన్నాడు.
జానకి పెదాలపై చిరునవ్వు.... ఒక్కసారి రాజీవ్ గుర్తొచ్చాడు.....చాలా రోజులైంది, ఫోన్ చేయాలనుకుంది మనసులో.
మానవ స్వభావాల్లో ఎన్ని విచిత్రాలున్నాయో ఎవరికర్ధమవుతుంది? ఏ అంతస్సంఘర్షణలు మనిషిని బతకనీయకుండా అడ్డం పడతాయో?
జానకి కాళ్ళని నాకుతోంది కుక్కపిల్ల బిక్కీ వెనక్కి తీసుకుంది.
కానీ, వెంటనే అప్రయత్నంగా ఒళ్ళోకి తీసుకుంది- దానిమీద తన కేమి కోపం!! పాపం, మూగజీవి!
హాల్లో ఫోను మోగుతోంది.... గబుక్కున మాధవరావు తీసాడు.
"ఆ బాగుంది, ఆ ఆ..... మేము రేపు ఊరెడుతున్నాం. ఆ నెలరోజులు తర్వాత ఫోన్ చేయండి- ఆ దాన్నీ తీసికెడుతున్నాం!" ఫోన్ పెట్టేశాడు.
"ఎక్కడికెడుతున్నాం?" అంది జానకి కుక్కపిల్లని ఒళ్ళోనించి దింపుతూ.
మాధవరావు ఫక్కున నవ్వాడు.
"లేకపోతే బోర్... నాలుగురోజులు సెలవు పెట్టుకుని వస్తాడుట! అందుకే అలా చెప్పేసా!"
అర్ధమైపోయింది ఎవరొస్తారో! - కానీ వెంటనే అంది-
"పోనీ-రానివ్వలేకపోయారా, పిల్లని చూస్తాడూ..!" అంది.
"నోర్ముయ్యి. ఇప్పుడొచ్చి ఈ పిల్లని తీసికెళ్ళిపోతానంటే ఎంత కష్టమో తెలుసా... నీ కోసమే చెప్తున్నా - కుక్కపిల్లని చూడ్డం తేలికకాదు. పైగా... సుబ్బి లేకపోతే దాని పనులన్నీ నువ్వు చేయాలి! అందుకే అలా చెప్పేశా!" అన్నాడు ఎంతో సంతోషంగా.
జానకి దీర్ఘంగా నిట్టూర్చింది... అది అన్యాయం కదా, కానీ.... ఎవరు చెప్తారూ- ఏది న్యాయం, ఏది అన్యాయం అనీ... మనసు తప్ప!
కుక్కపిల్ల 'కుయ్ కుయ్...' మంటోంది.
సుబ్బి గబగబా వచ్చి బయటకి తీసుకెళ్ళింది.
ఆరోజు సాయంత్రం డిన్నరుకెడుతూ, మాధవరావు, జానకి-సుబ్బిని, కుక్కపిల్లని కూడా వెంటబెట్టుకెళ్ళారు.
"సుబ్బి కార్లో కూచోవాలి, కుక్కపిల్లనాడిస్తూ!" అన్నాడు మాధవరావు.
"లోపలికి తీసుకొచ్చా" అంది.
"అక్కర్లేదు నాకు తెలుసు" అన్నాడు మాధవరావు.
"జానీ, నువ్వు ఆ కుక్కపిల్లని పాలు పట్టేప్పుడు జాగ్రత్తగా చూడాలి.... మనం దగ్గరలేకపోతే అది తాగేయగలదు" అన్నాడు.
ఆ డిన్నరు సందర్భంగా అక్కడకొచ్చిన వాళ్ళంతా- "వైద్యనాథ్ మీకిచ్చారటగా కుక్కపిల్లని, యు ఆర్ లక్కీ.... మంచి కుక్కపిల్ల దొరకటం చాలా కష్టమండీ!" అని,
"జానకి అదృష్టవంతురాలు, కుక్కపిల్లని చూడ్డానికి చిన్న పనిపిల్ల కూడా వుంది. ఎంత ప్రయత్నం చేస్తున్నాడో పనిపిల్ల కోసం!" అంది మిసెస్ రాఘవన్.

 Previous Page Next Page