"అమ్మమ్మ, అసలు కుదరదండీ. అనుకున్న ఎఫెక్ట్ తీసుకురాకపోతే ఒక్కోసారి రివర్స్ కొడుతుందండీ."
సునంద కంగారుపడుతూ "అలావద్దు. కొంచెం ఆలశ్యమైనా పకడ్బందీగా రాయి" అంది.
"అందులో ఈ ప్రేమవ్యహారాల్లోనండీ తొందర వుండకూడదండీ, ఓర్పు, నిరీక్షణ అవసరమండీ!"
"పోనీ అలాగే నిరీక్షిస్తాను. కానీ మరీ ఆలస్యం చెయ్యమాక" అంది సునంద నిట్టూర్చి.
"ఏవండీ. మీరు కారు డ్రయివింగ్ బాగా చేస్తారండీ" అన్నది ప్రియంవద.
"అవునా?"
"అవునండీ."
"నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని వుందా?"
"ఉంది. కానండీ, ఎందుకులెండి? మీ కారు పాడయిపోతుంది."
"ఏం పాడుకాదు. అయినా.....పోతేపోనియ్యి. ఈ కారుపోతే యింకొకటి కొనుక్కుంటాను."
"మీ ఇంట్లో అంతా మీ యిష్టమేనా అండీ."
"నా మాట మా డాడీ కాదనరు. ఆనక రెడీగా వుండు. కార్లో తీసుకెళతాను."
"అలాగేనండీ. కాని మా బావకు చెప్పకండేం. అతనికిలాంటివి ఇష్టం వుండదు".
"చెప్పనులే. ఇహ నేను వెడతాను. నువ్వు ఏకాంతంగా వుండి ప్రేమలేఖ తయారుచేస్తూ వుండు. మళ్ళీ వొస్తాను" అంటూ సునంద లేచింది.
ఆమె వెళ్ళిపోయాక తలుపులు బిడాయించుకుని ప్రియంవద మంచంమీద బోర్లా పడుకుని గడ్డం క్రింద చేతులానించి చాలాసేపు ఆలోచించింది. నిజంగానే మూడ్ రాలేదు. లేచి అటూ ఇటూ కాసేపు పచార్లు చేసింది. అప్రయత్నంగా ఆమెదృష్టి గోడకు తగిలించివున్న బనీను-బ్రా కాంబినేషన్ మీదకు వెళ్ళింది. నవ్వుకుని వాటిని చేతిలోకి తీసుకుని మంచంమీద కూర్చుని వొడిలో పెట్టుకుంది. ఆమె చేతులు వాటిని ప్రేమగా నిమురుతున్నాయి.
అవునూ! యివి ఎందుకలా అతుక్కుపోయాయి?
విడదియ్యటానికన్నట్లు రెండు చేతుల్తో విడివిడిగా పట్టుకుని మృదువుగా లాగింది. రాలేదు. అంతకన్నా బలం ఉపయోగించటానికి ఆమెకు మనస్కరించలేదు. వాటిని ముద్దుపెట్టుకుని మంచంమీద నుంచిలేచి గోడకు తగిలించింది.
చేతిలో కాగితం, పెన్ను తీసుకుంది. మనసు ఆమె పరిధుల్లో లేకుండా ఎటో విహరిస్తోంది.
6
అప్రయత్నంగా చేతిలో పెన్ను కదిలింది. కాని ఆమె రాస్తోంది ఉత్తరం కాదు. ఆమె చేతివ్రేళ్ళు చిత్రంగా కదుల్తూ ఓ రూపాన్ని చిత్రిస్తున్నాయి.
మనోకుహరంలొ ఏవో ధ్వనితరంగాలు.
ధా ధిన్ ధిన్ ధా, ధా ధిన్ ధిన్ ధా
తాతిన్ తిన్ తా, తాధిన్ ధిన్ ధా.
రూపం తయారయింది. ఆమె తెలివి తెచ్చుకుని "అరె!" అనుకుంది ఆశ్చర్యంగా.
"అసలండి, మన మనస్సులో ఏముంటుందో మనకే తెలీదండీ" అని తాను సునందతో అన్నమాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
తాను రాసింది ఉత్తరం కాదు.
తాను గీసింది బొమ్మ.
ఆ కాగితం మీద తయారయింది మహేష్ రూపం.
"అనుకోకుండా, అప్రయత్నంగా ఎంత అందమైన చిత్రం తయారయింది!
"మహేష్!" అంది.
"........"
"నువ్వెవరివో.....యిలా నిన్ను కలుసుకోవటం...."
ముఖం ముందుకు వొంచింది. పెదవులు అతని పెదవుల్ని కలుసుకోబోతున్నాయి.
తలుపు చప్పుడయింది.
ఉలికిపడి లేచి, తలుపు తీసింది.
మహేష్!
లోపలకు వొస్తూ- "ఇవేళ కాలేజి ఎర్లీగా అయిపోయింది. ఏమిటది చేతిలోని కాగితం?" అన్నాడు.
అప్పుడు చూసుకుంది-యింకా చేతిలోనే వున్న విషయం..... ఉలికిపడి "ఊ?" అంది.
"ఆంజనేయులి బొమ్మా?"
"అవునన్నట్లు తలఊపింది."
"ఏదీ చూడనియ్యి" అంటూ చెయ్యి చాచాడు.
"ఉహు" అంటూ తలత్రిప్పి కాగితం మడతపెట్టి గౌన్ లొ పెట్టేసు కుంది.
మహేష్ నవ్వాడు. అతన్ని గుండెల్లో దాచుకుంటున్నావా?"
అవునన్నట్లు తల ఊపింది.
అతను నవ్వి చేతిలో పుస్తకాలు టేబిల్ మీద గిరాటేస్తుండగా ఒక పుస్తకంలోంచి ఆమె దగ్గరనుంచి తీసుకున్న ఆంజనేయులి రూపం గీసివున్న కాగితం క్రిందపడింది.
వొంగతీసి మడతవిప్పుతూ యధాలాపంగా వెనక్కి చూశాడు. ఆమె గదిలో లేదు.
పేపర్ టేబిల్ మీద పెట్టాడు. "వొరేయ్ నిన్ను చూస్తే జెలసీగా వుందిరా. మరీ అంత గుండెల్లో దూరతావా?" అంటూ పిడికిలి బిగించి ఆంజనేయులు ముక్కుమీద చిన్న గుద్దు వేశాడు.
"ఏమిటి చేస్తున్నావు?"
త్రుళ్ళిపడి ముఖం త్రిప్పి చూసేసరికి ప్రియంవద వెనక నిలబడి వుంది. మునివేళ్ళ మీద నిలబడి అతని భుజంమీద నుంచి ఏం జరుగుతున్నదో చూడటానికి ప్రయత్నిస్తూ.
"ఆంజనేయులు హఠాత్తుగా కనబడితే గుర్తుపట్టటానికి అతని రూపం మననం చేసుకుంటున్నాను."
"అబ్బే! చాలా తేలికండీ గుర్తుపట్టటం. ఒకసారి చూస్తే మరిచి పోలేరు."
"ఒక్కసారి కూడా చూడలేదు గా. అందుకని...."
"నిజమేలెండీ."
"అరె, అదేమిటి?" అన్నాడు గోడకు తగిలించివున్న బనీను-బ్రా కాంబినేషన్ చూస్తూ.