శోభనం గదిలో భర్త ఆమెతో అన్న మొదటి మాట కూడా అదే.
'నామీద నీకున్న అపారమైన ప్రేమ నీ భవిష్యత్తుకి అడ్డురాకూడదు విశాలా! చదువుకున్న ఆడవాళ్ళంటే నాకిష్టం కూడా ఎంత వరకు చదువుకోవాలనుకుంటే అంతవరకూ చదువుకో ఉద్యోగం చేయాలనుకుంటే చెయ్యి నేను బలవంతం చెయ్యను. కానీ ఈ రోజుల్లో స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం వుండడం ఎంతైనా అవసరం అని నమ్మేవాళ్ళలో నేనొకన్ని" అన్నాడు. ఆమె కోరికకు తనెంత విలువనిస్తున్నాడో ఆమె గ్రహించేలా.
విశాల హతాశురాలయింది. నిజంగా చదువంటే తనకు అంత ఇంటరెస్టు లేదని చెప్పే ధైర్యం లేదామెలో వారం తిరిగేలోపులో తిరిగి ఆమె కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. మేనత్తే అయిన అత్తగారు ఆమె చదువుకి ఆటంకం కలిగించకూడదని ఆమెని ఏ పనీ ముట్టుకోనిచ్చేది కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి విశ్వం స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళిపోయేవాడు. విశాల ఒక్కమాటయినా అనేది కాదు. అంటే వాళ్ళ దృష్టిలో తన గౌరవం తగ్గిపోతుందేమోనని భయం. అనేది కాదు. అంటే వాళ్ళ దృష్టిలో తన గౌరవం తగ్గిపోతుందేమోనని భయం.
పెళ్ళయిన మూడు నెలలకే ఆమె గర్భవతయింది.
"హమ్మయ్య! ఇకనైనా చదువు మానేయమంటారు" అని సంతోషపడింది విశాల. కాని అదీ ఫలించలేదు. అత్తగారు పిలిచి ప్రేమగా "దిగులు పడకే విశాలా, డెలివరీ ఎలాగూ వేసవి సెలవుల్లో అవుతుంది. నీ చదువుకేం అడ్డంకీ వుండదు. పుట్టిన బిడ్డని చూసుకోడానికి నేను లేనూ" అంది.
చదువు, వేవిళ్ళ మధ్య విశాల నలిగిపోకుండా ఆవిడ అనుక్షణం ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది. మంచినీళ్ళతో సహా అన్నీ అందించేది. విసాలకు పాప పుట్టింది. "సృజన" అని పేరు పెట్టారు. ఆ తర్వాత రెండేళ్ళపాటు పిల్లలు పుట్టకుండా జాగ్రత్తపడ్డాడు విశ్వం.
విశాల బి.యస్సీ థర్డుక్లాసులో పాసయింది. "పెళ్ళీ, పిల్లలూ అయ్యాక ఫస్టుక్లాసు తెచ్చుకోవడం ఎలా అవుతుందిలే అసలు పాసవడమే గొప్ప" అని అందలం ఎక్కించారామెను.
ఆ సంవత్సరమే మామగారు రిటైరయ్యారు. తనకు తెలిసిన వాళ్ళను పట్టుకుని ఆమెను అదే డిపార్టుమెంటులో ఉద్యోగం వేయించారు. కాదనే ధైర్యం లేదామెకు. "నువ్వు తప్పించుకోలేనిదాన్ని అలవాటు చేసుకోవడం మంచిది" అని ఇంగ్లీషు సామెత అలాంటప్పుడు ఇష్టంలేదని చెప్పి చెడ్డదాన్నయేకంటే అది తన గొప్పతనంగా చూపించుకోవడం శ్రేయస్కరం అని ఆమెకు తెలుసు. మామగారు వార్త చెప్పగానే మొహం నిండా సంతోషాన్ని పులుముకుని, ఎగిరి గంతేసి ఆయనకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంది.
"మా విశాలకు ఉద్యోగం వచ్చింది" -వాళ్ళే పిలిచి ఉద్యోగం ఇచ్చారన్నంత గొప్పగా అందరికీ చెప్పుకున్నారు.
చదువుకోవలసిన అవసరం తగ్గిపోయేటప్పటికి విశాల క్రమక్రమంగా సెలవురోజులలో విశ్వంతో కలిపి బయటకు తిరగటం ప్రారంభించింది. తన స్నేహబృందంతో విశాల కలిసిపోవడం విశ్వానికి చాలా తృప్తి కలిగించింది. మెల్లగా మామూలు రోజులలో కూడా ఆమెను బయటకు తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు.
మరో ఏడాదికి "వరుణ్" పుట్టాడు. అత్తమామల ఆనందానికి అవధులు లేవు తమకు వంశోద్దారకుడిని ప్రసాదించిన విశాలను నెత్తిన పెట్టుకున్నారు.
పగలు ఉద్యోగం, సాయంత్రం సినిమాలు, షికార్లతో విశాలకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఆమెకు ఏ లోటూ లేదు. పిల్లల బాధ్యత అంతా అత్తమామలే తీసుకున్నారు. కావలసినంత తీరిక, డబ్బుకి కొదవలేదు. జీవితంలో కావలసినవన్నీ సాధించినట్లేనని విశాల అభిప్రాయం.
ఇంట్లో పనిమనిషి వేళకు రాకపోవడం, సమయానికి బస్సు అంధక పోవడం, వరలక్ష్మీ వ్రతానికి ఆఫీసరు సెలవు యివ్వకపోవడం, తనకు యిష్టమయిన హీరోయిన్ సినిమాకు మొదటి ఆటకు టిక్కెట్టు దొరకక పోవడం ఆమెకు చెప్పుకోదగ్గ సమస్యలు. అమ్మాయికి ఫస్టుగ్రేడు రావడం, అబ్బాయి తండ్రిలాగే క్రికెట్ అంటే యిష్టపడడం, పెళ్ళిరోజున భర్త తనకి ముందు చెప్పకుండానే పట్టుచీర తేవడం ఆమె గొప్పగా చెప్పుకునే విషయాలు.
జీవితంలో యింతవరకు నువ్వు సాధించిన దేమిటి అని ప్రశ్నిస్తే బహుశా భర్తాపిల్లల్నీ, తన బ్యాంక్ అకౌంటునీ, చేయించుకున్న ముఫ్ఫైతులాల బంగారు నగల్నీ చూపిస్తున్నది విశాల. ఈ దేశంలోని నూటికి తొంభైతొమ్మిది మంది ఆడవాళ్ళలాగే తను చాలా అదృష్టవంతురాల్ని అనుకుంటూ వుంటుంది.
పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు. ఏడాది తేడాతో విశాల అత్త మామలిద్దరూ ఎక్కువ జబ్బు పడకుండానే పోయారు. తన కిష్టమయిన, తనంటే యిష్టపడే బామ్మని తెచ్చి దగ్గర పెట్టుకుంది విశాల. బామ్మ మొదటి నుంచి ఆమెకు గురువే. అత్తింటికి పంపే ముందూ, తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా ఆమె అనేక నీతులు బోధించింది. భర్తను ఆకట్టుకోవడం ఎలాగో, కొంగున కట్టేసుకునే మార్గాలేమిటో అన్నీ వివరించేది. అవన్నీ ఆచరణలో పెడుతూనే వచ్చింది విశాల. ఆ బామ్మే తనకు దగ్గరగా వుండడం విశాలకు సంతోషాన్ని కలిగించింది.
అన్నాళ్ళూ అమ్మా నాన్నలకు భయపడి స్నేహితులతో బయట కాలక్షేపం చేసే విశ్వం ప్రోగ్రాం అంతా యింటికే మార్చేశాడు. సెలవు రోజొస్తే వాళ్ళిల్లు పెళ్ళిలో విడిదింటిలాగా తయారయ్యేది. విశాలకు కోపం రావడం గమనించి మందలించింది బామ్మ.
"ఊరుకోవే పిచ్చిదానా ఇలాగయినా అతను నీ కళ్ళముందుంటాడు. మగవాళ్ళ బుద్దులు ఏవేళ ఎటు మళ్ళుతాయో తెలియదు. అప్పుడు చూడలా? జయ వెంటపడ్డాడు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇదివరకులా నువ్వు అతడివెంట తిరగడం కుదరదు. ఇంటికే రానీ అదే మంచిది" అని హితబోధ చేసింది. విశాలకు ఆ మాటా నిజమేననిపించింది. ఆ జయ పెళ్ళే చేసుకోకుండా కన్యగా వుండిపోయిందింతవరకూ ఆ భయం విశాలకి వుంది. పేకాటలో కూర్చున్నవాళ్ళకు టిఫిన్లు, కాఫీలు అందిస్తూ భర్త ఆదరణని మరింతగా పొందింది విశాల.
కొందరు జీవితాన్ని ఒక కోణంలోంచే చూస్తారు. తాము చేసేదంతా ఒప్పేనని, ఎదుటివాళ్ళందరిలోనూ లోపాలుంటాయనీ గాఢంగా నమ్ముతారు. విశాల ఆ కోవలోకి చెందిందే.
జీవితాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించే వ్యక్తి ఆ కుటుంబంలోకి అడుగుపెడితే ఆ సంసారాన్ని ఏ రకంగా విశ్లేషించడం జరిగుతుంది? అనుకోకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఒకమ్మాయి.
2
సునీత విశ్వనాథం పెదతండ్రి కూతురు. తండ్రికి ఎక్కువగా ట్రాన్స్ ఫర్లయ్యే ఉద్యోగం కావడంతో కొన్నేళ్ళు ఆమె బాబాయి గారింట వుండి చదువుకుంది. స్వంత అన్నయ్యలు ఇద్దరున్నా, వాళ్ళతో కలిసి వుండే అవకాశం తక్కువవడంతో ఆమెకు విశ్వనాథం దగ్గరే బాగా చనువు ఏర్పడింది.
సునీత మొదటిసారిగా ఆ యింటికి వచ్చినప్పుడు ఆమె వయసు పదేళ్ళు. చెల్లెళ్ళు లేని విశ్వం ఆమె అంటే ప్రాణం పెట్టేవాడు. పాఠాలే కాకుండా ఎప్పుడూ కబుర్లూ, కథలూ చెపుతుండేవాడు. అతడి ప్రేమా, అభిమానం ఆమెకు తల్లిదండ్రులు దగ్గరలేని లోటు ఫిలవ్వనివ్వలేదు. తండ్రి హైద్రాబాద్ ట్రాన్స్ ఫరయి అక్కడున్న మూడేళ్ళు ఆమె విశ్వనాధానికి కాస్త దూరమయింది. తిరిగి పదిహేనోయేట ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అప్పుడప్పుడే వికసిస్తున్న ఆమె బుద్దికి ఒక రూపునిచ్చింది విశ్వమే. అడాలసెంట్ వయసులో ముద్రించుకుపోయిన భావాలు జీవితాంతం చెరిగిపోనివి. స్వతహగా తెలివయినదీ, పరిశీలనా శక్తి గలదీ అయిన సునీత వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో విశ్వం ప్రభావం చాలా వుంది.
ఆమెకు తెలిసిన విశ్వం సకల విద్యా పారంగతుడు ప్రాచీన, ఆధునిక సాహిత్యాలనూ, చరిత్రలనూ, సాంప్రదాయాలనూ క్షుణ్ణంగా పరిశీలించినవాడు. మంచి విమర్శకుడు. ఆమెకు సాహిత్యాన్ని పరిచయం చేసిందితడే తమ ఇంట్లో, బంధువుల ఇళ్ళలో జరిగే పూజా పునస్కారాలనూ, వేడుకలనూ, సాంప్రదాయాలనూ విశ్లేషించి ఆమెతో చర్చిస్తూండేవాడతను.
"ఈ రోజు తాతయ్య ఆబ్దికం ఆయన కిష్టమైన పదార్దాలే కాకుండా అన్ని పిండివంటలు చేయించాం. ఆయన ఆత్మకోసం తృప్తిగా భోజనం చేశాం. కానీ తాతయ్య గాంధీజీ శిష్యుడు. చనిపోయేరోజువరకూ ప్రతి రోజూ గంటసేపు నూలు వడికేవాడు. మనం ఈ రోజు ఆయన కిష్టమయిన పదార్ధాలు చేసుకుని తింటే ఆయన ఆత్మకు సంతి కలుగుతుందని, ఆయనకు స్వర్గప్రాప్తి జరుగుతుందని నమ్మినప్పుడు, ఆయనకు చాలా ఇష్టమయిన నూలువడికే పనిచేస్తే ఆయన ఆత్మకు తప్పకుండా శాంతి కలుగుతుంది కదా కాని చెయ్యం...ఆ పని మనకు బోర్ కొడుతుంది. కాబట్టి చెయ్యం..."
ఇవి కొన్ని మచ్చుతునకలు. వాటిని అతిజాగ్రత్తగా డైరీలో నోట్ చేసుకునేది సునీత. ఆమె నోట ఎప్పుడూ విశ్వం అన్నయ్యమాటే వచ్చేది. చదువు పూర్తయి విశాఖపట్టణం వెళ్ళిపోయినా ఆమెమీద విశ్వం ప్రభావం పోలేదు. ఇప్పుడు భర్త ఉద్యోగం నిమిత్తం అరబ్ దేశాలకు వెళ్ళడంతో ఒంటరిగా విశాఖపట్టణంలో వుండలేక ట్రాన్స్ ఫర్ చేయించుకుని హైదరాబాద్ వచ్చింది.
సునీత ఈ మధ్యకాలంలో పుస్తకాలూ, జీవితాలూ చాలా చదివింది. మానసికంగా చాలా ఎదిగానని, అన్నయ్యతో అన్ని విషయాలలో సమానంగా చర్చించగలననే ధైర్యం వచ్చేసింది. అందుకే తల్లిదండ్రులనూ, అన్నయ్యలనూ కూడా కాదని విశ్వం దగ్గరకు వచ్చింది. అందులో జయ కూడా హైదరాబాదులోనే వుంది. జయంటే ఆమెకు చాలా ఇష్టం. బంధుత్వం దూరమైనదే అయినా చిన్నతనంలో వాళ్ళింటికి దగ్గరలో వుండటం మూలంగా వాళ్ళిద్దరికీ బాగా స్నేహం కలిసింది. విశ్వం అన్నయ్య జయను చేసుకుంటే బావుండేదని ఎన్నోసార్లు అనుకున్నా, విశ్వం, విశాల దాంపత్యాన్ని గురించి బంధువులందరూ మెచ్చుకోవడం విని, అన్నయ్యకు అనుకూలవతి అయిన భార్య దొరికిందని సంతోషించింది. ఇప్పుడు వాళ్ళమధ్య తను కనీసం రెండేళ్ళు వుండబోతోంది. ఆ ఇల్లు ఒక నందనవనం అయుంటుంది. పిల్లలు ఆణిముత్యాల్లా మెరిసి పోతుంటారు. వాళ్ళను మంచి క్రమశిక్షణలో, అభ్యుదయ భావాలతో పెంచుతుంటారు. వాళ్ళమధ్య కొన్నాళ్ళు గడిపే అదృష్టం తనది అనుకుంటూ వచ్చిందామె.