Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 18


    
    కందిపచ్చడి నూరుతూ, వెనకాల అలికిడైతే తల తిప్పి చూసింది శారద. బీరువా చాటున దాక్కోబోతున్న దుర్గ కనబడింది. "చూశాన్లే! రా!" అంది శారద.
    
    దుర్గ నవ్వుతూ వచ్చి పక్కనే కూర్చుని చెయ్యిజాచింది. కొద్దిగా పచ్చడి రోట్లోనుంచి తీసి దుర్గ చేతిలో వేసింది శారద. దుర్గ నాలికతో దాన్ని తాకి చూసి 'అబ్బ కారం!' అన్నట్లు మొహం పెట్టింది.  

 

    "కారంగా వుందా?"
    
    అవునన్నట్లు తల వూపింది దుర్గ. రోజుతూనే 'ఇంకాస్త పెట్టు' అన్నట్లు చెయ్యి జాపింది మళ్ళీ.
    
    "అలా రోజుకుంటూనే తినకపోతే ఏం? ఒక గ్లాసు మంచినీళ్ళు తాగు" అంది శారద.
    
    మంచినీళ్ళ బిందె దాకా వెళ్ళి, "బా! బ!" అంటూ భయంగా చూస్తూ వెనక్కి అడుగేసింది దుర్గ.
    
    "ఏమిటి?" అంది శారద.
    
    "బా! బా!" అంది అటువైపు చెయ్యి చూపిస్తూ.
    
    బిందె చాటుగా కూర్చుని ఉన్న పిల్లి తాలూకు కళ్ళు మిలమిల మెరుస్తూ కనబడ్డాయి శారదకి.
    
    "పిల్లిని చూసి భయపడతావే, పిచ్చిదానా?" అంటూ, "ఛేయ్, ఛేయ్!" అంటూ చెయ్యి విసిరింది. తన విశ్రాంతికి భంగం కలిగినందుకు చిరాకు చూపిస్తూ 'మ్యావ్' అని గుర్రుగా చూస్తూ, పెరట్లోకి వెళ్ళి, గోడదూకి మాయమైపోయింది పిల్లి.
    
    దాని దారికి అడ్డం రాకుండా పక్కకి జరిగిన దుర్గ 'అమ్మయ్య!' అన్నట్లు గుండెమీద  చేతులు వేసుకుంది.
    
    తర్వాత మంచినీళ్ళు తాగి 'నీక్కూడా కావాలా?' అన్నట్లు సౌంజ్ఞ చేసింది.
    
    "మంచినీళ్ళా? వద్దు! మంచి విషం ఇవ్వు ఒక గ్లాసెడు!" అంది శారద చిరాగ్గా. ఆసమయంలో దుర్గ రావడం ఆమెకి కొద్దిగా విసుగ్గా వుంది. దుర్గ పక్కింటి అమ్మాయి-మూగది. కొద్దిగా వెర్రిబాగుల్ది. చాలా మంచిది కూడా! శారదంటే వెర్రి అభిమానం. పని లేనప్పుడు దుర్గ వస్తే శారదకి ఎంత సంతోషంగా, కాలక్షేపంగా వుంటుందో-పనిలో ఉన్నప్పుడు వస్తే అంత చిరాగ్గా వుంటుంది.
    
    ఈ వేళ చాలా పని వుంది శారదకి. శంకర్రావు హాస్పిటల్ కి వెళ్ళాడు. పండగలూ, పేరంటాలూ, ఇలా శ్రావణ శుక్రవారం నోములూ వచ్చినప్పుడు నర్సింగ్ హోమ్ కెళ్ళి వూరికే మొహం చూపించి, అర్జెంటు పనులేమన్నా వున్నాయేమో కనుక్కుని, ఇంటికెళ్ళి పోవచ్చని చెప్పింది శశి.
    
    ఆయన ఇంకో గంటలో వచ్చేస్తారు.
    
    ఈలోగా షాపుకెళ్ళి, టిక్ ట్వెంటీ కొని తాగెయ్యాలనుకుంది శారద. పచ్చడి, కూరతో వంట ముగించి, శుక్రవారం నాడు ముత్తయిదువగా వెళ్ళిపోవాలనుకుంది.
    
    ఇప్పుడే వచ్చిందీ వెర్రిపిల్ల! తోసేసినా పోదు, తనకి తోస్తే తప్ప!
    
    శారద పచ్చడి నూరి, గిన్నెలోకి తీసి, కూర తరగ డానికి కూర్చునేంతలో పొయ్యిమీద వున్న అన్నం కాస్తా మాడువాసన వచ్చింది. త్వరత్వరగా వెళ్ళిమ పమిట కొంగుతో అన్నం గిన్నె పట్టుకుని దింపింది శారద.
    
    దుర్గ శారద భుజాలు పట్టుకుని కుదిపేస్తూ 'అచ్చనగాయలు ఆడుకుందామా?' అన్నట్లు సైగ చేసింది.
    
    "ఇప్పుడు కాదు! తర్వాత!" అంది శారద.
    
    దుర్గ మూతి ముడుచుకుంది. 'నీ జట్టు కచ్చి!" అన్నట్లు వేళ్ళు చూపించి, చరచర గుమ్మందాకా వెళ్ళిపోయి, అక్కడ హఠాత్తుగా ఆగి, వెనక్కి తిరిగివచ్చి జాలిగా చూస్తూ- 'ఆడవూ' అన్నట్లు చూసింది.
    
    గుండె పిండేసినట్లయింది శారదకు. ఆటలు తప్ప ఇంకేం తెలియని వెర్రిబాగుల పిల్ల! పదహారేళ్ళ వయసూ, ఆరేళ్ళ మనసూను! పెంపుడు కుక్కపిల్లలాగా తన కాళ్ళని చుట్టుకు చుట్టుకు తిరిగే పిల్ల! తను కసురుకున్నా పడి, తన చిరాకు తగ్గేదాకా బెదురు చూపులు చూసే అమాయకురాలు! ఆ అమ్మాయిని ఎలా నొప్పించగలదు తను!
    
    "కూర్చో! నావంట అయిన తర్వాత ఆడదాం అని, "స్నానం అయిందా?" అంది శారద.
    
    'తలంటి పోసుకున్నా!' అన్నట్లు అభినయించింది దుర్గ. పక్కనే కూర్చుని మూగభాషలోనే కబుర్లు చెబుతోంది. ఆ సైగలన్నీ బాగా అర్ధమవుతాయి ఆ కాంపౌండ్ లో వున్న కాపరాల వాళ్ళందరికీ. ఆ సైగల అర్ధాలేకాక తాత్పర్యాలు కూడా తెలుస్తాయి శారదకి.
    
    ఆరోజు తమ ఇంట్లో వంటేమిటో చెప్పింది దుర్గ. పచ్చిమిరపకాయల పచ్చడీ, పప్పులుసూను. కొనుక్కోవడానికి పది పైసలిమ్మంటే వాళ్ళ నాన్న కోప్పడ్డాడని చెప్పింది.
    
    పరధ్యానంగా వింటోంది శారద. పరధ్యానంగానే తలంటు పోసుకుంది. వంట పూర్తి చేసింది.
    
    ఒక అరగంటసేపు దుర్గతో అచ్చనగాయలాడింది. 'ఇంక ఇంటికి వెళ్ళు! తర్వాత ఆడుకుందాంలే!" అని దుర్గని ఇంటికి పంపేసరికి శంకర్రావు వచ్చాడు.ల భోజనాలయ్యేసరికి మధ్యాహ్నమయింది. పనిమనిషి వచ్చింది. ఆమెకి గిన్నెలెయ్యగానే, మళ్ళీ దుర్గ వచ్చింది.
    
    చావడానికి కూడా తీరికలేదు శారదకి!
    
                                     4
    
    "ఈయన మిస్టర్ రాజన్! వసుమతి హజ్బెండు! కోరమాండల్ లో సేల్సు మేనేజర్!" అంది శశి పరిచయం చేస్తూ. "అండ్ దిసీజ్ మై హజ్బెండ్....డాక్టర్ సుధీర్!"

 Previous Page Next Page