కాసేపు అక్కడే తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇల్లు చూడగానే మళ్ళీ చలపతిలో భయం ప్రవేశించింది. ఈ ఇంటికీ తనకూ బంధం ఎన్నాళ్ళు! మహా అయితే అయిదురోజులు.
ఆ తరువాత? నమ్మకం లేదు. తన ఇల్లు మారిపోతుంది. తను ఒక్కడే వేరే వుంటాడు. ఎవ్వరికీ సంబంధం లేకుండా! అదే శ్మశానం. మరి సావిత్రి సంగతేమిటి?
సావిత్రి......సావిత్రి..........సావిత్రి............ దేముడా! ఇంత బుద్ది తక్కువపని చేశావేమిటి ? నన్ను సావిత్రితో కలుపక ముందే తీసుకుపొతే ఇవాళ నాకింత బాధ ఉండేది కాదే.
"కాసేపు నిద్రపోకూడదూ?" అనునయంగా అడిగింది సావిత్రి.
"ఊహు! నిద్రపోను! నిన్ను చూస్తూ కుర్చుంటాను.! ఆ తర్వాత ఒకవేళ నా నిద్ర శాస్వతమాయిపొతే. కనీసం ముందయినా నిన్ను చూస్తూ ఎక్కువ కాలం గడిపానన్న సంతృప్తి ఉంటుంది."
సావిత్రీ కన్నీరు పెట్టుకుంది. మంచం మీదకు ఒరిగి పోయి వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది.
ఛీ! తను వట్టి ఇడియట్! ఆ పిల్లను మరీ బెదరగొట్టేస్తున్నాడు, క్షోభ పెట్టేస్తున్నాడు . తప్పు కదూ?
తప్పా? తప్పేముంది?
ఆ 'రోజు' ని ఎదుర్కోటానికి సావితి కి తగిన ఆత్మస్థయిర్యం ఇస్తున్నాడు. ముందు నుంచే ఆ ఆలోచనకి తట్టుకునేట్లు చేస్తున్నాడు. నిజంగానే తను పోయినా సావిత్రి పూర్తిగా అప్ సెట్ అయిపోకూడదు. మరి అంత ధైర్యం కావాలంటే సావిత్రికి ఇలాంటి మాటలే చెప్పాలి! ఆమెని ఆ మాటలు వినడానికి 'సిద్దం' చేయాలి!
"సావిత్రీ! ఏడవకు!" ఆమెను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు చలపతి.
సావిత్రి అతని భుజం మీద వాలి మరింతగా దుఃఖించసాగింది. సావిత్రి ఎలాంటి దుఃఖాన్నయినా మరిచిపోగలిగేది తన గుండెలను అనుకొనే!
కాని ఇప్పుడు తనే దూరమయిపోతున్నాడు. ఆమె అనుకొని సంతృప్తిగా కళ్ళు మూసుకునే తన ఎద పిడికెడు బూడిదయిపోతుంది.
"నాన్సెన్స్!" గట్టిగా అరిచాడు చలపతి.
సావిత్రి ఖంగారుగా అతని వంక చూసింది. "ఏమిటండీ? ఏమయింది?"
చలపతి ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. "ఏమి లేదు! ఏదో గుర్తుకొచ్చింది! అంతే...." సర్దుకొంటూ జవాబిచ్చాడు.
"కాసేపు నిద్రపోకూడదూ?"
చలపతి కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు.
నిద్రలో కల. సావిత్రి ఏడుస్తోంది. బిగ్గరగా, గుండెలు పగిలేట్టు అందరూ ఆమెకు దూరంగా పారిపోతున్నారు. చీకట్లు కమ్ముకొస్తున్నాయ్! సావిత్రి ఏడుస్తూనే వుంది. హటాత్తుగా ఓ మూల నుంచి ఎవరో వచ్చారు. అతన్ని చూసి పరుగుతో వెళ్ళి అతని గుండెల మీద వాలిపోయింది సావిత్రి. అతను సావిత్రిని బుజ్జగిస్తున్నాడు. ధైర్యం చెపుతున్నాడు. అతన్ని గుర్తించాడు చలపతి! అతను శ్రీకాంత్.
ఎవరో తట్టిలేపుతున్నట్లయి త్రుళ్ళిపడి నిద్రలేచాడతను. ఎదురుగా శ్రీకాంత్. నుంచుని సావిత్రి, నర్సరాజు వున్నారు.
"ఏమిటి కలవరిస్తున్నావ్?" అడిగాడు శ్రీకాంత్.
"కలవరించానా?"
"అవును!"
"ఏమని?"
"ఏమో ! అది అడుగుదామనే లేపాము."
తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు చలపతి.
"పద అలా గార్డెన్ లో కూర్చుందాం "బలవంతంగా తోటలోకి లాక్కెళ్ళారు శ్రీకాంత్. ముగ్గురూ అక్కడ కూర్చుని టీ తాగారు.
* * *
తన కుర్చీ పక్కనే ఏపుగా ఎదుగుతున్న గులాబీ మొక్కను చూసాడు చలపతి. సరిగ్గా అయిదు పూలున్నాయ్. దానికి. తన అయిష్ష్ కూడా అయిదు రోజులే!
సావిత్రికి రోజుకో పువ్వు కోసి తలలో పెట్టగలడు తను. అయిదు రోజులు అలా చేస్తే తన జీవితాంతం సావిత్రికి పూలు కొనిపెట్టి నట్లు అవుతుంది.
నవ్వువచ్చింది చలపతికి.
అంతలోనే మధ్యాహ్నం కల గుర్తు కొచ్చింది . అవును! అలాంటి కల వచ్చిందేమిటి? సావిత్రి శ్రీకాంత్ గుండెల మీద ఎందుకు వాలిపోయింది!
"ఏమో ! కలమిటో సరిగా గుర్తులేదు తనకి. కాని అందులో తనని కదిల్చి అంశం ఒక్కటే......."
సావిత్రిని శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటే ఎలా వుంటుంది?
తనకి ప్రాణ స్నేహితుడు మంచి మనిషి! లక్షల ఆస్తి వున్నవాడు. ఆస్తికి తగ్గ హోదా! అలాంటి వాడు చేసుకుంటే సావిత్రికి రక్షణ వుంటుంది. ఇద్దరూ ఒకరినొకరు తెలుసు. అర్ధం చేసుకొన్నవాడు! అతనికి తనంటే ఎంత అభిమానమో సావిత్రి అన్నా కూడా అంతే అభిమానం ముంది.
శ్రీకాంత్ అయితేనే ఆమెని తనంటే బాగా చూసుకోగలడు.
కాని .......కాని.....ఇందుకు సావిత్రి ఒప్పుకుంటుందా?
ఊహు! కంఠంలో ప్రాణం వుండగా వప్పుకోదు. తను లేకపోయిన తర్వాత ఇంక ప్రపంచంతోనే పనిలేదంటుంది. ఆత్మహత్య చేసుకొన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అంచేత తను ముందే నచ్చజేప్పాలి. శ్రీకాంత్ ని పెళ్ళాడితే గాని తనకు మానసికంగా తృప్తిగా ఉండదనీ, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఆపరేషన్ కెళ్ళాల్సి వస్తుందనీ బెదిరించాలి. అప్పుడు గాని మాట వినదు!
మరి, శ్రీకాంత్ సంగతేమిటి?
సావిత్రి నంటే ఎలాగోలా వప్పించవచ్చు! అతనిని వప్పించడం తనకి సాధ్యమవుతుందా అదీ గాక ఓసారి శ్రీకాంత్ చెప్పిన విషయం తనకు బాగా గుర్తుంది అతను ప్రేమించిన అమ్మాయి కొంతవరకూ సావిత్రిని పోలి వుంటుందట! మరి అతని మీద సెంటిమెంట్ కొంతవరకూ పని చేయదూ? అతనిని ఆ ఆలోచన కొంత ముందుకి నడిపించదూ?
అతను వప్పుకోవాలేగాని, తనకి ఇంక కావాల్సిందేమీ వుండదు. సావిత్రి వంక చూసి భవిష్యత్తు కోసం క్షోభిస్తూ ఆపరేషన్ థియేటర్ లో వెళ్ళాల్సిన పరిస్థితి తనకుండదు. ఒకవేళ కన్ను మూసినా నిశ్చింతగా , చిరునవ్వుతో మూస్తాడు.
'ఒకవేళ ' ఏమిటి? తను చనిపోవడమే ఖాయం! శ్రీకాంత్ కీ, సావిత్రీకి తెలీదు. తను వాళ్ళిద్దరకూ తెలీకుండా అలా తిరిగొస్తానని చెప్పి ఓ డాక్టర్ దగ్గర కెళ్ళి ఆపరేషన్ గురించి అంతా తెలుసుకొని వచ్చాడు. దానంత ప్రమాదకరమయినది మరొకటి లేదుట! ఇంకా దానికంటే కాన్సర్ నయం. చావడానికి చాలా టైము పడుతుంది.
"ఏమిట్రా, మళ్ళీ పరధ్యానంలో పడ్డావ్?" పలుకరించాడు శ్రీకాంత్.
"ఏముంది - మామూలే" నవ్వుతూ అన్నాడు చలపతి.
"గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్స్ ని కూడా కలుసుకొన్నా ఇవాళ! వాళ్ళు అదే చెప్పారు. ఇదేమి క్లిష్టమయిన ఆపరేషన్ కాదట!"
చలపతి మాట్లాడలేదు.
ఇవన్నీ తనకు భయం పోగొట్టడానికి చెపుతున్న కబుర్లు! అసలు సంగతి తనకూ తెలుసు, వాళ్ళకూ తెలుసు. \సావిత్రి లేచి ఇంట్లోకి వెళ్ళింది. ఏవేవో ఆఫీసు విషయాలు మాట్లాడుతున్నాడు శ్రీకాంత్.
"శ్రీకాంత్ !" నెమ్మదిగా పిలిచాడు చలపతి.
మాట్లాడుతున్నవాడిల్లా టక్కున ఆగిపోయాడు శ్రీకాంత్.
"ఏమిట్రా?"