Previous Page Next Page 
వెలుగుబాట పేజి 17


    
    "ఊరికే వాగకు! పోరా అవతలికి ఫో, కుమార్ మెడ మీద చెయ్యివెయ్యబోయాడు.
    కుమార్ చర్రున అతడిని ఎదుర్కొని 'ఆగండి! నా వంటిమీద చెయ్యివెయ్యటం మీ వంటికి మంచిదికాదు. సరళ రమ్మని పిలిస్తే కాదనలేక వచ్చాను." అని అతడి చేతిని వెనక్కు పెట్టేసి, ఆ ఇంట్లోంచి వచ్చేసాడు.
    మూడువేలతో అతి తక్కువ స్థాయిలో ప్రారంభించిన అతడి ప్రాక్టీస్ రోజు రోజుకీ పుంజుకుంటూంది. అందుకు ప్రధాన కారణం తరతమభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితోను స్నేహితుడిలా కలిసిపోగలిగే అతడి నిర్మల ప్రవృత్తి కొద్ది రోజులోనే పనిఉన్నా, లేకపోయినా అతడి రాకకోసం ఎదురుచూసే దశలోకి వచ్చేసారు గ్రామీణులు.
    ఆరోజు నర్స్ మేరీ, అతడి ఆస్పత్రిగదికి వచ్చి "డాక్టర్! మిమ్మల్ని ఝాన్సీ డాక్టర్ అర్జంట్ గా గవర్నమెంట్ ఆస్పత్రికి రమ్మంటున్నారు" అని చెప్పింది. ఏదయినా కష్టమైన ఆపరేషన్ కేసు వచ్చిందేమోనని తను చూడవలసిన కొద్దిమంది రోగులను సాయంత్రం రమ్మని, గవర్నమెంట్  ఆస్పత్రికి వెళ్ళారు కుమార్. అక్కడ ఝాన్సీ  తాన్ సీట్ లో కోపంగా కూచొనివుంది, చుట్టూ రోగులున్నారు. వాళ్ళమధ్య దోషిలా తలదించుకుని నిలబడి ఉన్నాడు కాంపౌండర్.
    కుమార్ రాగానే ఝాన్సీ "చూశారా ఈ దుర్మార్గుడు చేస్తున్నపని, ఆస్పత్రిలో గవర్నమెంట్ వారు సప్లయి చేసిన మందులు రహస్యంగా అమ్ముకుంటున్నాడు. ఇదివరకూ ఇలాగే చేసివుంటాడు. నేరం మీ మీదకు వచ్చింది. మీరు అందర్నీ నమ్మే అమాయకులు గనుక కనిపెట్ట లేకపోయారు. నాకు వీడిమీద అనుమానం ఎప్పటినుంచో ఉంది, ఇవాళ దొరికిపోయాడు" అంది.
    ఆస్పత్రిలో మందులు మాయమవుతున్నాయనే అనుమానం చాలారోజుల క్రిందటే వచ్చింది ఝాన్సీకి. గవర్నమెంట్  ఆస్పత్రికి తాళం వెయ్యటానికి వీల్లేదు. మధ్యాహ్నం, ఝాన్సీ  భోజనానికి వెళ్ళినప్పుడు నర్స్ ఉండేది. రాత్రి కంపౌండర్ ఉండేవాడు. ఇటీవల ఝాన్సీ ఆలోచించి ఆ ఏర్పాటు మార్చి, రాత్రివేళ నర్స్ ని ఉండమని పగటి వేళలోనే కాంపౌండర్ ని, నియమించింది. ఇందువల్ల కొన్నాళ్ళు మందులు మాయమవటం ఆగింది. కానీ మళ్ళీ మొదలయింది. ఝాన్సీ ఆలోచించి, ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. లంచ్ కి ఇంటికి వెళ్ళినట్లే వెళ్ళి మేరీతో  సహా కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చింది. లోపలికి వెళ్ళకుండా, ఇద్దరూ కంపౌండ్ వాల్ దగ్గర నిలబడ్డారు. మరోవ్యక్తి సాయంతో ఆస్పత్రిలో మందులు బయటకు చేరవేస్తున్న కంపౌండర్ ని  తప్పించుకు వీల్లేకుండా "రెడ్ హేండెడ్" గా పట్టుకున్నారు. ఝాన్సీ గట్టిగా అరిచేసరికి చుట్టుపక్కలవాళ్ళు పోగయ్యారు. ఆ మరొ వ్యక్తినికూడా పట్టుకున్నారు.
    "ఇతడిమీద రిపోర్టు ఇద్దాం సార్! మీరు నిర్దోషి అని తేలిపోతుంది. వీడు డిస్మిస్ అవుతాడు" అంది మేరీ అసహ్యంగా చూస్తూ.
    కుమార్ కాంపౌండర్ దగ్గరకువచ్చి అతడి భుజంమీద చెయ్యివేసి "వెంకట్రావ్ ఎందుకిలాంటి పనిచేసావ్?" అన్నాడు. అప్పటివరకూ ఆ అభాగ్యుడు దుఃఖం నిగ్రహించుకుంటున్నాడు. స్నేహ పూర్వకమైన ఆ పలకరింపుతో అతడి కళ్ళలోంచి కన్నీరు ప్రవహించింది.
    "కుమార్ బాబూ గడ్డితిన్నాను. ఇది పాడుపనని తెలుసుబాబూ, ఏం చెయ్యను? పెద్ద కుటుంబం, నా జీతం ఏ మూలకొస్తుంది? పెద్ద పెద్ద ఉద్యోగులకు పైసంపాదనలుంటాయి. కాని, నాకేం దొరుకుతుంది? అందుకని కక్కుర్తిపడ్డాను?"
    "అది సరే! ఈ ఊళ్లో నీ దగ్గర ఈ మందులెవరు కొంటారు? డాక్టరుకి తప్ప వీటి ఉపయోగం తెలియదు కదా?"
    వెంకట్రావ్ నీళ్ళు నమిలాడు.
    "నిజం చెపితే, అది నిజమని నేను నమ్మగలిగితే, నీ ఉద్యోగం పోకుండా చూస్తాను" కుమార్ మాటల్లో వెంకట్రావుకి నమ్మకం ఉంది. అతని మంచితనమూ అనుభవించాడువెంటనే కక్కేసాడు.
    "కెన్నెడీబాబుకి టౌన్ కి మందులషావుంది డాక్టరు బాబూ. నా దగ్గర ఈ మందులన్నీ చవగ్గా కొని తన షాపులో పెట్టుకుంటాడు. "నీకేం ఫరవాలేదు అన్నింటికీ నేనున్నాను" అన్నాడు. ఆ ధైర్యంతోనే ఈ ఛండాలపు పనిచేస్తున్నాను. అప్పుడు మీరు డిస్మిస్ అయినప్పుడు నేనెంత కుమిలిపోయానో మీకు తెలీదు. ఏదో నాలుగు డబ్బులు వస్తున్నాయనుకొన్నానే కాని, అది మీ ఉద్యోగం పోగొడుతుందని అనుకోలేదు" ఏడ్చినంత పనిచేశాడు. కంపౌండర్ మీద ఝాన్సీకి జాలికలగలేదు-కర్కషంగా "ఓహొ ఇదేకాబోలు పశ్చాత్తాపం! ఇప్పుడు నా ఉద్యోగం పోయినా పాపం మళ్ళీ కుమిలిపోతావు. కుమార్ ఇతడిమీద రిపోర్టు వ్రాస్తాను. మళ్ళీ నీ ఉద్యోగం నీ కొస్తుంది" అంది.
    "నో ఝాన్సీ నిజం చెబితే అతడిమీదకు ఏమీ రానియ్యనని మాటఇచ్చాను. నా మాట నువ్వు నిలబెట్టాలి" అన్నాడు కుమార్ మాటలకు అందరూ విభ్రాంతులయ్యారు. ఝాన్సీకి పట్టరానికోపం వచ్చింది.

 Previous Page Next Page