12
కన్న, కమల తెచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు. ఇదివరలో వాళ్ళకు ప్రతిదానిలోనూ ఇరవై ముపై మార్కుల కంటె ఎక్కువ వచ్చేవి కావు.
అలాంటిది ఇంచుమించు అన్ని సబ్జక్టులలోనూ యాభై పైగా మార్కులు వచ్చాయి. చాలా సంతోషించాడు రాజారావు వెంటనే ట్యూషన్ మాస్టారు దగ్గిర కెళ్ళి "మాస్టారూ! మీ బుణం తీర్చుకోలేను. మా కన్న, కమల ఇద్దరూ చాలా బాగా మార్కులు తెచ్చుకున్నారు." అన్నాడు.
మాస్టారుముఖం వికసించటానికి మారు వడిలిపోయింది.
"నన్ను పొగడకు బాబూ! సిగ్గేస్తోంది." అన్నాడు.
"అదేం మాస్టారు!"
"ఈ నెలంతా వాళ్ళకు నేను పాఠాలు చెప్పలేదు ఏ రోజు కారోజు అనితమ్మ వాళ్ళను పార్కులోకో తోటలోకో తీసుకుపోతోంది. జీతంరాళ్ళు పోతాయని నేనూ మీకేమీ చెప్పలేదు. ఎంతైనా అవనీ. అన్యాయంగా మీ దగ్గిర్నుండి డబ్బు తీసుకోలేను"
రాజారావు ఆశ్చర్యానికి అంతులేదు.
అనితను నిందించాలా? పిల్లల చదువులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందే!
లోపలకి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతడిని మరింత ఆశ్చర్యంలో ముంచింది.
అనిత సుశీలకు జాకెట్టు కత్తిరించికుట్టడం నేర్చిస్తోంది.
ఈ అల్లరి గారాలపిల్లకు కుట్లుకూడా చేతనవునా?
ఆంగ్లో ఇండియన్ తల్లికి పుట్టి ఉత్తర ప్రాంతంలో పెరిగిన ఈ యువతి ఎంత తేలికగా ఈ ఇంటిలో కలిసిపోయింది?
కన్న, కమల తమ పుస్తకాల ముందు కూచుని వాళ్లే చదువు కుంటున్నారు.
ఇదివరకెన్నడూ అలా చదివేవారు కారు.
సంతృప్తితో మనసు నిండిపోగా అక్కడి కుర్చీలో కూచుని "కుట్టుపని ఎక్కడ నేర్చుకున్నావు అనితా!" అన్నాడు.
"మా అమ్మ దగ్గిర".......
తల వంచుకుని సమాధానం చెప్పింది అనిత
అనిత తల్లి ప్రస్తావన వచ్చేసరికి రాజారావు మనసులో ప్రసన్నత కొంతవరకు తగ్గింది.
"పియానో వాయించటం, కుట్టటం, అల్లటం, నాట్యం చెయ్యటం, పంట అన్నీ అమ్మదగ్గిరే నేర్చుకున్నాను. అయితే నాకొచ్చినవన్నీ ఉత్తరాది వంటలు. ఇక్కడి వంటలు అత్తయ్య దగ్గిర నేర్చుకుంటున్నాను."
"నేర్చుకుంటున్నాననే వంకతో వంటంతా నువ్వే చేస్తున్నావు." నిష్ఠూరం \వేస్తున్నట్లు అంది సుశీల.
"ఏం చెయ్యమంటావ్? నాకు ఎప్పుడు చేతి నిండా పని ఉండాలి, ఇవేవీ లేకపోతే దెబ్బలాడటానికి ఉజ్జీ అయినా దొరకాలి."
రాజారావును చూసి నవ్వింది అనిత.
ఆ రోజూ అనిత మాటలు వింటున్నకొద్దీ, అనితను చూస్తున్న కొద్ది, ఏదో ఆర్ద్రభావం కలుగసాగింది రాజారావులో........
"నా లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయి. చదువుకో!" ఆశ్చర్యంగా చూసింది సుశీల.
రాజారావు అపురూపంగా ఎంచుకునే కొన్నింటిలో ఒకటి ఎంతటి ఆత్మీయులకూ ఆలైబ్రరీని అప్పగించడు రాజారావు.
సుశీల చూపులలో ఆశ్చర్యాన్ని గమనించి లోలోపల లజ్జపడ్డాడు. సంభాషణ మారుస్తూ" కన్నా! కమలా! మీకు చాలా మంచి మార్కులు వచ్చాయి? ఏం కావాలో అడగండి. కొని పెడతాను." అన్నాడు.
పిల్లలిద్దరూ పొంగిపోయారు.
ఉత్సాహంతో ఇద్దరూ ఒక్కసారిగా అన్న దగ్గిరకొచ్చారు.
"మాకు రంగురంగుల కార్డుబోర్డు తెచ్చిపెట్టు" అన్నారు.
వాళ్ళు బంతికాని, రింగ్ కాని కోరుకుంటారనుకున్న రాజారావు ఆశ్చర్యపోతూ "కార్డ్ బోర్డు దేనికి?" అన్నాడు.
"రకరకాల బొమ్మలు తయారు చేసుకుంటాం?"
"మీ కెవరు నేర్పుతారు?"