రూమ్ లో కొంతడబ్బు వుంచి మిగతాది జేబులో వుంచుకుని బయట పడ్డాడు మిత్రా.
మళ్ళీ వేట....
మిత్రా భవిష్యత్తులో చేయవలసిన పధకాన్ని ఆలోచించుకొన్నాడు. అతనికి గన్ గాని, రైఫిల్ గాని ఒకటుంటే మంచిదనిపించింది. అవి ఎక్కడ దొరుకుతాయో తెలియలేదు మిత్రాకి.
రెండు మూడు షాపులు తిరిగి నైఫ్ నొకదాన్ని కొన్నాడు. పదును బాగానే వుందని పించింది.
అప్పటికి టైము దాదాపు పదకొండు కావొస్తుంది.
ఓ హోటల్ కి లైట్ గా భోజనం చేసి బయలుదేరాడు. మరోగంట సేపు సినిమాహాళ్ళ దగ్గరినుంచి పార్కుల వరకూ గాలించాడు.
ఈ విషయములో ఎవరైనా సహాయం తీసుకుంటే బావుణ్ననిపించింది.
ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా, మొత్తం కథ అంతా చెప్పాలి- కథంతా విని నవ్వుతారు. తిడతారు కూడా. ఈ ఆలోచన మంచిదికాదని వెనక్కి తీస్తారు. అదే తన కిష్టము లేదు. తనొక నిర్ణయానికి వస్తే దాన్ని యెవరూ ఆపలేరు. ఈ విషయములో ఇంకొకళ్ళ సహాయం కోరుకోవడం ప్రమాదకరం. అందుకే ఎంత కష్టమైనా ఎంత ప్రమాదం ఎదురైనా తానే స్వయంగా తానే స్వయంగా నిర్ణయాన్ని మానుకొన్నాడు మిత్రా.
ఈ నిర్ణయం తరువాత అతనికి కొండంత ఉత్సాహం ప్రవేశించింది. అతనిలో వివిధ ఆలోచనలు... ఏదయినా కారణంవల్ల అతను 2 గంటలకి... అతన్ని కలిసే మార్గం...
ఈ లోపుగా అతనిని కలిసే ప్రయత్నం చెయ్యటం మంచిది... అప్పుడే ఫ్లాష్ లాంటి ఐడియా వెలిగింది. అసలావ్యక్తి ఇక్కడుండే వ్యక్తిలా కనిపించలేదు. అతను బహుశా ఏదైనా హోటల్ లో స్టే చేసి ఉండి ఉంటాడు. ఇంతవరకూ ఈ ఆలోచన తట్టనందుకు తనని తానే తిట్టుకున్నాడు మిత్రా.
టైము రెండు అవటానికి రెండు గంటలు మాత్రం వుంది.
ఈలోపు అతనుండేది ఎక్కడో తెలిస్తే సమస్య సులభం అవుతుంది. అతని పేరు తెలిస్తే బాగుండేది అనుకొని దగ్గరలో వున్న ఓ రెండు హోటల్స్ లో అతని ఉనికి కోసం ప్రయత్నించాడు. ఆ రెయిన్ కోటు వ్యక్తి పేరు తెలియకపోవటం వలన అతనికి చాలా సమస్యలు ఎదురయ్యాయి.
ఒక హోటల్స్ లో పేరు చెప్పకుండా గుర్తులు చెప్పటం వలన అనుమానంగా చూశారు. మరికొందరు ఎదురు ప్రశ్నించారు.
అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తావు అతనిలో నీకేం పని.
పేరు, ఊరు తెలియకుండా వ్యక్తి ఆచూకి తెలుసుకోవటం ఎంత కష్టమో అర్ధం అయింది మిత్రాకి.
అతడి యడ్రస్ తెలుసుకోవటానికి ఇంత కష్టపడవలసి వస్తుందంటే. అతడ్ని చంపటానికి ఇంకెంత కష్టపడవలసి వస్తుందో ననిపించింది మిత్రాకి.
ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత అనుమానంగా చూసినా మిత్రా ప్రయత్నాన్ని మానలేదు.
అలా మధ్యాహ్నం రెండింటి వరకు వెతుకుతూనే ఉన్నాడు మిత్రా.
అజ్ఞాత వ్యక్తి చెప్పి వస్తానని చెప్పిన టైమ్ కి ఇంకా గంట వుండటంతో అతను వస్తానన్న పాన్ షాప్ కి బయలుదేరాడు. ఆ షాప్ కి వెళ్ళాలంటే యూనివర్శిటి మీదగానే వెళ్ళాలి.
మిత్రాకి అటుగా వెళ్తుంటే ఓసారి రమేష్ కి కనిపించి వెళితే బావుణ్ననిపించింది. రమేష్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అతని దగ్గిర ఎప్పుడో డమ్మీ రివాల్వర్ ఒకటి చూసినట్లు గుర్తుకి రావటంతో కనీసం ఎవరినైనా బెదిరించడానికైనా ఉపయోగపడుతుందనిపించి బండిని రమేష్ వుండే హాస్టల్ దగ్గర ఆపాడు మిత్రా.
మిత్రా రమేష్ రూమ్ దగ్గరకెళ్ళి అతనక్కడ కనపడక పోవటంతో రమేష్ రూమ్మేట్ ని అడిగాడు.
"బయటికి చాయ్ తాగటానికి వెళ్లారు.
కూర్చోండి వచ్చేస్తాడు." చెప్పాడు రూమ్మేట్.
దాదాపు పది నిమిషాల వరకు చూశాడు మిత్రా.
రమేష్ రాకపోవటంతో అతనే బయలుదేరాడు, రమేష్ ని కలవటం కోసం.
హాస్టల్ కి కొంచెం దూరంలో వుంది ఓ ఇరాని హోటల్. మిత్రా తలవంచుకుని అటుగా నడుస్తున్నాడు.
ఏ వ్యక్తి కోసం మిత్రా వెతుకుతున్నాడో ఆ వ్యక్తి అతని ముందు నడుచుకుంటు వెళ్ళిపోతున్నాడు.
మిత్రా అతన్ని గమనించేసరికి చాలా దూరంలో కనిపించాడా వ్యక్తి.
ఆ వ్యక్తి నడకని బట్టి గుర్తు పట్టాడు మిత్రా. పర్శనాలిటి కూడా అదే కావటంతో ఆలస్యం చేయకుండా పరుగు పెట్టాడు అతని కోసం.