Previous Page Next Page 
వెలుగుబాట పేజి 18


    "దోషులను ఇలా వదిలేస్తావా? ఇదేనా  నీ మంచి తనం? ఇలాంటి చీడపురుగులవల్ల సంఘానికెంత నష్టం కలుగుతుందో ఆలోచించావా?"
    "నిజమే! కాని ఆ చీడపురుగు ఎవరో  ఆలోచించావా? ఇక్కడ అసలయిన చీడపురుగు కెన్నెడీ బాబు. అతడి మద్దతు లేకుండా, ఇతడిందుకు సాహసించేవాడుకాదు.
    "అందుకే, రిసోర్టిస్తే చీడపురుగులన్నీ నశిస్తాయి" "ఇంపాసిబుల్! ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. తెలుసా! "సీజర్స్ వైఫ్ ఈజ్  ఎబేషష్పియస్" అని, అలాగే కెనెడీ బాబు లాంటి వాళ్ళు  నేరారోపణకు అతీతులు. అలాంటి వాళ్ళను విచారణ జరిపించకుండానే  వదిలేస్తారు, ఎటొచ్చీ సామాస్యుడయిన ఈ కాంపౌండర్ ని డిస్మిస్ చేస్తారు."
    అందరూ వింతగా  వింటున్నారు.ఝన్సీ కొంచెం చికాకుతో "ఇంతకూ ఏమంటావు?" అంది.
    ఝాన్సీతో ఏమీ  అనకుండా కంపౌండర్ తో "నీ ఇంటి పరిస్థితులు బాగుండకపోవచ్చు. నీ పరిస్థితులేకాదు ఈ దేశంలో నూటికి డెభైఅయిదుమంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నీ పరిస్థితులు బాగుచేసుకునేందుకు ఇదికాదు మార్గం. కెన్నెడీ బాబులూ, బోసుబాబులూ ఎలాగూ మనను దోచుకుంటూనే వున్నారు. వాళ్ళను మనమంతా కలిసికట్టుగా ఎదిరించవలసిందిపోయి, మనసు మనమే దోచుకోవటం ఎంత నీచం?" అన్నాడు. నిర్ఘాంతపోయి వింటున్న ఝాన్సీతో "డాక్టర్ ప్లీజ్ సేవ్ మై ఆనర్. అతడికి ఏ ఆపదా రానీయనని నేను మాటయిచ్చాను. నా మీద నమ్మకంతో రహస్యాలన్నీ చెప్పేసాడు. జరిగింది మరిచిపోండి. మన కంపౌండర్ ఇకముందు ఇలాంటివి చేయడని నేను మాట ఇస్తున్నాను. కాంపౌండర్ నా మాట నిలబెడతారుకదా?" అన్నాడు.
    కాంపౌండర్  తన మాటల్లో తన భావోద్వేగాన్ని వ్యక్తం చేయలేక, చెమ్మగిల్లిన తన కళ్ళకు కుమార్ చేతులద్దు కున్నాడు. కుమార్ ఆ చేతులు విడిపించుకుని, అతడి భుజం తట్టి వెళ్ళిపోయాడు. అక్కడి అందరి చూపులూ అతడి ననుసరించాయి ఒక విధమయిన ప్రశంసతో.
    ఆ సాయంత్రం ఇంటిదగ్గర ఝాన్సీ కుమార్ తో "కాంపౌండర్ నేరం నిరూపిస్తే నువ్వు నిర్దోషివని రుజువయ్యేది కదా నీ ఉద్యోగం నీకు దక్కేదికదా? " అంది.
    "నేను నిర్దోషినని రుజువు కావాలసింది ఎవరికి? గ్రామస్తులందరికీ ఆ విషయం తెలుసు. ఇక ఆ ఉద్యోగం నువ్వు చేస్తే ఒకటా, నేనుచేస్తే ఒకటీనా?......
    కాంపౌండర్ లాగ తనూ కుమార్ చేతులు కళ్ళకద్దుకో లేక పోయినందుకు సిగ్గుపడి ఝాన్సీ.


                                                       *    *    *


    మబ్బులేని పిడుగుల్లా వచ్చారు ఝాన్సీ తల్లీ, ఝాన్సీ అక్కా. కంగారుపడిపోయింది, ఝాన్సీ "రండి రండి" అని ఆహ్వానించింది పాలిపోయిన ముఖంతో, పొడినవ్వుతో.
    "ఈ నెలంతా నీ దగ్గరనుంచి ఉత్తరమే లేదు. ఎలా వున్నావోనని బెంగ పెట్టుకుని  వచ్చేసాం" అంది తల్లి, ఝాన్సీ చెక్కిళ్ళు ఆప్యాయంగా నిమురుతూ.
    అసలు సంగతి అదికాదు. ఝాన్సీ ఆ నెల జీతం పంపలేదు. ఇబ్బందులలో ఉన్నానని, తర్వాత పంపుతానని ఉత్తరం వ్రాసిపడేసింది. ఆమె ఇక్కడ ఏ దుబారాలు చేస్తుందోనని తల్లికి గాభరాపుట్టింది. అంతేకాదు డబ్బు అవసరంకూడా ఉండి కూతుర్ని తీసుకుని బయలుదేరి వచ్చేసింది.
    "తల్లి చేతులు తొలగిస్తూ "బాగానే ఉన్నాను" అంది ఝాన్సి. లోపలి రాగానే శాంతమ్మ, ఆమె భర్త ఎదురయ్యారు. ఒకరి నొకరు చూసుకుంటూ నిలిచిపోయారు ఇభాయపక్షాలూ కుమార్ తండ్రి పిచ్చిగా నవ్వాడు. శరీరం జలదరించింది ఝాన్సీ తల్లికి.
    "వీళ్ళంతా ఎవరే?" అంది ఆరాగా.....
    "నాతో పనిచేసే డాక్టరుగారి తల్లిదండ్రులు"
    "అయితే, ఇక్కడెందుకున్నారు?"
    "మేమంతా కలిసి ఉంటున్నాం."
    "హవ్వ ఇదెక్కడి విడ్డూరమే! నేనెంత చదువుకోని దాన్నయినా అంత చవటనుచేసి మాట్లాడకే. హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లంతా ఒకింట్లో కలిసి ఉంటారుటే! అతడు కూడా ఇక్కడే ఉంటున్నాడా?"
    "ఆఁ"
    "ఆఁ! ఝాన్సీ ఇదేం విడ్డూరమే? పెళ్ళికావలసిన పిల్లవి, ఇలా ఉంటే పరువు ప్రతిష్ఠలేం కావాలే?"
    "అమ్మా! పెంచి పెద్దదాన్ని చేసినంత మాత్రాన నా శీలానికి నువ్వు సంరక్షురాలివన్నట్లు మాట్లాడకు- ఏమి చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, నేను నిర్ణయించుకోగలను."
    "ఆఁ ఎంతెంత మాటలంటున్నావే? పసిగుడ్డువి. ఈ లోకం సంగతి నీకేం తెలుసే? ఎన్ని ఢక్కా మొక్కీలు తిని మిమ్మల్ని పెంచానో, ఎప్పుడైనా ఆలోచించావా?"

 Previous Page Next Page