Previous Page Next Page 
హృదయాంజలి పేజి 18

   
    "జ్యోతితో నాకు మూడేళ్ళ పరిచయం, అక్కా! ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు! మా ముందున్న జీవితం గురించి మాకు సరైన అవగాహనే ఉంది. నేనిప్పుడు పెళ్ళి చేసుకోకపోతే పెళ్ళి చేసుకొనే వరకు ఆగుతానంది, ఎట్టి పరిస్థితిలోనూ మరో సంబంధం చేసుకోనంది. నా పరిస్తితి ఇంచుమించు అదే!"
 
    "అంత గాఢంగా ఒకరికొకరు కావాలనుకొన్నప్పుడు ఇక ఆగడం అనవసరం, భానూ, పెళ్లికిక నేను చెప్పాల్సిన అభ్యంతరం ఏంలేదు."
 
    "నాన్నగారికి నువ్వే నచ్చచెప్పాలక్కా!"
 
    "సరే! అలాగే చెబుతాను."
 
    అదే వారంలో ఉదయభాను పెళ్ళి జ్యోతితో జరిగిపోయింది.

    శాస్త్రి కష్టపడి పైకి వచ్చినవాడు. డబ్బు విలువ బాగా తెలిసిన వాడు. పెళ్ళి చాలా క్లుప్తంగా జరిపించాడు.

    జ్యోతీ అత్తారింట్లో మూడు నిద్రలు చేసి వెళ్ళాక మళ్ళీ రాలేదు.
 
    "ఇక్కడ ఇల్లు ఇబ్బందికదా? అక్కడ వాళ్ళ అన్నా వదినలు ఉద్యోగరీత్యా చాలా దూరంలో ఉన్నారు. అంత ఇంట్లో ముసలివాళ్ళిద్దరే వుండాలంటే ఎలాగో అనిపిస్తుందట! కొన్నాళ్ళ పాటు ఇలాగే జరగనీయమన్నారు మా అత్తగారు!" అని చెప్పాడు భాను.
 
    అత్తారింటికి షాపు దగ్గరవుతుందని అక్కడికే వెళ్ళసాగాడు భాను.

    రాను రాను రావడమే తగ్గిపోయింది! వచ్చినప్పుడు పదో పాతికో తండ్రి తలగడ క్రింద పెట్టి పోతుంటాడు!


                                *    *    *

    "ఇంటద్దె కృష్ణవేణి ఆంటీకి ఇచ్చిరా, అఱ్పితా" అప్పుడే స్కూల్ నుండి వచ్చిన అపురూప పర్సులోంచి డబ్బు తీస్తూ చెప్పింది.
 
    అక్క ఇచ్చిన నోట్లు లెక్క పెట్టుకొంది అర్పిత.  "ఒక్క నెల అద్దె ఇది! మనం ఇవ్వాల్సింది మూణ్ణెల్ల అద్దెకదా?"

    "మొత్తం నా జీతం ఇఛ్చేసినా మూణ్ణెల్ల అద్దె భర్తీకాదు! ఇప్పటికి నెల అద్దె ఇచ్చేసిరా! వారం పదిరోజుల్లో మిగతా డబ్బు ఇస్తామని చెప్పు!"

    "ఉహుఁ నేను వెళ్ళను! ఆవిడ ఈ డబ్బు తీసి నా ముఖాన కొట్టి, భద్రకాళిలా అరిచి మూణ్ణెల్ల అద్దె పట్టుకురాపో అంటుంది. నువ్వే వెళ్ళు. ఏం సమాధానం చెబుతావో, ఎలా సర్ది చెబుతావో."

    "ఒక రక్తం పంచుకు పుట్టినవాళ్ళం కదే? తిట్లూ దీవెనలూ సమానంగా పంచుకవాలన్న తెలివి నీకెప్పుడు వస్తుందో!"

    విసురుగా, రోషంగా అంది అర్పిత. "అందుకే నేను చదువు మానేసి ఉద్యోగం చేస్తానని చెప్పింది"
 
    "ఏమన్నా అంటే చదువు మానేస్తాననడం తేలికైంది నీకు! అక్కడేదో ఉద్యోగాలు కుప్పలుగా పోసినట్టు, కావాలనుకొన్నవాళ్ళు ఒకటి ఏరి తెచ్చుకోవచ్చునన్నట్టు."

    "నీ పాటి ఉద్యోగం నేను సంపాదించుకోలేక పోనులే!"
 
    "నీతో పెట్టుకోవడం నాదే తప్పు!మనసు పాడైపోవడం తప్ప ఇంకేం మిగలదు" చెల్లెలితో మాట్లాడే ఓపిక లేనట్టుగా నిస్పృహగా ఒక నిట్టూర్పు విడిచి డబ్బు తీసుకొని బయల్దేరింది అపురూప కాని, గుండె దడదడలాడుతోంది. డబ్బు తక్కువ ఉన్నందుకు ఇంటావిడ నిజంగానే భద్రకాళి అవతారం ఎత్తుతుంది కాని, ఏం చేయగలదు తను? మొత్తం జీతం ఇంటద్దె క్రింద కట్టేసి ఏం చేయాలి? ఏం తినాలి! తమకు ఓ పూట అన్నం లేకపోయినా గడుస్తుందేమోగాని తండ్రికి ఓపూట మందు లేకపోతే గడవదు!

    "వచ్చేప్పుడు పేపరు తీసుకురా , తల్లీ!"
 
    ఆ గదిలో ఒక మూలన మంచం కుక్కిలో అస్థి పంజరంలా అంటుకుపోయిన తండ్రికి అదొక్కటే కాలక్షేపం!

    అపురూప గడప దాటుతూ,  "పేపరు అడిగితే ఆవిడ ముఖం ఎలాగో పెట్టుకొంటుంది నాన్నగారూ!"
 అంది.

    "చదివి పడేసిన పేపరేకదమ్మా? మనం తినేస్తామా ఏమిటి? చదివి ఇచ్చేస్తాంగా?"
 
    "సరే! అడుగుతాను!"
 
    ఇంటావిడ కృష్ణవేణి ప్రక్కనే ఉంటుంది.

    అపురూప బితుకు బితుకుమంటూ వెళ్ళేసరికి ఆవిడ వరండాలో బియ్యం బాగుచేసుకొనే కార్యక్రమంలో వుంది. జల్లెడలో బియ్యం పోసి ఒక లయతో గిర్రున త్రిప్పుతోంది. ఆవిడ చేతిలో జల్లెడ తిరగడంలేదు గాని జల్లెడలో బియ్యం చక్రంలా తిరుగుతున్నాయి.

 Previous Page Next Page