"ఈ రెండురోజులూ నేను విపరీతంగా ఆలోచించిన విషమేమిటో తెలుసా?"
"ఆపరేషన్ గురించే అలోచించి వుంటావ్?"
"కాదు! సావిత్రి గురించి!"
"ఎందుకు?"
"నాకెందుకో ఇంటికి తిరిగోస్తానని నమ్మకం లేదు......"
"అలంటి ......." ఆడ్డుపడబోయాడు శ్రీకాంత్.
కానీ చలపతి వినిపించుకోలేదు. "నేను చెప్పేది విను. నీ నమ్మకం నీకు ఉన్నట్లే నా నమ్మకం నాకు ఉంటుంది కదా? అంచేత నా నమ్మకం అది. ఆ పరిస్థితిల్లో సావిత్రి గతేమిటి? ఇది నన్ను కలచి వేస్తున్న సమస్య. ఎంత ఆలోచించినా నాకేమీ పరిష్కారం దొరకలేదు ఇవాల్టీ వరకూ.
"అది కూడా పెద్ద సమస్యగా చిత్రించుకొని నిన్ను నువ్వు బాధించుకొంటున్నావ్! అంతే" కోపంగా అన్నాడు శ్రీకాంత్.
"కాదురా శ్రీకాంత్! ఉన్నదున్నట్టుగానే చూస్తున్నాను....."
"ఎవ్వరి గురించి నువ్వెలాంటి బాధా పెట్టుకొనవసరం లేదు. న మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు?" నిష్టురంగా అన్నాడతను.
"నీమీద నాకు నమ్మకంలేక కాదురా! సావిత్రి మీద నమ్మకం లేక. నేను పోయిన మరుక్షణంమే ఏ ఆత్మహత్యో చేసుకుంటుంది నాకు తెలుసు. దాని విషయం.........."
శ్రీకాంత్ కి ఏం మాట్లాడాలో తోచలేదు.
"అదీ కాకపోయినా సావిత్రి నీ దగ్గర ఎంతకాలం పెట్టుకుంటావ్? నీకూ పెళ్ళి కాలేదు. అటు సావిత్రి వయసులో ఉంది. చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎమనుకొంటారు! సరే, కొన్నాళ్ళ కయిన నీకు వివాహం మవుతుందనుకొందాం. నీకొచ్చే భార్య కూడా సావిత్రిని ఆదరించగలదన్న నమ్మకమేమిటి? ఎన్నో గొడవలోస్తాయ్.... అందుకని నేనే ఓ ఆలోచన చేశాను....."
"ఏమిటది?" అడిగాడు శ్రీకాంత్.
"ముందు నువ్వు నాకో మాటివ్వాలి. నేనేమి అడిగినా కాదననని! అప్పుడే చెప్తాను!"
"అంటే నీ మాట కాదని నేనన్నానా ఎప్పుడయినా?"
"అదివరకటి సంగతి వేరు! ఇప్పటి సంగతి వేరు. అది వరకు నీ మాట మీద నిలబడ్డావా లేదా , అని నేను చూస్తుండేవాడిని! ఇప్పుడలా చూడ్డానికి నేనుండను. తేడా లేదూ?"
కొద్దిక్షణాలు భారంగా గడిచినాయ్.
"సరే చెప్పు! నువ్వేం అడిగినా చేస్తాను! సరేనా?"
"సావిత్రిని నువ్వు పెళ్ళి చేసుకోవాలి!"
అదిరిపడ్డాడు శ్రీకాంత్ "నీకు పూర్తిగా మతిపోయింది!" అన్నాడు కోపంగా.
'అలాగే అనుకో పోనీ!" తాపీగా అన్నాడు చలపతి. "ఇది ఓ మతిలేని స్నేహితుని కోరిక అనుకోని ఆ కోరిక నెరవేర్చు!"
"కాని......చలపతీ - కోరికలు కోరడంలో కూడా న్యాయం ఉండాలి!"
"ఉందనే నేననుకుంటున్నాను. సావిత్రి నీకు తగిన భార్య అవుతుంది. ఆమె గురించి నీకు, నీ గురించి ఆమెకూ తెలుసు దానికి నేనంటే ఎంత అభిమానముందో , నా ప్రాణ స్నేహితునిగా నిన్ను అలాగే అభిమానిస్తోంది. పోనీ నీ పాత ప్రియురాలిని సావిత్రి లో చూసుకోలేవూ? ఆమెకూ సావిత్రికి కొంత పోలిక ఉందని ఆరోజన్నావ్ గుర్తుందా?"
శ్రీకాంత్ భరించలేక లేచి నిలబడ్డాడు "నువ్ చాలా క్రూరుడివి రా చలపతి! నువ్వు ఇంత క్రూరంగా మాట్లాడగలవన్న సంగతి నాకిప్పుడే తెలిసింది......."
"స్వార్ధం రా బ్రదర్! నా స్వార్ధమే నాతొ ఇలా మాట్లాడిస్తోంది. సావిత్రికి అన్యాయం జరగకూడదన్న తపనే నన్ను నన్నుగా ఉండనీయటం లేదు."
శ్రీకాంత్ అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. క్రమంగా చీకటి అల్లుకుపోయింది.
"ఊహు! నాకు నచ్చలేదు చలపతీ! సావిత్రిని నేనెప్పుడూ అలాంటి దృష్టితో చూడలేదు! నావల్ల కాని పని అది......." దీనంగా అన్నాడు శ్రీకాంత్.
"నువ్వు స్నేహితుడికి ద్రోహం చేయటం లేదురా! సావిత్రిని చేసుకొని నాకు మహోపకారం చేస్తునావ్! నేను ఎలాంటి కోరికలూ మిగలకుండా ప్రశాంతమయిన చావు చావాలనుకొంటె నువ్వు ఆ పని చేయక తప్పదు! ఒరే శ్రీకాంత్! నాకెన్నో సహాయాలు చేశావ్ రా! నా జీవితమంతా నువ్ చేసిన సహాయాల్తోనే నిండిపోయింది. ఇదొక్కటే నువ్ చేయగలిగిన ఆఖరి సహాయం! కాదనకు......" లేచి శ్రీకాంత్ భుజాలు పట్టుకొని ఆవేశంగా కుదుపుతున్నాడు చలపతి.
శ్రీకాంత్ కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్. అమాంతం చలపతిని గాడంగా కౌగలించుకొన్నాడు.
"సరేరా! నీకు అదే సంతోషం కలిగిస్తుందనుకొంటె తప్పక అలాగే చేస్తాను! కాని.......సావిత్రి విషయమేమిటి? ఆ అమ్మాయికీ విషయమేమీ చెప్పకు! అసలే కృంగిపోతుంది నువ్విలాంటివన్నీ మాట్లాడితే పరిస్థితి మరింత విషమించి పోతుంది.........."
"అదంతా నేను చూసుకొంటారా! నువ్వు ఒప్పుకున్నావు! నాకదే చాలు! నాకెంత ఆనందంగా ఉందొ తెలుసా? ఇప్పుడు లక్ష ఆపరేషన్లయినా సరే చేయించుకోవడానికి సిద్దంగా వున్నాను......?" ఉత్సాహంగా అన్నాడు చలపతి.
శ్రీకాంత్ మాట్లాడలేదు.
"రాత్రంతా యిక్కడే కూర్చుంటరా ఏమిటి ఇద్దరూ?" నవ్వుతూ అక్కడికొచ్చింది సావిత్రి.
"ఏవేవో కబుర్లలో మునిగిపోయాం! పదరా!" లేచి లోపలకు నడుస్తూ అన్నాడు చలపతి. శ్రీకాంత్ కూడా అతన్ని అనుసరించాడు.
ముగ్గురూ భోజనాలు ముగించారు. చలపతిలో ఓ కొత్త ఉత్సాహం , సంతోషం గమనించి ఆశ్చర్యపోయింది సావిత్రి. ఆపరేషన్ అన్న విషయం తెలిసిన రోజు నుంచీ అంతటి ఉత్సాహంగా ఎప్పుడూ లేడు.
అయితే శ్రీకాంత్ ప్రవర్తనలో మార్పు మాత్రం ఆమెకి అర్ధం కాలేదు. సాధారణంగా అతనే ఏవేవో తమాషా కబుర్లు చెప్తూ చలపతికి ఉత్సాహం కలుగజేస్తుండేవాడు. అలాంటిది ఈరోజు ఎక్కువ మాట్లాడటమేలేదు. ఏదో కలత పడుతున్నట్లు కూడా తెలుస్తూనే వుంది.
ఎంచేత అలా వున్నదీ తెలీటం లేదు. ఒకవేళ చలపతి గురించి డాక్టర్లేమన్నా చెడుగా చెప్పలేదు కదా! కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగిపోయినాయ్యమెకి.
"దేముడా! నాకు అన్యాయం చెయ్యకు! కావాలంటే నా ప్రాణం తీసుకో! ఆయనకే ఆపదారానివ్వకు......" లోలోపలే ప్రార్దించుకొందామె.
భోజనాలు ముగియగానే తనగదిలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. అతనలా వెళ్ళిపోవడం ఆమెకు మరింత అనుమానాన్ని కలిగించింది. ఎలాగయినా సరే చలపతికి తెలియకుండా శ్రీకాంత్ ని కలుసుకొని సంగతేమిటో అడగాలి.
చలపతి ఏదో పుస్తకం చదువుతూ గదిలో పడుకొన్నాడు. ! నెమ్మదిగా శ్రీకాంత్ గదిలోకి నడిచింది సావిత్రి. కుర్చీలో రెండు చేతుల్లోనూ తల పెట్టుకొని కూర్చున్న శ్రీకాంత్ ఆమెను చూసి లేచి నిలబడ్డాడు.
"ఏమిటి!" అడిగాడు నెమ్మదిగా.
"వూరికే......అంటే మీరదోలా ఉంటేనూ- మళ్ళీ డాక్టర్ గారిని కలుసుకొన్నారేమోనని....."
"ఊహు! చలపతి గురించి కాదులెండి! మరేదో ఆఫీస్ గొడవ! మీరు గాబరాపడినట్లున్నారు..........."
"ఆ...అవును......సరే,,,,వస్తాను......." గదిలోంచి త్వరత్వరగా బయటకు నడిచిందామె.
శ్రీకాంత్ చాలాసేపు అక్కడే నిలుచుండిపోయాడు.
ఒకవేళ చలపతి దక్కని పక్షంలో సావిత్రిని తను చేసుకోవాలా? ఏమిటీ దారుణం? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఎంత చలపతి కోరికయినా తన బుద్దీ - జ్ఞానం ఏమయిపొయినయ్యి అని ప్రశ్నించదూ?
ఊహూ! చలపతి బ్రతకాలి. అప్పుడు తన కెలాంటి క్షోభ వుండదు. అంతే! అలాగే జరగాలని భగవంతుడ్ని ప్రార్ధించుకోవాలి. మరో ఆలోచనే అనవసరం తనకు. అశాంతిగానే పక్కమీదకు చేరాడు శ్రీకాంత్.