"అనిత వదిన?"
రాజారావు ఒకసారి అనితను వోరగా చూసి "మీకీ మధ్య చదువెవరు చెప్తున్నారు?" అన్నాడు సమాధానం తనకు తెలుస్తోన్నా........
అనిత కలిగించుకుంది.
"ఎవ్వరూ చెప్పటంలేదు. వాళ్ళే చదువుకుంటున్నారు. సాయంత్రాలు ఆడుకునే సమయం. ఆ సమయంలో ఆడనిచ్చి తరువాత చదువుకోమంటే వాళ్లే చదువుకుంటారు. తెలియనిది నేను చెవుతున్నాను. ఆ మాస్టార్ దగ్గిర భయంతో వచ్చినవి కూడా మరచిపోయేవారు. ఇక్కడ ఎవరి భయమూ లేదు గనుక చదివినదేదో తల కెక్కించుకుంటున్నారు. అంతే?"
"నీ బుణం ఎలా తీర్చుకోవాలో నాకర్థం కావటంలేదు!"
"పెళ్లి కాకముందే పిల్లతల్లి నయ్యానని నన్ను ఎవ్వరూ పెళ్ళి చేసుకోవటం లేదు. పోనీ నన్ను పెళ్ళాడేసి బుణం తీర్చుకోండి." చిలిపినవ్వుతో కొంటె చూపులతో అంది.
రాజారావు ప్రసన్నత పటాపంచలయి నిలువెల్లా భగ్గుమన్నాడు....
"ఛీ ! ఛీ! నీ కసలు సంస్కారమూ, సభ్యతా తెలియవు."
"నిజంగానే ఈనాటి సంస్కారం ఎలాంటిదో నాకర్ధం కావటం లేదు. అది తెలుసుకుందామనే వచ్చాను..."
అనిత మాటలో ఏదో వ్యంగ్యం ధ్వనించి సూటిగా అనిత ముఖంతోకి చూశాడు.
అనిత ముఖం మీది హేళనతో కూడిన చిరునవ్వు రాజారావును మండించింది....
"మన అని కలిపి మాట్లాడకు. మీ సంస్కారమూ, మా సంస్కారమూ ఏనాటికీ ఒకటి కావు." అన్నాడు కసిగా.
పకపక నవ్వుతూ "నూటికి నూరు పాళ్ళు నిజం!" అంది అనిత. కాలితో నేలను గట్టిగా తన్ని విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు.
13
రమణరావు తమ ఇంటికి రాగానే సుశీలా రమణరావులకు ఏకాంతం కలిగించడంకోసం రాజారావు ఏదోవంకన బయటికి వెళ్ళటం పరిపాటి. ఇటీవల రాజారావు అలా వెళ్ళగానే రమణరావు వెళ్ళిపోతున్నాడు. సుశీల ఒక్కర్తే ఏదో చదువు కుంటోంది.
ఎప్పటిలాగానే "రమణరావుగారు వెళ్ళిపోయారా?" అని అడిగాడు వచ్చీరాగానే రాజారావు....
"నువ్వలా వెళ్ళగానే ఆయనిలా వెళ్ళిపోయారు." చిరునవ్వుతో చెప్పింది సుశీల.
ఆ వెంటనే అనిత, సుశీల ఒకరి నొకరు వీలుగా చూసుకొని నవ్వుకున్నారు. ఆ నవ్వులు చూసిన రాజారావుకు ఏదో అనుమానం తోచింది.
"సుశీలా! ఏం జరిగింది! నిజం చెప్పు! రమణరావుగారు ఎందుకు వెళ్ళిపోయారు?" అన్నాడు కోపంగా-
సుశీల కంగారుపడింది.
బెంబేలుగా "నిజం! నాకేమీ తెలియదు. కొంచెం సేపు ఉండమని నేను బ్రతిమాలాను కూడా..." అంది.
"ఆ మాట నిజం. పాపం, చాలా బ్రతిమాలింది. కావాలంటే ఆయననే అడుగు..."
కొంటెగా అంది అనిత.
"నువ్వూ అక్కడే ఉన్నావా?"
అసహనంగా అడిగాడు రాజారావు.
"రామ! రామ! నేను అత్తయ్య దగ్గిరకూర్చుని కబుర్లు చెపుతున్నాను. కావాలంటే అత్తయ్య నడుగు. రమణరావుగారు వెళ్తోంటే సుశీల వెనకే వెళ్ళి కొంచెంసేపు వుండమని అడుగుతోంది. నాకు వినిపించింది..."
"ఇదేదో తేలుస్తాను."
"త్వరగా తేల్చాలనే నా తాపత్రయమూ."
రాజారావు వెంటనే లేచి రమణరావు దగ్గిరికి వళ్ళాడు.
రమణరావు విపరీతమయిన ఆశాంతితో బాధపడుతున్నట్టు ముఖం చూడగానే తెలిసిపోతుంది ఎవరికైనా....
"రమణరావుగారూ! నేను వచ్చేవరకు ఉండకుండా వచ్చేశారేం?
"నాకు పనుంది. అంటే ఇప్పుడు కాదు. కానీ , ఇప్పుడు కూడా ఉంది. కొంచెం చూసుకోవాలి. అదే..."
రమణరావు విపరీతంగా కంగారు పడుతున్నాడని అర్థమయింది రాజారావుకి...
తన దగ్గిర నిజం దాస్తున్నాడని కూడా అర్థమయింది.
"రమణరావుగారూ? స్థిమితంగా కూర్చోండి. ఏం జరిగిందో చెప్పండి. నా దగ్గిర కంగారు దేనికి? మా ఇంటో మీకెవరైనా ఇబ్బంది కలిగించారా?"
రమణరావు నుదుటికిపట్టిన చెమట తుడుచుకుంటూతీవ్రంగా ఆలోచిస్తున్నవాడిలా కళ్ళు తెరిచాడు.
"రాజారావుగారూ! మీకు నాతో సంబంధం కలుపుకోవటం మనసారా ఇష్టమేనా?"
"ఇంచుమించు అంతా నిశ్చయమయిపోయిన తర్వాత ఇవేం మాటలండీ!"
రమణరావు హృదయం కుదుటబడింది. రాజారావుకేమీ తెలియదని తెలిసింది.
సుశీలకు తెలుసో? తెలియదో?
"అయితే నాదొక్క కోరిక!"
"ఏమిటో చెప్పండి!"
"ఆ జానకిని మీఇంటికి రానీయకండి___"
ఉలిక్కిపడ్డాడు రాజారావు.
"దానికీ, దీనికీ ఏంసంబంధం?"