Previous Page Next Page 
అనిత పేజి 18


    "చూడండి! మనమంతా పరువు ప్రతిషలతో బ్రతుకుతున్న వాళ్ళం. అల్లరి పాలయిన ఆ పిల్ల మన ఇళ్ళకు రావటం ఏం బాగుంటుందీ?"
    రాజారావు చటుక్కున సమాధానం  చెప్పలేకపోయాడు. జానకిపట్ల మొదటినుంచీ అతని మనసులో ఏదో అర్ద్రభావముంది అదిగాక జానకి తనంతట డబ్బుకోసం ఎవడినో వలలో వేసుకోబోయి అతడు డబ్బియ్యకపోగా పోలీసులను పిలిచి అల్లరిపెట్ట జూచిందనే కట్టుకథ తనేనాడూ నమ్మలేదు."  
    అతని కోపమంతా ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వెళ్ళాలనేదే!
    ఏది ఏమయినా జానకి అల్లరిపాలయింది. బ్రతుకు బండలయింది.
    ఇప్పుడు తనేం చెయ్యగలడు?
    "దురదృష్టవశాన అల్లరి పాలయింది కానీ, మన ఇళ్ళకు రాకూడనంతటి దుర్మార్గురాలు కాదండీ జానకి! ఏ  పాపిష్టి వెధవ దాని జీవితంలో నిప్పులు పోశాడో కాని వాడు దాని ఫలితం అనుభవించక తప్పదు."
    రమణరావు ముఖం పాలిపోయింది. గ్రుక్కిళ్ళు మింగుతూ "అంతే! అంతే! కానీ, జానకి మీ యింటి కొస్తున్నంతవరకూ నేను మీ ఇంటికిరాలేను. ఆ తరువాత మీ ఇష్టం." అన్నాడు.
    "చిన్నతనం నుండీ జానకి మా ఇంట్లో పిల్లలాగ తిరిగింది. నాకు తెలిసినంత వరకు దానిది చాలా సాధు స్వభావం. ఈ అల్లరయ్యాక వ్యధతో చితికిపోతూ వీధి ముఖం కూడా చూడటంలేదు. నా నోటితో నేను కఠినంగా రావద్దని ఎలాచెప్పను?"
    "నా నిర్ణయం చెప్పాను. మీరు ఆలోచించుకోండి. నా సంబంధం మీకు కావాలనుకొంటే ఆ జానకిని దూరంగా ఉంచండి."
    గంభీరంగా కటువుగా అన్నాడు రమణరావు. ఆ కటుత్వానికి రాజారావు మనసు చివుక్కుమన్నా "సరే!" అని లేచాడు.


                                                              14


    చిన్నతనం నుండీ రాజారావు కుంటుబానికీ తులశమ్మ కుటుంబానికీ చాలా సన్నిహిత సంబంధం ఉన్నా, ఏనాడూ రాజారావు తులశమ్మ ఇంటికిపోలేదు.
    తలవని తలపుగా తన కళ్ళముందు రాజారావును చూడగానే సంతోషంతో, సంభ్రమంతో ఉక్కిరి బిక్కిరయింది జానకి.
    "రా! అన్నయ్యా! కూచో!" అంటూ కుర్చీ చూపించింది.
    తనను చూడగానే పట్టరాని ఆనందం ప్రతిఫలిస్తోన్న ఆ ముఖంలోకి చూడలేకపోయాడు రాజారావు.
    మనిషి బాగా చిక్కిపోయింది. ఒక్క అలంకారమయినా లేదు బొట్టూ, కాటుకా తప్ప. నేతచీర కట్టుకుంది.
    ఈ వ్యక్తిపైనా అలాంటి కట్టు కథలు!
    అంత అల్లరి!
    జానకి ప్లేటులో మినపసున్ని, జంతికలు తెచ్చిపెట్టింది. అవి చూశాక తమ ఇంట్లోకి ఆ తినుబండారాలెలా వచ్చాయో అర్థమయింది రాజారావుకి.
    జానకి చూపుతున్న ఆదరణముందు తను చెప్పదలచుకున్నది ఎలా చెప్పాలో అర్థంకావటంలేదు రాజారావుకి.
    జానకే మాట్లాడింది.
    "అలా వున్నావేం అన్నయ్యా! వంట్లో బాగుండలేదా?"
    "బాగానే ఉందమ్మా!"
    "ఇవాళ నామనసుకి చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్యా! నా జీవితం భగ్నమయ్యాక ఇంత ఆనందం నాకెన్నడూ కలగలేదు. నువ్వు నమ్న నోరువిప్పి ఏమీ అనక పోయినా ఈ అపవాదుల పాలయ్యాక  నీముందు నిలబడలేక పోయేదానిని. తరువాత సుశీల చెప్పింది నాతో సుశీలను మాట్లాడొద్దన్నావట కదూ! ఎంత క్రుంగిపోయాననుకున్నావు అన్నయ్యా! సంఘమంతా ఒక్కటై లేని నిందలు నా నెత్తిన వేసినవాడు కూడా అంత బాధపడలేదు. బ్రతుకుమీదే విరక్తి పుట్టింది. నువ్వుకూడా నన్ను అసహ్యించుకోవటం కంటే నాకు వేరే మరణం అక్కర్లేదు. ఇవాళ నువ్వు నాదగ్గిర కొచ్చావు. అంటే నా మీద కోపంపోయినట్లేగా! నాకు గట్టి నమ్మకం. నన్ను గురించి నువ్వు కోపంపోయినట్లేగా! నాకు గట్టి నమ్మకం. నా గురించి నువ్వు చెడుగా అనుకోలేవని............."
    ఆ అమాయకురాలి మాటలు  వింటోంటే, ఆ వడిలిన ముఖం చూస్తోంటే రాజారావు కళ్ళు చెమ్మగిల్లాయి. "నాకు నీ మీద ఏనాడూ కోపంలేదమ్మా! జాలితప్ప కాని..............."
    జానకి తల దించుకుని "నాకు తెలుసు అన్నయ్యా!" అంది.
    తిరిగి అంది.
    "పోనీయ్ అన్నయ్యా! ఇన్నాళ్ళకైనా నా మీద నీకు దయ కలిగింది. మిగిలిన సంఘమంతా నా ముఖంమీద ఉమ్మివేసినా నాకు బాధలేదు. నువ్వూ, సుశీల, కన్న, కమల , అమ్మగారూ, మీ అందరితో కలిసి మెలిసి ఉండగలిగితే అది చాలు."
    రాజారావు గొంతు పూడిపోతోంది. ప్రయత్నించీ తను చెప్పదలచుకున్నది చెప్పలేక పోతున్నాడు.    
    "మీ అమ్మ ఏది జానకీ??"
    "ఇవాళ అమ్మగారికి గుండెల్లో నొప్పి వచ్చింది. మన ఇంటికే వంటచెయ్యడానికి వెళ్లింది. నువ్వు మన యింటి నుంచి రావటంలేదా?"
    రాజారావు మనసు వేదనతో మెలికలు తిరిగిపోసాగింది.
    "రమణరావుగారింటి నుండి వచ్చాను."
    తను చెప్పదలచుకున్నది చెప్పక తప్పదన్నట్లు నాంది మొదలుపెట్టాడు.
    ఆ పేరు వింటోనే జానకి అదిరిపడింది. పాలిపోయిన ముఖంతో వణుకుతున్న పెదవులను నొక్కిపట్టుక్కు కూర్చుంది.  

 Previous Page Next Page