అందుకని చిరునవ్వు నవ్వుతూ, "నాకు సంబంధం కుదిరేదాకా ఆ అమ్మాయిని ఆగమని చెప్పొచ్చుగా. ఇష్టం లేదని చెప్పెయ్యడమెందుకు? ఆ తరవాత నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి దొరికినా నిన్ను మనస్పూర్తిగా ఇష్టపడే అమ్మాయి దొరకకపోతే? నా సంబంధంతో దీనికి సంబంధం లేదన్నయ్యా. నువ్వు ఒప్పేసుకో." అంది.
మళ్ళీ అదే భావన కలిగింది భరత్ కి. ఎంత యెదిగిపోయింది తన చెల్లెలు - శారీరకంగా, మానసికంగా కూడా, తను ఎందుకు గమనించలేకపోయాడు.
"భారతి చెప్పింది కరెక్టే, భరత్! నీకు ఇష్టమేనని చెప్పు ఆ అమ్మాయితో. ఆ తరవాత ఇంక అదే పనిగా పెట్టుకుని భారతికి సంబంధాలు వెదుకుదాం. ఇంతకీ తను ఎవరి అమ్మాయి అన్నావూ?"
"రత్నాకరరావుగారని అయన కూతురు."
"ఇంటి పేరేమిటో?"
చెప్పాడు భరత్.
సదాశివరావుగారి మొహంలో సంతోషం కనబడింది. "ఓహొహో! మన రత్నాకరరావే. ఇదివరకు మనింటికి ఎదురుగానే వుండేవాళ్ళు. అప్పట్లో రత్నయ్య అని పిలిచేవాళ్ళం. అబ్బో ఎప్పటి మాట. అప్పటికి నువ్వింకా పుట్టనే లేదు. మన రత్నయ్య ఇంత గొప్ప వాడయ్యాడా, చూశావా బాబూ! మన మహా నాయకులు కన్న కలలు కల్లలు కాలేదు నాయనా! స్వాతంత్ర్యం వచ్చాక, ఒట్టిపోయినట్లున్న దేశం గట్టి పడుతుందని, బీదరికం దేశాలు పట్టిపోతుందని మన పెద్దలు ఉర్రుతలుగారు. చూడు! అది నిజం అవుతోంది నాయనా! మన రత్నయ్య కోటిశ్వరుడయిపోయాడా? నా కళ్ళు ఆనందంతో తడి అయిపోతున్నాయి భరత్!"
స్వాతంత్ర్యం వచ్చిక దేశ సంపదని పంది కొక్కుల్లా మెక్కుతున్న రత్నాకరరావులాంటి వాళ్ళు ఎక్కువైపోయారని, ధనవంతులు మరింత ధనవంతులయిపోతుండగా, బీదలు మరి బీదలై నిరుపేదలై పోతున్నారని గ్రహించలేని మంచి మనిషి అయన.
"ఆ అమ్మాయి నిన్ను అంత ఇష్టపడి చేసుకుంటోంది కాబట్టి మీ దాంపత్యం అన్యోన్యంగా వుంటుంది. మీకు కష్టాలు వుండవు. శుభం నాయనా!" అన్నారు ఆర్ద్రంగా.
తండ్రి చూడకుండా నాలుక బయట పెట్టి అన్నను వెక్కిరించింది భారతి.
--------------
"ఏమయింది?" అంది సుదీర సారధితో.
సుదీర తనని కూర్చోమని చెబుతుందేమోనని ఎదురు చూశాడు సారధి. అతనికి అలాంటి మర్యాద ఇవ్వదు సుదీర.
మనసులోనే కసిగా అనుకున్నాడు అతను- 'ఎదురుగా వున్న మనిషిని కనీసం కూర్చోమని కూడా ఆనవు నువ్వు. చూస్తూ వుండు-.......నేను నీ పక్క మీద నీ పక్కనే పడుకునే రోజు వస్త్యుంది!"
పసుపు పచ్చటి పోల్కాడాట్స్ నైట్ గౌను వేసుకుని వున్న సుదీరని చూస్తే అతనికి అనిపించింది. 'అడచిరతలా వుండే ఈ అమ్మాయి పక్కలో ఎలా వుంటుంది? ఉద్రేకంతో రక్కి, గిల్లి మొగుణ్ణి తినేస్తుందా మాన్ - ఈటర్ లాగా?"
ఎగ్జయిట్ మెంట్ కలిగింది అతనికి. దాన్ని అణచుకుంటూ అన్నాడు. "ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది."
అసహనంగా చూసింది సుదీర. "ఏమిటది? ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యడానికే నువ్వు ఉన్నది. నాతొ కష్టాలు చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకోవడానికి కాదు."
అడచిరత!
"మనం హొటలు కోసం చూసిన స్థలం కాలేజి తాలుకుది. ఆ స్థలానికి అసలు గిరాకి లేని రోజుల్లో కాలేజి కమిటి దాన్ని దయాకర్ అనే వాడికి తొంబై తొమ్మిదేళ్ళు లీజుకి ఇచ్చిందట!"
"గాడ్! ఎవరు అంత ఉదారంగా లీజు కొచ్చిన ధర్మాత్ముడు?"
"సదాశివరావని..........భరత్ వాళ్ళ నాన్న!"
"చాదస్తపు ముసలాయనా?" అంది మొహం చిట్లిస్తూ. "అందరికి ఉదారంగా దానాలు చేసెయ్యడం వల్లే ఇవాళ దారినపోయే దానయ్యలాగా అయిపోయాడు. అయినా, కాలేజి కమిటి తరపున అయన లీజు కివ్వడమేమిటి? అయన కేమిటి సంబంధం?"
"ఆ కాలేజిని ఒకప్పుడు సదాశివరావు తండ్రి కట్టించాడు. తన డబ్బుతోనే, చాలా సంవత్సరాలు డొనేషన్లు ఇచ్చి ఆ కాలేజిని నడిపించాడు."
"ఆగాగు!" అంది సుదీర. "ఏమిటి .........అయన కాలేజికి డొనేషన్లు ఇచ్చేవాడా? నువ్వేదో తలకిందులుగా మాట్లాడుతున్నావు. అయన స్టూడెంట్ల డొనేషన్లు వసూలు చేసేవాడు.అవునా?"
"కాదు కాదు!" అని నవ్వాడు సారధి. "ఆయనే తన సొంత ఆస్తులు అమ్మి, ప్రతి సంవత్సరం కాలేజికి డొనేషన్ ఇచ్చి నడిపించేవాడు. స్టూడెంట్ల దగ్గర డొనేషన్లు గుంజడం ఇప్పటి పద్దతి. సదాశివరావు హయంలో ఆస్తి చాలా వరకూ తరిగిపోయి, కాలేజి నడపలేని స్థితి వచ్చింది. అప్పుడు కొంతమంది పెద్ద మనుషులు కలిసి దాన్ని కొనేశారు. కొనేటప్పుడు మిగిలిన ఆస్తులన్నీ కాలేజికి చెందేటట్లు, కాలేజి తాలూకు పాత అప్పులన్నీ - ఒక మూడు లక్షల దాకా తనే నెమ్మదిగా తిర్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు సదాశివరావు."
అపనమ్మకంగా చూసింది సుదీర.
"జీసెస్! ఎందుకు?"
చులకనగా నవ్వాడు సారధి. "వానిటి భేషజం అంటారు చూడండి..........అది! తాము చాలా సత్పురుషులమైనట్లు దేశోద్దారకులమైనట్లు అందరిని నమ్మించాలని కొంతమందికి దురద వుంటుంది. ఈ ముసలాడు ఆ రకమే అనుకుంటాను."
"ఇంతకీ ఆ మూడు లక్షల అప్పు తిర్చాడా అయన?"
"తిర్చలేదు! దానికి బదులుగా తన ఇంటిని తాకట్టు పెట్టాడు."
"ఏది.........ఇప్పుడుంటున్న ఇల్లు!"
"ఆ పాడుబడ్డ కొంపే! అమ్మితే లక్షరూపాయలు రాదు! అది తప్పితే మరో గతి కూడా లేదాయనకి."
"సారధి! వెళ్ళు. వెళ్ళి ఆ దయాకర్ కి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పారెయ్. అక్కడ నుంచి అతని పాక హొటల్ పికేయ్యమను. ఆ స్థలం మొత్తం మనకే కావాలి."
"ఐ విల్ డూ దట్!" అని "ఇంకో చిన్న ప్రాబ్లెం కూడా వచ్చింది." అన్నాడు.
"ఏమిటది?"
"కాలేజి స్టూడెంట్స్ ఇవాళ నుంచి స్త్రయిక్ చేస్తున్నారు."
"ఎందుకు?"
"ఇప్పుడున్న కాలేజి బిల్డింగ్ వాళ్ళ అవసరాలకు సరిపోవడం లేదుట. ఎదురుగా వున్న ఈ ఖాళీస్థలాన్ని కూడా కాలేజి స్వాదినం చేసుకుని తమకు వసతి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.'
"షిట్!" అంది సుదీర నిస్పృహగా. కాలేజి కుర్రాళ్ళతో గొడవ అంటే తెల్లిగా పోదు.
"కాలేజి కమిటికి చైర్మన్ ఎవరిప్పుడు?"
"మీ డాడీ! రత్నాకరరావుగారు."
తేలిగ్గా నిట్టూర్చింది సుదీర. "మరి ఆ సంగతి చెప్పవేం? నాన్నగారికి తెలిసిందా ఈ విషయం?"
"తెలిసింది."
"ఏం చెయ్యబోతున్నారు ఇప్పుడు?"
"ఏం చెయ్యాలో నేను చెప్పాను. తను చెయ్యబోతున్నది మీకు చెప్పొద్దన్నారు. నేను వెళ్ళి ఆ దయాకర్ తో మాట్లాడుతాను. ఆ స్టూడెంట్ కుర్రాళ్ళని ఎలా టాకిల్ చెయ్యాలో కూడా మాకు తెలుసు!" అని వినయంగా కొంచెం వంగి "మీరేం వర్రీ కాకండి. ఈ సారధి మీ సేవ కోసమే!" అన్నాడు నాటకియంగా.
పెదిమని మునిపంటితో కొరుకుతూ ఆలోచనలో పడింది సుదీర.
------------
"బయటికి వెళుతున్నావా అన్నయ్యా! అట్లు వేస్తున్నాను . తిని వెళ్ళు!" అంది భారతి.
"అట్లా........అట్లే కానిమ్ము!" అని వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు భరత్.
"కాదు - నీక్కాబోయే శ్రీవారి దగ్గరికి."
వెంటనే భారతి మొహంలో అనుమానం తొంగి చూసింది. "ఎవరూ!" అంది.
"ఏమో నాకు తెలియదు! వెళ్ళి వెదకాలి ఇప్పుడు, పర్మిషనిస్తావా?"
"పర్మిషనిస్తాను గానీ, నువ్వు అలా మెషినులా తిరుగుతూ వెదకక్కర్లేదు."
"వెతకక్కర్లేదు అంటే నాకు వెత తగ్గినట్లే! ఏం? ఎవరన్నా రెడీగా ఉన్నారా ఏమిటి?"
తల ఒంచుకుని చెప్పింది భారతి. "ఒక సంబంధం నా కళ్ళకి బంధంలా తగులుకుంది అన్నయ్యా!"
"ఎవరతను?" అన్నాడు భరత్ ఆశ్చర్యంగా.
సిగ్గుతో జీరబోయింది భారతి గొంతు. "దయాకర్ అని."
"ఏ దయాకర్ - మీ కాలేజికి ఎదురుగా కాంటిన్ పెట్టినతనా?"
'అతనే' అన్నట్లు తల ఉపింది భారతి. "తనే వచ్చి అడిగాడు. నేను ఏమి చెప్పలేదు."