Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 19


    జూలై ఆరో తారీఖు ఆదివారం రాత్రి ఒక స్పెషల్ ప్రోగ్రాముని రేడియోవాళ్ళు ప్రసారం చేస్తున్నారు. జనంలో బాగా పాపులారిటీ వున్న ఒక నటుడు తన కిష్టమైన పాటల్ని ఒక గంటసేపు వినిపిస్తాడు. ఈ నటుడంటే జనానికి క్రేజ్. ఈ ప్రోగ్రామ్ గురించి అప్పుడే రేడియో వాళ్ళు అడ్వర్టయిజ్ మెంట్ మొదలుపెట్టారు కూడా. తెలుగుదేశంలో ఆ గంటా దాదాపు అన్ని రేడియోలు ఆన్ చేసే వుంటాయి. మనం మన ప్రచారం కోసం ఆ గంటా ఉపయోగించుకోబోతున్నాం.
    రేడియో స్టేషన్.... తెల్లవారు ఝామున 4-30 కి ఇంజనీర్లు రావటంతో మేల్కొంటుంది. దాదాపు ఇరవై మంది వచ్చి పని ప్రారంభిస్తారు. మొదట గడియారాలన్నీ ఒకే టైము చూపిస్తున్నాయా లేదా అన్న విషయం చెక్ చేస్తారు. తరువాత మైకులు, ఊరి బయట వున్న రిసీవింగ్ సెంటర్- షార్ట్ వేవ్, మీడియం వేవ్ పరీక్ష చేయబడ్తాయి. ఇద్దరు డ్యూటీ ఆఫీసర్లు పనిలోకి వస్తారు. ప్రతిరోజూ అయిదున్నరకి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ తన యింటి నుంచి (అలారం పెట్టుకుని లేచి) రేడియో స్టేషన్ కి ఫోన్ చేసి, అంతా సవ్యంగా ప్రారంభం అవుతుందా లేదా? డ్యూటీ ఆఫీసర్లు వచ్చారా లేదా అన్న విషయం కనుక్కుంటూ వుంటాడు. ఆఫీసర్లు అలా రాకపోతే వెంటనే స్టేషన్ డైరెక్టరే వెళ్ళి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంఘటనలు కూడా లేకపోలేదు. అంధ్రప్రదేశ్ లో కూడా యిలా ఒకసారి జరిగింది.
    స్టూడియో కంట్రోల్ రూమ్ నిజంగా ఒక సాలెగూడులా ఉంటుంది. రకరకాల ప్రోగ్రామ్ లు, మైక్రోఫోన్లు యిక్కడ కంట్రోల్ చెయ్యబడ్తాయి. ఇక్కడ నుంచే టెలిఫోన్ లైన్ల ద్వారా ఎన్నో మైళ్ళ దూరాన వున్న ట్రాన్స్ మీటర్ కు మాటలు సరఫరా చేయబడతాయి. కంట్రోల్ రూమ్ యింజనీరు దాదాపు ప్రతిరోజూ అష్టావధానం చేస్తూ వుంటాడు. ఒక చిన్న స్విచ్ పొరపాటున నొక్కినా, ఒక స్విచ్ పొరపాటున తిప్పినా, ఒక టేప్ ఆలస్యంగా ప్రారంభించినా అయోమయం తప్పదు.
    ఒక క్షణం ఆగి పరశురాముడు కొనసాగించాడు "ఇహ జూలై ఆరో తారీఖు ప్రోగ్రాం గురించి ఆలోచిద్దాం.... ఆ నటుడు తన స్పీచ్ ని పది నిమిషాలపాటు యిస్తాడు. రికార్డులు పది పదిహేను వినిపిస్తారు. అవి నలభై నిమిషాలు. ఇంకో ఏడు నిమిషాలు అడ్వర్టయిజ్ మెంట్ లు, మొత్తం యాభై ఏడు నిముషాలు. ముందు నటుడి వ్యాఖ్య రికార్డు చేయబడుతుంది. మధ్యలో అడ్వర్టయిజ్ మెంట్స్ ఇన్ సర్ట్ చేయబడతాయి. "నేను నా పదహారో ఏట రంగస్థలం ప్రవేశించాను, నా నలభై ఏళ్ళ నటజీవితంలో ఎన్నో ఒడుదుడుకుల్ని చవి చూసేను. ఇప్పుడు నా మొట్టమొదటి చిత్రంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారు పాడిన పాటని వినిపిస్తాను. టింగ్ టింగ్. 'మీ పైరుకు గ్రోమోర్ ఎరువునే వాడండి' యిలా సాగుతుంది. - ఆ ప్రోగ్రాం. దీనికి బదులుగా మనం మార్చబోయే టేపులో ఇలా వుంటుంది. 'మనుషుల్ని పాలించవలసిన అధికారుల్లో రోజురోజుకీ స్వార్ధం పెరిగిపోతుంది. దీన్ని తగ్గించాలంటే వచ్చే ఎన్నికల్లో మీరు మాడిజంకే ఓటు వెయ్యండి. మిమ్మల్ని పాలిస్తున్న అధికారుల కన్నా పిచ్చివాళ్ళను ఎన్నుకోవటం నయం' టింగ్.... టింగ్.... 'మీ ఓటు మాడిజం గుర్తుకే వెయ్యండి' యిలా సాగుతుంది. ఈ గంటసేపూ ప్రోగ్రాములో మన ఆశయాలూ, మనం ఎంత తెలివైన వాళ్ళమో ఇవన్నీ చెబుతాం. మధ్యలో టింగ్ టింగ్ లు స్టయిల్లో మాడిజం నినాదాలు వుంటాయి."
    "ఈ గంటసేపూ రేడియోలో పనిచేస్తున్న వాళ్ళు ఊరుకుంటారా? మధ్యలో ఆఫ్ చెయ్యరూ?" అని అడిగాడు ఒక యువకుడు.
    "అక్కడికే వస్తున్నా" అన్నాడు పరశురాముడు. "రేడియోలో వస్తున్న ప్రతీ ప్రోగ్రామ్ నీ వినటానికి డ్యూటీ ఆఫీసర్స్ అని ఇద్దరుంటారు. వీళ్ళలో చాలామందికి తెలుగు సరిగ్గా రాదు. అయినా ఆ విషయం మనని యిప్పుడు అంతగా బాధించదు. రేడియోలో వస్తున్న ప్రసారాన్ని యింకొక చోటనుంచి కూడా ఆపుచెయ్యవచ్చు. దాన్ని ట్రాన్స్ మీటర్ టవర్ అంటారు. ఊరికి దూరంగా వుంటుంది. మనం జాగ్రత్త తీసుకోవలసింది ఇక్కడే!"
    "ముందు రేడియో స్టేషన్ గురించి చెప్పండి! అక్కడా చాలా మంది వుంటారు కదా. వాళ్ళ కన్ను కప్పటం ఎలా?"
    "చాలా మంది వుండరు. రాత్రి ఎనిమిదింటికి కొద్దిమందే వుంటారు".
    "అయినా గంటసేపు ప్రోగ్రామ్ ని ప్రసారం చెయ్యటం అంటే.... అది అసలు సాధ్యమేనా? డ్యూటీ ఆఫీసర్స్ వూరుకొంటారా? గూర్ఖాలు చేతులు కట్టుకొని కూర్చుంటారా?"
    "కూర్చోరు" అన్నాడు అనీల్ కుమార్ అనే ఇంజనీరు.
    "కాబట్టి రేడియో స్టేషన్ లో వున్నవాళ్ళకి తమ మామూలు ప్రోగ్రామ్ జరుగుతున్నట్టూ వాళ్ళ వాళ్ళ స్పీకర్లోంచి వినబడుతూంది. ట్రాన్స్ మిషన్ టవర్ దగ్గిర మాత్రం మనవాళ్ళు ఇద్దరూ ఆకక్ది ఇంజనీర్స్ ని స్నేహంగా కంట్రోల్ చేస్తారు" అన్నాడు 'స్నేహం' అన్న పదాన్ని వత్తిపలుకుతూ.
    ఒక యువకుడు లేచి, "అన్నిటికన్నా కష్టమైన పని యింకొకటి వున్నది" అన్నాడు.
    "ఏమిటి?"
    "టేపులు మార్చటం. మన టేపు ఆ స్థానంలోకి వెళ్ళాలి. ఎవరికీ అనుమానం రాకుండా అది ప్రసారం జరుగుతున్నంతసేపూ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా అని మాత్రమే మనం ఆలోచిస్తూ వచ్చాం. డ్యూటీ ఆఫీసర్ పెర్సనల్ ఫోను వైరుకూడా కత్తిరించి పబ్లిక్ ఎవరూ ఫోన్ చేసి చెప్పకుండా జాగ్రత్తపడతాం. కానీ ఎలా టేపులు మార్చటం?"
    "ఆ విషయం నేను చూసుకుంటాను. మనకి తెలిసినవాడు రేడియో స్టేషన్ లో ఒకడున్నాడు. చెప్పింది చేస్తాడు."
    "ఎవరు?"
    "కృష్ణ - తాండవకృష్ణ"
    .......
    "ఇంపాసిబుల్. నేను చచ్చినా చెయ్యను" అన్నాడు కృష్ణ. "అసలిది సాధ్యమయ్యే పనేనా? ఎవరికైనా తెలిస్తే నాకు జైలు శిక్ష తప్పదు".
    "ఎందుకు సాధ్యంకాదు? కొంచెం తెలివి తేటల్తో వ్యవహరిస్తే సాధ్యం కానిదంటూ ఏమీలేదు. ఎవరికైనా తెలియటం అంటావా? ఎలా తెలుస్తుంది? ఆస్కారమే లేదు. అంతా నీ చేతిలోనే వుంది-"
    "సారీ నేను చెయ్యను. అసలు ఊహించటానికే వళ్ళు గగుర్పొడుస్తోంది" అన్నాడు కృష్ణ.
    "ఇంటికి రిజిస్ట్రార్ ఆఫీసు పెయింట్ వేసి పెళ్లి చేసుకొన్నప్పుడు గగుర్పొడవలేదా వళ్ళు?" అని అడిగాడు పరశురాముడు.
    కృష్ణ పాలిపోయిన మొహంతో "ఏం బెదిరిస్తున్నారా?" అన్నాడు.
    "కాదు హెచ్చరిస్తున్నాను. ఆ రోజు మీరు దండలు మార్చుకుంటున్న ఫోటోలు ఇంకా నా దగ్గిరే వున్నాయి. అది చాలు మీ పెళ్ళయినట్టు ఋజువు చెయ్యటానికి. చెప్పు టేపు మారుస్తావా?"
    కృష్ణ తటపటాయించి "మారుస్తాను" అన్నాడు.
    "గుడ్! ప్రపంచ చరిత్రలోనే లేని ఒక అపూర్వ సంఘటనని మాడిజం సంస్థ జరపబోతోంది. రాత్రి ఎనిమిదింటికి రేడియో వింటున్న వాళ్ళ మతులు పోతాయి. పిల్లలు మాడిజం వేసే జోకులకు కేరింతలు కొడుతూ నవ్వుతారు. ఆడవాళ్ళు అసలు ఇది 'రేడియోయేనా' అని ఆశ్చర్యపోతారు. మగవాళ్ళు బాండులు మారుస్తూ చెక్ చేస్తారు. అంతా అయోమయం, పరశురాముడు ప్లానింగ్ కి మరో నిదర్శనం....జూలై ఆరో తారీఖు- ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకి."
                   *    *    *
    టేపులు పట్టుకుని కృష్ణ ఇంటికి వచ్చేడు. ఆదివారం కార్యక్రమం రాధ నిర్వహించాలి. అంటే ఆ టేపులు స్థానంలో చివరి నిముషంలో పెట్టాలి.
    అంతా ఆఖరి నిముషంలో జరగాలి-
    రాధకి ఏ మాత్రం అనుమానం రాకుండా.
                      11
    జూలై ఆరో తారీఖు - ఆదివారం.
    కృష్ణ టెన్షన్ తో వణికిపోతున్నాడు. మాడిజం తాలూకు ఇంజనీర్లు ఇద్దరిద్దరు చొప్పున ఆరుగురు లోపలికి వచ్చారు. వాళ్ళు ఎంత మామూలుగా ప్రవర్తించారంటే రేడియో స్టేషన్ లో పనిచేస్తున్న వాళ్ళుకూడా, ఆ వచ్చినవాళ్ళు తమ వాళ్ళేనని భావించారు. నిశ్శబ్దంగా వాళ్ళూ తమ పని తాము చేసుకుపోయారు. ఇంటర్నల్ స్పీకర్ కీ, రేడియోలకీ టేప్ కనెక్ట్ చేయబడింది. స్టేషన్ గేటు ముందున్న సెంట్రీలకు లోపల జరుగుతున్నది ఏమీ తెలీదు.
    కృష్ణ చేతిలోని టేపుని చూశాడు. అచ్చం ఫిలిం హీరో గొంతులానే వుంది పరశురాముడు గొంతు. మధ్యలో టింగ్ టింగ్ లూ.... అమ్మాయీ అబ్బాయి కలిసి పాడిన అడ్వర్టయిజ్ మెంట్ పాట శంకరాభరణం స్టయిల్లో "మోసాలు ద్వేషాలు కలబోసిన రంగమే.... ఈ ప్రభుత్వమూ" అని. ఎవరైనా చెప్తే తప్ప, తెలుగురాణి ట్రాన్స్ మీషన్ టవర్ దగ్గిరుండే ఇంజనీర్ కు అర్ధం కాదు. చెప్పాలీ అంటే అంతదూరం వెళ్ళాలి. మామూలు పౌరులు వెళ్లలేరు. ఫోన్ పని చెయ్యదు. అదే రోజు స్టేడియంలో సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగస్తుల సాంస్కృతిక కార్యక్రమాలున్నాయి. కాబట్టి చాలామంది, పార్థసారథితో సహా అక్కడే వుంటారు. 
    'పరశురాముడూ, యూ ఆర్ రియల్లీ ఇంటలిజెంట్' అనుకున్నాడు కృష్ణ చేతిలోని టేపు చూస్తూ.
                   *    *    *
    ఆదివారం రాత్రి 7-50 నిముషాలైంది.
    పరశురాముడు రేడియో ఆన్ చేశాడు. అంతకు ఐదు నిముషాల క్రితమే అతడు డ్యూటీ ఆఫీసర్ కి ఫోన్ చేసేడు. రింగ్ కాలేదు. అంటే అంతా అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందన్నమాట.
    ఏదైనా గొడవ అవుతే ట్రాన్స్ మీటర్ టవర్ దగ్గిరే అవ్వాలి. అక్కడే ఓ జీపు రెడీగా వుంది- ఏ మాత్రం గొడవయినా తమ వాళ్ళని ఎక్కించుకొని వెనక్కి వచ్చెయ్యటానికి. కానీ గొడవ జరగటానికి ఏ కోణంలో చూసినా స్కోప్ లేదు.
    8-00 అవటానికి ఇంకా ముప్పై సెకన్లున్నాయి.
    వాద్య సంగీతం వినిపిస్తూంది.     

 Previous Page Next Page