తులసమ్మకి కొంత వరకు అర్ధమైంది- ఈ గొడవేంటో! పైగా... చంద్రయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
"ఎవర్నీ నమ్మకు- నీ దగ్గరున్న నాలుగు డబ్బులూ కాజేసి, తన్ని పంపిస్తారు" అంది.
"అదేమిటీ, ఆయన చాలా మంచివాడు. పైగా... ఆయన ఇద్దరు కొడుకులూ ఇండియాలో లేరు. అందుకని...."
"నాకు ఇవన్నీ చెప్పకు. పెట్టేబేడా సర్దుకు ఇక్కడకొచ్చేయి... నువ్వూ, లీల మీ బతుకు మీరు బతకండి!" అంది కోపంగా.
"లీల లేదా..?" అన్నాడు చిరాగ్గా సుధాకర్.
తులసమ్మకి అసలు విషయం చెప్పేయాలి.
"అమ్మమ్మా, ఆ ఇల్లు ఆయనే కొనుక్కుంటాడు - నువ్వెవరికీ బేరాలు చెప్పకు - ఆ విషయం నీకు చెప్దామనే వచ్చా!" అన్నాడు.
తులసమ్మ సుధాకర్ చెంపమీద కొట్టింది. విస్తుపోయాడు - అంత బలమెక్కడి నుంచి వచ్చింది ఈ ముసలిదానికీ!
"ఆ ఇల్లు లీల తల్లిది - లీలకే రాసింది. విల్లు రాసానని చెప్పింది. ఆ చంద్రయ్య ఆరోజు చావుబతుకుల మీద మహాలక్ష్మి వుండగా విల్లు నీ పేర రాయించి నాటకం ఆడతాడా- నేనుండగా ఆ ఇల్లు అమ్మడానికి వీల్లేదు."
"అంతా మోసం, దగా! దొంగ విల్లు సృష్టించాడని ఆ చంద్రయ్యని జైల్లో పడేయిస్తా- నీ పనీ పడతా- ఇంకొక్కసారి ఇల్లు మీ పేర రాసిందని అన్నావో చూడు - నీతో కావాలనే అన్నా... నేను ఇల్లు అమ్మేస్తానని! నేనా లీలకి ద్రోహం చేసేదీ? ఆ ఇల్లు గలాయన్ని నీకో ఇల్లు కొనిపెట్టమను, వాడి బోడి కూతుర్ని నీకు కట్టబెట్టమను - ఫో! లీలకి ఇవన్నీ తెలిస్తే బాధపడుతుంది....ఫో!" తులసమ్మ ఆవేశంగా అరిచింది. ఆయాసం ఎక్కువైంది- రొప్పుతూ మంచం మీద పడుకుంది.
సుధాకర్ కి కంగారేసింది, కోపమొచ్చింది-
"అసలు నువ్వెవరు? ఏదో పెద్దదానివని గౌరవిస్తున్నామంతే! మా యింటి వ్యవహారంలో జోక్యం చేసుకున్నది చాలు- ఆఖరి మాట చెప్తున్నా.... నా భార్యని ఈ మార్గానికి తెచ్చింది నువ్వు! ఆనాడు నా యింటి నుంచి బయటకొచ్చే ధైర్యం- దానికి నిన్ను చూచుకుని కాదూ?! ఇప్పుడు భక్తి, సేవ అంటూ రోడ్లమీద పడటానికి కారణం నువ్వు కాదూ?! నా కాపురం కూలిపోవటానికి కారణం నువ్వు కదూ?! ఆ చంద్రయ్యని అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్న నాటకం నాకు తెలియదా! ఇదే చెప్తున్నా, నేనొచ్చింది లీలని తీసుకెళ్ళడానికికాదు. లీలని వదిలించుకోటానికే, తెలిసిందా..?"
సుధాకర్ మనసులో వున్న మాటలన్నీ బైటకి అనేశాడు ఆవేశంతో.
తులసమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది.
"నా పిల్లని అమ్మేసింది నువ్వే! నువ్వే నా పిల్లని అమ్మేసి డబ్బు చేసుకున్నావ్- ఈ ఆశ్రమంలో వున్నా గుట్టు బయటపెట్టడానికి ఎంత టైము కావాలంటావ్?!" అరుస్తున్నాడు సుధాకర్.
అప్పుడే ఇంట్లోకొచ్చిన లీల కొయ్యలా నిలబడిపోయింది సుధాకర్ మాటలు వింటూ.
"ఏమే... ఏదీ నా పిల్ల?! నువ్వూ, ఆ ముసల్దీ ఎవడికి అమ్మేశారు..? ఇప్పుడెవడితో కులకుతున్నావ్??" సుధాకర్ కోపంగా లీల జుట్టు పట్టుకులాగి కిందపడేశాడు.
లీలకి నోట మాటరాలేదు.
'ఏమిటిదంతా, పిల్లని అమ్మేయటమా! తను ఎవడితోనో కులకటమా!'... పిచ్చిపట్టింది అంతే!!
వీధిగుమ్మంలో నుంచున్న వీరాస్వామి అంతా వింటున్నాడు.
తులసమ్మ లేచింది మంచం మీదనుంచి-
"ఏంరా... ఎవర్నో వెంటపెట్టుకొచ్చి దాంతో తెగతెంపులు చేసుకుందామనుకున్నావా..? ముందు ఇంట్లోంచి బయటకి నడు. నీలాంటి వాడికి చేసిన మేలు పాముకి పాలుపోసినట్టే!" పూనకం వచ్చినట్లుగా అరిచింది తులసమ్మ.
వీరాస్వామి సుధాకర్ భుజంమీద చెయ్యేసి, "పద" అన్నాడు నెమ్మదిగా.
సుధాకర్ బయటకి నడిచాడు. తులసమ్మ బడలికతో రొప్పుతూ మంచంపై వాలిపోయింది.
రాజ్యలక్ష్మమ్మ ఆరోగ్యం కుదుటపడింది.
'తల్లీ- లీలా.... నీ ఋణం ఎలా తీర్చుకుంటానో!" అంది.
"వచ్చే జన్మలో మీ కడుపునా పుడతాలే!" అంది రాజ్యలక్ష్మమ్మ.
"ఏం... నేనే పుడతానేమో ఎవరికీ తెలుసూ!" అంది లీల.
గుమ్మంలో ఏదో అలికిడి అయింది.
"ఎవరూ, పిన్నీ... నువ్వా? నిద్రలేచావా - అయ్యో... నీకు కాఫీ కాచి ఇయ్యలేదు కదూ!" అంటూ లీల గబగబా వంటింట్లోకెళ్ళింది. లీల వెంట తులసమ్మ వెళ్ళింది.
"ఇటురా!" అంది తన గదిలోకి నడుస్తూ వెంట వెళ్ళింది లీల.
"నేను బతికున్నా, చచ్చినా ఈ మాట మరచిపోకు!"
"అమ్మమ్మా, నీకు ఇంక శతాయుష్షు! ఆ ఆపద తప్పిపోయింది... ఇంక నీకేం భయంలేదు" అంది కొంటెగా లీల.
"నిన్ను భగవంతుడే కాపాడాలి - ఇటు వినమ్మా -ఎప్పుడైనా సుధాకర్, వీరస్వామి, చంద్రయ్య ఏ కాగితం మీద సంతకం పెట్టమన్నా పెట్టొద్దు... శ్రద్దగా విను - అలా నవ్వకు. చాలా ముఖ్యవిషయం... ఎక్కడా, ఏ కాగితంమీదా సంతకం చేయకు." బతిమాలుతున్నట్లుగా అంది తులసమ్మ.
"అలాగే... అలాగే!" అంది లీల మనసులో ఏదో ఆలోచించుకుంటూ.
కాలంతోపాటు జీవితాల్లో చాలా మార్పులొస్తాయి!
ఆరోజు మాధవరావు ఇంట్లోకొస్తూనే- "జానకీ..." అని అరుస్తూ వచ్చాడు.
ఏమైందోనని భయంగా వచ్చి నిలబడింది జానకి.
"ఇలా రా!"
భార్యాభర్త గదిలోకెళ్ళారు. మాధవరావు ముఖం చాలా గంభీరంగా వుంది.
"దీన్ని మనం పెంచుకుంటున్నామా?"
జానకికి అర్ధంకాలేదు....ఆ ప్రశ్న!
"అంటే..?" అంది.
"అదే.... మనం మద్రాసు వెళ్ళిపోతున్నాం"
"నువ్వు పిల్లని..."
"మనతోబాటే!" అంది జానకి.
మద్రాసులో ఓ బ్రాంచి ప్రారంభించాలనుకుంటున్నాడు మాధవరావని జానకికి తెలుసు. కానీ...
"ఒక్కమాట విను-మనం ఎవర్నీ పెంచుకోవటం లేదు- ఈ పిల్ల పనిమనిషి కూతురు- తల్లి చచ్చిపోయింది, కనుక మన పనిమనిషి-అంటే... ఈ పిల్ల దాని మనవరాలు పెంచుతోంది అంతే!"-
"అంటే..!"
"ఊరందరికీ ఇది మనింట్లో వున్న పనిపిల్ల! దీనికి ఆరేళ్ళు నిండాయి - ఇకనుంచి ఆ మద్రాసులో నువ్వు దీనిచేత అన్ని పనులూ చేయించాలి. ఇది మన పనిపిల్ల... అంతే!" మాధవరావు విసురుగా వెళ్ళిపోయాడు. గుండె పట్టుకున్నట్టె అయింది జానకికి.
ఈ పిల్ల పనిపిల్లా!!
వీధిలో స్కూటర్ ఆగింది...
"మేము మద్రాసు వెళ్ళిపోతున్నాం- ఇంక మీరు అక్కడికి రావాలి మీ పిల్లని చూడాలంటే!" అన్నాడు రాజీవ్ తో మాధవరావు.
"జానకి పడుకుంది, జ్వరంగా వుంది" అన్నాడు పేపర్లో ముఖం పెట్టుకుని.
రాజీవ్ కి ఆక్షణంలో ఏం చెప్పాలో తెలియలేదు. అంటే- ఇంక మమతని చూడలేడా తను!! "పోనీ, నా పిల్లని నాకిచ్చేయమంటా, సుమతిని ఒప్పిస్తా" అరగంట అలానే కూచున్నాక రాజీవ్ వెళ్ళిపోయాడు.
జానకి మనసు మనసులో లేదు. కానీ, పిల్లని పూర్తిగా రాజీవ్ కి ఇచ్చేయమా లేదు... అల అని పనిమనిషిలా దీన్ని చూడటమేమిటీ!
"అవును జానకీ, ఇది నా కూతురని చెప్పుకుని, నేను నా ఆస్తిపాస్తులన్నీ దీనికి కట్టబెట్టాల్సిన కర్మ నాకేమిటీ?- ఓ కులం గోత్రం కాని పిల్ల- నా పిల్ల అని చెప్పి నా వంశానికి మచ్చ తేలేను. నాకున్న సంపద అంతా ఏ గుడికో దానం చేస్తే ఎంతో పేరు. కీర్తి! అంతేకాని, దిక్కుమాలిన పిల్లలని నేను నా పిల్లలుగా చూడలేను" అన్నాడు ఖచ్చితంగా.
"ఈ విషయం ఎప్పుడో చెప్పా కానీ, నీ మీద ప్రేమతో సరే అన్నా అయినా- నీకూ తెలుసు... యిది పనిపిల్ల మాత్రమేకాని, నేను నా పిల్లగా పెంచలేనని!" అన్నాడు మళ్ళీ.
జానకి నోటమాట రాలేదు.
రాజీవ్ చేసిన రెండు ఫోన్ కాల్సు మాధవరావే తీసుకున్నాడు.
"చెప్పాను కదా- ఆవిడ మాట్లాడదు! గొంతునొప్పితో పడుకుంది"- ఫోను పెట్టేసాడు.
నాలుగు రోజులయేసరికి మద్రాసులో పెద్ద భవంతిలో అడుగుపెట్టారు జానకి. మాధవరావులు పనిపిల్లతో! మాధవరావు స్నేహితులు ఎందరో వచ్చారు- వాళ్ళని చూడ్డానికి! మాధవరావు ఆఫీసువాళ్ళు వచ్చారు. జానకి మద్రాసు వచ్చిందగ్గరనుంచి పూర్తిగా మారిపోయింది.
ఈ పిల్లని పంపేస్తే ఈ తిండి కూడా దొరకదు దానికి. ఈ పిల్లకోసం తను మాధవరావుకి దూరమైపోతే తనకే బతుకు లేదు. తన చదువుకి ఇన్నిరోజుల తర్వాత ఏ నౌకరీ దొరుకుతుందీ?! అయినా- అలా ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఈ పిల్లని తను పెంచగలదా?! ఈ పిల్లకి తన మీద ప్రేమ, తన భర్త మీద విరోధం కలిగితే తను భరించగలదా?! ఈ ఇంటి జమిందారీ పరువు ప్రతిష్టలు నేలకూల్చి తను చేసేదేముందీ?! మాధవరావు తనని పెళ్ళిచేసుకుని గొప్ప స్థాయికి తన జీవితాన్ని తెచ్చాడు.