Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 17

 

    గర్జించినట్టుగా అంది "నోర్ముయ్ .......ఏమిటది సరోజా? పెద్దా చిన్నా జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్టల్లా వాగకు. నీవు, నీ జ్ఞానం- నీ గ్రంధాలు నాకు తెలుసులే, నా విజ్ఞానాన్ని నీవు నీరసించనవసరం లేదు. అంత మాత్రాన నాకు లోటు రాదు."
    "ఏమిటి శ్రీదూ.....తెలియనిది? అయినా ఆ తెలియని వ్యక్తి ఎవరు?" వస్తూనే అడిగాడు మాధవ్ శ్రీదేవి చివరిమాట విని.
    "నమస్తే బావగారూ!"
    అతన్ని చూసి లేచి నిలబడింది సరోజ.
    సంతోషంగా అన్నాడు "ఎప్పుడొచ్చావ్సరోజా?" అంతా బావున్నారా? మామగారు, అత్తగారు, పొలాలు, పైర్లు, పాడి, పశువులు అంతా బావున్నాయా?"
    విరగబడి నవ్వి అంది "అదేమిటి బావా? మామగారిని, అత్తగారిని పొలాల్ని, పశువులని అంతా ఒకే లిస్ట్ లో వేసేస్తున్నావ్?"
    "చీ! చీ! అలా ఎందుకంటావ్? నీ అతితెలివి కానీ....అయినా అలా కలిపితే నిన్నూ మీ అక్కని కలపాలి గానీ మామగారిని, అత్తగారినా? చీ! చీ!"
    "అలాగండి బావగారూ! అక్కగారి వెంట మీరూ మీ అబ్బాయి కూడా వస్తారనేది మరిచిపోకండి."
    ఇద్దరు నవ్వేశారు. ఆ మాటలోని చమత్కారానికి.
    వాళ్ళ మాటలకి అడ్దోస్తూ అంది "మీ చమత్కారాలకేం గానీ ముందు ఆ డ్రెస్ మార్చుకుని రండి." టిఫిన్ చేద్దురు గాని."
    ఆ వార్నింగ్ లో ఏమర్ధందాగి వుందో గాని, మరేమీ అనకుండా తనగదిలోకి వెళ్ళిపోయాడు మాధవ్.
                                                  9
    ఇక ఆ సాయంత్రమంతా నిశ్శబ్దంగానే గడిచిపోయింది, బావగారు వచ్చాక హాయిగా కబుర్లు చెపుతూ కూర్చుందా మన్న శ్రీదేవి పలక్కుండా అవుసే ఎత్తకుండా ఏదో నవల చేత బట్టుకుని కూర్చుంది.
    అక్క మనస్తత్వం బాగా తెలుసు కాబట్టి ఏమి ప్రస్తావించకుండానే "వేయిపడగలు చదవటంలో మునిగిపోయింది సరోజ, అసలు సాహిత్య పిపాసుల జీవితమే ధన్యం, వాళ్ళకి ప్రపంచం ఎటుబోయి ఎటువచ్చినా చింత లేదు, ఏదో ఓ చక్కని పుస్తకం చేతికి దొరికితే చాలు, ఇహ ఏమి అక్కర్లేదు. అట్టే శ్రమ పడకుండా అన్ని మర్చిపోతారు.
    విశ్వనాధవారి సాహిత్యం చదివే శ్రద్దాశువలకి భాషాభిమానమంటూ ఇంకొకటి జతయితే యిహ ఆయన్ని వదలలేరు. నిత్యం ఆ పుస్తకాలే పారాయణం చేస్తూ వుంటారు.
    ఏ విధమైన వ్యాపకాలులేని ఒక్క మాధవ్ మాత్రమే ప్రొద్దు గడవక బాధపడ్డాడు. కాస్త సేపు పేపరు తిరగావేశాడు. ఏమి రుచించలేదు. ఎక్కడ చూసినా వర్షాభావ సూచక వార్తలే. బావులు ఎండిపోయాయని, నీళ్ళు దొరక్క దూర ప్రదేశాలనించి లారీల్లో తెస్తున్నారని, పైర్లు ఎండిపోతున్నాయని, నీటి కోసం తగాదాలు ఎక్కువౌతున్నాయని రకరకాలుగా వార్తలు, ఇవి తప్ప ఏమి లేవు. కాదంటే అక్కడక్కడా మంత్రుల వాగ్దానాలున్నాయ్.
    విసుగ్గా పేపరు మూసేసి పక్కకి పారేశాడు. విక్లి ఒకటి తీసుకుని తిప్పసాగాడు. అందులో అతనికి చదవతగ్గది ఏమి కనిపించలేదు. అక్కడక్కడ హాస్యోక్తులు తప్ప మరేమీ అతన్ని ఆకర్షించలేదు. అవి అయినా పేజీలు నింపేట్టుగా వున్నాయ్ తప్ప నవ్వించేట్టుగ లేవు- ఇక సినిమా శీర్షిక చూడబోతే బొమ్మలన్నీ ముద్దుగా పడి క్రింద పేర్లు చూసినా వాళ్ళని గుర్తించేట్టు లేకుండా వున్నాయ్.
    విసుగ్గా లేచి శ్రీదేవి తను చదివే పుస్తకాలు దాచుకునే అల్మారా అంతా తిరగేశాడు. "విజయచిత్ర" తొలి సంవత్సరం సంచికలన్నీ కలిపి బైండ్ చేసిన ఓ పెద్ద వాల్యూమ్ కనిపించింది. సంవత్సరం సరుకు! ఇహ ఆ తర్వాత ఏమి యత్నించకుండానే అతనికి కాలం గడిచిపోయింది, హాయిగా చుశాడవన్ని.
    ఎనిమిది అవుతూనే చదువుతోన్ననవలని ఆవల పెట్టేసి లేస్తూ అంది శ్రీదేవి "సరోజా ఎనిమిది అయింది ఇహ భోజనానికి లేద్దామా? ఇంకా ఆకలి వెయ్యటంలెదూ?"
    జవాబేమి యివకుండా చదువుతున్న ఆ పుస్తకాన్ని గుర్తు పెట్టుకుని మూసేసి లేచి వెళ్ళింది సరోజ.
    అన్ని సర్ది వడ్డించేశాక మాధవ్ ని పిలిచింది. అతనో క్షణం అటూ యిటూ చూసి, ఆటా యిట అని మూలిగి, అయిష్టంగా పుస్తకం మూసేసి లేచి వెళ్లాడు.
    భోజనాలు కూడా మౌనంగానే ముగిశాయ్. "ఒద్దు, కొంచెంవెయ్, చాలు" అన్న మాటలు మాత్రమే తమకి వచ్చినట్టుగా వ్యవహరించారు యిద్దరూ.
    శ్రిదేవే మధ్య మధ్య అలా అలా మాట్లాడింది. "ఏమ్ సరోజా! కాస్సేపటికే ముగదానివైపోయావల్లె వుందే. అలా ఉలుకూ పలుకూ లేకుండా తింటే తిండి ఏం సహిస్తుందే!"
    మరి కాసేపాగి అంది మళ్ళీ.
    "ఏమిటండి---కూర కలుపుకోనేలేదు. ఇంకాస్త నెయ్యి వెయ్యనా? అయ్యో ఖర్మ వెయ్యనా ఏమిటి? వేసుకోండి. పెరుగు ఇంకాస్త వెయ్యమంటారా? మీగడ కూడా వుంది లెండి."
    కానీ వాళ్ళిద్దరూ దేనికి అందకుండా పొందకుండా జవాబులు చెప్పారు.
    ముఖం చిట్లించుకుంటూనే వాళ్ళిద్దరికీ అన్నాలు పెట్టేసి తనూ ఏదో అయిందనిపించింది. చకచక భోజనం చేస్తూ చలాకీగా మాట్లాడుతూ వుండే శ్రీదేవికి యీ మౌనవ్రతం అలవాటు లేని అపోసనం. తర్వాత కంచాలన్నీ అలాగే వదిలేసి వెళ్ళి పడకలు తయారుచేసింది.
    ఇంతలోనే బాబు లేస్తే వాడికి పాలు పట్టి స్ప్రింగ్ ఉయ్యాల్లో వేసింది. వాడు ఊగుతూనే నిద్రపోయాడు. అలా అలా పనులు పై పైనే ముగించుకుని వచ్చింది గదిలోకి.
    ఆమె గదిలోకి వచ్చేసరికే మాధవ్ తన మంచంపై పడుకుని అదే పుస్తకాన్ని తిరిగేస్తూ ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు. అతని ప్రక్కన్నే మంచం వాల్చుకుని, పడక వేసుకుని తనూ పడుకుంటూ అతనికేసి తిరిగింది.
    అయినా అతను తపోభంగం కాని ఋషిమల్లె ఆ బొమ్మలు చూడటంలో మునిగి పోయాడు. ఓ క్షణం ఆగి ప్రశ్నించింది "ఏమిటండి అది?"
    చూపించాడు.
నవ్వి అంది "అబ్బ ఎన్నాళ్ళకి మీ చేతిలో సినిమా పుస్తకాలు చూస్తున్నాను. చూస్తోంటే మరదలి ప్రభావం వల్ల మీరూ పుస్తకాల్లో పడ్డట్టున్నారే"
    "ఆ ఏమిటి? నిజమే? ఇంతమంచి పుస్తకాన్ని నీ వద్ద వుంచుకుని నాకు ఒక్క సారయినా చూపావా?" నిష్టూరంగా అన్నాడు.
    ఆమె జవాబు ఏమి యివలేదు. అతను తిరిగి ఆ పుస్తకంలో లినమయ్యాడు.
    అటూ యిటూ పొరలి నిద్ర రాక పిలిచింది "ఏమండీ" అతను పలక్కపోవటంతో మళ్ళీ పిలిచింది "ఏమండీ.....ఆ పుస్తకాన్ని మూసేసి నాల్గుకబుర్లు చెప్పరాదూ! అయినా రాత్రి పూట చదువేమిటండి?"

 Previous Page Next Page