Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 19


    
    "నైస్ టు మీట్యు!" అన్నాడు సుధీర్, కరచాలనం చేస్తూ.
    
    "ఐయామ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ!" అన్నాడు రాజన్, సుధీర్ చేతిని ఆప్యాయంగా ఒత్తుతూ.
    
    "ఇది వసుమతి....నా ఫ్రెండు!" అంది శశి సరదాగా.
    
    కొత్త వ్యక్తికి పెట్టినట్లు పొడుగాటి నమస్కారం పెట్టాడు సుధీర్. వసుమతి నవ్వింది.
    
    అందరూ బెంజ్ కారు దగ్గరికి నడిచారు. స్టీరింగు ముందు కూర్చుంది శశి. వసుమతి కోసం డోర్ తెరిచింది. వసుమతి ఆమె పక్కనే కూర్చుంది.
    
    మగాళ్ళిద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. కారు జూలాజికల్ పార్కువైపు మెత్తగా జారిపోయింది.
    
    అది డిసెంబరు నెల. చిరుచలిగా, లేత ఎండగా వుంది వాతావరణం. పిక్నిక్ లకీ, డేటింగులకీ చాలా అనువైన సమయం.
    
    పార్కులో కారుని ఒకచోట వదిలి మెల్లిగా, తాపీగా నడుస్తూ, జంతువులని చూస్తున్నారు. లేత నీలిరంగు టెర్రీవూల్ సఫారీ డ్రెస్ వేసుకుని వున్నాడు సుధీర్. సన్నగా వున్నా, బలంగా ఉన్నాడు. పొడుగ్గా హుందాగా ఉన్నాడు.
    
    "మా అయన కంటే మీ ఆయనే బావున్నాడు శశీ!" అంది వసుమతి నవ్వుతూ.
    
    "నీ నోటికి అదుపు లేదు." అంది శశి. కాని, ఆమె మొహంలో తృప్తి కనబడుతోంది. వసుమతి ఇంకా పొగిడినా వినాలనే కోరిక కనబడుతోంది. తన భర్తవైపు ఇష్టంగా, వోరగా చూసింది.
    
    నిజమే! అతను చాలా బాగుంటాడు. అతను నోరు తెరిచి తెలుగు మాట్లాడకపోతే ఏ పంజాబీ వాడో, కాశ్మీరీనో అనుకుంటారు జనం.
    
    అతని పక్కనే నడుస్తున్న వసుమతి భర్త రాజన్ - సుధీర్ కి కాంట్రాస్ట్ లాగా నల్లగా పొడుగ్గా, బలంగా ఉన్నాడు. క్రీంకలర్ డెనిమ్ పాంట్ వేసుకుని, హాండ్లూం ఫర్టు టక్ చేసి తాటి ఆకుతో అల్లిన టిన్ గాలన్ హాట్ పెట్టుకుని స్మార్ట్ గానే ఉన్నాడు. చేతులనిండా దట్టంగా రోమాలు! బిరుసు గెడ్డం!
    
    ఎదురుగా కనబడుతున్న చింపాంజీ దగ్గర ఆగి, ఒకేలా నవ్వడం మొదలెట్టింది వసుమతి.
    
    అందరూ నవ్వుతూ ఆమెకేసి చూశారు.
    
    "ఏమిటే?" అంది శశి.
    
    ఏదో చెప్పబోయి, నవ్వు తెరలో మాటలు మింగుడు పడిపోగా మళ్ళీ నవ్వింది వసుమతి.
    
    "నవ్వి అన్నా చెప్పు చెప్పి అన్నా నవ్వు!" అన్నాడు రాజన్ ఇంగ్లీషులో.
    
    "ఏంలేదు. చింపాంజీని చూస్తే...."నవ్వింది.
    
    "వూ! చూస్తే!"
    
    "చింపాంజీని చూస్తే..." మళ్ళీ నవ్వింది.
    
    కారణం తెలియకుండానే అందరికీ నవ్వొచ్చింది. నవ్వు అంటువ్యాధిలాంటిది..నిజం!
    
    "చిం....చింపాజీని చూస్తే" అని నవ్వి- "ఎవరో...తెలిసిన వాళ్ళు గుర్తొస్తున్నారు!" అని విరగబడి నవ్వింది. "వంటినిండా జుట్టు...."
    
    నవ్వబోయి, రాజన్ ఏమన్నా అనుకుంటాడేమోనని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది శశి.
    
    "నేనేగా గుర్తొచ్చేది?" అన్నాడు రాజన్ గద్దిస్తున్నట్లు, అంతలోనే తనూ నవ్వేశాడు.
    
    అందరూ నవ్వు మొహాలతో ముందుకు నడిచారు.
    
    వసుమతి భర్త చాలా సరదా మనిషి. చేతులు తిప్పుతూ, తలాడిస్తూ, కళ్ళు పెద్దవి చేస్తూ, పెదిమలు బిగబడుతూ, మొహంలో చిత్రవిచిత్రమైన భావాలు పలికిస్తూ, ఒక్కక్షణం ఆపకుండా మాట్లాడుతున్నాడు. అతను కనబడ్డ ప్రతి స్టాల్ లో ప్రతి తినుబండారమూ కొన్నాడు. వేరుశనగ పప్పులతో చేసిన చికీ, పాప్ కార్న్, ఐస్ క్రీమ్, కాండీ, కుల్ఫీ, ఫ్లేవర్ డ్ మిల్క్, కాఫీ, కేకులూ మళ్ళీ టీ....
    
    డాక్టర్లు ముగ్గురూ భయపడిపోతున్నారు అతని ప్రతాపానికి. "ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కావు" అని వాళ్ళు ఏకగ్రీవంగానూ వంతులు వేసుకునీ హెచ్చరిస్తున్నారు. వినకుండా- "పిక్నిక్ వచ్చినప్పుడు నానా చెత్తా తింటేనే ఎంజాయ్ మెంటు" అంటూ విజ్రుంభించి ఇంకా ఇంకా కొన్నాడు.
    
    "ఇన్నాళ్ళూ వసుమతి సన్నమని మా అందరికీ బెంగగా వుండేది. ఇక ఫర్వాలేదండీ! ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని, వసుకూడా మీలాగా....."అని ఆపేసింది నవ్వుతూ. ఆగమని చేత్తో సైగచేస్తూ, నోట్లో పెట్టుకున్నది త్వరత్వరగా నమిలి మింగి, తర్వాత - "మీకేం భయం వద్దు! ఐవిల్ మేక్ హర్ ఫాట్!" అన్నాడు రాజన్.
    
    అతను పిట్టల్ని పిట్ట అరుపులతో, విజిల్సుతో పలకరించాడు. కోతుల్ని వెక్కిరించాడు. పాముల్ని చూసి భయం నటించాడు. అతనితో సమానంగా అల్లరి చేసింది వసుమతి.
    
    శశి చిరునవ్వుతో ఇదంతా చూస్తూంది. వాళ్ళ పద్దతి నచ్చనట్లు సీరియస్ గా మొహం పెట్టుకుని నడుస్తున్నాడు సుధీర్.
    
    పెద్దపులులున్న ఎన్ క్లోజరు దగ్గరికి వచ్చారు. అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తూంది పులి.
    
    ఇంతలో...
    
    ఒక పాలపిట్ట తరుముతున్న గెద్దని తప్పించుకుని ఎగురుతూ వచ్చి హఠాత్తుగా వశం తప్పి, కూలిపోతున్న విమానంలాగా కింద-సరిగ్గా పులిమీద పడింది. రెక్కలు టపటప ఆర్పింది. ఈకలు కొన్ని వూడి ఎగిరి పడ్డాయి.

 Previous Page Next Page