"ఎక్కడ పెట్టాలో తెలీక యిక్కడ వుంచేశా" అన్నదామె.
"తెలియకపోవటమేమిటి? పెట్టెలో పెట్టెయ్యవలసింది."
"ఎవరి పెట్టెలో?"
"నా పెట్టెలో."
"అమ్మా ఆశ. అందులో నా ప్రాపర్టీ కూడా వుంది."
"అయితే నీ బ్రీఫ్ కేస్ లొ పెట్టుకో."
"మీ ప్రాపర్టీ నా కెందుకండీ."
"అయితే రెండింటిని విడదీసేద్దాం" అంటూ అతను గోడకు తగిలించివున్న కాంబినేషన్ తీసుకొచ్చి రెండింటినీ విడివిడిగా లాగెయ్యటానికి చూశాడు. అవి వూడిరాలేదు."
"ఎందుకు ఊడిరావటం లేదంటావు?" అన్నాడు ఆశ్చర్యంగా.
"అదే నాకూ అర్ధం కావటంలేదండీ."
"నువ్వాడపిల్లవు. ఈ క్లిప్పులూ కిటుకులూ నీకు బాగా తెలుస్తాయి."
"అది నిజమే అనుకోండి. ఇదిక్లిప్పులూ బటన్స్ కు సంబంధించిన వ్యవహారమైతే చాలా యీజీగా పరిష్కరించేదాన్ని. కాని అంతకుమించిన దేదోవున్నట్లుంది.
"అయితే ఒక పనిచేద్దాం"
"ఏ పనండి?" అన్నది అమాయకంగా ముఖంపెట్టి.
"నువ్వో వైపు, నేనోవైపూ పట్టుకుని లాగుదాం"
"ఐడియా బాగుంది గానండీ ఒక్కషరతు. చిరిగి పోయే దాకా లాగకూడదు."
"ఎందుకని"
"కొన్నిటికి లాజిక్ వుండదండీ. కొన్ని పనులు, పోనీ కొన్నిటికి సంబంధించిన పనులు మృదువుగా చెయ్యాలి అంతే"
"సరే" అంటూ అతను బనీను పట్టుకున్నాడు. ఆమె బ్రావైపు చేతి లోకి తీసుకుంది.
కొంచెం కొంచెం లాగారు.
ఊడిరాలేదు.
కొంచెం బలంగా లాగాడు.
"ఇదిగో అంత బలమునుపయోగిస్తే చిరిగిపోతుంది చెబుతున్నా"
"అవునూ లాగటం, ఊడదియ్యటం యిలాంటివి మృదువుగా ఎలా కుదురుతాయి? పూర్తిగా మోటుగా కాకపోయినా కొంతైనా బలం ఉపయోగించకుండా"
"కుదిరించుకోవాలి, అంతే"
"అయితే నువ్వు యిటువైపు పట్టుకో, నేనటువైపు పట్టుకుంటా"
"ఆఁ అలా అన్నారు బాగుంది" అని అతనికొస తాను అందుకుని తనకొస అతని కందించింది.
ఇప్పుడు బ్రా అతని చేతిలో వుంది. ఆమె వాడిన బ్రా. కొంచంగా వొళ్ళు జలధరించింది.
"ఏమిటిది నేనేనా?" అనుకుంటూ అప్రయత్నంగా ఆమె ముఖంలోకి చూశాడు. కాటుక పెట్టుకున్నట్టు నల్లగా మెరిసే ఆ కళ్ళు-అతని చూపుల్లో కలసి క్షణంసేపు రెపరెపలాడాయి.
"మీరూ.....విడదియ్యమంటూంటే కలుపుతున్నారేమిటి?"
"కలుపుతున్నానా?" అన్నాడు కంగారుపడుతూ.
"చూపుల్లో చూపు కలుపుతున్నారు"
"కలపటం లేదు. చూస్తున్నాను"
"పోనీ. మీకు చెయ్యమని ఓపని అప్పగిస్తే ఎందుకలా చూస్తున్నారు?"
"నేనూ.....నువ్వు సరిగ్గా లాగుతున్నావో లేదో అని చూస్తున్నాను"
"నేను సరిగ్గా లాగుతున్నానో లేదో అక్కడ చూస్తే తెలుస్తుందిగానీ, యిక్కడ చూస్తే తెలుస్తుందా?"
"అవును నేనేమిటిలా మొద్దబ్బాయిలా సమాధానం చెప్పాను?" అనుకున్నాడు బాధగా. నేను తనకు ఆశ్రయమిస్తున్నాను. ఊ అవును. ఆశ్రయమిస్తున్నాను చాలా పెద్దమనిషిలా ప్రవర్తించాలి. నా గురించి, నా బుద్దిమంతతనాన్ని గురించి తను అపార్ధం చేసుకోకూడదు.
ఎదురుగా గోడకి అతను షేవింగ్ చేసుకునేందుకూ, తల దువ్వుకునేందుకూ ఉపయోగించే చిన్న సైజ్ మిర్రర్ వుంది. అనుకోకుండా అటు కేసి తలత్రిప్పి అద్దంలో తన ముఖం కనిపించి ఉలికిపడ్డాడు.
నూనూగుమీసాలు, కళ్ళమీదకు వురుకుతోన్న వొత్తయిన క్రాఫ్, లేతగా మెరిసే చెంపలు...
"మెడిసిన్ ఫస్టియర్ చదువుతున్నావు. గట్టిగా చ హూస్తే పద్దెనిమిదేళ్ళు నిండివుండవు. నువ్వు పెద్దమనిషివా?" అని ఆ ప్రతి బింబం నవ్వినట్లయింది.
"ఏవిటి లాగటం మానేసి అద్దంలోకి మీలో మీరు చూచుకుంటున్నారు. మీకు యితరుల మొహాల్లోకో, లేక మీ మొహంలోకో చూసుకోవటం తప్పితే వేరేపని లేనట్లుందే."
"అవునవును మనం యీ కాంబినేషన్ విడదీసే ప్రయత్నంలో వున్నాం కదూ. నువ్వటూ- నేనిటూ లాగుతున్నాంకదూ. ఊ పట్టు."
"అన్నాడేకాని అతని చేతులా పనిచేయలేకపోతున్నాయి. మళ్ళీ అనుకోకుండా ఆమెముఖంలోకి చూసి, ఆ ముఖంలోని నవ్వుచూసి అతనిచేతులు మరింత చచ్చుపడి పోయినట్లయినాయి".
* * *
"ఏమండీ! నాకో ఐడియా వొచ్చింది" అంది ప్రియంవద.
ఇందాకట్నుంచీ కొంచెం అన్యమనస్కంగా వున్నాడు. "ఏమిటి?" అన్నాడు.
"ఊళ్ళో ఎగ్జిబిషన్ వుందికదా".
"అవునూ".
"ఆంజనేయులు ఇలాంటి చోట్లకు ఎక్కువ వొస్తాడండి. రోడ్ల మీద, సినిమా హాల్స్ లో కన్నా ఎగ్జిబిషన్ లో అయితే అతను కనిపించటానికి ఎక్కువ అవకాశంవుంది".
"నిజమే" అనుకుంటూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళలో ఏదో బాధ కనిపించింది. "పాపం" అనుకున్నాడు. తన విధ్యుక్తధర్మం ఎక్కువగా నెరవేర్చటంలేదు. మనసులో అతనికోసం ఎంత తపన పడుతోందో అని విచారించాడు. మళ్ళీ ఎక్కువసేపు చూస్తే- కళ్ళలోకి చూస్తున్నారంటుందనుకుని చూపు మరల్చుకున్నాడు.
"గుడ్! అలాగే వెడదాం" అన్నాడు హుందాగా.
ఓ అరగంటలో యిద్దరూ డ్రెస్ చేసుకుని ఎగ్జిబిషన్ కి వెళ్ళారు.
చీకటిపడిపోయింది.....కాని ఎగ్జిబిషన్ రకరకాల విద్యుత్ అలంకరణలతో వెలిగిపోతుంది. ఎన్నో వైవిధ్యాలతో వున్న స్టాల్స్, ఎంటర్ టెయిన్ మెంట్స్, హడావుడిగా అన్నీ చూసుకుంటూ, కొంటూ, తినుబండారాలు తింటూ నడిచే స్త్రీ పురుషులు, పిల్లలు__బోలెడు జనం రద్దీగా వుందది. వాటిమధ్య నుంచి పావుగంటకోసారి దూసుకుపోతోన్న చిన్నసైజు రైలు బండి.
"నా చెయ్యిపట్టుకోండి తప్పిపోతానేమో" అన్నది.
ప్రియంవద యీవేళ పంజాబీ డ్రెస్ వేసుకుని వుంది. ఎవరైనా పంజాబీ డ్రెస్ వేసుకుంటే అతనికి ఎలర్జీ. కాని ప్రియంవదకు ఎంతో నప్పినట్లుగా, అమిరినట్లుగా వుంది.