Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 17

    "ఈ టెంక వెధవ- ఎలాంటి ప్లాన్ వేస్తాడో" వీర్రాజు బాధగా బుర్ర గోక్కుంటూ అన్నాడు.

    "లాభంలేదు- ఈ రాత్రికే మనం సొరంగం తవ్వేయాలి- తప్పించుకోవాలి-"

    "జైల్లో శాశ్వతంగా ఉండడానికి, మర్డర్ చెయ్యక తప్పదు- ఎవర్ని చేద్దాం-" ఆవేశపడిపోతూ అన్నాడు వీర్రాజు.

    "ముందు తప్పించుకోవాలి- అందుకోండి- సత్తుగిన్నెలు- వాటిని మధ్యకు మడచండి- ఒక్కొక్క సత్తుగిన్నెనూ ఒక్కొక్క గునపంగా చెయ్యండి- ప్రేమజీవుల్ని ఏకం చెయ్యండి- ప్రపంచ ప్రేమికులారా ఏకంకండి-" గట్టిగా అరవబోయాడు పోతురాజు.

    "నోర్ముయ్- పద డైనింగ్ హాల్ కి" సేతురాజు ముందుకు నడుస్తూ అన్నాడు.

    వాడిని అనుసరించాడు మిగతా ఇద్దరూ.

    అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు దాటింది.

                               ౦    ౦    ౦

    శతాబ్దాల తరబడి గుచ్చిన, మేలైన మంచి ముత్యాలదండ అకస్మాత్తుగా తెగిపోయి, ముత్యాలన్నీ మట్టిపాలైనట్టుగా అయిపోయింది సుదేష్ణాదేవి మనసు.

    ఒక్కసారిగా అ బిల్డింగ్ లోని అంతులేని సంతోషానికి ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టుగా అయిపోయింది పరిస్థితి.

    కాళేశ్వర ప్రసాద్ స్వయంగా స్టార్ట్ హాస్పిటల్స్ లోని, చిల్డ్రన్స్ స్పెషలిస్టులకి ఫోన్ చేస్తున్నాడు.

    బెడ్ రూమ్ లో బెడ్ మీద ఉలుకూ, పలుకూ లేకుండా నిద్రపోతున్నాడు తేజ.

    నిన్న సాయంత్రం వరకూ, కళకళ్ళాడుతూ, గంథపుబొమ్మలా తిరిగిన తేజ, నీరసంగా మాటలు రానివాడిలా, చలనరహితంగా ఉండడంతో సుదేష్ణాదేవి మనసు బాధతో విలవిల్లాడిపోతోంది.

    రాత్రి తన దగ్గరే పడుకోబెట్టుకుంది తేజను. తెల్లవారుఝామున చెయ్యివేసి చూస్తే ఒళ్ళంతా కాలిపోతోంది.

    దిగ్గునలేచి, తనకు తోచిన వైద్యం చేసింది. ఫలితం కనిపించక పోవడంతో ఫామిలీ డాక్టర్ని పిలిచింది.

    "లైట్ టెంపరేచరు- కంగారు పడకండి-" అలా క్యాజువల్ గా ఫామిలీ డాక్టరు చెప్పి, వెళ్ళిపోవడంతో చాలా అసంతృప్తిగా లోనయింది సుదేష్ణాదేవి.

    కాఫీ తాగలేదు. ముఖం కడగలేదు. చీరనుకూడా మార్చుకోలేదు. అలాగే కొడుకు దగ్గర సపర్యలు చేస్తూ కూర్చుంది.

    "ఏమైంది నా బాబుకి- ఉత్త జ్వరమైతే- అలా మూగవాడిలా ఎందుకుండిపోతాడు- ఏదో జరిగింది- స్పెషలిస్టులకి ఫోన్ చేస్తారా- లేదా- సీరియస్ గా అడుగుతున్న భార్యకు, ఏ జవాబు చెప్పకుండా ఫోన్ వేపు పరుగెత్తాడు కాళేశ్వరప్రసాద్.

    అరగంటలో__

    తేజస్వర ప్యాలెస్ పోర్టికో అరడజను మారుతీకార్లతో నిండిపోయింది.

    అక్కడ ఒకరి ముఖాలొకరు చూసుకున్న స్టార్ హాస్పిటల్స్ చిల్డ్రన్సు స్పెషలిస్టులందరూ చెప్పింది ఒక్కటే-

    "రెండుగంటల తర్వాత- మీ బాబు- నార్మల్ గా ఉంటాడు-"

    ఒక స్పెషలిస్టు ఇంజక్షను చేయబోతుండగా వారించింది సుదేష్ణాదేవి.

    "మీ ఇంజక్షను సూదులు గుచ్చుకొంటే వాడు ఏడుస్తాడు- ఆ బాధను నేను తట్టుకోలేను-"

    కొంతమంది అనుభవజ్ఞులు మాత్రమే ఆమె మానసిక స్థితిని అర్ధం చేసుకోగలిగారు.

    "ఇంజక్షను చేయకపోతే ఎలా- ఆమెను కొంచెం పక్కకు తీసి కెల్తారా-" రిక్వెస్టు చేశాడు సీనియర్ డాక్టర్.

    "మిస్టర్ డాక్టర్-" ఆమె నోట్లోంచి సీరియస్ గా వచ్చిన, ఆ పిలుపుకి ఆ డాక్టరు బిత్తరపోయాడు.

    "దిసీజ్ మై హౌస్- హి ఈజ్ మై కిడ్- నేను చెప్పినట్టుగా చెయ్యండి-"

    "అదికాదమ్మా- ప్లీజ్ లిజన్ మీ- ఇంజక్షనుచేస్తే మీ అబ్బాయి-"

    "మీ విజిటింగ్ ఫీజెంత- మీకెంత కావాలో అంత రాసుకుని తీకొని వెళ్ళిపొండి-" చెక్ బుక్ లోంచి ఒక కాగితాన్ని చింపి, అతనివేపు విసురుతూ అంది సుదేష్ణాదేవి.

    టాబ్ లెట్స్ ఇచ్చి, అవి ఎలా వెయ్యాలో చెప్పి, వెళ్ళిపోయారు వాళ్ళు.

    అరగంట గడిచింది.

    కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు కాళేశ్వరప్రసాద్.

    ఫామిలీ డాక్టరు మళ్ళీ వచ్చి కాళేశ్వర ప్రసాద్ ని పక్కకు తీసికెళ్ళాడు.

    "అనుబంధం గురించి అందరకూ తెలుసు- కొన్నింటికి టాబ్లెట్సు, కొన్నింటికి ఇంజక్షన్లూ వాడాలి. సుదేష్ణ ఫీలింగ్ ను నేను అర్ధం చేసుకోగలను- మన ఆపేక్షలు, మన అభిమానాలు, మన మొండితనాలతో పిల్లల్ని హింసించడం మంచి పద్దతి కాదు.

    పిల్లల్తో ఇంత ఎటాచ్ మెంట్ ను పెంచుకోవడం కూడా మంచిది కాదు. తీవ్రంగా, గాఢంగా పెరిగిపోయిన సన్నిహితత్వం భారమైన దూరాన్ని పెంచేస్తుందని పెద్దలంటారు. చదువుకున్నవాడివి నువ్వయినా హేతుబద్దంగా ఆలోచించు."

    అరవైఏళ్ళ ఆ ఫామిలీ డాక్టర్ చెప్పిన మాటల వెనుక భావాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోగలిగాడు కాళేశ్వర ప్రసాద్.

    బెడ్ రూమ్ లోని సుదేష్ణాదేవిని మూడు నిమిషాలసేపు బయటకుఎలా పంపించాలో ఒక్క క్షణంలో ఆలోచించి, క్రింద హాల్లోంచి ఒక వ్యక్తికి ఫోనుచేసి, మాట్లాడి ఫోను పెట్టేసి, యధాలాపంగా పైకొచ్చేశాడు.

    సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత-

 Previous Page Next Page