"ఇదేమీ చోద్యమే. మా కాలంలో ఇలా ఏ ఆడపిల్లా బరితెగించి పెళ్ళి చేసుకోనని చెప్పేది కాదు" రాగాలు తీసింది తల్లి.
"మీ కాలంలో ఏ ఆడపిల్లా ఇలా మాట్లాడివుండదు. నిజమే. మీ కాలంలో టీ.వీ. వుందా? లేదు. మరి ఇప్పుడొచ్చింది. మీ కాలంలో లేదని నువ్వు టీ.వీ. కొనకుండా ఆపేశావా? లేదు. పైపెచ్చు కలర్ టీ.వీ. తెచ్చుకున్నావ్. అలానే అభిప్రాయాల్లోనూ మార్పులొస్తున్నాయి.
మీ అమ్మ పెళ్ళి అయిన ఆర్నెల్ల తరువాత బరువుగా కళ్ళమీద వాలిపోతున్న సిగ్గు తెరలను ఎత్తుకుని మొగుడ్ని మొదటిసారి బెడ్ రూమ్ లొ చూసింది. నువ్వేమో నెలకంతా భర్త కమనీయ రూపాన్ని కళ్ళారా తిలకించావ్. మరి మార్పు రాలేదూ? అలానే నేనూ. ఇక ఇందులో ఆర్గ్యుమెంట్స్ అనవసరం" చాలా స్పష్టంగా చెప్పింది ఆమె.
"అలా మాట్లాడకే- తప్పే" ఈసారి తల్లి అనునయంగా చెప్పింది.
"తప్పొప్పుల పట్టిక నా దగ్గర చదవకు. తప్పు ఒప్పు రెండూ కాలం మీద ఆధారపడి వుంటాయి. ఒక కాలంలో తప్పు మరో కాలంలో రైటు. మనిషికి సుఖం ఇచ్చేదంతా ఒప్పేనంటాడు రూసో అనే ఆయన. 'నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, ఫలితం కోసం ఆశించకుండా' అని అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి నైతిక విలువలు కానీ మరే విలువలు కానీ కాల పరిస్థితులమీద ఆధారపడి ఉంటాయి. నా మటుకు నాకు సహజ వికాసానికి తోడ్పడేదంతా మంచే."
ఇక కూతురితో ఎలా వాదించాలో తెలియక ఆమె తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
* * *
అంత గొడవయ్యాక, వర్ష బి.ఇడి. చదివి ఇటీవలే స్కూల్ టీచర్ గా చేరింది. లక్కేగా, ఉన్న వూరులోనే పోస్టింగ్ వచ్చింది.
త్వరగా బయల్దేరి స్కూలుకు వెళ్ళాలన్న ఆలోచన రాగానే ఆమె ముఖంపై కాసిన్ని నీళ్ళు చల్లుకొని బ్రష్ చేసుకుని వంట గదిలోకి వచ్చింది.
కాఫీ తాగాక స్నానం చేసి తయారవటం మొదలుపెట్టింది.
'యు' షేప్ లో కత్తిరించుకున్న జుట్టును అలా వీపుమీద వదిలేసి మొదట్లో క్లిప్ పెట్టుకుంది. ముఖానికి ఆయిల్ ఆఫ్ ఒలేని కొద్దిగా పట్టించి లైట్ గా పౌడర్ అద్దుకుంది. నుదుటున పెద్దగా తిలకం బొట్టు పెట్టుకుంది.
ఆమె చీర కట్టుకోవడం పెద్దగా ఇష్టపడదు. చాలా ఇంపార్టెంట్ అయిన నడుమును అలా బహిర్గతం చేసే చీరకట్టుకు ఆమె వ్యతిరేకి. అందుకే మోడరన్ డ్రస్సులంటే ఇష్టం.
ఆరోజు తెల్లని కాటన్ చుడీదార్ వేసుకుంది.
చివరిసారి అద్దంలో చూసుకుని బయల్దేరింది.
స్కూలుకు వెళ్ళేసరికి తొమ్మిదిన్నర దాటింది.
కారిడార్ లో నడుస్తుంటే వెంకటాచలం అనే టీచర్ ఎదురుపడ్డాడు.
అతనికి నోటి దురద ఎక్కువ. తోటి లేడీ టీచర్లతో వెకిలిగా మాట్లాడు తుంటాడు.
అయితే వర్ష దగ్గర మాత్రం అతను మంత్రగత్తె దగ్గర పడుకున్న కుక్కపిల్లలాగా నడుచుకుంటాడు. దానికి కారణం ఆమె గురించి విని వుండటమే.
ఆమె యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు ఓరోజు క్లాసుకు వెళుతోంది. ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం వద్ద గుమిగూడిన విద్యార్థి బృందం ఆమెను చూడగానే కసెక్కింది.
ఓ విద్యార్థి ఆమెకు వినబడేటట్లు "చీర కుచ్చెళ్ళను తాకుతూ చేతిని పోనిస్తే ఏం తగులుతుంది?" అని ప్రక్కనున్న మిత్రుల్ని అడిగాడు.
ఈ ప్రశ్న వేసింది ఆమెకే కాబట్టి ఏం సమాధానం చెబుతుందా అని అందరూ అటువేపు చూస్తున్నారు.
సాధారణంగా అలాంటప్పుడు అమ్మాయిలు మరింత తల వంచుకుని నడక వేగం హెచ్చిస్తారు.
కానీ ఆమె ఠక్కున ఆగింది. మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న వేసిన విద్యార్థితో "ఇంటికెళ్ళి మీ చెల్లెలు చీరలోనో, మీ అక్క చీరలోనో చేయిపెట్టి చూడు. అక్కడ ఏం తగులుతుందో నాకూ అదే తగులుతుంది. ఎందుకంటే అనాటమీ ఎవరికైనా ఒక్కటే కదా" అంది.
పాపం కుర్రాళ్ళు బిక్కచచ్చిపోయారు. వంచిన తల ఎత్తలేదు. కళ్ళుమూసి తెరిచేంతలో తలో దిక్కు మాయమయ్యారు.
ఈ సంఘటన గురించి వినడంవల్ల వెంకటాచలం ఆమె ముందు బలవంతంగా నోరు కట్టేసుకున్నాడు.
అలాంటి వెంకటాచలం తనను చూసి అదోరకంగా నవ్వడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలగజేసింది.
"ఏమిటీ విషయం?" అని అడిగింది అతను దగ్గరకు రాగానే.
"మిమ్మల్ని హెడ్ మాస్టర్ రమ్మంటున్నారు" అని చెప్పి ఆమెను దాటి వెళ్ళిపోయాడు.
వెర్రిమొర్రి ఆలోచనలు ఏమీ చేయకుండా హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళింది.
ఏదో సీరియస్ గా రాసుకుంటున్న హెడ్ మాస్టర్ నారాయణరావు తల పైకెత్తి ఆమెను హూడగానే పలకరింపుగా నవ్వాడు.
"గుడ్ మార్నింగ్ సర్" ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ విష్ చేసింది.
"నీకేమోగానీ నాకు మాత్రం బేడ్ మార్నింగమ్మా" అన్నాడాయన కళ్ళజోడును చేతుల్లోకి తీసుకుంటూ.
"అదేంటి సార్! ఏమైంది?"
"నీకు ట్రాన్స్ ఫర్ అయిందమ్మా. నీలాంటి సిన్సియర్ అండ్ బ్రిలియంట్ టీచర్ ను పోగొట్టుకుంటున్నందుకు చాలా బాధగా వుందమ్మా."
ఆమెలో చిన్న కదలిక.
"ట్రాన్స్ ఫరా?"
"అవునమ్మా."
అప్పటికి సర్దుకుంది ఆమె. ఉద్యోగం అన్న తర్వాత బదిలీలు తప్పవు కదా సార్! ఇంతకీ ఏ ఊరుకి ట్రాన్స్ ఫర్ చేశారు?"
"శృంగారపురం" అంతవరకూ బాధతో వున్న హెడ్ మాస్టర్ ఆ ఊరు పేరు చెబుతూ అదో విధంగా కళ్ళు ఆడించాడు.
ఆమె ఆశ్చర్యంతో "అలాంటి పేరుతో ఊరు వుందా?" అని అడిగింది.
"యస్- ఇటీజ్ దేర్. మల్లాంకు దగ్గరే. బాగా ఇంటీరియర్ విలేజ్. ఆ ఊరి గురించి తెలియదా? భలే తమాషా ఊరు."
"తమాషా ఊరా?"
"అవును. స్వయంగా నువ్వే వెళుతున్నావు గనుక అంతా పూర్తిగా తెలుస్తుందిలేమ్మా."
ఇక ఆమె ఏమీ ప్రశ్నించలేదు. అనవసరపు విషయాల్లో క్యూరియాసిటీ ప్రదర్శించకపోవటం ఆమెకున్న మంచిలక్షణాల్లో ఒకటి.
ట్రాన్స్ ఫర్ మీద ఆ వూరు కెళ్ళడానికి ఆమె మానసికంగా ప్రిపేర్ అవుతోంది.
"ఇక్కడికి పెద్ద దూరమేమీ కాదమ్మా. నాయుడుపేట వెళ్ళి అక్కడి నుంచి మల్లం బస్ ఎక్కాలి. పాటిమిట్ట దాటిన తరువాత స్టేజీ శృంగారపురమే. బస్సు దిగగానే నేమ్ బోర్డు వుంటుంది. దానిమీద "శృంగారపురం ఒక కిలోమీటరు" అని రాసి. ఊరు ఉన్న దిశను చూపిస్తూ యారో మార్కు వుంటుంది. ఆవైపు నడుచుకుంటూ వెళితే ఊరొస్తుంది."