Previous Page Next Page 
పడిలేచే కడలి తరంగం పేజి 19

    చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు తటపటాయించాడు.

    "నాకు మెరూన్ కలరంటే ఇష్టం..... నీకు బాగా సూటవుతుందని కూడా నమ్మకం....." ఆమె కట్టుకోవాల్సిన చీర గురించి పరోక్షంగా చెప్పి బయటకు నడిచాడు.

                                                                  8

    వివిధభారతి వింటూ బెడ్ పై పడుకున్న శిల్పకు ఆవేళ ఆదివారమని కిరీటి స్నేహితులకు పార్టి అరేంజ్ చేసింది అదే రోజన్న విషయం గుర్తుకొచ్చింది.

    బెడ్ పై నుండి లేచి షవర్ బాత్ క్రింద మరోమారు స్నానం చేస్తూ ఆలోచించింది.

    కిరీటి కోరినట్టు మెరూన్ కలర్ అమెరికన్ జార్జెటు చీర కట్టుకోవడమా వద్దా అని.....

    నిజానికి ఆ కలర్ తనకూ ఇష్టమే.

    తనకిష్టమని ఆ చీర కట్టుకుంటే కిరీటి తన కోర్కెను మన్నించినట్టుగా ఫీలైతే.

    అతనిలో అనవసరమైన ఆలోచనలకు తావిచ్చినట్టు అవుతుందేమో.

    పోనీ వట్టిచీర మాత్రమేకదా. కట్టుకుని ఆపాటి సంతోషాన్ని కల్గిస్తే పోయేదేముంది.

    నోనో...... వీల్లేదు..... ఆమెలోని అహంకారం ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంది.

    అలాచేస్తే అతనికి దాసోహమైనట్టుగా అవుతుంది.

    ఆ ఆలోచన రాగానే ఆమె నేరేడురంగు క్రేంప్ సిల్క్ శారీ తీసింది. అదేరంగు బ్లౌజు వేసుకుని ఆరుగంటలకల్లా అలంకరణ పూర్తి చేసింది.

    ఆరుగంటలకి పార్టీ అన్న పెద్దమనిషి ఇంకా రాడేం అనుకుంటూ బడలికగా సోఫాలో కూర్చుంది.

    బయట మరోగదిలో చీటికీ మాటికీ వాచీ చూసుకుంటూ కూర్చున్న కిరీటిలో అసహనం ఎక్కువ కాసాగింది.

    ఆరుగంటలకి అక్కడ ఉండాలని స్పష్టంగా చెప్పాడే.

    ఇంకా బయటికి రాదేం.....

    ఒకవేళ మరిచిపోయిందా..... లేక మళ్ళీ అలకపాన్సు ఎక్కిందా?

    మరో అరగంటపాటు ఆలోచన్లతో గడిపిన కిరీటి ధైర్యంచేసి ఆమె గదికి వెళ్ళాడు.

    గది తలుపులు తోయగానే ఉలిక్కిపడుతూ పైకిలేచింది శిల్ప.

    ఆమెను చూడగానే తయారై తనకోసమే వెయిట్ చేస్తుందన్నమాట అనుకున్నాడు.

    ఆమె కట్టుకున్న చీరను చూడగానే అతని ముఖంలో తారట్లాడిన నీలినీడల్ని ఆమె గమనించకపోలేదు.

    బెంజ్ కారులో అతడి ప్రక్కనే కూర్చుంది.

    కారులో వారిమధ్య ఎటువంటి చర్చ చోటు చేసుకోలేదు.

    పసిపిల్లాడు ఉడికిపోయినట్టు ముఖంపెట్టిన కిరీటిని చూసి అతడు కోరినవిధంగా మెరూన్ కలర్ చీర కట్టుకునుండాల్సింది అనుకుంది.

    కారు సన్ అండ్ సీని చేరగానే వి.ఐ.పి.ని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కిరీటిని స్నేహితులు ఉక్కిరిబిక్కిరి చేశారు.

    ఖరీదైన కార్లను, ఖరీదైన మనుషుల్ని దాటుకుంటూ వారి అభినందనల్ని అందుకుంటూ రూప్ గార్డెన్ చేరుకున్నారు.

    అందమైన ఇల్యూమినేషన్ తోనూ అందంగా పేర్చబడిన టేబుల్స్ తోనూ, ఖరీదయిన బొకేలు, బహుమతులతోనూ అంతా సందడిగా ఉంది.

    అక్కడ చేరిన ప్రతివ్యక్తికీ తనను కిరీటి పరిచయం చేస్తుంటే ఠీవిగా ప్రతి నమస్కారం చేస్తూ ఉండిపోయింది కాని వారు వేసే జోక్స్ కుగానీ, వారంటున్న మాటలకు గాని శిల్ప జవాబు ఇవ్వలేదు.

    "షిలుక్స్ ప్రెట్టీ...." అని కామెంట్ చేసిన ఓ భారీకాయుడ్ని "హి ఈజ్ మిస్టర్ గజేంద్ర" అంటూ పరిచయం చేశాడు కిరీటి.

    'మనిషికి తగ్గట్టు పేరు చక్కగా సూటయ్యింది' అనుకుంది కొర కొరమంటున్న అతడి చూపుల్ని చూస్తూ.....

    పురుషుల వరుస పూర్తికాగానే శిల్పను అధునాతనంగా అలంకరించుకున్న స్త్రీ దగ్గరకు తీసుకెళ్లాడు.

 Previous Page Next Page