Previous Page Next Page 
మోహిత పేజి 19


    "వర్షం.... చలేస్తోందా? ఇలారా..... నా దగ్గరగా కూర్చో, నేను మీ బావను కాదుగా సిగ్గుపడటానికి. సిగ్గులేకుండా ఫ్రీగా వుండేవాళ్ళంటే నాకు చాలా యిష్టం. నేను ఈ ఏరియాలో పవర్ పుల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ని. నేను చెప్పినట్టుగా వున్నావనుకో రేపుదయానికల్లా నీ ఎదుట నీ బావ వుంటాడు. అర్థమయిందా" అంటూ ఇందు భుజాలమీద చెయ్యివేసి, ఆమె కళ్ళల్లోకి హేపీగా చూశాడు సి.ఐ.

 

    ఆమె భుజాల మెత్తదనం అతనికి ఆనందమయిన కిక్ నిచ్చింది.

 

    అతని చేతుల గరుకుతనం ఆమె మదిలో భయాన్ని రేపింది. గబుక్కున సోఫామంచి లేచిపోయి, బైటకు వెళ్ళిపోడానికి మెయిన్ డోర్ వేపు అడుగు వేసింది ఇందు.

 

    "అయ్యబాబోయ్! బోల్డు కతా కార్యక్రమం వుండగా అప్పుడే లేచిపోయా వేమిటి? చూడమ్మడూ! ఈ రాత్రి నీది..... నాదీనూ..... ఆ గణేష్ గాడు నీకా విషయం చెప్పలేదా? మొహమాటపడకు రా" అంటూ గబగబా ఆమె దగ్గరికెళ్ళి, రెండు చేతులతో ఆమె నడుముని పట్టుకుని కొడిపెట్టని పైకెత్తినట్టుగా పైకెత్తి డబుల్ కాట్ బెడ్ మీద పడేశాడు చంద్రప్ప.

 

    ఏమాత్రం ఆసల్యం చెయ్యకుండా ఆమె పైటను లాగేసి పక్కన పడేసి, ఆమె జాకెట్ మీద చేతులు వేశాడతను.

 

    ఇందు ఏడుస్తోంది.... ప్రతిఘటిస్తోంది.... గణేష్ ను పిలుస్తోంది..... అరుస్తోంది.

 

    బయట వర్షం హోరున కురుస్తోంది.

 

    ఆమె వంటిమీదున్న చీరని లాగేసి, గోడకేసి విసిరికొట్టి, ఆమె  తలను పొదివిపట్టుకుని రెండుబుగ్గల్నీ కొరికి, పెదవులమీద ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను.

 

    "ప్లీజ్.... ప్లీజ్.... నన్నొదిలెయ్యండి సార్" బ్రతిమలాడుతోంది ఇందు.

 

    చంద్రప్ప వినే పరిస్థితిలో లేడు. ఆమెను గోడవారకు ఆన్చి తన కోరికను తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను.

 

    భయంతో పెనుకేకలు పెడుతోంది ఇందు.

 

    సరిగ్గా....

 

    సరిగ్గా అదే సమయంలో.....

 

    చంద్రప్ప తన భుజమ్మీద పడిన బలమయిన చేతిస్పర్శకు తలతిప్పి చూసి....

 

    "నువ్వా..... నెవ్వెందుకొచ్చావురా ఇక్కడికి..... కిందకెళ్లి తాగుపో" ఆ వ్యక్తిని వదిలించుకుని ఇందుమీద పడ్డాడు.

 

    ఆ వ్యక్తి చంద్రప్పను బలమయిన తన చేతులతో వెనక్కి లాగాడు.

 

    ఆ విసురుకి చంద్రప్ప బెడ్ మీద  బోర్లాపడిపోయాడు.

 

    "ఇందూ.... నువ్వెళ్ళిపో..... రోడ్డుమీద కెళ్ళిపో.... పరిగెత్తి పారిపో" అరిచాడు ఆ వ్యక్తి.

 

    పక్కన పడిపోయిన చీరను అందుకుని రెండుచేతులతో పట్టుకుని మెయిన్ డోర్ వేపు పరుగెత్తింది ఇందు. ఇందు పారిపోవడాన్ని చూసిన చంద్రప్ప విసురుగా మంచంమ్మీంచి లేవబోయాడు.

 

    "కదిల్తే కాలూ, చేతులూ విరిచేస్తాను."

 

    కళ్లల్లో నిప్పులు చెరుగుతూ అరిచాడు ఆ వ్యక్తి. తనని ఆ సమయంలో చంపడానికయినా వెనుకాడని ఆ వ్యక్తిని చూసి ఒక్కక్షణం వెనక్కి తగ్గి, వార్డ్ రోబ్ వేపు చూశాడు చంద్రప్ప.

 

    వార్డ్ రోబ్ లో యూనిఫారమ్ పక్కన సర్వీస్ రివాల్వర్.

 

    తనకు సమీపంలో నిలబడి ఆ వ్యక్తి గుండెలమీద తన్ని వార్డ్ రోబ్ లో వున్న రివాల్వర్ ని అందుకుని-

 

    "ఒరే గణేషూ.... ఊరకుక్క..... నా మందుతాగి, నాకే అన్యాయం చేస్తావట్రా..... నిన్ను ..... నిన్ను" అంటూ గణేష్ ముఖమ్మీద కొట్టి మెయిన్ డోర్ వేపు పరుగెత్తాడు చంద్రప్ప.

 

    చంద్రప్ప దెబ్బతాకిడికి గోడకు ఢీకొని, బాధగా అరుస్తూ కిందపడిపోయి, ఒక్క ఉదుటున లేచి ముందుకు పరుగెత్తాడు గణేష్.

 

    తన పంజా దెబ్బతిని పారిపోయిన మనిషికోసం వెతుకుతున్న అడవిపులిలా వున్నాడు చంద్రప్ప. వళ్ళంతా  చెమటలు కక్కుతున్నాడు. చిందరంవందరైపోయిన జుట్టు...... కోపంతో ఎరుపెక్కిన ముఖం, తడిసి ముద్దయిపోయి వంటిమీద బనీస్, చేతిలో రివాల్వర్ తో మెట్లమీద నుంచి హాల్లోని బెడ్ రూమ్ లోకొచ్చాడు.

 

    ఆ బెడ్  రూమ్ లో దృశ్యాన్ని చూడగానే అతనికి చిర్రెత్తుకొచ్చింది. అక్కడ వంటిమీద స్పృహలేకుండా, గురకతీస్తూ నిద్రపోతున్న హెడ్ కానిస్టేబుల్ ని చూసి తిట్లు లంకించుకుని, కాళ్ళతో రెండుతన్నులు తన్ని-

 

    "ఒసేయ్... ఎక్కడే! ఎక్కడున్నా నువ్వు.... తప్పించుకోలేవు" అంటూ వెనక్కి తిరిగి పోర్టికొవేపు పరుగెత్తబోయి ఆగిపోయాడు చంద్రప్ప.

 

    అక్కడ ద్వారబంధం దగ్గర ఉగ్రనరసింహంలా నుంచున్నాడు గణేష్.

 

    "ఒరేయ్ అడ్డులెగు..... చంపేస్తాను..... అయ్ విల్ షూట్  యూ.... చెపుతున్నా" విసురుగా గణేష్ ని తోసుకుని ముందుకు రాబోయిన చంద్రప్ప మెడమీద చెయ్యివేసి, తోసుకుంటూ  వెనక్కి తీసుకొచ్చి కడుపుమీద మోకాలితో తన్నాడు గణేష్.

 

    ఆ దెబ్బకు విలవిల్లాడుతూ కిందపడిపోయాడు చంద్రప్ప.

 

    "బాస్టర్డ్.... నిన్ను..... నిన్ను" అంటూ కిందపడిన చంద్రప్ప పైకి లేచి, రివాల్వర్ ని గణేష్ గుండెలకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు.

 

    గణేష్ బాధగా మొదటిసారి అరిచాడు.

 

    గణేష్ భయంకరంగా రెండోసారి అరిచాడు.

 

    గణేష్ నెత్తురు మడుగులో కిందకు ఒరిగిపోతూ మూడోసారి అరిచాడు.....

 

    ఆ మూడో అరుపుని విన్పించుకోలేని పరిస్థితిలో చంద్రప్ప తీవ్రమయిన క్రోథంతో ఆ బిల్డింగ్ లోంచి బయటకు పరుగెత్తాడు.

 

    సాధారణంగా ఎప్పుడూ లేనట్టే కాలనీ మెయిన్ రోడ్డుమీద వీధిలైట్లు లేవు.

 

    వర్షం మాత్రం ముమ్మరంగా వుంది.

 

    ఆ వర్షంలో గతుకుల రోడ్లమీద పిచ్చి పిచ్చిగా అరుస్తూ పరుగెడుతున్నాడు చంద్రప్ప.

 

    అప్పుడు సమయం రాత్రి ఎనిమిది ముప్ఫై అయిదు నిముషాలయింది.

 

                                          *    *    *

 

    అంతక్రితం పావుగంట ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎంక్వయిరీ కౌంటర్ ముందు అసహనంగా నుంచున్నాడు వెంకటయ్య.

 

    "విజయవాడ వెళ్ళే బస్సు ఆరుగంటలకే వస్తుందన్నారు. ఇంకా రాలేదు..... వస్తుందంటారా?" అడిగాడు వెంకటయ్య ఎంక్వయిరీలో వున్న మనిషిని.

 

    "ఇది మీరు అయిదోసారి అడగడం అనుకుంటాను. పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారల్లే వుంది. మీరోపని చెయ్యండి.... మీరు రైల్వేస్టేషన్ కి వెళ్లిపొండి. బెంగూళూర్ కి చాలా ట్రైన్స్ వున్నాయి. అక్కడ్నుంచి బోలెడు బస్సులున్నాయి" సానుభూతితో చెప్పాడతను.

 

    "నేనడిగేది ఆర్టీసి బస్సు గురించి....." కొంచెం కోపం ధ్వనించిన గొంతుతో అన్నాడు వెంకటయ్య.

 

    "మనదేశంలో రోడ్ల పరిస్థితి మీకు తెలీందేవుంది..... దానికి తోడు వర్షాలు ఏక్సిడెంట్లు..... ఏక్సిడెంట్లను తగ్గించాలన్న ఉద్దేశ్యంలో బస్సుల్ని సాధ్యమయి నంత "స్లోగా" నడపమని హయ్యర్ అఫీషియల్స్ ఆర్డర్స్. ఆర్టీసీ నష్టాల్లో పడిపోయినా ఫర్వాలేదు. మా బస్సుల్లో ప్రయాణించే ఏ ఒక్క పాసింజర్ కి కూడా చిన్న గాయంకూడా తగలకూడదని మా జన్మభూమి ప్రతిజ్ఞ. అందుచేత మీరు మాతో సహకరించాలి. ఎందుకంటే..... ఆర్టీసీ మీది, మాది, మనందరిదీనూ కాదంటారా...." ఆలిండియా రేడియోలోంచి ఆర్టీసీలోకి వచ్చిన వాడిలా చెప్పాడు ఆ వ్యక్తి.

 

    ఆ మాటలకు ఏడవాలో నవ్వాలో రైల్వేస్టేషన్ కు వెళ్ళిపోవాలో అర్థంకాలేదు వెంకటయ్యకి.

 

    హేండ్ బ్యాగ్ తో వెనుదిరిగాడు వెంకటయ్య.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    "హలో.... సార్....." అని ఆ ఎంక్వయిరీ వ్యక్తి వెంకటయ్యని పిల్చాడు. వెంకటయ్య తలతిప్పి చూశాడు.

 

    "అదిగో మీ బస్సు..... ప్లాట్ ఫారం నెంబర్ త్రీ మీదకు ఇప్పుడే వచ్చింది. విష్ యూ హేపీ జర్నీ....." అని నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి.

 

    అప్పుడే ప్లాట్ ఫారం మీదకోచ్చిన బస్సువేపు చూసి గబగబా అటువేపు నడిచి, బస్సెక్కి, నెంబర్ వెతుక్కుని సీట్లో కూర్చున్నాడు వెంకటయ్య.

 

    వర్షం, బయటంతా వర్షం. తెరిచి వున్న గ్లాస్ విండోని క్లోజ్ చేసి బయటకు చూస్తున్నాడాయన.

    

                                        *    *    *

 

    ఎనిమిది యాభై నిమిషాలు.

 

    అస్తవ్యస్తంగా వంటిమీదున్న చీరతో, హోరున కురుస్తున్న వర్షములో మెయిన్ రోడ్ మీదనుంచి పరిగెడుతూ వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ క్రాస్ రోడ్స్ లో నుంచుంది ఇందు.

 

    ఎటు వెళ్ళాలో తెలీడం లేదామెకు. ఒక్కక్షణం ఆలోచించి కాంప్లెక్స్ లెప్ట్ గేట్ వేపు పరుగెత్తింది.

 

    వరుసగా సిటీబస్ టెర్మినల్స్, అది దాటాక రూరల్ బస్ టెర్మినల్స్ ఆ తరువాత వరుసగా బెంగుళూరు, చిక్ మంగళూరు, మంగుళూరు బస్  ప్లాట్ ఫారమ్స్.

 

    ఈదురుగాలి జివ్వు జివ్వుమంటోంది.

 

    ప్లాట్ఫారమ్స్ కు ఎదురుగా వున్న చెట్లకింద, నుంచున్న పల్లెటూరి ప్రయాణీకుల పక్కన బిక్కుబిక్కుమంటూ నుంచుంది.

 

    కళ్ళంట ఉబుకుతున్న కన్నీళ్ళను తుడుచుకుని బస్సులవేపు చూస్తోందామె.

 

    ప్లాట్ ఫారమ్ నెంబర్ త్రీ మీద వున్న  బస్సుమీద విజయవాడ అన్నపేరు చూడగానే కంటిముందు తల్లి కన్పించినట్టయింది ఇందుకు.

 

    ఆమె గుండెల్లోంచి దుఃఖం ఒకసారి వర్షంలా పెల్లుబికింది. ముందుకు నడిచింది. నాలుగడుగులు వేసింది.

 

    అప్పుడే బస్సు స్టార్టయింది. ప్లాట్ ఫారంమీద నుంచి బైటకొచ్చింది. డ్రైవర్ గేరు మార్చాడు.

 

    బస్సుకు ఎదురుగా నుంచుని ఇందు బస్సుని అపమన్నట్లుగా సంజ్ఞ చేసింది. డ్రైవర్ ఆమెవేపు చూడలేదు.

    కానీ -

 

    కండక్టరుకు టిక్కెట్టును చూపించి, తలతిప్పి నీళ్ళు కారుతున్న అద్దాల్లోంచి బయటకు చూసిన వెంకటయ్యకు ఎవరో అమ్మాయి బస్సుని ఆపమంటున్న దృశ్యం అస్పష్టంగా కనబడింది.

 

    కానీ ఆ అమ్మాయి తన కూతురు ఇందు అతని తనకి తెలీదు. బురదనీళ్ళను చిమ్ముకుంటూ బస్సు కాంప్లెక్స్ లోంచి బయటకు వెళ్ళిపోయింది.

 

    ఇందు కళ్ళలో కన్నీరు గడ్డకట్టింది.

 

    ముందుకు నడవబోయి ఇందు తనకెదురుగా నుంచుని తనవేపు కోపంగా, క్రోథంగా, కోరికగా, అసహనంగా చూస్తున్న వ్యక్తిని చూసి కెవ్వున కేకవేసింది.

 

    ఆ వ్యక్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రప్ప.

 

    చంద్రప్ప అరుస్తున్న ఇందును, భుజాలమీద వేసుకొని విక్రమార్కుడిలా బస్సు కాంప్లెక్స్ లోంచి బయటకు ఠీవిగా నడిచి ఆటో ఎక్కాడు.

 

                                            *    *    *


    
    మోహిత, మైత్రేయ విజయవాడ చేరేసరికి ఉదయం ఎనిమిది గంటలయింది. అలంకార్ సెంటర్లో వున్న హోటల్ జగపతి ఇంటర్నేషనల్ లో ఏ.సీ. సూట్ తీసుకున్నారు.

 

    స్నానాలూ, టిఫిన్ లూ పూర్తయ్యాక ఆ రోజు డైలీ పేపర్  తిరగేస్తోంది మోహిత.    

 Previous Page Next Page