సారంగపాణికి అంతా విచిత్రం అనిపించింది. అతడేమీ మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మంచంమీద కూర్చొని చుట్ట కాలుస్తున్న కరణం వెంకటరావు కనిపించాడు. 'కరణంగారూ!' అన్న సారంగపాణి మాట పూర్తికాకుండానే 'ఉష్, అవతల లంబాడీలున్నారు. జర తగ్గి మాట్లాడు' అని పిలిచి మంచంమీద కూర్చోబెట్టాడు. "లంబాడీలున్నరు చూశావు-ఏం జెప్పనులే. ఇంటిమీదికి బందిపోటోలే వచ్చిపడ్డారు. బైటికెళ్తే ప్రాణాలు తీసెటట్టున్నరు. వాళ్ళమ్మల .... వాళ్ళక్కల.... వీళ్ళయ్య మా నాయన కిచ్చిండట, నూరో, ఇన్నూరో రూపాయలు భూమి ఇప్పించమని. ఆయన్నే అడుక్కోవాల్సుండె. ఏమంటావ్? వాడు చచ్చె, వీడు చచ్చే. ఇప్పుడు నాదగ్గరేమున్నది చెప్పు? నాకేదో తక్లీపొచ్చింది (కష్టం). జమీ నమ్ముకున్న నారయ్యకు. నారయ్య పైక మిచ్చిండు. అయిపోయింది. ఇప్పుడీ లంబాడీలు జమీనియ్యనంటే ప్రాణాలు తీసెటట్టున్నరు. జమీనియ్యకుంటే నారయ్య పైకమియ్యమంటడు. జమీన్ వదలమంటడు. ఎట్లచావమంటవు చెప్పు?" అని తన కథ చెప్పాడు పాణికి కరణం.
సారంగపాణికి అంతా అయోమయంగా తోచింది. మాట్లాడకుండా పాఠం చెప్పడానికిగాను, ఇంట్లోకి బయల్దేరాడు. చెయ్యిపట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు కరణం. "పంతులూ! ఇయ్యాళ్ళ పాటమొద్దు గీట మొద్దుగాని నేనున్ననని మాత్రం వాళ్ళకు ఎరికె కానియ్యకు" అని రెండు చేతులూ పట్టుకొని, "ఇగో, ఇవ్వి చేతులు కావు కాళ్ళనుకో, జర పాణం, మానం దక్కించు" అన్నాడు.
పాణికి అసహ్యంగా అనిపించింది. ఇంత పెద్ద మనిషి ఇలా అంటాడేం? వాళ్ళకు ముఖం చూపిస్తే తంతారని దాక్కుంటాడా? ఎంతకాలం దాక్కోగలడు? అనుకొని, "సరేనండి, నాకేంపని? నే వెళుతున్నా'నని వెళ్ళిపోయాడు పాణి.
అతడు కనిపించగానే లంబాడీలంతా అడిగారు ముక్తస్వరంతో : "ఏమ్రా అయ్యా! కరణం లేడా?" అని. 'గుంజుండి ఇవతలికి' అన్నదొక గొంతు. లంబాడీ భాషలో తిట్టాయి కొన్ని గొంతులు.
'బిడ్డను గుంజుండి' అన్నదొక గొంతు.
పాణి ఒళ్ళు మండిపోయింది. ఆ మాట విని కరణం బయటికి పరిగెత్తి వస్తాడనుకొని వెనక్కు చూచాడు. కరణం రాలేదు. ఉద్రిక్తులై ఉన్నారు లంబాడీలంతా. తనను తంతారేమో అనుకొని 'నాక్కనిపించలేదు' అని వెళ్ళిపోయాడు.
'నక్కుంది నక్క. ఎందరి పొట్టలు కొడతాడో! ఇంకెన్ని బంగ్లలు కడ్తడో!!' అన్నగొంతు ఒకటి వినిపిస్తే 'నక్క కాదు పందిరా, పంది' అన్నది మరొక గొంతు.
పాణి నారయ్య ఇంటికి బయలుదేరాడు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక తలుపూ తెరచిలేదు. వీధిలో తానుతప్ప ఒక్కమనిషి కనిపించలేదు. జనం తలుపుల సందులోంచి వీధిలోకి చూచి ఏవేవో గుసగుసలు చెప్పుకుంటున్నారు. పాణికిదంతా ఏమీ అర్ధంకాలేదు. నారయ్య ఇంటి ముందుకు వెళితే ఎప్పుడూ తెరచి ఉండే తలుపు మూసి ఉంది. తలుపు తట్టాడు. జవాబు రాలేదు. పిల్చాడు. సీతవచ్చి తలుపుసందులోంచి చూచింది. పంతులేననే విషయం ధ్రువపర్చుకొని గడియతీసి ఒంటితలుపు ఓరగా తీసింది. ఏదో ప్రళయం వస్తుందని బెదిరినవారిలా ఉన్నారంతా. చీమ చిటుక్కుమంటే ఉలిక్కిపడి వీధిలోకి చూస్తున్నారు. కాళ్ళకు కండువా చుట్టుకొని కూర్చున్న నారయ్య సైగచేసి పాణిని పిలిచి తన పక్కన బల్ల పీటమీద కూర్చో బెట్టుకొని మెల్లగా చెవులో చెప్పినట్లు అడిగాడు:
'కర్ణపోరింటికి పోయొచ్చిన్రా'
'వెళ్ళొచ్చా' అన్నాడు మామూలు స్వరంతో పాణి.
'గోడలకు చెవులుంటాయి. జర చిన్నగ మాట్లాడురి' అని, 'ఆడ లంబాడీ తండున్నదా?' అని అడిగాడు.
"ఉన్నది."
"వాండ్లెందుకొచ్చిన్రో ఎరికెనా?"
"లంబాడీలు చెప్పారు. కరణంకూ... ..." అని మాట మింగేశాడు పాణి.
"కరణం ఇంట్లుంన్నడన్నమాట. ఉండే లేడనిపించిండు. నా తాన రెండువేలు తీసుకున్నాడు. ఏమన్నంటే జమీన్ నీకు పట్టా కాలేదని బెదిరిస్తడు. అప్పుడు నూరు, ఇప్పుడు యాభయి, ఇంకో అయిదు నూర్లు తిన్నడు. ఇగో ఇప్పుడు, అగో అప్పుడు అంటాడు. పట్టా చేయించడు. లంబాడీ కులం బందిపోటుకులం. కరణం కండ్లపడకపోతే నా ఇంటిమీద పడతరేమోనని బుగులుగున్నది. ఎటన్న పరార్ (పారిపోవడం) అయిదమంటే ఆడదాన్ని, పిల్లల్నొదిలి ఎట్లపోదును చెప్పురి? తిక్కపుడ్తె ఊరిమీదపడి దోచుకుంటరేమో లంబాడోళ్ళని ఊరంత పాణాలు బిగబట్టుకొనినున్నది. దేవుడెట్ల రక్షిస్తడో?" అని రెండుచేతులూ ఎత్తి నమస్కరించాడు.
"డబ్బు తీసుకున్నట్లు కరణం ఏమైనా రశీదు ఇచ్చాడా?"
"రశీదు? కాట్లబూడిద. కరణాన్ని రశీదడిగి బతుకుతమా ఊళ్ళ?"
"రశీదు లేకుంటే చిక్కేనే? దొరవారితో చెబితే?"
"కరణం పగబడ్తడు, కరణం పగ పాము పగ."
పాణి ఆలోచించసాగాడు. వెంకట్రావు ఎంత దుర్మార్గుడు! భూమి ఆశచూపి ఇద్దరి దగ్గరా డబ్బు కాజేశాడు. అంతేకాక, డబ్బు తిన్నట్లు దాఖలా ఎక్కడా లేకుండా చేశాడు. అంతేకాక, అందర్నీ చేతుల్లో పెట్టుకొని నాటకం ఆడుతునాడు. రామారెడ్డిగారే నయం. తన అధికారాన్ని రక్షించుకోవడానికి చచ్చేట్లు కొడ్తాడేగాని పరుల సొత్తు అపహరించడానికి ప్రయత్నించడు. దొర అధికారానికి వణికిపోతారు జనం. కరణం కుట్రకు భయపడతారు జనం. ఇద్దరికీ భయపడుతూ బ్రతుకుతుంటారు జనం అనుకున్నాడు.
సీత అతని ముందు పాలగ్లాసు పెట్టి దూరంగా నుంచుంది.
"ఎందుకండీ ఇప్పుడు పాలు? ఇప్పుడే ఫలహారం చేసి వచ్చాను."
"తాగుండి పంతులూ, పంతులని తెచ్చింది."
పాలు తాగేసి "పాఠానికి" అంటూండగానే"ఇయ్యాళేం పాఠముండి? ఊరంతా ఉడికిపోతాంది. బతికి బాగుంటే రేపు పాఠం" అన్నాడు నారయ్య.
"సరే, అయితే వస్తా."
"ఎప్పుడేమొస్తదొ, ఈన్నె ఉండరాదురి ఇయ్యాళ?"
"నాకేం భయమండీ? ఏమన్నా పెళ్ళామా పిల్లలా నాకు?" అని లేచి నుంచున్నాడు.
కాళ్ళకు చుట్టుకున్న కండువా విప్పి బల్లదిగి "సరేగాని, జర పదిలంగా పోండ్రి" అని సాగనంపి వెంటనే తలుపేసుకున్నాడు నారయ్య.
గడీ గేట్లో అడుగు పెట్టినవాడల్లా జడుసుకొని వెనకడుగు వేశాడు పాణి.
ఆరడుగుల నల్లటి బొగ్గులాంటి మనిషి పెద్ద దుడ్డుకర్ర పట్టుకొని గేటుపక్కన నుంచొని కనిపించాడు పాణికి. బుర్రమీసాలూ, వెడల్పయిన ముఖం, కండలు తేలిన శరీరం. అతడు మదార్ సాబ్. రెడ్డిగారి రక్షక బృందానికి నాయకుడు. పాణిని చూసి సలాంచేశాడు మదార్ సాబ్. ప్రతినమస్కారం చేసి గేట్లో అడుగు పెట్టాడు పాణి. గుర్రాల కొట్టం ముందు చుట్టలు కాలుస్తూ, కర్రలు పట్టుకొని, దొంతుకూర్చున్న పదిమందీ లేచినుంచొని పాణికి నమస్కరించారు. ప్రతినమస్కారం చేసి తనగాడికి సాగిపోతున్న పాణిని ఎంకటి పిలిచాడు, "దొర పిలుస్తాండు" అని. ఎంకటి ముందునడుస్తుంటే పాణి వెనక సాగిపోయాడు. పెద్దహాలు చివర గుమ్మందగ్గరికి రాగానే అక్కడే ఉండమని ఎంకటి లోపలికి వెళ్ళాడు. ఆ తరువాత క్షణానికి మంజరి గదిలోంచి వచ్చి మెరుపులా మాయమైంది- సారంగపాణి వైపు ఒక చూపు విసరి. తాను సరిగా ఊహించాననుకున్నాడు పాణి. మంజరిది పసిడిఛాయే. బాగా పొడవైన మనిషి. ఎంత దృఢమైన శరీరం!
ఎంకటి వచ్చి పిలిచాడు. పాణి అనుసరించాడు యాంత్రికంగా. పెద్ద కమానులో ఉన్న గోడలో ఒక దర్వాజా ఉంది. ఆ తరువాత హాలుంది-చిన్నది. దానికి కుడివైపు ఒక గదీ, ఎడమవైపు ఒక గదీ, ఎదురుగా ఉన్న దర్వాజాలోంచి అవతలికి వెళ్ళేదారీ ఉన్నాయి. ఎడమచేతి వైపున్న గదిలోకి ప్రవేశపెట్టాడు పాణిని ఎంకటి.
అదీ పెద్దగదే! నేలమీద చక్కని తివాచి పరచి ఉంది. శుభ్రంగానూ, ఎత్తుగా ఉన్న గోడలకు నాలిగింటికీ నాలుగు జపాను ఆడబొమ్మలు తగిలించి ఉన్నాయి. కిటికీ పక్కగా ఒక పెద్ద ఎత్తయిన పందిరి మంచం ఉంది. దాని నాలుగు కోళ్ళపైనా నగిషీపని చేయబడి, కోళ్ళ చివర్న సింహాల ముఖాలున్నాయి. పందిరి స్తంభాల నాలిగింటిపైనా చిలకల బొమ్మలున్నాయి. మంచానికి తలవైపూ, కాళ్ళవైపూ, నిలువుటద్దాలున్నాయి. వాటికింద మంచపు ఈ చివరనుండి ఆ చివరవరకూ చిన్న చిన్న చతురపు పింగాణీరాళ్ళూ, మధ్య మధ్యన అద్దాలు ఉన్నాయి. మంచంమీద ఎత్తైన పరుపూ, తెల్లటి దుప్పటీ, రెండు కాళ్ళవైపునా, రెండు తలవైపునా నాలుగు పెద్దపెద్ద దిండ్లున్నాయి.
రెడ్డిగారు రెండు దిండ్ల నానుకొని కాళ్ళు చాచుకొని కూర్చొని ఉన్నారు. పక్కనే ఎత్తు స్టూలుమీద వనజ కూర్చొని మొక్కజొన్న గింజలు ఒలిచిపెడ్తోంది. గింజలు నోట్లో పోసుకొని, వెండిపళ్ళెంలోని వెన్న కలిపిన పచ్చిమిరపకాయల కారం వేలుతో తీసి నాలుకకు రాచుకుంటున్నారు రెడ్డిగారు. పాణిని చూచి "రా పంతులూ!" అని అక్కడే ఉన్న ఎత్తు స్టూలు చూపించారు. పాణి రెండు మెట్లెక్కి దానిమీద కూర్చున్నాడు. ఒక దాసీది వెండిపళ్ళెంలో వెన్న కలిపిన కారం తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది. వనజ ఒకసారి పాణికీ, ఒకసారి రెడ్డిగారికీ గింజలు ఒలిచిపెడ్తోంది. వనజ ముఖంలో పూర్వపు ఉత్సాహం, చిలిపితనం కనిపించలేడు పాణికి. అందుక్కారణమేమో అర్ధం కాలేదతనికి.
"పంతులూ! కరణం ఇంటికి పోయినావా?" రెడ్డిగారడిగారు.
"వెళ్ళానండీ."
"కతంత తెలిసినాది?"
"విన్నానండి"
'పాఠం చెప్పినవు కుంటిదానికి?'
'వద్దన్నారండీ.'
"ఎవ్వరు? కరణమేనా? ఇంట్ల ఉండే లేడనిపించుకుంటడ్లేవాడు!"
నసిగాడు పాణి.
'నీ చేతులు పట్టుకున్నాడేమో చెప్పొద్దని. అందితే జుట్టు పట్టుకుంటడు. లేకుంటే కాళ్ళు. ఏమనుకున్నవ్?'