విస్తళ్లది మహిళల పరిశ్రమ. వారు తమ పనులు తీర్చుకొని వసారాల్లో చేర్తారు. ఇద్దరు ముగ్గురు గృహిణులు ఒక ఇంట్లో కూడ్తారు. విస్తళ్లు కుడ్తుంటారు. ముచ్చట్లు పెడ్తుంటారు. ఊరి ముచ్చట్లన్నీ అక్కడే! ఎక్కడెక్కడి వార్తలు - వ్యాఖ్యలు సంపాదకీయాలూ ఉంటాయి . వ్రాయని వార్తాపత్రిక!
విస్తళ్లు కుడ్తుంటారు. పాటలు - ఒక్కొకరు విడిగా సామూహికంగా పాడుతుంటారు. అందులో సీతమ్మవారి వేవిళ్లు - ఊర్మిళ నిద్ర - సుభద్ర పరిణయం - ఒక్కటేమిటి అనేకం ఉంటాయి. ఇది వేదికలేని సాంస్కృతిక ప్రదర్శనం! ఇది పేరు తెలియని వినోదం.
విస్తళ్ళు కుడ్తుంటారు. ఒక తల్లి చిరుతిండి వంతులవారిగా చేసి తెస్తుంది. నవ్వులాటలు - పరిహాసాలు - దరహాసాలు - కోపాలు - చిరుతగాదాల మధ్య చిరుతిండ్లు. ఇది సామూహిక జీవనం - సామూహిక వ్యవహారం. ఇది పేరులేని క్లబ్బు.
ఇదంతా మహిళలు కలిసి చేసే ఆలిన్ వన్. అప్పుడు మహిళా సంఘాలు లేవు. పదవులకు పోట్లాట లేదు.
సాయంకాలం అవుతుండగా ఎవరి ఇళ్లకు వాళ్లు చేర్తారు. తాజాగా తయారవుతారు. కొప్పులో పూలు ముడుచుకొని మగవారికి స్వాగతం పలుకుతారు!
ఇదీ మన జీవన విధానం.
దీనిని మటుమాయం చేసింది మరలనాగరకత!
మళ్లీ ఇంతటి ప్రశాంత జీవితం కనీసం కలలో చూడగలమా?
ఖమ్మం మెట్టు విస్తళ్ళకు ప్రసిద్ధి. విస్తళ్ల వర్తకం బాగా జరిగేది. అప్పుడు నూరు మంచి విస్తళ్ల కట్ట పావలా!
డాబాలు - కమానులు:
చాలవరకు పెంకుటిళ్లని చెప్పాను. అయితే బీటు బజారులో సంపన్న వర్తకులకు డాబా ఇండ్లుండేవి. అయితే వాటి కప్పులు సిమెంటువి కావు. అప్పుడు సిమెంటు అతి తక్కువ. కప్పుకు ఇనుపవిగాని, కలపనిగాని వాట్లు వేసి దాని మీద పలాస్త్రి పరిచి సున్నం వేసి, కట్టేవారు. కాలవ గట్టున సున్నం బట్టీలు ఉండేవి. ఇండ్లు ఎట్లా కట్టినా ముందు వసారా తప్పక ఉండేది. అది నలుగురు కూడాదానికి - రాత్రిళ్ళు అతిథులు, ఆగంతుకుల విశ్రాంతికి పనికివస్తాయి.
ప్రస్తుతపు గాంధీచౌక్ అప్పటి బీటు బజారు. బీటు అనే పేరు BID నుంచి వచ్చింది. అప్పుడు ఇదే మార్కెట్టు! ఉదయం బండలతో నిండి కిటకిటలాడుతుండేది. చుట్టుపట్ల పల్లెల నుంచి - గూడూరు నుంచి గూడా - బండ్లలో సరుకులు తెచ్చేవారు. ధరల నిర్ణయానికి వర్తకులు అక్కడ కూడి BID అంటే, మాట లేక పాట ద్వారా ధర నిశ్చయం అయ్యేది. అయితే ధరల విషయంలోనూ - తూకం విషయంలోనూ - చెల్లింపుల విషయంలోనూ వర్తకులు రైతులను మోసం చేసేవారు. ముంచేవారు. ప్రభుత్వం ఇది గమనించింది. రైతన్నను కాపాడడానికి మార్కెటు క్రమబద్ధీకరణ చట్టం తెచ్చింది. మార్కెటును సర్కారు ఏర్పరచింది. కాలువ వడ్డున ఒక విశాల స్థలం - ఒక రేకులషెడ్డు ఏర్పరచింది. మార్కెటు బీటు బజారు నుంచి కాలువ వడ్డుకు మారింది. అక్కణ్ణుంచి గుట్టల బజారుకు తరలింది.
ఇండ్లకంటే ధర్మసత్రాలు గట్టిగా కట్టేవారు. అప్పటికి కొత్త బజారులో అర్వపల్లివారి సత్రం మాత్రమే ఉండేది. తరువాత మిషన్ ఆస్పత్రి దగ్గర శిరం వారి సత్రం వెలిసింది.
పల్లెల్లో సత్రాలు ఉండవు. ఎందుకంటే, అక్కడి అతిథులకు భోజనానికి కరువు ఉండదు. బస్తీలలో ఆ ఉదారత అప్పటికే లోపించింది. బయటినుంచి పనులకోసం వచ్చిన అతిథులు సత్రాలను ఆశ్రయించేవారు. పూటకూళ్లు తప్ప హోటలు వ్యవస్థ బలపడలేదు. అంతేకాక, భోజన ఖాజనాల విషయంలో కుల నియమాలుండేవి. అందువల్ల సత్రాలు అవసరం అయినాయి.
సత్రాలలో ఉచిత వసతి కల్పించేవారు. వంట సామగ్రి, అంటే పాత్ర సామాగ్రి ఉచితంగా ఇచ్చేవారు. కొన్నిచోట్ల వంటకు అవసరం అయిన పదార్థాలుకూడా ఇచ్చేవారు. ఖమ్మంలో కాదు కాని, మరికొన్ని చోట్ల కులాలవారీ సత్రాలుండేవి. అతిథులకు వండుకునే ఇబ్బంది లేకుండా సిద్ధాన్నం వడ్డించేవారు.
ఆరోగ్యరీత్యా స్వయంపాకం ఉత్తమమని తేలింది.
హోటలు తిండ్లు అనేక రోగాలకు కారణం అని వెల్లడి అయింది.
వీటిని దృష్టిలో ఉంచుకుని సత్ర వ్యవస్థ వ్యక్తిగత, సామాజిక ఆరోగ్యానికి ఉపకరించిందని ఇంకా అంగీకరించలేకపోతున్నాం.
ఇంటికన్న సత్రం - సత్రం కన్న గుడి, గట్టిగా - పటిష్టంగా నిర్మిస్తారు. గుడి రాతి కట్టడం. అది కోటలా ఉంటుంది. గుడి దేవుడిది మాత్రం కాదు. దానికి బహుళ ప్రయోజనాలున్నాయి.
1. భద్రత : దండయాత్రలు - దోపిళ్ళు - తుపానులు వచ్చినప్పుడు గ్రామ ప్రజలను రక్షిస్తాయి. 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెనలో దేవాలయాలు ఎందరినో కాపాడినాయి.
2. వినోదం : విజ్ఞానం - దేవాలయంలోనే హరి కథలు, పురాణాల వంటివి జరిగేవి. భారత సంస్కృతికి మూల స్తంభాలయిన రామాయణ, భారత, భాగవతాలను ప్రజలలోనికి తీసుకొనిపోయిందీ, వానిని పరిరక్షించిందీ దేవాలయాలే! అందుకే అవి అన్యమతస్తుల ఆగ్రహానికి - దోపిడికి - వినాశానికి గురి అయినాయి.
3. పాపభీతి : దేవుని ముందు ప్రమాణం చేసి అబద్ధం చెప్పరాదనీ - దేవుని ముందు చేసిన వాగ్దానం నిలపెట్టాలనీ, అలా కాకుంటే పాపం తగిలి ఏదో అరిష్టం జరుగుతుందనీ భయపడేవారు. ఆ భయమే సామాజిక జీవితాన్ని న్యాయమర్గంలో నడిపించింది.
4. సమానత : దేవునిగుడిలో కులం -అధికారం - సంపద అనే వ్యత్యాసం లేదు. అందరూ ఒకే పంక్తిలో తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. ప్రసాదం ఇవ్వడంలో ముందువెనుకలు తప్ప వ్యత్యాసాలు లేవు.
5. ఆధ్యాత్మికత : ఈ జీవితం కేవలం శరీర పోషణకు మాత్రం కాదు. ఆత్మలేని దేహానికి చలనం లేదు. అంతం దేహానికే. ఆత్మ నిత్యం అయింది. దానికి అంతం లేదు. ఆత్మ అరువు తెచ్చుకున్నది - శరీరం. ఇల్లు కాళీ చేసేటప్పుడు మేకులను కూడా పీక్కొనిపోతాం. మేకుల రంధ్రాలను వెంట తీసుకొని పోలేము. ఆ రంధ్రాలే ఒక జన్మ సంస్కారాలు. వాటిని ఆత్మ మరో జన్మకు తీసుకొని వెళ్తుంది. కావున శుద్ధము - సాత్వికము - ప్రశాంతము - న్యాయము అయిన జీవితం ద్వారా ఆత్మను రక్షించుకోవాలని ఆధ్యాత్మిక విద్య బోధిస్తుంది. ఇది దేవాలయాలలోనే సంప్రాప్తం అవుతుంది.
6. సామాజికం : గ్రామంలో ఎక్కడ కలిసినా, కలవకున్నా గుళ్లో కలుసుకుంటారు. ఒకరి కథలు ఒకరికి చెప్పుకుంటారు. ఈ చెప్పుకోవడంలో ఉన్న ఊరట దేనిలోనూ లేదు.
ఒక పాతికేళ్ల కిందటి ఒక వృత్తాంతం వివరిస్తాను : ఒక మిత్రుని భార్యకు గుండె జబ్బు వచ్చింది. నాకు తెలిసిన ఒక డాక్టరు మిత్రుని దగ్గరికి తీసికెళ్ళాను. అతడు నాస్తికుడు. అన్ని పరీక్షలు చేశాడు. "మీ ఊళ్ళో గుడి ఉందా?" అని అడిగాడు. ఆమె "లేదు" అన్నది. "అందుకే ఈ జబ్బు" అన్నాడు డాక్టరు.
నాస్తికుడు గుడి సంగతి మాట్లాడ్డం నాకు విచిత్రం అనిపించింది. "గుడికి గుండెకు లంకె ఏమిటి?" అని అడిగాను.
"ఉంది. వీళ్ళు దొరలు. తమ సౌధంలో వంటరి జీవితం గడపాలి. ఒకరు ఈమెతో - లేక ఈమె" ఒకరితో మాట్లాడ్డానికి దొరతనం అడ్డు వస్తుంది. గుడి ఉంటే అక్కడ ఎవరయినా కలుస్తారు. వారితో మనసు విప్పుకుంటుంది. ఈమెకు జబ్బు ఏమీలేదు" అని పంపించాడు.
వాళ్లు ఆ ఊళ్లో హనుమదాలయం నిర్మించారు. ఆమె క్షేమంగా ఉంది.
బహుళార్థ సాధకాలయిన దేవాలయాలను గుర్తించడం లేదు. మన సమాజాన్ని వలెనే ఆలయాలను శిథిలావస్థకు చేరుస్తున్నాం.
"వృద్ధుల బుద్ధులు సంచలింపవే" అన్నారు పెద్దలు. నేనూ వృద్ధుణ్ణే. ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను. చెప్పదలచుకున్నది డాబాల బజారును గురించి కదా!
నైజాంలో మున్సిపాలిటీలు లేకుండెను అని చెప్పాననుకుంటా. నైజాంలో అంతా సర్కారే! సర్కారువారికి ఖమ్మంలో డాబాలు ఉండాలి అనిపించింది. సర్కారుకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఆగదు.
సర్కారువారు కొన్ని ప్లాట్లు చేశారు. డాబాలు కట్టిన వారికి మాత్రమే కేటాయిస్తామన్నారు. సంపన్న వర్తకులు తీసుకున్నారు. ఆ వీధి సాంతం డాబాలు కట్టారు. అది డాబాల బజారు అయింది.
అలాగే ప్రతి ఇంటికీ కమాను ఉండాలని సర్కారు హుకుం జారీ చేసింది. అందువల్ల అది కమాను బజారు అయింది. ఆ బజారులోనే వేంకటేశ్వర ఆలయం ఉంది.