Previous Page Next Page 
పడిలేచే కడలి తరంగం పేజి 18

                                                   7

    రోజులు గడుస్తున్నా శిల్ప ప్రవర్తనలో అణుమాత్రమైనా మార్పు లేకపోవడంతో కిరీటి కూడా వీలైనంత దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు.

    పగలంతా బిజినెస్ వ్యవహారాలతో తల మునకలవుతూ అర్థరాత్రి వరకూ లైబ్రరీలో గడిపేస్తూ యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయాడు.

    ఇక శిల్ప సంగతి సరేసరి.

    భార్యగా అతని మంచి చెడ్డల గురించిగాని, ఇంటి యజమానురాలిగా ఇంటి విషయాలుగాని పట్టించుకోకుండా సముద్రాన్ని చూస్తూనో, స్టీరియో వింటూనో, నిద్రపోతూనో పగలంతా గడిపేది.

    ఒక్కోరోజు కిరీటి కంటిక్కూడా కనపడకుండా జాగ్రత్తపడేది.

    ఓరోజు రాత్రి ఎనిమిదిగంటల ప్రాంతంలో కిరీటి స్వయంగా ఆమె గదికి వచ్చాడు.

    "ఓసారిలా వస్తావా" అని పిలవగానే మారుమాట్లాడకుండా అతని వెనుక నడిచింది.

    షాపింగ్ చేసుకువచ్చిన గుర్తుగా పేకెట్స్ తో చీరలు.....

    చీరలనన్నింటిని బయటికి తీస్తూ "నీకోసం బాంబేనుండి ప్రత్యేకంగా తెప్పించాను" అన్నాడు ముక్తసరిగా.

    నిజానికి అన్నీ ఖరీదైన చీరలే..... సగానికిపైగా ఆమెకు నచ్చిన డిజైన్సే......

    అయినా ముఖంలో ఎటువంటిభావమూ కనిపించకుండా జాగ్రత్తపడింది.

    ఆమె ప్రక్కనుండి ఏమాత్రమూ రెస్పాన్స్ లేకపోయేసరికి ఇబ్బందిగా నిలబడిపోయాడు.

    "తీసి నీ గదిలో పెట్టెయ్"

    "ఇప్పుడు ఇవన్నీ యెందుకు......?"

    "నీకు అవసరమని"

    "నా అవసరాల గురించి మీకెందుకు తాపత్రయం?"

    "భార్యవని....."

    "దురాశ......"

   
 
   7)

    "ఎప్పటికైనా మారకపోవన్న ఆశ....."

    "అది ఈ జన్మలో జరగదని చెప్పాను...."

    "నేను ఆశావాదంతోనే జీవితంలో చాలా సాధించాను."

    "కాని నా విషయంలో మీకు ఓటమి ఖాయం."

    "అదీ చూస్తాను....."

    అతని ఆత్మవిశ్వాసం ఆమెకు అహంకారంలా అనిపించింది. నవ్వుతున్న అతని కళ్ళు ఆమె స్వాతిశయంపై గుచ్చుకుంటున్న ముళ్ళులా అనిపించాయి.

    "శిల్పా.... చీరల విషయంలో ఇంత సీరియస్ గా చర్చించుకోవటం షియర్ వేస్టాఫ్ టైమ్"

    "చీరలు కొనటం కూడా వేస్టే అన్నది నా అభిప్రాయం."

    "సండే ఈవెనింగ్ 'సన్ అండ్ సీ'లో స్నేహితులకి మేరేజ్ పార్టీ ఇస్తున్నాను."

    "........అందుకని నేనీ ఖరీదైన చీరల్ని కట్టుకుని అక్కడ మీ ముద్దుల భార్యగా కొంతసేపు నటించాలి."

    "సరిగ్గానే ఊహించావు....."

    "కాని మీ ఊహే సరికాదు....."

    "అంటే......."

    "మిమ్మల్ని అంతగా ద్వేషించే నేను అక్కడకు వస్తానని, వచ్చి మీకు భార్యగా నటిస్తానని ఎలా అనుకున్నారు."

    గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది కిరీటికి.

    అదిరించి బెదిరించి ప్రయోజనం లేదనుకున్నాడు.

    "ప్లీజ్ శిల్పా..... ఐ హావ్ కమిటెడ్......"

    ఓరగా అతనివేపు చూసింది.

    "నా దురదృష్టాన్ని ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నము చేయొద్దని నీకు ముందే చెప్పాను....." ఆర్థ్రంగా అన్నాడు.

    "మిమ్మల్ని చూస్తుంటే జాలిగా వుంది."

    ఆమె ధోరణి అతనికి సహింపరానిదిగా వుంది...... అయినా భరించాడు.

    "అలాగే వస్తాను..... కాని ఒక్క షరతు...."

    ఏమిటన్నట్టుగా చూశాడు.

    అక్కడ మీ ప్రవర్తన ఏమాత్రం శృతిమించకూడదు. ఐమీన్ నేను ఇష్టపడని రీతిలో మీరు ప్రవర్తించకూడదు."

     "కాని..... అక్కడకు వచ్చేనాకు అత్యంత ఆత్మీయులయిన మిత్రులు. కాస్త ఈస్తటిక్ గా నువ్వు బిహేవ్ చేయాలి."

    "నా పరంగా మీకెటువంటి బాధ కలగకుండా చూస్తాను."

    "నేను కూడా......"

    బయటకు వెళ్ళబోతూ ఆగాడు.

    "సండే ఈవెనింగ్  సరిగ్గా ఆరుగంటలకు పార్టి."

    "చిన్న రిక్వెస్టు......"

    ఈసారి వెళ్ళబోతూ ఆమె ఆగింది.

 Previous Page Next Page