Previous Page Next Page 
మమత పేజి 21

జానకి నవ్వేసి తన అదృష్టాన్ని మరోసారి తల్చుకుంది. ఇదే అదృష్టమా!! ఏమో! చేతికున్న బంగారు గాజుల వరుసలు, మెళ్ళో వున్న డైమండ్ నెక్లెస్ సరిచేసుకుంటూ!!   
                                     *    *    *
చంద్రయ్య రొప్పుకుంటూ తులసమ్మ ఇంటికొచ్చాడు.
"చూసావా... ఎంత మోసమో!" అన్నాడు కుర్చీలో కూచుని.
లీల గ్లాసుతో మంచినీళ్ళు అందించింది... వీరస్వామితో సుధాకర్ వచ్చి వారంరోజులనాడు ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయాడు.
"హమ్మో, ఎంత మోసం! నాకు ఒక్క పైసా యివ్వలేదు. ఆ వీరస్వామి, వాడి విధవ కూతురూ ఏదో మత్తుమందు చల్లారు - అంతే, ఇప్పుడు వాడు మన సుధాకర్ కాదు" అరుస్తున్నాడు చంద్రయ్య.
తులసమ్మకి ఈమాటలు మరీ ఆశ్చర్యంగా లేవు. ఈ మోసంలో భాగం చంద్రయ్యదేగా! దొంగ విల్లు సృష్టించి, చావు బతుకుల్లో వున్న మహలక్ష్మి చేత సంతకం చేయించింది ఈ చంద్రయ్య కదూ! - తులసమ్మ ఏమీ అనలేదు.
"అమ్మా- లీలమ్మ తల్లీ... నీ కొంప మునిగింది. ఆ పిల్లని పెళ్ళాడుతాడట కూడా! ఛీ.... వితంతువును పెళ్ళిచేసుకోటమా- పూర్తిగా భ్రష్టుడైపోయాడు!" అన్నాడు లీలతో.
లీల నవ్వేసింది. చంద్రయ్యకి అర్ధంకావడంలేదు. ఎవరూ సుధాకర్ గురించి పల్లెత్తు మాట అనరేమిటీ..? ఇది వీళ్ళంతా కలిసి పన్నిన కుట్రకాదు కదా!
తులసమ్మ కునుకు తీస్తోంది. లీల- "బాబాయ్.... ఎందుకంత ఆవేశం? ఆయన ఆస్తి ఆయననుభవిస్తాడు.... అంతే!" అంది.
చంద్రయ్య కస్సున లేచాడు. "ఆయనెవడూ- ఆయన! నీ ఖర్మ ఇలా వుండబట్టే వాడికలాటి బుద్దులు పుట్టాయి. 'బాబాయి..... బాబాయి' అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడి మనస్సు నువ్వూ, ఈ ముసల్దీ విరిచేసారు- మీరేం బాగుపడతారో చూస్తాగా!" అన్నాడు కసిగా.
"బాబాయ్- నాలుగు మంచి ముక్కలు విను- నిన్నెవరూ మోసం చెయ్యలేదు ఎవరి విధి ఎలా నడవాలో అలాగే నడుస్తుంది..! నేనెవ్వరు, నువ్వెవ్వరు? - నిమిత్తమాత్రులం! కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? జీవితంలో సర్వశ్రేష్ఠమైంది. అందరూ కోరదగిందీ ముక్తి..! దానివలననే బాహ్యంతార బంధనాలనుండి విడుదల!" లీల అలా చెప్పుకుపోతోంది.
"ఏమిటీ... గీతోపదేశమా? ఈ తులసమ్మ నీ జీవితాన్ని సర్వనాశనం చేసిందన్నమాట! మొగుడూ, సంసారం గొడవ లేకుండా, ఇక్కడ ఈ ఆశ్రమంలో నిన్ను కట్టిపడేసి ఇలా సన్నాసిలా తయారు చేస్తోందా?! - అందుకే మరి, ఆ సుధాకర్ గాడు అలా ప్రవర్తిస్తున్నాడు!" అన్నాడు కోపంగా.
"ఎవరు- ఎలా ప్రరర్తించినా నాకు భయంలేదు. నేను నమ్ముకున్న సేవాధర్మం, భక్తి తత్పరత నన్ను రక్షిస్తాయి. రక్షించకపోతే అదీ భగవంతుని అనుగ్రహమే అనుకుంటాం బాబాయ్- నేనెవర్నీ నిందించను. -ఎవరి దగ్గరనుండీ ఏమీ ఆశించను- బాబాయ్....కూచో వస్తా.....దేముడికి నైవేద్యం ఏర్పాటుచేయాలి- పూజారిగారు వచ్చి పూజ చేస్తున్నాడు- ఇవాళ ఏకాదశి పర్వదినం!" - అంటూ లోపలకెళ్ళిపోయింది లీల.
చంద్రయ్యకి ఏం చేయాలో తోచలేదు. వయసులో వున్న పిల్ల భక్తి అనీ, పూజలనీ ఇలా తిరుగుతుంటే తప్పుకదూ?! తన ఇల్లు తను చూసుకుంటే అదే భక్తీ!!
చంద్రయ్య వెళ్ళిపోయాడు. లీల మనసు గట్టిపరచుకుంది. ఇక తన జీవితంలో కొత్త మార్పులు రావు. ఆ పిల్ల ఏమైపోయిందో తెలియదు. ఆ భర్తకి తను ఇక అక్కర్లేదు-మరి తనెవరికి కావాలీ- దేవుడికే! 'కమలాక్షునర్చించు కరములు.... కరములు!' అంతే! తన జీవితమంతా ఇక ఆ దేవుని పూజించడానికే! పరోపకారానికి- ఈ తులసమ్మ తనకి ఇక్కడ చోటు చూపించింది. ఆమె తనకి తల్లీ, తండ్రీ, గురువు, దైవం!" లీల తులసమ్మ గదివైపు చూసింది...   
ఎప్పుడొచ్చాడో మళ్ళీ చంద్రయ్య-
చంద్రయ్యతో ఏదో ఘర్షణ పడుతోంది..! అయ్యో- అదేమిటీ, తోసిపారేశాడు చంద్రయ్య, తులసమ్మని తల గుమ్మానికి కొట్టుకుంది.
లీల గబుక్కున వెళ్ళి తులసమ్మని ఒళ్ళో పెట్టుకుంది.
వైద్యనాధన్ చిన్న కొడుకు స్కూటర్ ఆపి లోపలకొచ్చాడు.
"హలో, ఆంటీ-ఏదీ... బిక్కీ?! అన్నాడు అటూ ఇటూ చూస్తూ.
బిక్కీకి ప్లేటులో పాలు పోస్తున్న సుబ్బి- "అక్కడుందీ!" అంది.
శంకరన్ కుక్కపిల్ల దగ్గరకొచ్చి ఎత్తుకున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న శంకరన్ నూనూగు మీసాలతో గుండ్రటి ముఖంతో చక్కగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు.
"కార్లో వచ్చావా..?" అంది జానకి శంకరన్ తో.
"నేర్చేసుకున్నా... కానీ, రోడ్డు మీదకి తెస్తానంటే డాడీ ఒప్పుకోటం లేదు - అయినా అప్పుడప్పుడు తీస్తున్నా" అన్నాడు.
సుబ్బి శంకరన్ వంకే చూస్తోంది. అది పనిపిల్లగా ఆ ఇంట్లోకొచ్చాక మద్రాసులో ఒకటిరెండుసార్లు అమ్మగారితో బయటకెళ్ళింది. ఆరోజు డిన్నరునాడు అందరినీ చూడాలనుకుంది సరదాగా. కానీ, కారులోనే కూచోమన్నాడు అయ్యగారు. చిన్నమ్మతో కలిసి చూసే సినిమాలు తప్ప బయట ప్రపంచంతో పనిలేని సుబ్బికి- ఈ శంకరన్ కబుర్లు చెప్తూ కుక్కని ఆడిస్తుంటే ఎంతో హాయిగా వుంది.
"ఏ ఊరూ..?" అన్నాడు.
"ఇదే..!" అంది నవ్వి సుబ్బి.
ఆ సుబ్బికి నవ్వుతుంటే బుగ్గలు సొట్టలు పడి బాగుంటుంది ముఖం. దాని నల్లని ఒత్తైన జుట్టు దానికి భలే అందమిచ్చింది.
"బాబూ... ఇటు చూడండి, ఎలా ఆడుతుందో!" అంటూ బంతి తెచ్చి కుక్కకి అందించింది సుబ్బి. శంకరన్ చాలాసేపు అక్కడుండి ఇంటికెళ్ళిపోయాడు.
"మళ్ళీ ఎప్పుడొస్తావ్?!" అంది.
"రేపు!" అన్నాడు స్కూటర్ తాళాలు తిప్పుతూ.
"బై ఆంటీ..!" అంటూ వెళ్ళిపోయాడు శంకరన్.
కుక్కపిల్ల కుయ్ మంది....దాని కాలు కుర్చీకి తగిలింది.....అదీ అరుపు....లోపల్నుంచి మాధవరావు బయటకొచ్చాడు.
"ఏం చేస్తున్నావ్..?" అంటూ సుబ్బి వీపుమీద ఒక దెబ్బవేశాడు. మళ్ళీ కుక్కపిల్ల కుయ్ మంది. ఎందుకలా కొడతావు అని అయివుంటుంది దాని భాషలో.
అంతలో ఫోను.... "మావాడు చెప్పాడు- బిక్కీ చాలా బాగా ఆడుతోందిట- సుబ్బి బాగా చూస్తోందనుకుంటా... ఇక మావాడు రోజూ వస్తాడు మీయింటికి!" అన్నాడు.
"ఓ.కే." అన్నడు మాధవరావు.
ఆ మాటలన్నీ వింటోంది సుబ్బి. 'ఆ అబ్బాయి రోజూ వస్తే బాగుండును. చక్కగా ఆడుకోవచ్చు' అనుకుంది మనసులో.
సుబ్బికి పనులన్నీ బాగా వచ్చేసాయి. కుక్కపిల్లకి చేయాల్సినవన్నీ ఎవరూ చెప్పకుండా తనే చేసేస్తోంది. వంటమనిషి ఓ పూట రాకపోతే వంట చేసేయటం కూడా వచ్చేసింది.
గాస్ గట్టు అందకపోతే చిన్నబల్ల వేసుకుని పనిచేయటం వచ్చేసింది సుబ్బికి. ఇప్పుడు సుబ్బి లేకపోతే ఒక్క నిమిషం గడవదు జానకికి.
మధ్యాహ్నం ఫోన్ మోగింది. మాధవరావు ఇంట్లో లేడు. జానకి ఫోను తీసింది.
ఒక్కసారి ఆనందం, ఆశ్చర్యం ఉక్కిరిబిక్కిరయిపోయింది ఓ క్షణం-
"చాలా బాగుంది- మీరు చూస్తే ఆశ్చర్యపోతారు- ఎప్పుడొస్తున్నారూ..?" అంది ఉత్సాహంగా.
"ఎల్లుండి.... అదే- బుధవారం!" అన్నాడు రాజీవ్.
ఫోను పెట్టాక జానకి ముఖాన చెమటలు తుడుచుకుంది.
పొరబాటు చేసిందా- ఏదో అబద్దం బాగా చెప్పాల్సింది- తీరా రాజీవ్ వచ్చాక పనిపిల్లగా దీన్ని చూడగలడా?! ఆ రెండు రోజులైనా దీన్ని ఇంట్లో పిల్లగా వుండనిస్తాడా మాధవరావు? - జానకికి భయం పట్టుకుంది- భర్తకి రాజీవ్ ఫోను విషయం చెప్పాలా...వద్దా!!
"ఎందుకు ఖంగారు పడుతున్నావ్?" - మాధవరావు చెయ్యి భుజంమీద పడగానే తల తిప్పింది ముఖం వెలవెలపోయింది.
"నాకు తెలుసు- రాజీవ్ వస్తున్నాడని ఫోను... ఎల్లుండి!"
అంటే... మాధవరావు లోపలకి రావటం, రెండో ఫోనులో తన మాటలు వినటం జరిగిందన్నమాట! జానకి ముఖం తుడుచుకుంటూ.
"అదే...ఎల్లుండి వస్తాడుట!" అంది.
"రానీ..!"
"కాదండీ, ఇలా పనిపిల్లలా దాన్ని చూస్తే అతని గుండె ఆగిపోదూ?! నేను ఏం చెప్పి తెచ్చానో తెలుసుగా!" అంది.
మాధవరావు ఆలోచించాడు. "అదా సంగతీ.... నేను ఉపాయం ఆలోచిస్తాగా!" అన్నాడు భార్యకి ఓదార్పుగా.
కానీ, జానకి అంతస్సంఘర్షణతో చాలా ఆవేదన పడింది. కానీ, పిల్లని పంపేస్తే, తన భర్త చెప్పినట్టు పిల్ల లేకుండా ఇంట్లో అన్ని పనులూ తనెక్కడ చూడగలదూ!
మాధవరావు బయటకెడుతూ- "ఎప్పుడొస్తున్నాడు నీ ఫ్రెండు?" అన్నాడు.
"నా ఫ్రెండెవరూ..?"
"అదే...రాజీవ్!"
"ఎల్లుండి..!"
మాధవరావు వెళ్ళిపోయాడు.
అటు మాధవరావు వెళ్ళాడు, ఇటు శంకరన్, వాడి అత్తకొడుకు సతీష్ ఇద్దరూ వచ్చారు. సతీష్ ఇంజనీరింగ్ లో అప్పుడే చేరాడు.

 Previous Page Next Page