Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 18


    రాలిన ఆకులతో ఉన్న మోడులకి సీమంతానికి గాజులు తొడిగినట్లుగా పూత వచ్చేదెప్పుడూ? మాగిన మామిడిపండ్ల వాసనలు పీల్చి కోయిలలు కూతలు కూసేదెప్పుడూ? అద్దాల గదుల్లో ఎయిర్ కండిషనర్ యాంత్రికత్వం నుండి సెలయేటి గాలుల్లోని చిరుపాటను ఆస్వాదించగలగడమే కదా బతకడానికీ, జీవించడానికీ ఉన్న తేడా! అమ్మపెట్టే తాయిలంకన్నా బజార్లో దొరికే రంగుల పిప్పరమెంటు రుచిగా ఉంటుందా?
    
    మనం సుఖాలకోసం ప్రతి నిత్యం పోరాడుతున్నాం.
    
    అయినా పాత జ్ఞాపకాల ఆనవాళ్ళు పోగొట్టుకోలేకపోతున్నాం. డ్రాయింగ్ రూముల్లో కృత్రిమ జలపాతాలూ, చచ్చిన కుందేళ్ళల్లో గడ్డి కూరిన బొమ్మలూ..... షోకేసుల్లో ప్లాస్టిక్ అరటిచెట్లూ ఎందుకు? అప్పుడే విచ్చుకున్న గులాబీ సుగంధం పెర్ ఫ్యూమ్ బాటిల్లో వెదుకుతున్నాం! రూమ్ ఫ్రెషనర్ సువాసనలు పీలిస్తే, కిటికీ అవతల నుండి వీచే పారిజాత సమీరాల ఆనందం దొరుకుతుందా?
    
    రాధా ... జాబిలమ్మ రువ్విన నవ్వులన్నీ మంచు ముత్యాలై నా ముంగిట్లో రాలినప్పుడు ఆ ముత్యాల సరాలు నీ మెడలో మాలగ కూర్చనా! అందమైన ఈ ప్రత్యూషాన నెమలి నడకలలోని ఒక గమనం .... జయదేవుని అష్టపదిలోని భావుకత్వం.....క్షేత్రయ్య పదంలోని లాలిత్యం....శ్రీనాథుని ప్రబంధంలోని శృంగారం నా వాకిట్లో జారిపడి నీవుగా మారావని నా భావం!
    
    పొగమంచు మాటున కోవెల శిఖరం, పూలహారాల చాటున దాగిన పెళ్ళికొడుకు మొహంలా కనిపిస్తోంది.
    
    మాధవ్ కోనేట్లో కాళ్ళు కడుక్కుని రెండు కలువపూలను కోసుకుని పైకి వచ్చాడు.
    
    "ఏ పేరున చేయించాలమ్మా అర్చన?" అడుగుతున్నాడు పూజారి.
    
    "మాధవుడి పేరుమీద చేయించండి!"
    
    తన పేరు వినబడి టక్కున తల ఎత్తి చూశాడు.
    
    రాధ కనపడింది. వెన్నెల్లో లిబర్టీ స్టాచ్యూలా ఉంది.
    
    "గోత్రం?" పూజారి అడుగుతున్నాడు.
    
    "దేవుడి గోత్రం!" అంది.
    
    "భరద్వాజస....! కలువపూలు పట్టుకుని ఆమెవైపు అడుగులేస్తూ అన్నాడు మాధవ్.
    
    అనుకోకుండా అతనక్కడ ప్రత్యక్షమవడంతో పెద్దవైన కళ్ళను ఇంకా విప్పార్చి విభ్రమంగా చూసింది రాధ.
    
    ఆ కనుదోయి సొగసుకి కలువపూలు సిగ్గుతో తల వాల్చాయి.
    
    మాధవ్ ఒంగి వాటిని ఆమె పాదాల దగ్గర ఉంచాడు.
    
    ఆమె పెదవి విప్పకుండానే చెంపలు వేసుకుని అపచారం అని సైగ చేసింది.
    
    "అవి అక్కడ కూడా సిగ్గుపడుతున్నాయి!" అన్నాడు.
    
    ఆమె బుగ్గల్లో సొట్టలు పడేటట్లు నవ్వింది.
    
    "హారతి అద్దుకోండి!" అన్నాడు హారతి పళ్ళెంతో వచ్చి పూజారి.
    
    హారతి వెలుగులో ఆమె ముఖం ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది.
    
    "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు!" దీవిస్తూ ప్రసాదం ఉన్న పూలసజ్జ అందించాడు పూజారి.
    
    ఇద్దరూ కోదండరాముడికి, సీతమ్మవారికీ భక్తిగా నమస్కరించి వెనక్కి తిరిగి నడవసాగారు.
    
    "ప్రసాదం కావాలి!" చెయ్యిజాపాడు మాధవ్.    
    
    ఆమె కొబ్బరి చిప్ప తీసి అందించబోయింది! అతను అందిస్తున్నచేతిని గట్టిగా పట్టుకున్నాడు. సుకుమారమైన ఆ చేయి అతని బలమైన చేతిలో నలిగిపోయింది. "పాణిగ్రహం అయింది!" అన్నాడు.
    
    ఆమె సిగ్గుతో వదిలించుకుని గబగబా అడుగులేసింది.
    
    "సప్తపది కూడా జరిగిపోయింది!" అన్నాడు.
    
    ఆమె పున్నాగ చెట్టుకిందకి వెళ్ళి నిలబడింది. అతను కొమ్మని ఊపి, జలజలమని రాలుతున్న పువ్వులను చూస్తూ "తలంబ్రాలు వేడుక కూడా ముగిసింది!" అన్నాడు.
    
    ఆమె చిరుకోపంగా చూసి, "అక్కడే ఆగితే మంచిది!" అంది.
    
    "అవును మిగిలిన వేడుక పెద్దవాళ్ళు చేస్తారు!" అన్నాడు.
    
    ఆమె అక్కడినుండి పారిపోయింది.
    
    మాధవ్ ఆమె దారికి అడ్డంగా నిలబడి "రాధా! డు యు లవ్ మి? అడిగాడు.
    
    ఆమె కళ్ళలో భయం కనపడింది. "అంటే?" అంది అమాయకంగా.
    
    నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అడిగాడు.
    
    ఆమె మోహంలో భయం స్థానే సిగ్గు ప్రవేశించింది. ఆకతాయి అల్లరి తలుపు మాటునుండి వచ్చి "సిగ్గమ్మా తప్పుకో.... అబ్బాయినో ఆట ఆడిస్తానంది.
    
    రాధ పరికిణీ కుచ్చెళ్లు పాదాలపైదాకా ఎత్తి బొటనవేలితో గచ్చుమీద గీస్తూ "ఊహుఁ" అంది.
    
    మాధవ్ తల ఎత్తి పైకి చూసి, కళ్ళల్లో ఏదో పడి, "అబ్బా! అని కళ్ళు నులుముకున్నాడు.
    
    రాధ ఒక్క ఉదుటున వచ్చి అతని తల వంచి కళ్ళల్లో నోరు పెట్టి, "ఉఫ్...." మని ఊది, "పోయిందా?" అని కంగారుగా అడిగింది.
    
    "ఎవరి కంట్లో నలక పడినా ఇలాగే ఊదుతావా?"
    
    "ఉహుఁ!"
    
    "మరదే... అదే ప్రేమంటే!" అల్లరిగా జవాబిచ్చాడు.
    
    ఆమె తల వాల్చి, కళ్ళు మాత్రం అద్భుతంగా ఏ.ఎం.ఎఫ్.హుసేన్ కుంచెకి అందనంత పైకెత్తి, 'ఇదేనా ప్రేమంటే?' అన్నట్లు చూసింది.
    
    'ప్రేమంటే నీ చీర కుచ్చెళ్ళని పైకి తీసి పదాలను గోదార్లో తడపగానే కలిగే 'జిల్' మనే భావన!"
    
    నిర్లక్ష్యంగా 'అంతేనా?' అన్నట్లు కళ్ళు ఆర్పి తల పైకెత్తింది.
    
    "నీ నాలిక కొనమీద పడే మొదటి వానచుక్క ఇచ్చే హాయి అయిన అనుభూతి!"
    
    "ఓఁ.... అదా!" అన్నట్టు ముక్కుపుటాలెగరేసింది.
    
    "నువ్వు నాటిన మొక్కకి పూసిన పూరేకు విచ్చుకాగానే నీ మనసులో కలిగే సందడి!" అన్నాడు.
    
    'అంతేనా?' అన్నట్టు మూతి తిప్పింది.
    
    "నేను ఎలిజబెత్ తో కలిసి లాస్ వెగాస్ లో గడిపిన రాత్రి గురించి చెప్పగానే నీలో కలిగే భావం!
    
    అతను ముగించకముందే ఆమె అదురుతున్న పెదవులతో, చెమరిస్తున్న కళ్ళతో "ఎలిజబెత్ ఎవరూ?" అంది.
    
    మాధవ్ అప్పుడే విరిసిన ఇంద్రధనస్సును చూసినట్లుగా ఆమెను చూస్తూ నవ్వాడు. వలపు ఎర్రన, కోపం నల్లన, విరహం పచ్చన, ప్రేమ తెల్లన... ఎన్నెన్ని రంగులు స్త్రీ మనోభావాల్లో!

 Previous Page Next Page