"ఇంటద్దె తెచ్చాను, ఆంటీ!"
"మూణ్ణెల్లదీ తెచ్చావా లేదా?" ఆవిడ జల్లెడ త్రిప్పడం ఆపి కొట్టినట్టుగా అడిగింది.
"ఒక్క రెండు రోజులాగితే మొత్తం ఇచ్చేస్తాను, ఆంటీ! ట్యూషన్ ఫీజులొస్తాయి! ఇప్పటికిది ఉంచండి."
అపురూప చేతిలోని నోట్లు విసురుగా లాక్కొని గబగబ లెక్కపెట్టి, ముఖం చీదరింపుతో నిండిపోగా, సరిగ్గా అపురూప మీద పడేలా రెట్టింపు విసురుతో విసిరింది. "మెత్తగా ఊరుకొనేకొద్దీ ప్రతినెలా ఇలాగే చేస్తున్నావు! మొత్తం అద్దెడబ్బు చెల్లుగా ఇచ్చిన పాపాన ఏనాడైనా పోయావా! ఎప్పుడూ రెండు మూడు నెలల అద్దె బకాయి! ఇక ఈసారి చస్తే ఊరుకోను! మొత్తం డబ్బు ఎల్లుండిలోగా ఇస్తేసరే! లేకపోతే ఏం చేస్తానో చెప్పి చేయను"
అక్కడేవున్న ఆమె భర్త "ప్రతినెలా ఇదే గొడవకదే? ఇల్లు ఖాళీ చేయిస్తే పోలా?" అన్నాడు.
ఆవిడ పులిలా భర్తమీద విరుచుకుపడింది. "మీకు దమ్ముంటే వాళ్ళని ఖాళీ చేయించండి. ఏడాదినుండి ఖాళీ చేయమని చెబుతున్నాను! చేస్తున్నారా?"
అటో ఇటో తేల్చేస్తాను అన్నట్టుగా అతడు భుజంమీద తువాలు దులిపివేసుకుంటూ అపురూప ముందుకు వచ్చాడు. "ఏమిటమ్మా ఈ సతాయింపు? ఏళ్ళయినా అద్దె పదిరూపాయలు పెంచరు. ఇచచే ఇద్దె సరిగా ఇస్తారా అంటే అదీ లేదు. మమ్మల్ని శని పట్టుకొన్నట్టుగా పట్టుకొన్నారు కదమ్మా?"
"వాళ్ళు కాళీ చేసిన మరుక్షణం ఓ వందరూపాయలు అద్దెపెంచి ఇచ్చుకోగలను "కృష్ణవేణి అందుకొంది." ఆఖరికి పోలీసుల్ని పిలిచి వెళ్ళగొట్టాల్సి వస్తుందేమో!"
పాలిపోయియ దుఃఖంతో నిస్సహాయంగా చూడసాగింది అపురూప.
ఆవిడ అన్నదాంట్లో అతిశయోక్తి ఏంలేదు! తామిస్తున్న రెండు వందల అద్దె చాలా తక్కువే! ఓల్డ్ సిటీ కాబట్టి ఈమాత్రమైనా దొరికింది. ఇదే మరోచోట అయితే నాలుగైదు వందలకి తక్కువరాదు! తాము ఖాళీచేస్తే వంద అదనంగా వస్తాయి.
"రేపు మీ అద్దె మొత్తం చెల్లగడతాను, ఆంటీ!" ఎలాగో గొంతు పెగల్చుకొని అంది అపురూప.
"జీతం వచ్చినరోజే ఇవ్వలేదు! తరువాతేం ఇస్తావు? ఈ గడువులు గడపడానికే!"
"ఇస్తాను, ఆంటీ! తప్పక ఇస్తాను. మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధపెడుతూ ఉండడానికి మేం మీ శత్రువులంకాదు. మీ ఇంట్లో నాలుగైదేళ్ళుగా ఉంటున్నాం. కాస్త వెనుకా ముందు ఇస్తూనే ఉన్నాం. ఇక అద్దె పెంచమంటే ఈ ఇంట్లో దిగినప్పుడు అద్దె వందరూపాయలు. ఇప్పుడు రెండు వందలు. ఇంకా పెంచమంటే మా పరిస్థితి మీకు తెలియంది కాదుగా?"
"తెలుసు కాబట్టే గట్టిగా వసూలు చేయలేకపోతున్నా. రేపు మాత్రం ఖచ్చితంగా తెచ్చివ్వాలి!" క్రిందపడ్డ నోట్లు ఏరుతూంటే అపురూపకూడా సాయంచేసి మొత్తం నోట్లు మడతపెట్టి ఇచ్చింది.
వెళ్లడానికి రెండడుగులువేసి, ఆగింది. "అంకుల్! కొంచెం ఆ పేపరిస్తారా? ఓ గంటలో తిరిగిస్తాను"
"చౌకగా అద్దెకుండడమే కాదు! అద్దె ఏ నెల కానెల బకాయి వుండడమే కాదు! పేపరు ఫ్రీగా ఇవ్వాలి.
ఏదో చదివి ఇచ్చేస్తారులే అనుకొంటే వాటికి కంతలు పెట్టి ఇవ్వడం"
అర్పితకు ఓ చెడ్డ అలవాటుంది. తన ఫేవరేట్ యాక్టర్ బొమ్మ పడితే కట్ చేసి తీసుకోవడం అపురూపకూడా ఒకటిరెండు సార్లు వాంటెడ్ కాలమ్స్ , ఉద్యోగావకాశాలు అన్నవి కట్ చేసుకంది.
"కట్ చేయడం తప్పే అంకుల్! ఈసారి మా పత్రిక పువ్వుల్లో పెట్టి ఇస్తాగా?"
పేపరు తీసుకొని వచ్చింది అపురూప.
ఇల్లు గలవాళ్ళు అరిచిన అరుపులన్నీ అర్పితతో పాటు తండ్రి కూడా విన్నాడు. ఆయన గుండెలో దుఃఖం తుఫాన్ లా చెలరేగింది. అపురూప గదిలో అడుగు పెట్టగానే అందుకొన్నాడు. "ఇది ఇల్లా? వట్టి మురికి కూపం! మన ఊళ్ళో బాత్ రూం ఉంటుందమ్మా ఇంతకంటే విశాలంగా శుభ్రంగా! దీనికి రెండొందల రూపాయలు అద్దివ్వడం కొంచెం అటుఇటుగా అయితే నానా మాటలు! వాళ్ళ తాత సొమ్ము తిన్నట్టుగా సిగ్గుశరాలు ఎంచడం. ఇక్కడికి వచ్చి ఏం బాముకొన్నామని? సిటీకి వెడితే ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చని ఇక్కడికి ఈడ్చుకు వచ్చి పడేశావు. సూర్యచంద్రులు ఎక్కడ ఉదయిస్తారో, ఎక్కడ అస్థమిస్తారో తెలియదు. మన ఊళ్ళో మంచి గంధంలాంటి గాలి, మధురమైన నీళ్ళు. ఇక్కడేం వుంది? దుర్గంధం! పాచిపట్టిన నీళ్ళు, పగలూ రాత్రీ తేడా లేకుండా కరిచే దోమలు. ఈ నరకంలో నేనిక ఒక్క క్షణమైనా ఉండలేనమ్మా! మూటాముల్లె సర్దండి. మన ఊరెళ్ళిపోదాం!" తండ్రి గొంతులో భళ్ళున బ్రద్దలవుతున్న ఆక్రోశం, ఆవేదన.
"మన ఊరెళ్ళి ఎక్కడుంటాం నాన్నగారూ? ఏం తింటాం? ఇంట్లో దీపం పెట్టే వాళ్ళులేక, ఆలనా పాలనా లేక ఇల్లు కూలిపోయి, జనం చేతికందినవి తలుపులు, దూలాలు ఎత్తుకెళ్ళిపోయారట. ఇప్పుడు అక్కడున్నది మనిల్లు కాదు! పాడుపడిన మొండిగోడలు. ఆ మధ్య మన ఊరి పెద్ద రెడ్డిగారు చెప్పలేదూ? ఇక ఏ గుడి సత్రంలోనో తలదాచుకు ఉందామన్నా ఏం పెట్టుకు తిందాం?"