అలవాటు పడ్డ ఇల్లే కాదు, అన్నా వదినల ఆప్యాయతతో అల్లుకుపోయిన మల్లె పందిరి అది! మనసనే కుసుమాలతో మమతల పందిళ్ళు వేసుకున్న పొదరిల్లు అది!
కౌసల్య మనసు ఎంతో ప్రశాంతంగా వుంది- తుఫాను వెలసిన తరువాత నెలకొన్న ప్రశంతతలా! అంతవరకూ అనుభవించిన నరకయాతన ఒక్కసారిగా తగ్గిపోయేసరికి , ఏదో నీరసం అవహించినట్లయింది కౌసల్యకి. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని నైటీ వేసుకునేసరికి శరీరం తేలిపోతున్నట్టనిపించింది. వొళ్ళు విరుచుకుంటూ మంచం మీద వాలిపోయింది. అంతవరకూ కోసల్యనే చూస్తూ నుంచున్న స్మిత తను కూడా నైటీ వేసుకు వొచ్చి "అత్తయ్యా!" అంటూ వెళ్ళి పక్కన పడుకుంది. "కధ చెప్పవూ?" అంటూ.
"అలాగే" అంటూ కధ చెప్పడం మొదలెట్టింది. వింటూ "ఊ" కొడుతూ పడుకుంది స్మిత , కౌసల్యని చుట్టుకుని.
కధ చెబుతూ చెబుతూ కౌసల్య కూడా నిద్రలోకి జారిపోయింది.
"భోం చేద్దాం రండీ!" అంటూ పిలవడాని కొచ్చిన రాధా సుధాకర్ లు ఇద్దరూ, కౌగలించుకొని ఒకరికొకరు హత్తుకుపోయి పడుకుని గాడ నిద్తలో వున్న కౌసల్యనీ, స్మితనీ చూసీ తృప్తిగా నిట్టురుస్తూ 'భోజనం కన్నా మనశ్శాంతి ముఖ్యం వాళ్ళని లేపోడ్డు" అనుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి.
భోజనాలప్పుడు జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పింది రాధ సుధాకర్ తో. అదంతా వింటూ వుంటే సుధాకర్ మతి పోయినట్టనిపించింది. కర్తవ్యం భోధపడలేదు.
"ఇప్పుడెం చెయ్యాలి?" అన్నాడు బాధతో తల పట్టుకుని సుధాకర్.
రాధ ఏదో చెప్పబోయే లోగా పానకాలు అక్కడికి రావడంతో ఆమె మాట్లాడక ఊరుకుంది.
"రండి బావగారూ రండి. జాయిన్ అజ్......ఫర్... డిన్నర్ " అన్నాడు లేచి నుంచుని సుధాకర్.
అనడం ఆలస్యం కంచం ముందు కూర్చుని, టేబిల్ మీదున్న పదార్ధాలని గబగబా వడ్డించేసుకున్నాడు పానకాలు.
అతను వడ్డించుకునే పద్దతి , తినే తీరు , సుధాకర్ కీ, రాధకీ కూడా ఎబ్బెట్టుగా అనిపించింది. అన్నం సహించలేడు. ఏదో తిన్నట్టుగా చేసి చెయ్యి కడుగేసుకున్నారు.
"నాకు మొహమాటం లేదండి! నేను నెమ్మదిగా తింటాను.' అంటూ అరగంట సేపు కూర్చుని భోం చేశాడు పానకాలు.
కౌసల్య విషయం తనకి తానుగా తీస్తే మాట్లాడాలని ఎదురు చూసిన సుధాకర్ ఎంతకీ అతడు కౌసల్య ప్రస్తావన తేకపోయేసరికి , తనే మొదలెట్టాడు. "కౌసల్య వచ్చింది సాయింత్రం" అని.
"అవును, నాకు తెలుసు, ఇంకెక్కడికి వెళుతుంది?" అన్నాడు నవ్వుతూ.
ఆ తరువాత ఏం మాట్లాడాలో తోచలేదు సుధాకర్ కి.
"మీరు ఇక్కడే పడుకోండి ఇవాళ్టికి" అంది రాధ పానకాలుని చూసి.
"నో......నో! ఇల్లు తాళం పెట్టుంది. అసలే రోజులు బాగాలేదు ఎవరైనా బద్దలు కొట్టి లోపలికి చొరబడితే దిక్కుండదు. కౌసల్యని లేపి తీసికెళ్ళిపోతాను.' అన్నాడు.
"మంచి నిద్దరలో ఉంది" అంది రాధ లేపడానికి ఇష్టం లేనట్టు.
"దానికెప్పుడూ నిద్దరమత్తే. ఇంటికెళ్ళాక నిద్దరపోతుందిలే" అన్నాడు పానకాలు. సుధాకర్ కి అతని మాటలు నచ్చలేదు. అంత రాత్రిపూట మంచి నిద్రలో ఉన్న మనిషిని, అందులోనూ ఎంతో బాధతో వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మనిషిని లేపి, అలా పంపడానికి అతని మనసు అంగీకరించలేదు.
"దాన్ని పడుకోనివ్వండి నీరసంగా ఉన్నట్టుంది. కొంచెం జ్వరం కూడా వొచ్చింది.' అంది రాధ, కౌసల్యని లేపి ఆ రాత్రి పంపడానికి మనసురాక , చిన్న అబద్దం చెబుతూ.
పానకాలు మాట్లాడలేదు.
సుధాకర్ , రాధ కూడా మాట్లాడలేదు. వాళ్ళ మధ్య కాస్సేపు మౌనం తాండవం చేసింది. ఆ రోజొచ్చినపొద్దుటి పేపర్లను తిరగేస్తూ కూర్చున్నాడు పానకాలు. గడియారం పదకొండు గంటలు కొట్టింది. రాధకి కూడా నిద్ర ముంచుకొస్తుంది.
"ఈ పూటకి మీరు ఇక్కడే పడుకోండి అన్నయ్యగారు" అంది మళ్ళీ రాధ ఆవలిస్తూ.
"లేదు, నేను వెళ్ళిపోతాను లెండి. కౌసల్యని రేపు పొద్దున్నే పంపండి" అన్నాడు.
"హమ్మయ్యా" అనుకుని నిట్టూర్చారు సుధాకరూ, రాదా.