పుల్లయ్య ఉక్కిరిబిక్కిరైనాడు. ఆనందం పట్టలేకపోయాడు. గొంతులోంచి మాటసైతం పెకల్లేదు. వెంటనే గుడిసెలోకి పరిగెత్తి ముంతతో నీళ్ళు తెచ్చినాడు. ఆ తరువాత మంచం వేశాడు. నరేంద్రజీ మంచంమీద కూర్చున్నాడు. పుల్లయ్య అందర్నీ పిలవడానికి వెళ్ళాడు.
క్షణంలో గూడెమంతా ఒకచోట కూడింది. ఈ సంస్కరణ చూడడానికి అన్నట్లు చంద్రుడు పైకి వచ్చి వెన్నెల విరిశాడు.
నరేందర్ జీ వాళ్లకిలా చెప్పాడు:
"సోదరులారా!
"మనంతా హిందువులం. మనందరికీ ఒకడే దేవుడు. వేదకాలంలో కులాలు లేకుండే. మనమంతా ఒకేచోట తినాలి. ఒకేచోట కూర్చోవాలి' అంటుంది వేదం. "నజ్యేష్టాసో నకనిష్టాసో" అంటుంది. అంటే మనలో ఒకడు పెద్దవాడుకాని, ఒకడు చిన్నవాడుకాని లేడని అర్ధం. కులాలు కొందరు స్వార్ధపరులైనవారు- ముఖ్యంగా బ్రాహ్మణులు సృష్టించినవి. అంటరానివాడూ అంటవచ్చినవాడూ అనేది యే శాస్త్రంలోనూ, ఏ వేదంలోనూ చెప్పబడలేదు. అవి మానవులు సృష్టించినవి. దేవుడు మనందరికి తండ్రి, అతని దృష్టిలో అందరూ సమానులే. మన మతం ఈనాటిది కాదు. కొన్నివేల సంవత్సరాల నుండి వస్తున్నది. మతం మార్చడంవల్ల కలిగే ప్రయోజనంలేదు. తురకల్ను చేసి మిమ్మల్నందర్నీ ప్రభువుల్ను చేస్తామని చెపుతారు. కాని, తిండిలేక మాడే తురకల్లేరా? ముసల్మానులంతా ఒకటే అని చెపుతారు కదా! మన హుజూర్ కొడుక్కు మీ కూతుర్ను చేసుకుంటాడా? ఆయన వచ్చి మీతో కూర్చొని తింటాడా? పోతే, మనలో కులాలు ఉన్నాయని వెక్కిరించేవారి మతంలో కులాలు లేవా? షియాల పిల్లలను సున్నీలు చేసుకోరు. సున్నీ వాడెవడైన మంచినీళ్ళడుగుతే షియా వాడు ఉమ్మి ఇస్తాడు. మహమ్మదు చివరి ప్రవక్త అని నమ్మేది ఇస్లాం. మెహద్వీ తెగకు చెందినవారు మహమ్మద్ తరువాత వాడు అయిన మెహదీని ప్రవక్తగా భావిస్తారు. వారి తెగకు చెందినాడే బహద్దూర్ యార్ జంగ్. వాస్తవంగా అతడు ముసల్మాను కాడు. అలాంటివానికి మిమ్మల్ని ముసల్మానులను చేసే హక్కు ఎక్కడిది? వర్గద్వేషాలు వాళ్ళలో మనలోకన్నా ఎక్కువ ఉన్నాయి. వాటినన్నింటినీ కప్పిపుచ్చి, అమాయకులైన మిమ్మల్ని మోసగిస్తున్నారు. వారిచ్చే భూములవల్ల మీరు ధనవంతులౌతారా? మనం కష్టం చేయాలి. భాగుపడాలి. చారెడు నేల చెక్కకోసం తండ్రి తాతల్నుంచి వచ్చే మతాన్ని వదులుకుంటామా? మన దగ్గర కోన్ని దురభ్యాసాలున్నాయి. వాటిని మనం వదులుకోవాలి. తాగుడు మానెయ్యాలి. దానివల్ల ఎంత డబ్బు పాడౌతుంది? శరీరం ఎంత పాడౌతుంది? ఆలోచించారా? మాంసాదులు తినడం మానివేయాలి. రోజూ స్నానం చెయ్యాలి. శుచిగా, శుభ్రంగా ఉండాలి. చదువుకోవాలి. మీ పిల్లలకు చదువు చెప్పించాలి. అలా అయితే మీ అంతట మీరే బాగుపడతారు. చెప్పండి. ఇప్పుడు హిందువులవుతారా?" అని అడిగాడు నరేంద్రజీ.
"అవుతం" అన్నారు అంతా ఒకే గొంతుతో.
"అయితే స్నానాలు చేసి రండి" అన్నాడు నరేంద్రజీ.
అంతా వెళ్ళిపోయారు. అందరూ శ్లాఘించారాయన్ను.
స్నానాలుచేసి వచ్చేశారంతా. ఒక ముంతలో మంచినీరు తెప్పించాడాయన - హోమంచేసే ఆవకాశం లేదు కాబట్టి. తన సంచీలోంచి ఒక సీసా తీశాడు. అది చూపించి, "ఇది గంగాజలం. కాశీనుంచి తెప్పించాను. దీనిని మీ నీళ్ళల్లో కలిపేస్తున్నాను" అని సీసామూత తీసి ముంతలో పోసేశాడు. "ఇప్పుడీ నీరు మంత్రం చదువుతూ మీమీద చల్లుతాను. మీరు పవిత్రులైపోతారు. గంగాజలం ప్రభావం తెలుసునా? ఎన్ని పాపాలు చేసినా హరిస్తుంది. ఇక నుంచి మీరు శుచిగా బ్రతకాలి. కల్లు, సారాయి త్రాగరాదు. మాంసం తినరాదు" అని నీరు చేత్తో తీసుకొని గాయత్రి చదువుతూ అందరిమీదా మూడుసార్లు చల్లాడు.
తలలువంచి చల్లించుకున్నారంతా.
"ఇప్పుడు మీరంతా హిందువులైపోయారు. ఇక మీకు తురక పేర్లు లేవు. మీ మీ పేర్లు చెప్పండి" అని అందరి పేర్లూ వ్రాసుకున్నాడు, ఉమూర్ మతహబీ (మత సంబంధమైన శాఖ) కి పంపడానికి.
"నేను 'హిందూధర్మకీ' అంటాను. మీరు 'జే' అనాలి" అన్నాడు. తరువాత -
'హిందూ ధర్మకీ' అన్నాడు నరేంద్రజీ.
మిక్కిలి ఉత్సాహంతో గొంతులు చించుకొని 'జై' అన్నారు అంతా. అలా మూడుసార్లు అనిపించాడు.
'కల్లు, సారాయి త్రాగము, మాంసము తినము' అనిపించాడు మూడుసార్లు.
ఆ రాత్రి గూడెంలోనే పడుకొని, తెల్లవారి రామారెడ్డిగార్ని కలిసి వెళ్ళిపోయాడు నరేంద్రజీ.
11
మామూలుగా వెళ్ళినట్లే కారణం ఇంటికి వెళ్ళాడు సారంగపాణి. అక్కడ అతనికో లంబాడీ తండాకు తండా కనిపించింది. తల గుడ్డలూ, మోకాలివరకు పంచలూ, మొలకు హాలీ బేడల మొలతాళ్ళు కలిగిన మగవాళ్ళు కర్రలు పట్టుకొని కూర్చున్నారు. ఒక్కొక్కని ముందు ఒక్కొక్క సద్దిమూటా, కొందరి చెవులలో ఆకు చుట్టలుండగా, కొందరు చుట్టలు కాలుస్తూ తుపుక్కు తుపుక్కున ఊస్తున్నారు. ఆడవారు అద్దాలు తాపిన ఎర్రని పరికిణీలూ, వీపు కనిపించే అద్దాలు తాపిన రవికలూ తొడుక్కున్నారు. తలమీద అద్దాలు తాపిన ఓణీలు వేసుకున్నారు. మెడలలో హాలీ రూపాయల దండలూ, పగడాల్లాంటి ఎర్రని పూసల దండలూ వేసుకున్నారు. మోచేతులవరకు అంగుళం కంటే ఎక్కువ వెడల్పున గాజులు వేసుకున్నారు. ఆడవాళ్ళు సైతం నేలమీద కూర్చొని కొందరు పిల్లలకు పాలిస్తున్నారు. కొందరు తలలు దువ్వుకుంటున్నారు. కొందరు పేలు చూపించుకుంటున్నారు. నగ్నంగా ఉన్న పిల్లలు అటు, ఇటూ పరిగెత్తుతూ గెంతుతూ ఆడుకుంటున్నారు. పాణిని చూచి అంతా లేచి నుంచున్నారు. దండాలు పెట్టారు. ఆశ్చర్యంగా చూచాడు పాణి.
"గీ కరణపాయిన తండ్రి మా అయ్య తాన జమీ (భూమి) నిప్పిస్తనని పైకం తీసుకున్నడండి. మా అయ్య తిరిగిండు, తిరిగిండు, చచ్చిండు. పెద్ద కరణపోడు కూడ చచ్చిండుండి. చిన్న కరణపోనికి హుకూమత్ వచ్చింది. ఏండ్లనుంచి తిరుగుతూన్నముండి. జమీన్ లేదు. గిమిన్ లేదు. ఇగ్గో ఇయ్యాలంటడు అగ్గో రేపంటడు. ఆ జమీన్ నారయ్యగారికి అమ్ముకున్నడు. పైకం తిన్నడు. ఎంత తిరిగినా మాట్లాడడు. ఎన్నిసార్లు అడిగినా మాట్లాడడుండి. ఇంట్లనే ఉంటడు. లేడనిపించుకుంటడు. గరీబోల్లం మా నోళ్ళల్ల మట్టికొట్టి ఏం బాగుపడ్తడండి? పిల్లలు పుట్టకుండైన్రా" అని ఒకడనగానే, ఒక ఆడది లేచి రెండుచేతులెత్తి గట్టిగా శపిస్తూన్నట్లు 'పురుగులు పడి చస్తడు' అన్నది. మళ్ళీ మొదటివాడు అందుకొని 'అరే అయ్యా! నువ్వే చెప్పూ నాయం. పైకంపాయె, ఇన్నేండ్ల ఫసల్ (పంట) పాయె, దున్నుకోటాన్కి జమీన్ లేకపోయె. ఎట్ల బతుకుతముండి? కరణం ఇంట్ల ఉన్నాడేమో జరచూసి చెప్పండి' అన్నాడు.