Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 19

   

      మర్నాడు అనుకున్నట్లుగా సరిగ్గా పదకొండు గంటలకు హోటల్ కి వచ్చాడు భుజంగపతి.
   
    "మా వాడు పెద్ద ఇండస్ట్రయిలిస్ట్ కాదనను. కానీ మొహమాటం ఎక్కువ. ఇవాళ కాకపోయినా రేపైనా మనం చూస్తాం. అమ్మాయిని కల్సుకొని ఏకాంతంగా మాట్లాడాలని అతగాడే అంటున్నాడు చూసుకోవాల్సింది అమ్మాయి. నచ్చాడో లేదో చెప్పాల్సింది అమ్మాయి. అమ్మాయికి నచ్చితే మీకు నచ్చినట్టు కదా. ఏవంటావ్ పీతాంబరం?"
   
    "అదీ నిజమే వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు నచ్చడమే మనకు కావాల్సింది" అన్నాడు పీతాంబరం.
   
    "అయితే రేపే వాళ్ళిద్దరూ కల్సుకుంటారు" చెపి వెళ్ళిపోయాడు భుజంగపతి.
   
                                                                 *    *    *    *
   
    మయూష నవనీత్ ఫోటోని ఎన్నిసార్లు చూసుకుందో తెలీదు.
   
    ఆరోజు రాత్రి మయూష కళ్ళనిండా కలలే.
   
    నవనీత్ తను చేయి చేయి కలుపుకొని న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగడం, పొడవాటి కారులో విశాలమయిన రోడ్డు మీద ప్రయాణం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మెట్లెక్కి పైకెక్కుతున్నపుడు ఇద్దరి ఉచ్వాస, నిస్చ్వాసలూ కల్సుకోవడం.
   
    నవనీత్ అందమయిన పెదవులు తనను సున్నితంగా ముద్దు పెట్టుకొంటున్న దృశ్యం.
   
    నీకోసం నీలాంటి అపురూపమయిన సౌందర్యవతి కోసం నేను ఎన్ని జన్మలుగా తపస్సు చేసానో నయాగరా ఫాల్స్ దగ్గర గుండెల కత్తుకుంటూ అన్నాడు నవనీత్.
   
    మంచు మబ్బులు, ఒక్కసారిగా ముఖంమీద అలుముకోవడంతో ఏమీ మాట్లాడలేకపోయింది.
   
    మయూష దగ్గరయిన ఇద్దరి గుండెల మధ్య మెత్తని మంచు నీరై కరిగి జారిపోతోంది.
   
    అకస్మాత్తుగా మెలుకువ రావడంతో మయూష కల చెదిరి పోయింది.
   
    గోడ గడియారం వేపు చూసింది.
   
    అయిదున్నర మరిక నిద్రపట్టలేదు ఆమెకు. కిటికీ తెరచింది. చల్లని గాలి ముఖానికి కొట్టింది.
   
                                         *    *    *    *

   
    జూబ్లీహిల్స్ రోడ్ నెం 39లో ఓ బిల్డింగ్ ముందు ఆటో ఆగింది. అందులోంచి దిగింది మయూష.
   
    విశాలమైన రాజప్రసాదం లాంటి బిల్డింగ్.
   
    తటపటాయిస్తూ అటూ ఇటూ చూసింది మయూష. సరిగ్గా అదే సమయంలో లోన్నించి ఒక వ్యక్తి పరుగు పరుగున గేటు తెరచుకుని బయటికి వచ్చాడు.
   
    ఆ వ్యక్తి గ్రేకలర్ సూట్లో ఉన్నాడు.
   
    "వెల్ కమ్ మేడమ్. మై నేమీజ్ జార్డ్. ఎస్టేట్ మేనేజర్ని" వినయంగా పరిచయం చేసుకున్నాడతను.
   
    "మేడమ్" ఆ పిలుపుకి పులకరించిపోయింది మయూష.
   
    విశాలమైన గేటు. ఆ గేటుకి రెండు వేపులా అందమైన పూల మొక్కలు. తెల్లపాలరాతి దారి గుండా మెయిన్ డోర్ దగ్గరకెళ్ళింది మయూష.
   
    అక్కడ గ్రీన్ శిల్పంలా కనిపించిన వ్యక్తిని చూసి సిగ్గుపడి తలదించుకుందామె.
   
    నవనీత్ ను చూడగానే ఎస్టేట్ మేనేజర్ జార్జ్ పక్కకు వెళ్ళిపోయాడు.
   
    "ప్లీజ్ కమ్ మయూష. దిస్ పేరడైజ్ వెల్ కమ్స్ యూ" గంభీరంగా ఉంది నవనీత్ గొంతు.
   
    లోనికి అడుగువేసిందామె.
   
    "అర మరికలు లేకుండా మాట్లాడుకోవడానికేనా పర్సనల్ గెస్ట్ హవుస్ కు మిమ్మల్ని రప్పించింది.... మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు" నవ్వుతూ అన్నాడు నవనీత్.
   
    దృఢంగా కండలు దీరిన శరీరం చిన్న మీసకట్టు, చిక్కటి నల్లటి జుత్తు, పొడవాటి ముక్కు, తెల్లటి దేహచ్చాయ....మేన్లీ మస్క్యులర్ బాడీ.....ఎథెలిటిక్స్ మాత్రమే ఉండే బాడీ.
   
    నవనీత్ అందంగా నవ్వగలడు అని అనుకుంది మయూష.
   
    అరగంట గడిచింది.
   
    ఇద్దరూ లాన్లో కూర్చున్నారు. తనే స్వయంగా రెండు గ్లాసుల్లో జ్యూస్ ను తెచ్చి ఒక గ్లాస్ ను మయూష కిచ్చి మరొక గ్లాసును తను తీసుకున్నాడు.
   
    "మయూషా నేను మీకు నచ్చానా?" సడన్ గా నవనీత్ అలా అడుగుతాడని ఊహించని ఆమె తొట్రుపాటు పడింది.
   
    కళ్ళెత్తి ఓరగా అతనివేపు చూసింది.
   
    "ఐ లవ్ యువర్ ఐస్ అండ్ ఆల్సోయూ టూ" సన్నగా నవ్వాడు నవనీత్.
   
    తనకెవరూ లేరని చిన్నప్పుడే తల్లిపోయిందని గత ఏడాదే తండ్రి చనిపోయాడని ఒంటరి వాడినైపోయానని తను అర్జంటుగా పెళ్ళి చేసుకోడానికి కారణం అదేనని చెప్పాడు నవనీత్.
   
    మరో నలభయ్ అయిదు నిమిషాల తర్వాత-
   
    "పెళ్ళి ఆర్భాటంగా చేసుకోవటం నాకిష్టం లేదు. నా ఇష్టానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తావని నాకు తెల్సు బైదిబై నా తరుపు నుంచి ఎక్కువ మంది గెస్ట్స్ ఉండరు. అదే న్యూయార్క్ లో అయితే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు."
   
    "మీరెలాగంటే అలాగే"
   
    "ఓ.కే నేను రెండ్రోజుల్లో అమెరికా వెళతాను. పదిరోజుల్లో వచ్చేస్తాను. ఆ వెంటనే పెళ్ళి జరిగిపోతే బాగుంటుంది. పతిగారికి అన్ని విషయాలూ చెప్పాను! అవసరమయిన డబ్బు ఆయన ద్వారా పంపుతాను మీ డాడీని వర్రీ కావద్దని చెప్పు."
   
    నవనీత్ మనసు ఎలాంటిదో ఆ మాటతో అర్ధమైపోయింది మయూషకు.
   
    మెయిన్ గేట్ వరకూ మయూషతో వచ్చాడు నవనీత్.
   
    "కృష్ణా ఓబ్రాయ్ లో ఇంపార్టెంట్ బిజినెస్ కాన్ఫరెన్స్ వుంది. లేకపోతే నేనే స్వయంగా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే వాడిని" అన్నాడు ఒకింత నొచ్చుకుంటున్నట్లుగా.
   
    కొద్దిక్షణాల్లో కారు ఆమె ముందుకొచ్చి ఆగింది.
   
    "నేను ఆటోలో వెళతాను ఇవన్నీ అప్పుడే ఎందుకు?" మరేం మాట్లాడకుండా నవనీత్ వెంటనే ఆటో తెప్పించాడు.
   
    వెంటనే ఆటో అక్కడ నుంచి కదిలింది.
   
    రోడ్డుకి అటూ ఇటూ కన్పిస్తున్న బిల్డింగుల్ని ఆనందంగా చూస్తోంది మయూష.
   
    అయామ్ లక్కీ గర్ల్ అని మొదటిసారిగా సంబరంగా అనుకుందామె.
   
                                                             *    *    *    *
   
    ఆరోజు రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు తల్లితోనూ వదినతోనూ చెప్పింది మయూష.
   
    "ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడే. ఫోటోలోలాగే ఉన్నాడా?" చాదస్తంగా అడిగింది శారదాంబ.
   
    "అదేంటి అత్తగారూ అలా అడుగుతారు. ఫోతోలోలా ఉండకుండా మనుషులు మారిపోతారా?" నవ్వుతూ అన్నది మాలతి.
   
    "కలికాలం రోజులు అమ్మాయీ మీ ఆడపడుచులు ఎంతమందే" బియ్యంలో తగిలిన రాయిని విసురుతూ అంది శారదాంబ.
   
    "ఆడపడుచులూ లేరు. అప్పడాల కర్రలూ లేరు ఆయనొక్కరే వెనకా ముందూ ఎవరూ లేరు."

 Previous Page Next Page