Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 17

   

        వచ్చిన మొదటిరోజునే ఆమెకు చిన్న ఆశాభంగం కలిగింది. విశ్వం స్టేషనులో రిసీవ్ చేసుకుని ఇంట్లో దింపి పనుందని వెంటనే ఆఫీసుకి వెళ్ళిపోయాడు. విశాల కూడా ఎలాగూ ఆఫీసుకి వెళ్ళిపోతుంది కదాని తనూ జాయినవడానికి బయలుదేరింది సునీత.
   
    "ఏమిటి? ఇవ్వాళ్ళ వెళ్ళి ఆఫీసులో జాయినవుతావా? వద్దు ఇవాళ అష్టమి మంగళవారం మంచిదికాదు. రేపు వెళుదువిగానిలే" అభ్యంతరం చెప్పింది విశాల సునీతకు ఏం చెప్పాలో తోచలేదు.
   
    "నా కివన్నీ నమ్మకం లేదొదినా! ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తాను? వెళతాను" అంది బ్రతిమాలుతున్న ధోరణిలో.
   
    "నీకు లేకపోతే నాకుంది. తర్వాతేమయినా అయితే బవుండదు. ఇంట్లో వున్నప్పుడు కాస్త నా మాట విను. ఈ రోజు నువ్వు వెళ్ళడం నా కిష్టంలేదు" అంది విశాల కాస్త తీవ్రంగా.
   
    వచ్చిన మొదటిరోజునే వదినతో గొడవ పెట్టుకోవడం ఇష్టంలేక ఆగిపోయింది సునీత. అన్నింటినీ హేతువాద్మతో తర్కించే విశ్వం అన్నయ్య ఇంట్లో ఈ పరిస్థితిని ఆమె వూహించలేకపోయింది.
   
    విశాల ఆఫీసుకి వెళ్ళిపోయాక ఏమీ తోచక జయ వాళ్ళింటికి బయలుదేరింది. అనుకోకుండా జయ ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే వుంది. రెండేళ్ళలో బాగా చిక్కిపోయింది. పదేళ్ళు వయసు పెరిగినట్లనిపిస్తోంది.
   
    "ఏమిటిలా అయిపోయావ్ జయా? ఏమిటి సుస్తీ" గాభరాగా అడిగింది సునీత.
   
    "ఇది మామూలు వైద్యులు నయం చెయ్యలేని జబ్బులే. ఇప్పుడు కాస్త కోలుకుంటున్నాను. నీ విషయం ఏమిటి? సడన్ గా వూడిపడ్డావు. ఎప్పుడు రాక? ఏమిటి విశేషాలు?"
   
    భర్త విదేశయానం గురించీ, తన ఉద్యోగం గురించీ చెప్పింది సునీత.
   
    "అయితే రెండేళ్ళు ఇక్కడ వుండబోతున్నావన్నమాట. ఎక్కడుండాలని?"
   
    "విశ్వం అన్నయ్య దగ్గరే! మరెక్కడైనా వుండనిస్తాడా అన్నయ్య నన్ను?" నవ్వుతూ అంది సునీత.
   
    విశ్వం ప్రసక్తి రాగానే జయ ముఖం మ్లానమయింది.
   
    "ఏమ్మా, విశ్వం ఎలాగున్నాడు? చాలా రోజులయింది చూసి, రావడమే మానేశాడు. మేము వెళదామంటే ఆ విశాలకూ, వాళ్ళ బామ్మకూ ఇష్టం వుండదు కాబోలు మమ్మల్ని చూడగానే మొహాలు మాడ్చేస్తారు" అంది జయ తల్లి.
   
    "అవన్నీ ఎందుకమ్మా? బావ ఉద్యోగం సంగతి మనకు తెలుసుగా మనింటికి రావడం వీలుపడడం లేదేమో ఎందుకలా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం?" అంది.
   
    "అన్నయ్య రాకపోవటం జయ మనసుకి కష్టం కలిగిస్తుంది. అన్నయ్యని అడగాలి ఈ విషయం" అనుకుంది సునీత. అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వలేకపోయిందప్పుడు. సాయంత్రం వరకు అక్కడే గడిపి ఇంటికి తిరిగి వచ్చింది. ఉదయం విశ్వంతో సరిగ్గా కుదరనేలేదు-సాయంత్రం ఆఫీసునుంచి రాగానే కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి.
   
    విశ్వం వస్తూనే మరో ఇద్దరు స్నేహితులని వెంటబెట్టుకుని వచ్చాడు.
   
    "సునీతా! నీ కోసం కొత్త తెలుగు సినిమా కేసెట్టు తీసుకొచ్చా వచ్చి కూర్చో" హుషారుగా పిలిచాడు. వీడియోలో సినిమా చూడ్డంలో మునిగి పోయారంతా విశాల వంటింట్లో పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి కాస్సేపు చూసి వెళుతోంది.
   
    సినిమా పూర్తయి స్నేహితులు వెళ్ళేసరికి రాత్రి ఎనిమిదిన్నర దాటింది. వెంటనే భోజనాలకు కూర్చున్నారందరూ. అది పూర్తి చేసుకుని మళ్ళీ  టివీ కట్టేవరకూ కామెంట్స్, జోక్స్ వేసుకుంటూ అంతకు మించిన ఆనందం మరేం లేదన్నట్లుగా ప్రవర్తించారు. ఆ తర్వాత నిద్రొస్తూందంటూ వెళ్ళి పడుకున్నాడు విశ్వం.
   
    పడుకోబోయేముందు డైరీ వ్రాయాలని కూర్చుంది సునీత. కలం ముందుకు సాగలేదు. ఏదో నిరాశ ఆవరించుకుంది మనసంతా. "టెలివిజన్ పెద్ద మాస్ మీడియా కదా, ఇరవై నాలుగ్గంటలూ దుఃఖించే స్త్రీలను చూపిస్తూ, వాళ్ళగతి యింతే అనీ, అందులోనే వాళ్ళానందం అనుభవిస్తారనీ చూపించే ఈ కథలను అన్నయ్య, వదినలలాంటి విజ్ఞాన వంతులు కూడా ఎలా ఆనందించ గలుగుతున్నారు?" అని వ్రాసుకుంది చివరగా.
   
                             *    *    *
   
    వారం రోజులు గడిచేటప్పటికి ఆమెకా యింటి పరిస్థితి కొంత అర్ధమయింది. విశ్వం ఎప్పుడు చూసినా బిజీగానే వుంటాడు. సెక్యూరిటీ గార్డులా స్నేహితులో లేక విశాలో పక్కనే వుంటారు. తీరిగ్గా కూర్చుని మాట్లాడుకునే వ్యవధే కనిపించదెప్పుడూ పిల్లల విషయంలోనూ ఆ దంపతులు పెద్దగా కేర్ తీసుకుంటున్నట్లుగా లేదు. చదువు విషయం ట్యూషన్ మాస్టర్ మీద వదిలేశారు. వాళ్ళడిగినవన్నీ కొనిపెట్టి తన బాధ్యత తీరిపోయిందనుకుంటుంది విశాల. విశ్వం పిల్లల విషయం పట్టించుకోడసలు. వాళ్ళిద్దరూ రోజంతా బిజీగానే కనిపిస్తారు కాని చేసే పనేమిటో ఎవరికీ తెలియదు.
   
    "అన్నయ్యా! సృజన సైన్సులో చాలా పూర్ గా వుంది. ట్యూషన్, మాస్టరు చెప్పింది కంఠతా పడుతోంది తప్ప అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించటం లేదు". విశ్వం తీరిగ్గా పేపరు చదువుతుండగా సమయం చూసుకుని అంది సునీత.
   
    "మీ అన్నయ్యకు అవన్నీ చూసుకోవడానికి టైమెక్కడుంటుందమ్మా? ఉదయమనగా వెళ్ళి సాయంత్రం వస్తారింటికి అప్పటికే బాగా అలసిపోతారు. అందుకేగా ట్యూషన్ పెట్టించాను. బాగానే చెప్తాడు. ఎప్పుడన్నా టైముంటే నేనే చెపుతాను కాని డానికి సైన్సంటే యిష్టం వుండదు. బోర్ అంటుంది" కాఫీ తీసుకొస్తున్న విశాల అందుకుంది. విశ్వం ఆమెవైపు చూసి నవ్వాడు తృప్తిగా.
   
    "నా మీద ఈగ కూడా వాలనివ్వదు మీ వదిన".
   
    "ఈగ వాలడం కాదు. వీళ్ళకు సృజన చదువు సంగతి చీమ కుట్టినట్లయినా లేదు" అనుకుంది సునీత.
   
    "సుజీకి ఇష్టం లేని సబ్జెక్టు చదవమని బలవంతం చెయ్యడం మంచి పనికాదు సునీతా! దాని సైకాలజీ నాకు బాగా తెలుసు. మనం కోప్పడితే రెచ్చిపోయి మరీ మొండికేస్తుంది" అన్నాడు విశ్వం.
   
    "అన్నయ్యా! నీకు గుర్తుందా? నా చిన్నతనంలో లెక్కలంటే నేనూ ఇదే విధంగా బిహేవ్ చేసేదాన్ని నువ్వే నన్ను బుజ్జగించి లెక్కలు చెప్పేవాడివి. ఆ తర్వాత లెక్కలు నాకు ఫేవరేట్ సబ్జెక్టు అయిపోయింది. పిల్లల్లో సబ్జెక్టు మీద యిష్టం కలిగించడం చెప్పేవాళ్ళని బట్టి వుంటుందనే వాడివి నువ్వే".
   
    తను ఆ విషయం మాట్లాడినంతసేపూ విశాల అక్కడనుంచి కదలదని అర్ధమయి పోయింది సునీతకు.
   
    "మొండి వాళ్ళంటే గుర్తొచ్చింది అన్నయ్యా! 'గాత్ విత్ ది విండ్ చదివానీ మధ్య స్కార్లెట్ ఒహోరా పాత్ర వారంరోజులదాకా నా మనసులో కదులుతూనే వుంది. ఎంత మొండిది! ఆమె అంటే జాలివేస్తుంది తప్ప కోపంరాదు. ఒకే ఒక్క నవల వ్రాసినా మార్గరేట్ మిచెల్ ఎంత బాగా వ్రాసింది".
   
    "అవును విన్నాను. కొనిపెట్టాను గాని చదవటానికి టైం దొరకడంలేదు" అనుకున్నట్లుగానే పుస్తకాల ప్రసక్తిరాగానే విశాల లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. "నువ్వే చూస్తున్నావు గదమ్మా ఎంత బిజీ అయిపోయిందో లైఫ్" అన్నాడు విశ్వం.
   
    "సినిమాలు చూడ్డం మానేస్తే చాలా టైం దొరుకుతుంది" అనబోయి సమయం కాదని వూరుకుంది. వచ్చిన అవకాశం వాదులుకోదల్చుకోలేదు. "అన్నయ్యా జయను కలిశాను మొన్న. చాలా చిక్కిపోయింది. జబ్బు చేసిందట. నువ్వటు వెళ్ళటం లేదటగా. అత్తయ్య కూడా అడిగింది నీ గురించి".
   
    విశ్వం మొహంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. వెంటనే సర్దుకున్నాడు.
   
    "నేనేం చెయ్యనమ్మా? నేను జయా వాళ్ళింటికి వెళ్ళడం జయకే లేనిపోని ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. తనకి కష్టం కలిగించకూడదనే నేను వెళ్ళడం మానేశాను. నువ్వెళ్ళి చూసి వస్తుండు. ఎందుకయినా మంచిది మీ వదిన దగ్గర వాళ్ళ విషయం ప్రస్తావించకు. వెళ్ళవద్దని శాసించదు గాని మనసులో బాధ పడుతుంది".
   
    వదినకు కష్టం కలిగించే పని జయ ఏం చేసిందో అడగబోయింది సునీత.

    "సునీతా నీళ్ళు కాగాయి. వరుణ్ కి స్నానం చేయించు వచ్చి" వంటింట్లోంచి అరిచింది విశాల.
   
    ఒక్కనిముషం తన అన్నయ్యతో ఏకాంతంగా మాట్లాడుతుంటేనే సహించలేని వదిన జయ విషయంలో అలా ప్రవర్తించటంలో ఆశ్చర్యమేముంది? లేచి లోపలికి వెళ్ళిపోయింది సునీత.
   
                             *    *    *

 Previous Page Next Page