"నీకు రాలేదా?"
"నాకు ఎనిమిదొందలు వచ్చింది?" అన్నాడతను గర్వంగా.
చిదంబరం నోరు తెరిచాడు ఆశ్చర్యంగా.
చిదానందం వెళ్ళిపోయాడు.
చిదంబరం జీవితంలో సులువుగా డబ్బు సంపాదించాలనే అరాటం మొదలైంది.
"అది తన కోసమేమిటి? తనకేం కావాలి? ఏమి అక్కర్లేదు.
తన భార్యా బిడ్డలు సుఖంగా వుండాలి. వాళ్ళ సంక్షేమం కోసం డబ్బు సంపాదించాలి. అంతే! వాళ్ళు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి వంటినిండా మంచి గుడ్డ, కట్టుకోవాలి. పిల్లలు బాగా చదువుకుని యోగ్యులు కావాలి?" అనుకున్నాడతను.
బిగినర్స్ లక్ బాగా పనిచేసింది. రోజు బ్రాకెట్టు, ఓపెన్, క్లోజ్ ఏదో ఒకటి' తగుల్తోంది' అంతో యింతో డబ్బులోస్తున్నాయి.
కానీ బిగినర్స్ లక్ ఎన్నిరోజులు?
వారం తిరిగేసరికి మొక్కలాటి ఆశ వటవృక్షమై కూర్చుంది. అప్పైనా చేసి ఆడాలన్నది ఆటగాళ్ళ సిద్దాంతం. అది అబ్బిందతనికి. రోజులు గడిచిపోతున్నాయి. మెల్లిమెల్లిగా చేబదుళ్ళ స్థాయి ప్రాంసరీ నోట్లకి అభివృద్ధి చెందింది.
అపుడున్న పల్లెలో ఆ రోజుల్లో అప్పడగాలంటే నామోషి అయినా అప్పు అడిగే అవసరమూ రాలేదేనాడు. ఈ వూళ్ళో ఎక్కడ చూసినా అప్పులే! అప్పులు! బట్టల కొట్లో, పచారి కొట్లో, వ్యక్తుల వద్ద.......
తన పరపతి పెరిగిందనుకున్నాడు చిదంబరం.
చాలా రోజుల తర్వాత.
ఆ రోజు ఒక్కసారిగా పాతిక రూపాయల 'కుండలీకరణ' అదే బ్రాకెట్ చిదంబరాన్ని దేవతలా అనుగ్రహించింది. ఒక్కసారిగా రెండువేలు! అమ్మ బాబోయ్! దాదాపు మూడు నెలల జీతమంత! ఎన్నడూ యింత డబ్బు కళ్ళారా చూళ్ళేదు! నెలంతా గొంతు చించుకుని అరిచినా వచ్చేది బొటాబోటిగా ఎనిమిదొందలు! అదే యిప్పుడు! ఒక్క పూటలో-- సాయంకాలం నుంచి ఉదయం లోగా రెండు వేలు........అదృష్టంలాగా వచ్చేయి.
ఇలా వారానికోసారి వస్తే?
నెలకి రెండు నాలుగులు ఎనిమిది వేలు.....సంవత్సరానికి లక్ష ఎప్పటికప్పుడు బ్యాంక్ లోనో వడ్డికో యిస్తే లక్షకి మరో అరలక్ష.....పదేళ్ళు గడిస్తే అసలే పదిలక్షలు. వడ్డీ మరో పదిహేను పాతిక లక్షలు.....తను రిటైరయ్యే నాటికీ పాతిక లక్షల ఆస్తి.
సంతయిల్లు కట్టుకోవాలి. కొంత పొలం కొనుక్కోవాలి. తిండికి చాలినన్ని బియ్యం రావాలి.దాన్లో పాడి పంటా యిల్లు ఓహ్.......అంతకంటే యింకేం కావాలి.....తను తప్పక సాధించాలి.
చిదంబరం తాను టెన్సింగ్---హిల్లరి లవారసుడనుకున్నాడు.
"గుడ్ లక్! ఆ నంబర్ నాకూ చెప్పి వుంటే నేను వంద ఆడేవాడిని. దశరద్ వెయ్యి రూపాయలు వేసేవాడు."
ఆ మాట విని నిర్ఘాంతపోయాడు చిదంబరం "అంత అడ్తార."
వెర్రివాడిని చూసి నవ్వినట్టుగా నవ్వేడతను. 'బాంబే లో కొందరు ఓపెన్ కి లక్ష -క్లోజ్ కి రెండు లక్షలు ఆడ్తారు తెలుసా? అసలు డబ్బు లెక్క పెట్టరు. నువ్విచ్చిన డబ్బు కట్టపై నీ నంబర్ వేసి ఓ మూలకి విసిరేసి నీ స్లిప్ పై సంతకం చేస్తారు. తగిలినప్పుడే చూసి యిచ్చేది. డబ్బు తీసుకునే బుక్కింగ్ కౌంటర్లోంచి డబ్బంతా ఓ గదిలోకి విసిరేస్తారు. అది రిజర్వుబ్యాంక్ స్ట్రాంగ్ రూంలా వుంటుంది!" అన్నాడు.
అదివిన్న చిదంబరం పాతిక లక్షల కోసం పదేళ్ళు అగాలన్న తన అజ్ఞానాన్ని నిందించుకున్నాడు.
అదృష్టం వరిస్తే లక్షలకి లక్షలు రోజుల్లోనే వస్తాయి. అంతా రన్నింగ్ చూసి నంబర్ తీయటంలో ఉంటుంది. తను ఓ మంచి రన్నర్ ని పట్టుకోవాలి అనుకున్నాడు.
"మరిమందు!"
"మందా!"
"ఆ మందు- మజా!" అన్నాడు చిదానందం.
తర్వాత చిదంబరం ఉహూ అంటున్నా అతను విన్లేదు. విందు,- మందు రెండూ రుచి చూపించాడతనికి.
తొలిసారిగా విస్కీ గొంతు దిగుతూ వుంటే ఆకాశాన మబ్బుల్ని చూసి పురి విప్పిన నెమలిలా అయింది. అతనికి మనస్సు బాధ, సంతోషం జమిలాగా ఎలా ఉంటాయి. కష్టం, సుఖం కలిసి కట్టుగా ఎలా జీవిస్తాయి.
ఆవి మందు మజాలో వుంటాయనుకున్నాడతను.
ఆ రోజు ప్రొద్దు పొడవటమే మహా దుర్మార్గంగా పొడిచింది. ప్రతిరోజూ కల్లుపాక చూడందే బ్రతకలేని తాగుబోతు బ్రతుకులా మబ్బు కమ్మేసింది.
తొలిసారి తాగినవాడు భార్యాబిడ్డలకి ముఖం చూపించలేక చాటేసినత్తుగా సూర్యుడు మబ్బు చాటుకి ముఖం చాటేసినట్టుగా చాటేసుకున్నాడు.
అప్పు తీర్చలేని తాగుబోతు వాడింటి మీద అప్పుదార్లు దాడి చేసినట్టు ఆకాశం నిండా మబ్బులు బైటయించాయి. తాగుబోతు బుడిబుడి ఏడ్పులు ఏడ్చినట్టుగా అడపాదడపా చినుకులు రాలుతున్నాయి.
చిదంబరానికి రాత్రి హేంగోవర్ యింకా తగ్గలేదు. అలాగే నిద్రలేచాడు. రాత్రి చేసిన తప్పుడు పనికి తనలో తనే సిగ్గుపడ్డాడు. మజా చేయమన్నందుకు చిదానందాన్ని చేసుకున్నందుకు తనని తిట్టుకున్నాడు.
ఆ రాత్రంతా గాబరాగా గడిపింది మణి. పిల్లలు తెలిసిన చోటల్ల్లా వెదికి వచ్చారు. అక్కడికి వెళతాడు అని ఆచూకి తెలిసిన చోటుకల్లా వెళ్ళొచ్చారు. అయినా చిదంబరం ఎక్కడుండేది చిదంబర రహస్యమే అయింది.
"ఆయన్ని" అల్లంత దూరాన చూడగానే మణి ముఖం మణిదీపమైంది.
'రాత్రంతా' మాటాల్లేదు. జేబులో మిగిలిన డబ్బు యిచ్చాడు.
"పద్దెనిమిది వందలు" లెక్క పెట్టింది మణి. ఎర్రబడిన కళ్ళు- పిక్కు పోయి ముఖం అలవాటు లేక సిగ్గు- భర్త ముఖం చూసి ఆశ్చర్యపోయిందామే.
"ఏమైంది అలా వున్నారు? డబ్బెక్కడిది?"