Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 18

    ఇద్దరు అక్కయ్యలు వున్నారుగానీ వాళ్ళకు ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయాయి.

    అతన్ని చూడడానికి అత్తమ్మ వరసయ్యే దగ్గర బంధువుతో వెళ్ళింది ఊర్మిళ. అన్నీ మాట్లాడుకున్నాక తిరిగి బస్టాండ్ కి చేరుకున్నారు.

    బస్సుకోసం చూస్తుండగా  "మీతో మాట్లాడాలి" అని పిలిచినట్టనిపిస్తే పక్కకి తిరిగి చూసింది.

    ఆశ్చర్యం.... అతను వెంకటాచలం.

    "నోటమాట రాక ఏమిటన్నట్టు చూసింది.

    "రండి" అని ఆమె అత్తమ్మను అక్కడే నిలబెట్టి ఆమెను మాత్రం బస్టాండుకు దూరంగా వున్న ఓ టీ అంగడి దగ్గరికి తీసుకెళ్ళాడు.

    "కాఫీ తాగండి" అని ఆమె జవాబు కోసం చూడకుండా కాఫీలు చెప్పాడు.

    కాఫీ తాగుతూ అసలు విషయం బయటపెట్టారు. "మా ఇద్దరి అన్నయ్యలతోనూ పడడంలేదు. పెళ్ళయ్యాక నా కొచ్చిన భాగాన్ని అమ్ముకుని మీ ఊరు వచ్చేస్తాను. నా పెళ్ళాన్ని నేను సాక్కుంటాలెండి. మీకా బెంగ వద్దు" అన్నాడు చివర నవ్వుతూ.

    "అలానేలే, పెళ్ళికానీ ఆలోచిద్దాం" అంది.
 
    అంతలో బస్సువస్తే ఎక్కేసింది.

    మరో నెల రోజులకు రావూరులో పెళ్ళి జరిపించేశారు. పెళ్ళయిన వెంటనే వెంకటాచలం ఈ ఊరొచ్చేశాడు. తను, తన భార్య ఉజ్వలతో మరో ఇంట్లో కాపురం పెడతానని అతనన్నాడుగానీ, ఆమె, రఘురామయ్య ఒప్పుకోలేదు.

    "నేనూ ముసలాడ్ని  -ఎప్పుడు ప్రయాణం కట్టేస్తానో తెలియదు. ఇద్దరూ ఆఢపిల్ల లేకదా, నువ్వూ ఇక్కడే వుంటే మగదిక్కు వున్నట్టు వుంటుంది" అన్నాడు.

    అలా వెంకటాచలం అక్కడే వాళ్ళింట్లో సెటిలైపోయాడు.

    అతను తన భాగాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎకరం నేల కొనుక్కున్నాడు. మొత్తం తనే సేద్యం చేసేవాడు. ఊర్మిళ మరిదికి అన్ని విధాల సహాయపడేది. వెంకటాచలం వచ్చిన కొన్ని రోజులకే బాగా కలిసిపోయాడు. భేషజాలు లేని మనిషి కలుపుగోలుగా వుండేవాడు. భార్య ఉజ్వలతో వున్నట్టే వదిన ఊర్మిళతోకూడా అలాగే వుండేవాడు.

    ఇలా హాయిగా వుంటే అది జీవితం కాదు. మరేదో అవుతుంది. అయితే వచ్చిన సమస్య ఊర్మిళకే. ఆ రోజు రఘురామయ్య తమ్ముడి కొడుకు చలపతి పిల్లలచే దేవుళ్ళకు పెట్టారు!

    చలపతికి ఇద్దరు పిల్లలు! వాళ్ళకి తలనీలాలు తీసే కార్యక్రమం.

     ఆ తతంగం ముగిసేటప్పటికి మధ్యాహ్నం నాలుగయింది. ఆ రోజంతా భోజనాలు చలపతి ఇంట్లోనే కాబట్టి ఊర్మిళ, ఉజ్వల తీరిగ్గా కూర్చుని వున్నారు.

    ముఖ్యమైన బంధువులు తప్ప అందరూ వెళ్ళిపోయారు.

    మధ్యాహ్నం నాలుగ్గంటలకి తినడంవల్ల ఎవరికీ ఆకలిగా లేదు.

    టైమ్ ఎనిమిదయింది. పౌర్ణమికి ముందురోజు కావడంవల్ల చంద్రుడు మీగడ తేరిన పాలగిన్నెలా వున్నాడు.

    అందరూ ఇంటిముందు కూర్చున్నప్పుడు యమున తన పిల్లలను వెంటబెట్టుకొచ్చింది. ఆమె చలపతి చెల్లెలు.

    "పిల్లలు అందరూ వెన్నెల కుప్పలాట ఆడుదామంటున్నారు. మనమూ కలుద్దాం. తిన్నది అరగనైనా అరుగుతుంది" అంది యమున.

    అంతా సరేనంటే సరేనన్నారు.

    అందరూ దొంగ ఎవరో తేల్చుకోవడానికి తప్పట్లు వేశారు. చివరికి ఊర్మిళ, వెంకటాచలమే మిగిలారు వాళ్ళిద్దర్లో దొంగ ెవరో తేలాలి. తప్పట్లు వేయడానికి ఇద్దరూ ఒకరి చేతుల్లో మరొకరు తమ చేతుల్ని దూర్చారు.

    ఎప్పుడైతే చలపతి తన చేయి పట్టుకున్నాడో ఊర్మిళకు షాక్ కొట్టినట్టు ఒళ్ళు ఝల్లుమంది.

    మొదటిసారి మగవాడి స్పర్శ.

    ఇంతకాలం తను పురుషుడితో సమానమన్న భ్రమ తొలగిపోయి, మొదటిసారి తను స్త్రీ అన్న విషయం స్పురణకు వచ్చిన క్షణం. మొత్తం రక్తమంతా ఒంట్లో పిచ్చిగా పరుగులు తీస్తున్నట్లు అలజడి. ఆమెకు తెలియకుండానే మల్లెమొగ్గల చెండులావున్న ఎద మల్లెపూల చెండులా విచ్చుకుంది. పెదవులమీద తను తన వేళ్ళతో సుతారంగా రాస్తున్నట్టు సంచలనం.

    అతడ్ని చూడడం సిగ్గుగా అనిపించి ఠక్కున కళ్ళు మూసుకుంది.

    తప్పట్లు వేయడం పూర్తయింది.

 Previous Page Next Page