ఒకవేళ ఎవరైనా రేడియో స్టేషన్ కొచ్చి బయట రేడియోల్లో వినిపిస్తూన్న విషయం గురించి స్వయంగా చెప్పాలన్నా పావుగంట పడుతుంది. ఆ మాత్రం చాలు అలజడి సృష్టించటానికి. మరుసటిరోజు పేపర్లనిండా యీ వార్తలే. ఫారిన్ లో కూడా యింత వరకు ఎవ్వరూ చెయ్యనిది....
ఎనిమిదయింది.
అంతవరకూ వస్తూన్న వాద్య సంగీతం ఆగిపోయింది. అమ్మాయి గొంతు- "ఆకాశవాణి.... కేంద్రం. ఇప్పటివరకూ బాలమురుగన్ గారి వయొలిన్ విన్నారు. తరువాతి అంశం వెంటనే ప్రసారం...." పరశురాముడు పక్కస్టేషన్ ట్యూన్ చేసేడు.
ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత కృష్ణ గొంతు- "ఆకాశవాణి- మా శ్రోతలకు ఈ వారపు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రఖ్యాత నటులు శ్రీ.... గారు నిర్వహిస్తారు" లైవ్ నుంచి రికార్డర్ కు మారిన చప్పుడు, "....శ్రోతలకు నమస్కారం" నటుడి కంఠం వినబడింది. "దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను రంగప్రవేశం చేశాను. అప్పట్లో మా కిన్ని సాంకేతిక పరికరాలుండేవి కావు. కానీ అప్పటి నటులకీ, ఇప్పటి నటులకీ పోల్చుకుంటే...."
రేడియో కట్టేసి లేచాడు పరశురాముడు. అతడి మొహం ఎర్రగా కందిపోయింది.
ట్రాన్స్ మీటర్ టవర్ దగ్గరున్న వ్యాన్ కి కబురు చేశాడు- తిరిగి వచ్చేయమని. ఇంకొక జీపు రేడియో స్టేషన్ కి పంపించాడు- కృష్ణని ఉన్న పళాన ఎక్కించుకు తీసుకురమ్మని.
కృష్ణ వచ్చేసరికి అయిదు నిమిషాలు ఆలస్యం అయింది.
అటూ ఇటూ పచార్లు చేస్తూ అతడి గురించి చూస్తున్నాడు.
కృష్ణ రాగానే విరుచుకుపడ్డాడు.
ఇటు యేడు తరాల్నీ, అటు యేడు తరాల్నీ తిట్టేడు. అసలు ఇలాంటి యువకులుండటంవల్లే దేశం తగలబడిపోతుందన్నాడు. పట్టుదల లేని యిలాటి వాళ్ళవల్లే విప్లవం రావటంలేదని అరిచేడు.
అన్నిటికీ కృష్ణ మౌనమే సమాధానం అయింది.
"అంత ధైర్యం లేనివాడివి ఈ పనికి ఎందుకు వప్పుకున్నావ్...."
కృష్ణ మాట్లాడలేదు.
"పోనీ తోడు యింకెవరన్నా కావాలంటే పంపించివుందునుగా...."
మౌనం.
"క్రితం సారి బ్రిడ్జీ పేల్చటానికి ఫిరంగులు పెడితే ఎవరో వాటినిండా బంతిపూలు కుక్కేరు. ఈసారి ఈ ఆపరేషన్ ఇలా ఫెయిలయింది. ఇదంతా చూస్తుంటే అసలు మిమ్మల్ని నమ్మటం నాదే బుద్ధితక్కువ అనిపిస్తూంది. మాడిజం సిద్దాంతాన్ని అమలు పరచడం కోసం యింకో పది సంవత్సరాలు ఆగుదామనుకుంటున్నాను. దేశం ఇంకా కొద్దిమంది మంచి యువకుల్నీ, తెలివైన వాళ్ళనీ సృష్టించేవరకూ నా కార్యకలాపాల్ని వాయిదా వేసుకోవటమే మంచిదని తోస్తూంది."
దీనికీ కృష్ణ మాట్లాడలేదు.
"ఈ ఆపరేషన్ వల్ల మా సంస్థకి కలిగిన నష్టం ఎంతో తెలుసా? ఐదు వేలు".
"నెలకు మూడువందల చొప్పున యిచ్చుకుంటాను" అన్నాడు కృష్ణ.
"డబ్బు సంగతి సరే- చెవులు పిండి మరీ వసూలు చేస్తాను. నా పథకం...."
"దానికేముందిసార్ - మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవచ్చు".
పరశురాముడు మరింత మండిపడి, "ఇదేమన్నా పెళ్లి నిశ్చయం అనుకున్నావా - ఒక ముహూర్తం దాటిపోతే ఇంకొకటి పెట్టుకోవటానికి. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? చెప్పవేం?" అన్నాడు.
"ఇది మనం అనుకున్నట్లు జరిగితే నేరం మొట్టమొదట రాధ మీదకే వెళుతుంది. పోలీసులు ఆమెనే నిర్బంధిస్తారు. ఆమె ఉద్యోగం పోతుంది. అందుకు".
"మాడిజం సంస్థలో ఆడి తప్పటం వుండదు. నీ పెళ్ళి ఫోటోలు పత్రికలో వేయిస్తాను".
"థాంక్స్ సార్, నాకు ఖర్చు తప్పింది."
"వ్వాట్...." అనరిచేడు పరశురాముడు.
"ఔను. రాధని ఈసారి నిజంగా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. నేను చాలా ఆలోచించాను పరశురాముడుగారూ.... ఈ దొంగ పెళ్లి అనేది యెంత కాదనుకున్నా మనసులో ఓ మూల ముల్లులా గుచ్చుకొంటూనే వుంది. మామూలు సెక్స్ సంగతి వదిలేస్తే 'స్నేహం కూడా కలవాలీ- ఆత్మీయత పంచుకోవాలీ' అంటే పెళ్ళి అనేది ఒకటే సాధనంగా కనబడుతూంది. పెళ్లి లేకుండా సెక్స్ ఏదో కాలక్షేపానికీ.... థ్రిల్ కీ సరిపోతుందే తప్ప అనుమానరహితమైన దగ్గిరతనానికి దారితీయదు. రాధతో ఇంత ముగ్ధమైన అనుభవం జరిగేక నాకు మామూలు స్నేహం సంతృప్తినివ్వటంలేదు. ఇతే నేను పశ్చాత్తాపంతో కృంగిపోతున్నానానీ- పెళ్ళి అయ్యాక ప్రవరాఖ్యుడి నయిపోతాననీ అనటంలేదు. ప్రస్తుతం మాత్రం రాధని చేసుకోకపోతే వుండలేననిపిస్తూంది. అమాయకమైన తన మొహమే మాటిమాటికీ జ్ఞాపకం వస్తూంది. మరి దాన్నే స్నేహమంటారేమో" అని ఆగేడు కృష్ణ.
చాలాసేపు పరశురాముడు మాట్లాడలేదు. తర్వాత అన్నాడు- "అంతా అయిపోయాక ఇప్పుడు ప్రేమేమిటోయ్- ఏం సుఖపడతావ్?"
"అయ్యా పరశురాముడుగారూ, ఇప్పటికే మేం నలుగురం ప్రేమ గురించి నాలుగు థియరీలు ప్రతిపాదించాం. మీరు అయిదో థియరీ చెప్పకండి. నేను నా పాట్లేవో పడతాను. ఆఖరుగా చిన్న ప్రశ్న. నేను చేసిన పనికి ప్రతిగా మాకు హాని చెయ్యరుగా?"
"మాడిజంకి వ్యక్తుల్ని గాయపర్చటంలో నమ్మకంలేదు."
"థాంక్స్ గురూగారూ!"
"మీ ఆవిడ్ని కూడా మా సంస్థలో చేర్పించు."
"కుదర్దేమో సార్! ఇంకో రెండు నెలల్లో మెటర్నిటీ లీవ్ పెడుతుంది. ఆ తర్వాత ఎలాగూ పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది."
పరశురాముడు మొదటిసారి ఆశ్చర్యపడి, "ఉద్ధండుడివే" అన్నాడు.
కృష్ణ సిగ్గుపడి "అదే కద్సార్ ఈ కథని సెంటిమెంటల్ గా ముగించింది" అన్నాడు.
* * *
ఇది జరిగిన నలుగు రోజులకి జయ రిజైన్ చేసింది.
ఆ విషయం అంతకుముందే గాలి వార్తలా తెలిసిన సారధి ఆశ్చర్యపడలేదు. కొంచెం బాధగా "ఎందుకు జయా, రిజైన్ చేయడం" అన్నాడు.
"అక్కడ జీతం ఇంకా ఎక్కువ వస్తుంది సర్" అన్నది నవ్వటానికి ప్రయత్నిస్తూ. అతడు నవ్వలేదు. తలెత్తి సూటిగా చూసేడు. ఆమె తల దించుకుంది. ఇద్దరికీ తెలుసు అసలు కారణమేమిటో.
ఆమె లేచింది.
"బెస్ట్ ఆఫ్ లక్ జయా!"
"థాంక్యూ సర్"
అతడి జీవితంలోనుంచీ వెళ్ళిపోతున్నట్టూ ఆమె బయటికి నడిచింది. అతడూ లేచి కిటికీ దగ్గరికి నడిచాడు. ఆమె నడుస్తూ వెళ్ళిపోవటం కనిపిస్తూంది. నెమ్మది నెమ్మదిగా అదృశ్యమైపోయింది. అతడు చాలా సేపు అలానే శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు.
తర్వాత రూమ్ లోంచి బయటకొచ్చేడు.
పక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్. ఆయన ఈ సంవత్సరం రిటైరైపోతాడు. రేడియోమాత్రం మోగుతూనే వుంటుంది. కొంతమంది ఆ సాధనాన్ని అపూర్వంగా తీర్చిదిద్దటం కోసం కష్టపడుతూ వుంటారు. కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూనే వుంటారు. జీవితంలోకి ప్రవేశించినట్టు అందులోకి రకరకాల వ్యక్తులు వస్తూ వుంటారు. తమ అభిప్రాయాన్ని బహిర్గతంచేసి, వెళ్ళిపోతూ వుంటారు. కామెడీలు.... ట్రాజెడీలు.... హాస్యం.... దుఃఖం.... అన్నీ....
అతడు టాక్సీ పక్కనున్న రూమ్ దగ్గిర ఆగేడు. ఎవరో కొత్త అమ్మాయి టేప్ తో కుస్తీ పడుతోంది. దగ్గిరకివెళ్ళి అడిగాడు.
"ఏం చెయ్యాలి?"
హఠాత్తుగా వెనుకనుంచి వినబడిన ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి చూసి, బెదురుగా "ఓ నాటకాన్ని డబ్ చెయ్యాలి సార్" అంది.
అతడు టేప్ ఇన్ సర్ట్ చేస్తూ, "ఏం టేప్ ఇది" అని అడిగేడు.
"కావ్య శాకుంతలం"
"నువ్వు చేసేది ఏది?"
"వరూధినీ ప్రవరాఖ్యం"
అతడు రీవైండ్ బటన్ నొక్కేడు. గతస్మృతుల్ని చెరిపేసుకోవటానికి టేప్ వెనక్కి తిరుగుతూంది. జీవితం కాదది- టేపు. సులభంగా తిరిగిపోతూంది.
* అయిపోయింది *
(21వ ఎపిసోడ్ నుంచి పెళ్ళిచూపులు అనే కథ వస్తుంది.)